ఆస్ట్రేలియా కార్చిచ్చు: నిప్పును నిప్పుతోనే నియంత్రించడం సాధ్యమా?

ఆస్ట్రేలియా కార్చిచ్చు

ఫొటో సోర్స్, Getty Images

ముల్లును ముల్లుతోనే తీయాలని చెబుతారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో మంటలను మంటలతోనే ఆర్పాలని కూడా అంటున్నారు.

ఆస్ట్రేలియాలో రగులుతున్న కార్చిచ్చు నేపథ్యంలో 'కంట్రోల్డ్ బర్నింగ్' అనే ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ఇందులో భాగంగా నియంత్రిత వాతావరణంలో మంటలను సృష్టించి మండే స్వభావం ఉన్న చిన్న చిన్న వస్తువులను ముందుగానే తగలబెట్టేస్తారు. దీనివల్ల ఆ ప్రాంతంలో కొత్తగా మంటలు విస్తరించే అవకాశం తగ్గుతుంది.

మంటలను అదుపుచేయడానికి తీసుకునే ఆఖరి చర్యగా దీన్ని భావిస్తారు. ముందుగానే చెట్లను తగలబెట్టేయడం ద్వారా అవతలి దిక్కు నుంచి వచ్చే మంటలు ఇవతలి వైపు రాకుండా చూడటం దీని ముఖ్య ఉద్దేశం.

కానీ, పర్యావరణవేత్తల కారణంగా ఈ పద్ధతిని అనుసరించడం కుదరట్లేదని, ఇలా కృత్రిమంగా మంటలను సృష్టించడం వల్ల అడవులకు నష్టం కలుగుతుందని వాళ్లు ఆందోళన చేస్తున్నట్లు ఆస్ట్రేలియా రాజకీయ నేతలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో 'కంట్రోల్డ్ బర్నింగ్' అనే పద్ధతి అసలు పనిచేస్తుందా అనే సందేహాలూ ఎదురవుతున్నాయి.

సరైన మార్గాలను అనుసరిస్తే దీని ద్వారా మంటలను అదుపు చేయడం సాధ్యమే అని చాలామంది నిపుణులు చెబుతున్నారు.

ఆస్ట్రేలియా కార్చిచ్చు

ఫొటో సోర్స్, Getty Images

వాతావరణ పరిస్థితులపై కూడా ఈ పద్ధతి ఎంతవరకు విజయవంతమవుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. కరువు పరిస్థితుల్లో చెట్లన్నీ ఎండిపోయి ఉన్న స్థితిలో వాటిని తగలబెడితే, మంటలు మరింత చేయిదాటిపోయే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియాలో ప్రస్తుతం విజృంభిస్తున్న కార్చిచ్చును గమనిస్తే మంటలు చెట్ల పై భాగం నుంచి వడివడిగా విస్తరిస్తున్నాయి.

కాబట్టి చెట్ల కింది భాగంలో తగలబెట్టి, కొత్త చెట్లు పెరగకుండా చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.

ఒకవేళ కొంత ప్రదేశంలో ముందుగానే చెట్లను కాల్చి బూడిద చేస్తే, అక్కడ కొత్తగా మంటలు వ్యాపించకుండా అదుపు చేయొచ్చు. కానీ, ప్రస్తుతం ఆస్ట్రేలియా కార్చిచ్చు చాలా బలంగా కనిపిస్తోంది. గాలులు కూడా వేగంగా వీస్తున్నాయి. కాబట్టి నిప్పు కణికలు గాల్లో చాలా దూరం ప్రయాణించి ఇతర చెట్లపై పడి వాటిని తగలబెట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఆస్ట్రేలియా కార్చిచ్చు

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియాలో గతంలో ఈ పద్ధతిలో మంటలను అదుపు చేసిన దాఖళాలు ఉన్నాయి. ఈ పద్ధతిపై పట్టున్న అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రపంచంలో చాలామంది ఉన్నారు.

మంటలను నివారించడానికి ముందుగా మంటలను సృష్టించడం అనేది చాలా వ్యయప్రయాసలతో కూడిన ప్రక్రియ. ముఖ్యంగా ప్రపంచ వారసత్వ హోదా పొందిన ప్రదేశాలకు దగ్గరగా ఈ ప్రక్రియ చేపట్టినప్పుడు ఉన్నత స్థాయిలో అనేక అనుమతులు పొందాల్సి ఉంటుంది.

క్వీన్స్‌లాండ్, న్యూ సౌత్ వేల్స్ ప్రాంతాల్లో ఈ పద్ధతిని అనుసరించినప్పుడు కొన్నిసార్లు మంచి ఫలితాలే వచ్చినా, ఇంకొన్ని సార్లు వాతావరణం అనుకూలించక అది విఫలమైంది.

వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, చల్లగా ఉన్నప్పుడే ఈ పద్ధతి విజయవంతమయ్యే అవకాశాలెక్కువ.

ఆస్ట్రేలియా కార్చిచ్చు

ఫొటో సోర్స్, Getty Images

2015లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం ఇలానే మంటలను అదుపు చేయడానికి ముందుగానే మంటలను సృష్టించి కొంత ప్రాంతాన్ని బూడిద చేయడానికి ప్రయత్నించింది. దట్టంగా పెరిగిన పొదలను కాల్చేస్తే, తరువాత మంటలు వాటి గుండా వ్యాపించవని భావించింది. కానీ, వాళ్లు రగిల్చిన మంటలు అదుపు తప్పి పరిసరాల్లో ఉన్న నాలుగు ఇళ్లు దగ్ధమయ్యాయి. 3 వేల హెక్టార్లలో వ్యవసాయ భూమి కూడా కాలిపోయింది.

కాబట్టి, ఈ 'కంట్రోల్డ్ బర్నింగ్' ద్వారా మంటలను ఎంత వరకు అదుపు చేయొచ్చనేదానిపై ఇప్పటికీ భిన్న వాదనలే వినిపిస్తున్నాయి. దీనిపై ఆస్ట్రేలియా రాజకీయ పక్షాలు కూడా రెండుగా విడిపోయాయి. కొందరు దీనికి అనుకూలంగా కొందరు వ్యతిరేకంగా వాదిస్తున్నారు.

ఒకవేళ ఈ పద్ధతిని ప్రయత్నించి అది సఫలమైతే ఫర్వాలేదు కానీ, విఫలమైతే మాత్రం పరిస్థితి మరింత భయంకరంగా మారుతుందని ఇంకొందరు పర్యావరణవేత్తలు భయపడుతున్నారు.

రియాల్టీ చెక్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)