తెలంగాణ - వేములవాడ: ముస్లిం పెళ్లి విందులో ఒకే కూర, ఒకటే స్వీట్ ఉండాలని తీర్మానం - ప్రెస్ రివ్యూ

ముస్లిం పెళ్ళి

ఫొటో సోర్స్, Getty Images

వేములవాడలో ముస్లిం పెళ్లిళ్లలో ఒకటే కూర, ఒకటే స్వీటు ఉండాలని స్థానిక ముస్లిం మత పెద్దలు తీర్మానించినట్లు 'సాక్షి' కథనం పేర్కొంది.

''కరోనా వైరస్ ఉధృతి, మరోవైపు ఆకాశాన్నంటున్నతున్న నిత్యావసర ధరల నేపథ్యంలో వివాహ విందు ఖర్చు పెరిగిపోతుండటంతో ఆడపిల్లల కుటుంబాలను ఖర్చు నుంచి బయటపడేసేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన మతపెద్దలంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై ఏ పెళ్లి అయినా సరే ఒకటే కూర, ఒకటే స్వీటు ఉండాలని తీర్మానించుకున్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

సాధారణంగా ముస్లిం కుటుంబాల పెళ్లిలో అమ్మాయి తరఫువారు పసందైన రుచులతో తీరొక్క తీపి పదార్థాలు సిద్ధం చేస్తారు. చికెన్, మటన్‌తో అనేక రకాల వంటలు, బిర్యానీ, చపాతీ రోటీ, కుర్బానీ కా మీఠా, ఖద్దూ కా కీర్ ఇలా చాలా రకాల వంటలు చేస్తారు.

కానీ, కరోనా కాలంలో చాలామంది వ్యాపారాలు మందగించాయి. ఎంతోమంది నష్టాలు చవిచూశారు. ఈ క్రమంలో ఆడపిల్లల పెళ్లిలో ఒకప్పటిలా రకరకలా ఆహార పదార్థాలతో విందులు ఏర్పాటు చేయడం తలకుమించిన భారమైంది.

పెళ్లికూతురుకు పుట్టింటి వారు ఇచ్చే సారె, కానుకల కంటే ఈ విందులో వడ్డించే వెరైటీల ఖర్చు అనేక రెట్లు అధికమైంది.

ఎంత తక్కువలో వెరైటీలు ప్లాన్ చేసినా... ఎంత లేదన్నా.. రూ. మూడున్నర నుంచి రూ. నాలుగున్నర లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఈ ఖర్చుపై పేద, సామాన్య ముస్లిం కుటుంబాల నుంచి అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

దీంతో ఖర్చును నియంత్రించేందుకు ఇటీవల వేములవాడలోని షాదీఖానాలో 8 మజీద్ కమిటీల పెద్దలు సమావేశమయ్యారు.

స్థానికంగా జరిగే విందుల్లో భగారాతో పాటు ఒకటే కూర చికెన్ లేదా మటన్ మాత్రమే వడ్డించాలని తీర్మానించారు.

గతంలో మాదిరి గంపెడు స్వీట్లు చేయకుండా ఏదైనా ఒకే స్వీటు పెట్టాలన్న తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మాంన ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నట్లు'' సాక్షి రాసుకొచ్చింది.

కన్నా లక్ష్మీ నారాయణ

ఫొటో సోర్స్, kanna laxmi narayana/face book

కన్నా కుటుంబంపై గృహహింస కేసు నిర్ధారణ

గృహహింస కేసులో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలికి రూ.కోటి పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించినట్లు 'ఆంధ్రజ్యోతి' వార్తలో తెలిపింది.

''ఈ మేరకు విజయవాడలోని ఒకటో చీఫ్‌ మెట్రోపాలిటన్‌ న్యాయమూర్తి టి.వెంకట శివసూర్య ప్రకాశ్‌ బుధవారం తీర్పు చెప్పారు.

వివరాలు... కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు, గుంటూరు మాజీ మేయరు కన్నా నాగరాజు తన మేనమామ కుమార్తె శ్రీలక్ష్మి కీర్తిని 2006లో ప్రేమ వివాహం చేసుకున్నాడు.

ఈ వివాహం నాగరాజు తల్లి విజయలక్ష్మికి ఇష్టం లేదు. దీంతో కుటుంబంలో వివాదాలు మొదలయ్యాయి. 2013లో శ్రీలక్ష్మి కీర్తికి పాప జన్మించింది.

ఆ తర్వాత 2015 మార్చిలో తల్లీబిడ్డను ఇంటినుంచి బయటకు పంపేశారు. దీనిపై శ్రీలక్ష్మి కీర్తి విజయవాడ ఒకటో చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో గృహహింస పిటిషన్‌ దాఖలు చేసింది.

దీన్ని విచారించిన న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. శ్రీలక్ష్మి కీర్తికి రూ.కోటి పరిహారంతో పాటు నెలకు రూ.50వేలు భరణంగా చెల్లించాలని, కోర్టు ఖర్చుల కింద రూ.1,000 ఇవ్వాలని తీర్పు చెప్పింది.

పాపకు అనారోగ్యంగా ఉండడంతో వైద్యానికి శ్రీలక్ష్మి ఖర్చు చేసిన రూ.50వేలు కూడా తిరిగి చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.

ఈ మొత్తానికి 12శాతం వడ్డీ చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చారు. శ్రీలక్ష్మితో పాటు కుమార్తెకు ఇంట్లో భాగస్వామ్యం కల్పించాలని స్పష్టం చేశారు. తీర్పు ఉత్తర్వులు విడుదలైన 3 నెలల్లోపు ఇవన్నీ అమలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించినట్లు'' ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది.

కేసీఆర్

ఫొటో సోర్స్, trs party facebook

తెలంగాణలో ఉద్యోగుల పరస్పర బదిలీలకు సరే

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల పరస్పర బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై గురువారం ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించినట్లు 'ఈనాడు' కథనం పేర్కొంది.

''భార్యాభర్తలను ఒకే చోటుకు బదిలీ చేసేందుకు వచ్చిన వినతులు, బదలాయింపుల సందర్భంగా ఉద్యోగుల నుంచి వచ్చిన అభ్యంతరాలనూ వెంటనే పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు.

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త జోనల్‌ విధానం కింద దాదాపు 70 వేల మందికి పైగా ఉద్యోగుల బదలాయింపు జరిగింది.

ఈ సందర్భంగా పలువురు భార్యాభర్తలైన ఉద్యోగులు బదిలీలను కోరారు. పనిచేస్తున్నచోటు కాకుండా వేరే జిల్లాలు, జోన్లు, బహుళజోన్లకు వెళ్లిన ఉద్యోగులు దీనిపై అభ్యంతరాలు వ్యక్తంచేశారు.

భార్యాభర్తల బదిలీలకు సంబంధించి కొన్ని జిల్లాలకే అనుమతించారు. రంగారెడ్డి, హైదరాబాద్‌, తదితర జిల్లాల్లో పట్టణ, నగర ప్రాంతాల్లోని పోస్టులకు అనుమతించలేదు.

ఈ నేపథ్యంలో టీఎన్జీవోల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్‌, రాయకంటి ప్రతాప్‌, టీజీవో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మమత, సత్యనారాయణలు బుధవారం సచివాలయంలో సీఎస్‌ సోమేశ్‌ను కలిసి పరస్పర బదిలీలు వెంటనే చేపట్టాలని, ఒకేచోటుకు దంపతుల బదిలీలకు అనుమతించాలని, బదలాయింపులపై వచ్చిన అప్పీళ్లను పరిష్కరించాలని అభ్యర్థించారు.

సంఘాల వినతులను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కు తెలియజేశారు. ఆయన వెంటనే స్పందించి వెంటనే పరస్పర బదిలీలకు అనుమతించారని'' ఈనాడు కథనంలో తెలిపింది

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

కరోనా పరిహారం విషయంలో ఏపీ సర్కారుపై సుప్రీంకోర్టు అసంతృప్తి

కరోనా పరిహారం చెల్లింపుల జాప్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసిందని ‘వెలుగు’ వార్తలో పేర్కొంది.

''ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తమ ముందుకు హాజరుకావాలంటూ ఆదేశాలిచ్చింది. కోవిడ్ బాధితుల పరిహారాన్నివారి బంధువులకు ఏపీ, బీహార్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

కరోనా కారణంగా మరణించినవారి కుటుంబానికి రూ. 50 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని గతంలో న్యాయస్థానం ఆదేశించింది.

అయితే ఈ చెల్లింపుల విషయంలో ఆంధ్రప్రదేశ్, బీహార్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాలు నిర్లక్ష్యం వహించాయి. దీనిపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

ఏపీ, బీహార్ రాష్ట్రాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు కోర్టు ముందు హాజరుకావాలని, పరిహారం ఎందుకు ఇవ్వలేదో తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది.

దాంతో బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ కోర్టు ముందు హాజరై వివరణ ఇచ్చారు.

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులకు సంబంధించిన వ్యాజ్యంపై జస్టిస్‌ ఎం ఆర్‌ షా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం వర్చువల్‌గా విచారణ జరిపింది.

విచారణ ప్రారంభం కాగానే ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పరిహారం చెల్లించాలని ఆంధ్ర ప్రభుత్వానికి ఇప్పటికి 10 సార్లు చెప్పామని.. అనేక ఉత్తర్వులిచ్చినా చేయనందునే తమ ముందు హాజరు కావాలని సీఎ్‌సను ఆదేశించామని తెలిపింది.

చెల్లింపులకు వారం రోజులు, పూర్తి స్థాయిలో దరఖాస్తుల పరిష్కారానికి రెండు వారాల సమయం ఇవ్వాలని ఏపీ సీఎస్ సమీర్ వర్మ అభ్యర్థించారు.

సీఎస్‌ తమకిచ్చిన హామీకి కట్టుబడి ఉంటారని విశ్వసిస్తున్నామని, చెప్పిన సమయానికి చెల్లింపులు పూర్తయ్యేలా చూడాలని ధర్మాసనం ఆదేశించినట్లు'' వెలుగు పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)