ఇరాన్‌లో కాసిం సులేమానీ అంత్యక్రియల్లో తొక్కిసలాట.. 50 మంది మృతి

కాశిం సులేమానీ అంత్యక్రియలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, కెర్మాన్ పట్టణంలో సులేమానీ అంత్యక్రియల్లో భారీ తొక్కిసలాట జరిగింది

అమెరికా డ్రోన్ దాడిలో చనిపోయిన ఇరాన్ సైనిక కమాండర్ కాశిం సులేమానీ అంత్యక్రియలకు.. భారీ సంఖ్యలో జనం హాజరవటంతో జరిగిన తొక్కిసలాటలో 50 మంది చనిపోయారని ఇరాన్ మీడియా వెల్లడించింది.

ఇరాన్‌లోని సులేమానీ స్వస్థలం కెర్మాన్ పట్టణంలో జరుగుతున్న అంత్యక్రియలకు పదుల లక్షల్లో జనం హాజరయ్యారని.. అంతిమయాత్రలో జరిగిన తొక్కిసలాటలో మరో 200 మందికి పైగా జనం గాయపడ్డారని ఆ వార్తలు చెప్తున్నాయి.

సులేమానీని అమెరికా డ్రోన్ దాడిలో చంపటం.. అమెరికా - ఇరాన్‌ల మధ్య యుద్ధం జరగవచ్చన్న ఆందోళనలను రేకెత్తించింది.

ఇరాన్‌లో దేశాధినేత ఖొమేనీ తర్వాత అత్యంత శక్తిమంతమైన నాయకుడు సులేమానీ అని పరిగణిస్తారు. ఆయనను ఒక ఉగ్రవాది అని, అమెరికా బలగాలకు ఆయనతో ప్రమాదం ఉందని అమెరికా భావించింది.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచీ డోనల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఇరాన్ కూడా అదే తీరుతో స్పందిస్తోంది.

అమెరికా గత నెలలో ఇరాక్‌లో.. ఇరాన్ మద్దతు గల ఒక మిలీషియా మీద దాడులు చేయటంతో ఇరాన్ - అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఆ మిలీషియా అమెరికా బలగాలపై దాడులకు పాల్పడుతోందని అమెరికా ఆరోపించింది.

సులేమానీ అంత్యక్రియలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, సులేమానీ శవపేటిక వద్ద ఇరాన్ దేశాధినేత ఖొమైనీ విలపించారు

‘‘అమెరికా సైన్యం, పెంటగన్ ఉగ్రవాద సంస్థలు...’’

ఇరాన్‌లో సులేమానీ హత్య నేపథ్యంలో పలు ముఖ్యమైన పరిణామాలివీ...

  • ఈ వారంలో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితిని సందర్శించటానికి ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జారిఫ్‌కు అమెరికా వీసా తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. అలా తిరస్కరించినట్లయితే.. ఐరాస ప్రధాన కార్యాలయాన్ని సందర్శించటానికి విదేశీ నాయకులకు అనుమతి ఇస్తామంటూ హమీ ఇచ్చిన ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించినట్లవుతుంది.
  • జావేద్ జారిఫ్ టెహ్రాన్‌లో ఒక సదస్సులో మాట్లాడుతూ.. సులేమానీని హత్య చేయటం ద్వారా అమెరికా పెద్ద జూదమాడిందని, లెక్కతప్పిందని వ్యాఖ్యానించారు.
  • ఇస్లామిక్ స్టేట్ మీద పోరాడుతున్న సంకీర్ణ సేనల్లో భాగంగా ఇరాక్‌లో ఉన్న తమ సైనికులు కొంతమందిని జర్మనీ ఉపసంహరించుకుంటోంది.
  • అమెరికా సైనికాధికారి ఒకరు ఇరాక్ నుంచి తమ సైనిక బలగాలను ఉపసంహరిస్తున్నామని సూచిస్తూ రాసిన ఒక లేఖ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. అటువంటిదేమీ జరగదని అమెరికా తిరస్కరించింది.
  • అమెరికా సైన్యాన్ని, పెంటగన్‌ను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఇరాన్ పార్లమెంటు ఆమోదించింది. సులేమానీ సారథ్యం వహించిన బలగాలకు అధిక నిధులు కేటాయించింది.
సులేమానీ అంత్యక్రియలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, సులేమానీని ఇరాన్‌లో రెండో శక్తిమంతమైన నాయకుడిగా పరిగణిస్తారు

‘‘సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాల్సిందే...’’

సులేమానీ అంత్యక్రియల్లో పాల్గొన్న జనం.. ''అమెరికాకు మరణం.. ట్రంప్‌కు మరణం'' అని నినాదాలు చేసినట్లు విలేకరులు తెలిపారు.

''అమరుడు కాశిం సులేమానీ చనిపోయారు.. ఇప్పుడు మరింత శక్తిమంతుడు...'' అని రివల్యూషనరీ గార్డ్స్ అధిపతి మేజర్ జనరల్ హుసేన్ సలామీ పేర్కొన్నారు.

రివల్యూషనరీ గార్డ్స్‌ను ఇరాన్‌ ఇస్లామిక్ వ్యవస్థ రక్షణ కోసం నెలకొల్పారు. అది ఒక ప్రధాన రాజకీయ, సైనిక శక్తి.

''సులేమానీ తన ప్రజలకు సేవ చేయటానికి సిద్ధంగా ఉన్న గొప్ప నాయకుడు. ఆయన మరణానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే'' అని అంత్యక్రియల్లో ఉన్న ఓ 18 ఏళ్ల విద్యార్థి ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పాడు.

అయతొల్లా ఖొమైనీ సోమవారం నాడు టెహ్రాన్‌లో సులేమానీ అంత్యక్రియల్లో ప్రార్థనలకు సారథ్యం వహించారు. ఆయన ఒక సమయంలో సులేమానీ శవపేటిక వద్ద విలపించారు.

ఇరాన్ రాజధానిలో అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజల సంఖ్య పదుల లక్షల్లో ఉందని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ అంచనాలు చెప్తున్నాయి. ఈ జనసందోహం శాటిలైట్ చిత్రాల్లో కూడా కనిపిస్తోంది.

కాశిం సులేమానీ

ఫొటో సోర్స్, Getty Images

కాసిం సులేమానీ ఎవరు?

మేజర్ జనరల్ కాసిం సులేమానీ 1998 నుంచి ఇరాన్ కడ్స్ దళానికి నేతృత్వం వహిస్తున్నారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌లో అత్యున్నత విభాగం అయిన ఇది విదేశాల్లో రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

జనరల్ సులేమానీ ఇరాన్ పాలనలో చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆయన కడ్స్ ఫోర్స్ తరఫున నేరుగా సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీకి రిపోర్ట్ చేస్తుంటారు.

1980లో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో పనిచేసినపుడు ఆయన మొదటిసారి వెలుగులోకి వచ్చారు.

సులేమానీను పశ్చిమాసియాలో ఇరాన్ కార్యకలాపాలు నిర్వహించడంలో వ్యూహకర్తగా భావిస్తారు.

2003లో అమెరికా సైనిక దాడుల్లో ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ పాలన అంతమైన తర్వాత పశ్చిమాసియాలో కడ్స్ సేన తమ కార్యకలాపాలు వేగవంతం చేసింది.

గత ఏడాది ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సహా కడ్స్ దళాలను విదేశీ తీవ్రవాద సంస్థలుగా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)