జనసేన - బీజేపీ ఉమ్మడి పోరాటం: 'అమరావతి నుంచి రాజధానిని కదలనివ్వం' - ప్రెస్ రివ్యూ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 151 సీట్ల బలం ఉన్న వైసీపీ తాము, ఏమైనా చేస్తానంటే ప్రజాస్వామ్యంలో కుదరదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేసినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
రాజధానిగా అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ కదలనివ్వబోమని ఆయన తేల్చిచెప్పారు.
గురువారం విజయవాడలో బీజేపీ-జనసేన భేటీ అనంతరం పవన్ కల్యాణ్ సహా ఉభయ పార్టీల నేతలతో కలిసి కన్నా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఏపీ భవిష్యత్, రాష్ట్ర ప్రజల హితాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ జగన్ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు పోతోందని ఆక్షేపించినట్లు జ్యోతి రాసింది..
'రాష్ట్ర రాజధానిగా అమరావతిని అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ లోపల, బయటా అంగీకరించాయి. ఇప్పుడు జగన్ దానిని మారుస్తానంటూ ఏకపక్షంగా ముందుకెళ్తే ఎలా సాధ్యమవుతుంది?
బీజేపీ-జనసేన ఉమ్మడి పోరాటంతో ప్రజల్లోకి వెళ్తాయి' అని కన్నా స్పష్టం చేశారు.అసెంబ్లీలో బలం ఒక్కటే సరిపోదు.. పోరాటాలతో పాటు అవసరమైతే న్యాయపరంగా ముందుకెళ్తాం. అమరావతి మాత్రం కదలదు' అని తేల్చిచెప్పారు.
ఒక్క అవకాశం ఇవ్వండి.. స్వర్గం చూపిస్తానంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ.. కుటుంబం, కులం, అవినీతి, అరాచకంతోపాటు ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టిన వారికి ప్రాధాన్యమివ్వడం దారుణమని కన్నా అన్నారని పత్రికలో రాశారు.
రాష్ట్రాన్ని.. వైసీపీ పెట్టుబడిదారుల బారిన పడనివ్వబోమన్నారు.
దేశ ప్రయోజనాలే ప్రధాని మోదీకి ముఖ్యమని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్దమనసుతో తమతో కలిసి వచ్చిన పవన్ కల్యాణ్‌కు మనస్పూర్తిగా స్వాగతం పలుకుతున్నట్లు కన్నా చెప్పారు.
రెండు పార్టీలూ కలిసి నేతల నుంచి కార్యకర్తల వరకూ ఎలాంటి విభేదాలు లేకుండా దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తామన్నారు.
కుటుంబం, అవినీతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో జగన్ ప్రభుత్వం ప్రజల్లో చులకనైపోయిందని.. ఈ విషయాలను మరింత లోతుగా ప్రజలకు వివరించి 2024లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరతామని ధీమా వ్యక్తం చేశారని ఆంధ్రజ్యోతి కథనంలో చెప్పింది.

ఫొటో సోర్స్, facbook/Sailajanathfollower
పీసీసీ అధ్యక్షుడుగా- శైలజానాథ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్షుడిగా అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ నియమితులైనట్లు ఈనాడు సహా ప్రధాన పత్రికలన్నీ కథనాలు ప్రచురించాయి.
కార్యనిర్వహక అధ్యక్షులుగా కడప జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఎస్.తులసిరెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీలను నియమిస్తూ ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల విభాగం ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం ఉత్తర్వులిచ్చారు.
పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఈ ముగ్గురినీ నియమించినట్లు పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పీసీసీ అధ్క్ష పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది.
ఇప్పుడు రాష్ట్రంలో రాజధాని తరలింపు, స్థానిక సంస్థల ఎన్నికలు లాంటి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అధ్యక్షుడితోపాటు, కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించిన కాంగ్రెస్ సామాజిక సమతౌల్యం పాటించే ప్రయత్నం చేసిందని ఈనాడు రాసింది.
రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా తనను నియమించినందుకు పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు శైలజానాథ్ కృతజ్ఞతలు తెలిపారు.
"కాంగ్రెస్ మాత్రమే సామాన్యులు, దళితులు, బలహీన వర్గాలకు మేలుచేసే పార్టీ అని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. సీనియర్లను కలుపుకుని ముదుకు వెళ్తాం. రాష్ట్రంలో మా ఓటింగ్ పొగొట్టుకున్నా, ప్రజలపై ప్రభావాన్ని కోల్పోలేదు క్రమంగా మావైపు వస్తారని భావిస్తున్నాం. రాజధాని మార్పుపై తర్వాత స్పందిస్తా. పార్టీ నాయకులందరితో వ్యక్తిగతంగా కలిసి మాట్లాడి అందరి అభిప్రాయాల ప్రకారం పార్టీని ముందుకు తీసుకెళ్తా" అని శైలజానాథ్ దిల్లీలో చెప్పినట్లు కథనంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
సివిల్స్ ఇంటర్వ్యూలకు 70 మంది తెలుగువారు
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 70 మంది వరకు అభ్యర్థులు సివిల్స్ ఇంటర్వ్యూలకు అర్హత సాధించినట్లు సాక్షి సహా అన్ని ప్రధాన పత్రికలూ వార్తలు ప్రచురించాయి.
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర కేడర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన సివిల్స్ మెయిన్స్-2019 పరీక్ష ఫలితాలు మంగళవారం రాత్రి విడుదలయ్యాయి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) దేశవ్యాప్తంగా నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో 2,304 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు.
ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి నుంచి న్యూఢిల్లీలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని యూపీఎస్సీ పేర్కొన్నట్లు కథనంలో చెప్పారు.
ఈసారి 896 పోస్టుల వరకు భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఇంటర్వ్యూల్లో మెరిట్ సాధించిన అభ్యర్థుల్ని గ్రూప్ ఏ, గ్రూప్ బీ కేటగిరీల్లోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర పోస్టులకు ఎంపిక చేస్తారు.
ఏపీ, తెలంగాణ నుంచి 850 మందికి మెయిన్స్‌కు అర్హత పొందినట్లు సాక్షిలో రాశారు.
ప్రిలిమ్స్‌కు ఏపీ, తెలంగాణ నుంచి 79,697 మంది దరఖాస్తు చేయగా.. 40,732 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 850 మందికి పైగా మెయిన్స్‌కి అర్హత సాధించారు.
విజయవాడ, హైదరాబాద్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. విజయవాడలో 134 మంది, హైదరాబాద్‌లో 641 మంది పరీక్ష రాయగా.. 775 మందిలో 80 మంది వరకూ ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు.
ఫిబ్రవరి నుంచి జరిగే ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కులకు.. మెయిన్ మార్కుల్ని జతచేసి ఈ ఏడాది మేలో యూపీఎస్సీ తుది ఫలితాలు విడుదలవుతాయని సాక్షి రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ మున్సిపోల్స్ బరిలో 12898 మంది
తెలంగాణలో జరగబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 12,898 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.
120 మున్సిపాలిటీల్లో 2,727 వార్డులు, 9 కార్పొరేషన్లలో 325 డివిజన్లలో.. సగటున నలుగురు చొప్పున పోటీపడుతున్నారని పత్రిక రాసింది.
మొత్తం 80 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 120 మున్సిపాలిటీల్లో 79 వార్డులు.. జవహర్‌నగర్ కార్పొరేషన్‌లో ఒక డివిజన్ ఉన్నది.
మొత్తం 3,052 వార్డుల్లో 2,972 వార్డుల్లో పోలింగ్ జరుగనుండగా.. అన్నిటా టీఆర్‌ఎస్ అభ్యర్థులు బరిలో నిలిచారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కొన్ని స్థానాలకే పరిమితమయ్యాయి.
రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించిన 80 ఏకగ్రీవస్థానాల్లో 77 వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులే ఉన్నారు. భైంసా మున్సిపాలిటీలో మూడువార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారని కథనంలో చెప్పారు.
కరీంనగర్ కార్పొరేషన్‌లో నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం ముగిసింది. మొత్తం 60 డివిజన్లలో 357 మంది బరిలో ఉండగా.. మహిళలకు రిజర్వ్ అయిన రెండు డివిజన్లను టీఆర్‌ఎస్ ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుందని నమస్తే తెలంగాణలో రాసింది.
మున్సిపల్ ఎన్నికల బరిలో స్వతంత్రులే ఎక్కువమంది ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
- సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో అర్ధ రాత్రి వరకు మహిళల ఆందోళన
- విరసం @50: వర్గ పోరాట స్పృహతో అయిదు దశాబ్దాల సాహితీ ప్రస్థానం
- కేరళలో రెండు ఎత్తయిన భవనాలు క్షణాల్లో నేలమట్టం
- అమిత్ షా ర్యాలీలో CAA వ్యతిరేక బ్యానర్ పట్టుకున్న అమ్మాయి ఏమన్నారు...
- జేఎన్‌యూలో దాడి నిందితుల్లో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్
- NRC ఎన్డీఏ కూటమిలో చీలికలు తీసుకొచ్చిందా
- భారత్‌లో ప్రతి 20 మంది చిన్నారుల్లో ఒకరు అయిదేళ్లలోపే చనిపోతున్నారు...
- ‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. అలాంటి పిటిషన్లతో ఉపయోగం లేదు’- చీఫ్ జస్టిస్ బోబ్డే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








