ఆస్ట్రేలియా కార్చిచ్చు: 2,000 ఇళ్లు బుగ్గి.. ఇంకా వదలని దావానలం భయం

ఆస్ట్రేలియా కార్చిచ్చు

ఫొటో సోర్స్, EPA

ఆస్ట్రేలియాలో నెలల తరబడి కొనసాగుతున్న కార్చిచ్చు సంక్షోభంలో దాదాపు 2,000 ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు చెప్తున్నారు. మరోవైపు.. అంతకంతకూ విషమిస్తున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిబ్బంది సమాయత్తమవుతున్నారు.

ఆస్ట్రేలియాలోని ఆగ్నేయ ప్రాంతాన్ని చుట్టుముడుతున్న కార్చిచ్చు మరింతగా వ్యాపించకుండా అదుపు చేయటానికి.. అగ్నిమాపక సిబ్బంది చల్లబడిన వాతావరణాన్ని ఉపయోగించుకుంటున్నారు.

అయితే ఉష్ణోగ్రతలు శుక్రవారం నాడు మళ్లీ పెరిగే అవకాశముంది. అప్పుడు కార్చిచ్చు దావానలంలా వ్యాపించవచ్చుననే భయాందోళనలు రేగుతున్నాయి.

ఆస్ట్రేలియా.. అనూహ్యమైన కార్చిచ్చుతో తలపడుతోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, విస్తృత కరవు.. కార్చిచ్చుకు ఆజ్యం పోస్తున్నాయి.

ఈ కార్చిచ్చు వల్ల సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకూ 25 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది జంతువులు ఆహుతయ్యాయి.

ఆస్ట్రేలియా కార్చిచ్చు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కార్చిచ్చులతో రేగిన పొగ, ధూళి సిడ్నీ నగరాన్ని కూడా ముంచెత్తాయి

న్యూ సౌత్ వేల్స్‌లో కార్చిచ్చులో 1,588 ఇళ్లు ధ్వంసమయ్యాయని.. మరో 653 దెబ్బతిన్నాయని అధికారులు మంగళవారం చెప్పారు.

పొరుగు రాష్ట్రమైన విక్టోరియాలో దాదాపు 200 ఇళ్లు ధ్వంసమవగా ఇతర రాష్ట్రాల్లో మరో 100కు పైగా ఇళ్లు బూడిదయ్యాయి.

ఇప్పటివరకూ ఈ ఇళ్ల బీమా విలువ 70 కోట్ల ఆస్ట్రేలియన్ డాలర్లకు చేరిందని.. అది ఇంకా గణనీయంగా పెరగవచ్చునని ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అంచనా వేసింది.

కార్చిచ్చు పొగ కాన్‌బెర్రా, సిడ్నీ నగరాలతో పాటు ఇప్పుడు మెల్‌బోర్న్‌ను కూడా కమ్మేసింది. ప్రజలకు శ్వాస ప్రమాదాలు మరింతగా పెరుగుతాయని.. ప్రత్యేకించి గర్భిణిలు సహా సున్నితమైన వారికి అధిక ముప్పు ఉంటుందని వైద్యులు హెచ్చరించారు.

మెల్‌బోర్న్‌ నగరంలో చూడగలిగే దూరం ఒక కిలోమీటరు కన్నా తక్కువకు పడిపోయిందని వాతావరణ విభాగం సోమవారం తెలిపింది.

ఆస్ట్రేలియా కార్చిచ్చు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, న్యూ సౌత్ వేల్స్ నివాసులు చాలా మంది ఇళ్లు వదిలి సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు

ప్రస్తుత ముప్పు ఏమిటి?

న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాల్లో వర్షం కురిసి ఉష్ణోగ్రతలు తగ్గాయి. అయితే మంటలు మళ్లీ విజృంభిస్తాయని అధికారులు హెచ్చరించారు.

రెండు రాష్ట్రాల్లో భారీ కార్చిచ్చులు కలిసి.. అంచనాలకు అందని దావానలాన్ని సృష్టించవచ్చునని వారు భయపడుతున్నారు. దానివల్ల ప్రజల ప్రాణాలకు, ఇళ్లకు ప్రమాదం పెరిగిపోతుందని చెప్తున్నారు.

పశ్చిమ ఆస్ట్రేలియాలో ఈ సీజన్‌లోని తొలి తుపాను వల్ల సోమవారం రాత్రి నుంచి బలమైన గాలులు వీస్తుండటంతో పాటు భారీ వర్షాలూ కురుస్తున్నాయి. కార్చిచ్చును నియంత్రించటానికి ఈ వర్షాలు కీలకంగా మారాయి.

కార్చిచ్చు పరిస్థితి కాస్త తెరిపి ఇవ్వటంతో.. ప్రభావిత ప్రాంతాలకు విలువైన సరఫరాలను చేరవేయటానికి వీలు కలిగింది.

దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరం సమీపంలోని కంగారూ దీవికి నిత్యావసరాలు, సహాయ సిబ్బంది, వాహనాలను పంపించినట్లు సైన్యం తెలిపింది. ఆ దీవిలో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. గత వారంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.

మంటలకు, జనావాసాలకు మధ్య.. మంటలను నియంత్రించే చర్యలను బలోపేతం చేయటానికి 2,600 మందికి పైగా సిబ్బందిని మోహరించినట్లు న్యూ సౌత్ వేల్స్ గ్రామీణ అగ్నిమాపక విభాగం మంగళవారం వెల్లడించింది.

ఆస్ట్రేలియా కార్చిచ్చు

ఫొటో సోర్స్, EPA

ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందా?

ఈ కార్చిచ్చు సంక్షోభం కొన్ని నెలల పాటు కొనసాగవచ్చునని ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ సోమవారం నాడు హెచ్చరించారు. ఈ విపత్తు నుంచి కోలుకోవటానికి వచ్చే రెండేళ్ల పాటు 200 కోట్ల ఆస్ట్రేలియన్ డాలర్లు వెచ్చిస్తామని చెప్పారు.

మంటల్లో ఇళ్లు, వ్యాపారాలు కోల్పోయిన వారికి సాయం చేయటం కోసం సహాయ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

అగ్నికీలలను నియంత్రించటం కోసం స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వారికి కొంత పరిహారం ఇస్తామని చెప్పారు. మంటలపై నీటిని వెదజల్లే విమానాల కోసం మరిన్ని నిధులు కేటాయించారు.

అయితే.. ఒకవైపు కార్చిచ్చు దహించి వేస్తోంటే మరోవైపు సెలవు తీసుకుని హవాయిలో విహరించారంటూ ప్రధాని మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కార్చిచ్చులో వాతావరణ మార్పు పాత్రను తేలికగా కొట్టివేయటం పట్ల కూడా ఆయన మీద విమర్శలు వచ్చాయి.

ఆస్ట్రేలియా కార్చిచ్చు

ఫొటో సోర్స్, Getty Images

ప్రముఖులు ఎలా సాయం చేస్తున్నారు?

హాస్యనటుడు సిలిస్ట్ బార్బర్ కేవలం 48 గంటల్లో 3.5 కోట్ల ఆస్ట్రేలియన్ డాలర్లు సేకరించి న్యూ సౌత్ వేల్స్ అగ్నిమాపక శాఖకు అందించారు.

ఆస్ట్రేలియా నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్.. తాను 10 లక్షల డాలర్లు విరాళం ఇచ్చినట్లు తెలిపారు. ఆయనతో పాటు అనేకమంది ప్రముఖులు.. కార్చిచ్చు మీద పోరాటానికి విరాళాలు అందిస్తున్నారు.

అమెరికా గాయకురాలు పింక్, ఆస్కార్ విజేత నికోల్ కిడ్‌మాన్ చెరో ఐదు లక్షల డాలర్లు విరాళం ప్రకటించారు.

పాప్ స్టార్ కైలీ మినోగ్.. తన కుటుంబం ఐదు లక్షల డాలర్లు విరాళం అందించినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)