దీపికా పడుకోణే: బాలీవుడ్‌కి ఒక రాజకీయ గళం దొరికిందా?

దీపికా పడుకోన్

ఫొటో సోర్స్, SPICE PR

    • రచయిత, సౌతిక్ బిస్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హింసతో అట్టుడికిన దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ దగ్గరకు మంగళవారం రాత్రి అనూహ్యంగా బాలీవుడ్ సూపర్‌స్టార్ ఒకరు వచ్చారు.

వర్సిటీ క్యాంపస్ మీద.. అధికార భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విద్యార్థుల గుంపు ప్రత్యర్థులపై చేసినట్లుగా ఆరోపిస్తున్న దిగ్భ్రాంతికరమైన దాడిని నిరసిస్తూ.. ఆ మబ్బుపట్టిన శీతాకాలపు సాయంత్రం వేళ విద్యార్థులకు సంఘీభావంగా నిలుచున్నారు దీపికా పడుకోణే.

ఆమె ఎటువంటి ప్రసంగాలూ చేయలేదు. ఎంత మౌనంగా వచ్చారో అంతే మౌనంగా వెళ్లిపోయారు.

కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో కల్లోలం రేగింది. భారతదేశంలో ఒక బాలీవుడ్ స్టార్ మాత్రమే అంత కలకలం సృష్టించగలరు.

మోదీ ప్రభుత్వాన్ని సమర్థించే మితవాద బృందాలు చాలా కాలంగా గురిపెట్టిన ఈ యూనివర్సిటీలో దెబ్బతిన్న విద్యార్థులకు పడుకోణే ''సాహసోపేత మద్దతు''ను.. ఆమె అభిమానులు, సహచరులు, విద్యార్థి నాయకులు ప్రశంసించారు.

సాధారణంగా బాలీవుడ్‌ని పరిహసించేవాళ్లు సైతం.. ఇప్పుడు ఆమె కొత్త సినిమాను - ఒక యాసిడ్ దాడి బాధితురాలి కథతో పడుకోణే నిర్మించి నటించిన సినిమా - తాము మళ్లీ మళ్లీ వీక్షిస్తామని ప్రకటించారు.

అయితే.. మోదీ ప్రభుత్వ మద్దతుదారులుగా బాగా తెలిసిన వారు.. పడుకోణే మీద మండిపడ్డారు. ఆమె తన కొత్త సినిమాకి ప్రచారం కోసం ఈ పనిచేశారని విమర్శించారు. ఆమె కొత్త సినిమాకు మద్దతివ్వాలని, ఆ సినిమాను బహిష్కరించాలని కోరుతూ ట్విటర్‌లో హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవటం మొదలయింది.

జేఎన్‌యూ క్యాంపస్‌ను పడుకోణే సందర్శించటం మీద ఈ వాగ్యుద్ధం అర్థంచేసుకోదగ్గదే.

దీపికా పడుకోన్

ఫొటో సోర్స్, AFP

దాదాపు మూడు డజన్ల సినిమాల్లో నటించిన ఈ 34 ఏళ్ల నటి.. ప్రపంచంలో అత్యంత విజయవంతంగా సాగుతున్న సినీ పరిశ్రమలో నిజంగానే ఒక సూపర్‌స్టార్. ఆమెకు సోషల్ మీడియాలో గణనీయమైన ఫాలోయింగ్ ఉంది. ట్విటర్‌లో 2.6 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 4.2 కోట్ల మంది ఆమెను ఫాలో అవుతున్నారు.

2016లో ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకునే నటీమణుల్లో పడుకోణే పదో స్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్ చెప్పింది. ఆ మరుసటి ఏడాది ఆమె, ఆమె భర్త, బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్‌సింగ్ ఉమ్మడిగా 2.1 కోట్ల డాలర్లు (దాదాపు రూ.150 కోట్లు) ఆర్జించారని ఆ మేగజీన్ పేర్కొంది.

ఒక హాలీవుడ్ సినిమాలో పడుకోణేతో కలిసి పనిచేసిన హాలీవుడ్ స్టార్ విన్‌డీజిల్.. ''ఆమె ఎంత అందంగా ఉంటారనే దాని గురించి ఎవరైనా మాట్లాడగలరు. ఆమె అసామాన్యమైన హాస్యచతురత గురించి ఎవరైనా చెప్పవచ్చు. కానీ.. ఆమె కేవలం ఒక తార మాత్రమే కాదు. ఆమె నటులకు నటి. ఈ కళకు అంకితమైన నటి'' అని ప్రశంసించారు.

పడుకోణే కాలక్రమంలో సున్నితభావాలు గల, ఆలోచించగల నటిగా గౌరవం సంపాదించుకున్నారు. డిప్రెషన్‌తో తన పోరాటం గురించి ఆమె బాహాటంగా మాట్లాడారు. మానసిక ఆరోగ్యం గురించి అవగాహన పెంపొందించే ప్రయత్నంలో భాగంగా.. జనవరి నెలలో దావోస్‌లో ప్రసంగించటానికి వెళ్లబోతున్నారు.

ఆమె 2017లో తను, రణ్‌వీర్‌సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన పద్మావత్ సినిమా విషయంలో మితవాద క్రోధాన్ని కూడా చవిచూశారు. నిరసనకారులు సినిమా హాళ్ల మీద దాడిచేసి ధ్వంసం చేశారు. ఒక భారతీయ పురాణంలో ఒక పాత్రకు శిక్షగా ముక్కు కోసిన కథను ప్రస్తావిస్తూ.. పడుకోణే ముక్కు కోసేస్తామని కూడా హెచ్చరించారు.

జేఎన్‌యూ క్యాంపస్‌ను పడుకోణే సందర్శించటం.. ఒక ప్రతీకాత్మక దృశ్యం. బాలీవుడ్ సినీ ప్రముఖులు, నటులు.. గొంతు విప్పరంటూ తరచుగా విమర్శలు ఎదుర్కొంటుంటారు.

గతంలో వరుస ప్రభుత్వాలు.. ముఖ్యంగా ముంబైలో మితవాద శివసేన పార్టీ సారథ్యంలోని ప్రభుత్వాలు - తమకు నచ్చని సినిమాలు నిర్మించిన సినీ ప్రముఖులను బాహాటంగానే బెదిరించాయి.

‘‘బాలీవుడ్ సినీ నిర్మాత ఒక దుర్బల జంతువు.. ప్రత్యేకించి అతడి సినిమా విడుదలయ్యే సమయం దగ్గరపడుతున్నపుడు వేటకు అనువుగా మారతాడు. అతడిని బెదిరించవచ్చు.. మోకరిల్లేలా చేయవచ్చు'' అని దర్శకుడు మహేష్ భట్ ఒకసారి అభివర్ణించారు.

పద్మావత్

ఫొటో సోర్స్, VIACOM18MOTIONPICTURES

ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా బాలీవుడ్‌ను చాలా ఓపికగా అనుగ్రహించారు. మద్దతుదారులైన నటులు, దర్శకులతో సెల్ఫీలకు కూడా ఫోజులిచ్చారు.

మరైతే.. పడుకోణే చర్య మార్పుకు నాందిపలికే బిందువా? ఇతర బాలీవుడ్ అగ్రతారలు కూడా మద్దతుగా నిలబడటాన్ని ఆమె చర్య ప్రోత్సహిస్తుందా?

భారతదేశంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన అసాధారణమైనది. ఎందుకంటే దీనికి సారథ్యం వహిస్తున్నది పౌర సమాజం. రాజకీయ పార్టీలు కాదు.

''సారాంశంలో.. ఆ ఉద్యమ స్ఫూర్తిని పడుకోణే ఆకళింపు చేసుకున్నారు. ఇది.. సిద్ధాంతాలకు అతీతమైన సంఘీభావ రాజకీయం. కాబట్టి జేఎన్‌యూలో ఆమె ఉనికి ముఖ్యమైన విషయం'' అని సమాజశాస్త్రవేత్త శివ్ విశ్వనాథన్ నాతో పేర్కొన్నారు.

ఇతరులు ఇదమిద్ధంగా లేరు. బలవంతమైన మోదీ హిందూ జాతీయవాద రాజకీయాలను - లౌకిక భారతదేశాన్ని విశ్వసించే వారు ఎదురుబొదురుగా నిలబడి నిట్టనిలువుగా చీలిన ఒక దేశంలో.. ''ఆకతాయి వామపక్ష విద్యార్థులు'' అని జనం అభివర్ణిస్తూ కొట్టిపారేసే ఈ యువత.. పడుకోణే సందర్శనతో పరిస్థితులను విస్మరించే అవకాశం లేదు.

''ఆమెను విమర్శించిన వారు ఆమె సినిమాలు చూడటం మానేస్తారని కూడా నేను ఖచ్చితంగా భావించలేను. మన ప్రజా సంస్కృతి సైద్ధాంతిక వైఖరుల మీద స్థిరంగా ఉండేది కాదు. అది ఎక్కువగా తాత్కాలిక సిద్ధాంతాలుగానే ఉంటాయి. ఏక కాలంలో తీవ్ర విరుద్ధ అభిప్రాయాలను కలిగి ఉండగల సామర్థ్యం మనకు ఉంది. మనం.. మంచికి చెడుకు, ఎడమకు కుడికి మధ్య స్పష్టమైన తేడాలు లేని ఒక మధ్యేవాద సమాజంలో నివసిస్తున్నాం. ఉదాహరణకు జనం.. ఒక బలమైన రాజ్యాన్ని - ఒక బహిరంగ మార్కెట్‌ను రెండిటికీ మద్దతు ఇస్తారు'' అని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకానమిక్ గ్రోత్‌లో సోషియాలజిస్ట్ ప్రొఫెసర్‌ సంజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.

దీపికా పడుకోన్

ఫొటో సోర్స్, facebook.com/DeepikaPadukone

మోదీ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఏకైక బాలీవుడ్ అగ్రతార దీపికా పడుకోణే ఒక్కరే కాదు.

వివాదాస్పద కొత్త పౌరసత్వ చట్టాన్ని, జేఎన్‌యూ క్యాంపస్ దాడిని వ్యతిరేకిస్తూ జరిగిన నిరసన ప్రదర్శనల్లో అనేక మంది యువ నటీమణులు, ప్రముఖ దర్శకులు పాల్గొన్నారు.

భారతదేశపు ప్రముఖ దర్శకుల్లో ఒకరైన అనురాగ్ కశ్యప్ మంగళవారం రాత్రి ఒక టీవీ చానల్‌తో మాట్లాడుతూ.. ''మోదీ ప్రభుత్వం దేశాన్ని 'దేశద్రోహులు, దేశభక్తులు' అని రెండు రకాల ప్రజలుగా విభజించింది'' అని పేర్కొన్నారు.

పడుకోన్ జేఎన్‌యూ దగ్గర విద్యార్థులను కలవటానికి ముందు ఒక న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ.. జరుగుతున్న సంఘటనలు తనను బాధించాయని చెప్పారు.

''ఇది నన్ను చాలా బాధ పెడుతోంది. ఇది కొత్త సాధారణ విషయంగా మారబోదని నేను అనుకుంటున్నా. అది చాలా భయం కలిగిస్తోంది. మన దేశ పునాది ఇది కాదు'' అని ఆమె పేర్కొన్నారు.

సెలబ్రిటీల రాజకీయాలను అనుమానించటం సులభం. కానీ.. పడుకోణే మాటల్లో నిజాయతీ గల ఆక్రోశం ధ్వనించింది.

''ఇది చాలా ముఖ్యమైన సందర్భమని నేను భావిస్తున్నా. తాను గొంతెత్తి మాట్లాడటం వల్ల పర్యవసానాల గురించి ఆమెకు తెలుసు. అయినా కానీ.. తాను మద్దతుగా నిలవటం ద్వారా చాలా విషయాలను పణంగా పెట్టారు. ఇది దేనికి దారి తీస్తుందో ఎవరికి తెలుసు? ఇప్పుడు మరింత మంది తారలు గొంతు విప్పి మాట్లాడతారా?'' అని సినీ విమర్శకురాలు శుభ్రా గుప్తా వ్యాఖ్యానించారు.

అది కాలమే చెప్తుంది.

వీడియో క్యాప్షన్, పద్మావత్: ఎందుకిన్ని అల్లర్లు? నిరసనలు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)