విరసం @50: వర్గ పోరాట స్పృహతో అయిదు దశాబ్దాల సాహితీ ప్రస్థానం

ఫొటో సోర్స్, facebook/arunataraviplavam/
విప్లవ రచయితల సంఘం - (విరసం) 50వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా విరసం హైదరాబాద్‌లో మహాసభలను ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి విరసం అభిమానులు, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తల ప్రసంగాలు, కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు సహా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. 'సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గ పోరాట రచన' పేరుతో ఈ సభలు జరుగుతున్నాయి.
కార్యక్రమం ప్రారంభానికి ముందు బాగ్‌లింగంపల్లి దగ్గరున్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కేరళ నుంచి వచ్చిన రావుణ్ణి ప్రపంచ కార్మిక పతాకాన్నీ, విరసం వ్యవస్థాపక సభ్యురాలు కృష్ణ బాయి విరసం పతాకాన్నీ, విప్లవకారుల కుటుంబానికి చెందిన కమలాకర్ అమరుల స్థూపాన్ని ఆవిష్కరించారు. సభ ప్రారంభం అయ్యాక విప్లవోద్యమంలో అమరులైన వారికి నివాళులు అర్పించారు.
బెంగాల్ నుంచి వచ్చిన రచయిత, అనువాదకులు కాంచన్, విరసం ప్రారంభం అయినప్పటి పరిస్థితులను వివరించారు. సుబ్బారావు పాణిగ్రాహిని గుర్తు చేసుకున్నారు. శ్రీశ్రీ,, చెరబండ రాజు వంటి కవుల పాత్రను గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న సమస్యల విషయంలో స్పందించాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడారు.


‘‘హింస, అణచివేత ఉన్న సమాజంలో మానవీయత, ప్రజాస్వామిక సాంస్కృతిక రంగంలో విరసం పనిచేస్తుంది. వర్గ సమాజాన్ని నిర్మూలించి మానవీయ సమాజం కోసం పనిచేస్తాం. దోపిడీ రూపాలు కొనసాగుతున్నా, పాలక రాజకీయాలు వీటిని పరిష్కరించలేదు. చాలా పార్టీలు వచ్చాయి. కానీ, ప్రజా సమస్యలు తీరలేదు. పైగా అవి తీవ్రమయ్యాయి. కొత్త రూపం తీసుకున్నాయి. దోపిడీ పెరిగింది. అవి ఉన్నంత వరకూ తిరుగుబాటు ఉద్యమాలు ఉంటాయని చరిత్ర నిరూపించింది’’ అంటూ ప్రస్తుత సమాజంలో విరసం పాత్ర గురించి చెప్పుకొచ్చారు ఆ సంస్థ కార్యదర్శి పాణి.
‘‘విరసం రాకముందు దారీ తెన్ను లేని పరిస్థితుల్లో ఉండేది తెలుగు సాహిత్యం. అభ్యుదయ కవిత్వం అడుగంటింది. ఆ సమయంలో తెలుగు సాహిత్యంలో పోరాట భావన తీసుకువచ్చింది విరసం. దీంతో తెలుగు సాహిత్యంలో కొత్త చరిత్ర ఏర్పడింది. అణగారిన వర్గాలకు, ప్రాంతాలకు సాహిత్యంలో సానుకూల స్థానం ఏర్పడింది’’ అన్నారు పాణి.

బెంగాల్ నుంచి కంచన్ కుమార్, మధ్య ప్రదేశ్ నుంచి రించిన్, కేరళ నుంచి రావుణ్ణి, కేకేయస్ దాస్, ఒడిశా నుంచి హేమంత్ దళపతి వంటి వారు ఈ సభలకు హాజరయ్యారు. సభా ప్రాంగణం దగ్గర పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం జైల్లో ఉన్న విరసం సభ్యులు వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాల మాటలను ఫ్లెక్సీలుగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అక్రమ అరెస్టులను ఖండించాలని నినాదాలు చేశారు.

ఎలా మొదలైంది?
విశాఖపట్టణంలో 1970లో అభ్యుదయ రచయితల సమావేశం సందర్భంగా కొందరు విద్యార్థులు ఒక ప్రశ్న లేవనెత్తారు.
అప్పట్లో శ్రీకాకుళం ప్రాంతంలో వామపక్ష అతివాదానికి మద్దతిచ్చారన్న ఆరోపణలతో కొందరు కళాకారులను పోలీసులు చంపారు.
దీనిపై రచయితల వైఖరి చెప్పాలని ఆ విద్యార్థులు డిమాండ్ చేశారు. అక్కడ ప్రారంభం అయిన చర్చ, అభ్యుదయ రచయితల నుంచి విప్లవ రచయితల సంఘం ఏర్పాటు దిశగా సాగింది.
1970 జనవరిలో ఈ విశాఖ సమావేశం జరగ్గా, 1970 జూలై 4న విరసం ఏర్పాటు అయింది.
శ్రీ శ్రీ ఈ సంఘానికి మొదటి అధ్యక్షులు. వరవరరావు, రావి శాస్త్రి, కెవి రమణా రెడ్డి వంటి వారు ఈ సంఘం వ్యవస్థాపక సభ్యులుగా ఉండేవారు.
వామపక్ష విప్లవానికి వీరు మద్దతిస్తారు. కవిత్వం అంటే పేదల పక్షాన, ప్రజల పక్షాన, అణచివేతకు గురవుతున్న వారి పక్షాన ఉండాలి అని ఈ సంస్థ నమ్ముతుంది.
ఇవి కూడా చదవండి:
- ఎడిటర్స్ కామెంట్: వందేళ్ల రష్యా అక్టోబర్ విప్లవం తెలుగు సమాజానికి ఏం చేసింది?
- ప్రొఫెసర్ సాయిబాబా: ''ఈ చలికాలం దాటి బతకలేనేమో!''
- కొండపల్లి కోటేశ్వరమ్మ: ‘వందేళ్ల విలువల వంతెన’
- BBC EXCLUSIVE: ‘‘జీవితాలను ప్రభావితం చేశాను అనిపించుకోవడమే నోబెల్‌కన్నా గొప్ప పురస్కారం!’’
- ‘తెలంగాణలో అమిత్ షా, కేసీఆర్‌ల రాజ్యం నడుస్తోంది’ - వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్
- ‘మోదీ హత్యకు మావోయిస్టుల కుట్ర’: నిజమా? కల్పితమా?
- విశాఖపట్నంకు ఆ పేరు ఎలా వచ్చింది? వైజాగ్‌గా ఎలా మారింది? చరిత్ర ఏం చెబుతోంది?
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
- ‘రోజుకు 4 గంటలే చదువు.. మిగతా సమయంలో వ్యవసాయం, ఆటలు, కమ్యూనిటీ పనులు’
- ఆస్ట్రేలియా కార్చిచ్చు: నిప్పును నిప్పుతోనే నియంత్రించడం సాధ్యమా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








