ఆస్ట్రేలియా కార్చిచ్చు: నిజంగా 50 కోట్ల జంతువులు చనిపోయాయా.. ఆ అంచనాకు ఎలా వచ్చారు?

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియా గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విపత్తును ఎదుర్కొంటోంది. అక్కడ దావాగ్ని అడవుల్ని దహించి వేస్తోంది. భారీ వృక్షాలు సైతం కాలి బూడిదవుతున్నాయి. అనేక ప్రాణులు తమ ఆవాసాల్ని, ప్రాణాల్ని కోల్పోతున్నాయి.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా ఆస్ట్రేలియా కార్చిచ్చుకు సంబంధించి అనేక పోస్టులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ మంటల కారణంగా దాదాపు 50 కోట్ల జంతువులు ప్రాణాలు కోల్పోయాయన్న కథనాలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి.
మరి ఆ పోస్టుల్లో నిజమెంత? నిజంగా అన్ని జంతువులు చచ్చిపోయాయా?
ఆస్ట్రేలియాలో మంటల వల్ల దాదాపు 50 కోట్ల జంతువుల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని మొదట పేర్కొన్న వ్యక్తి ప్రొఫెసర్ క్రిస్ డిక్‌మన్. సిడ్నీ విశ్వవిద్యాలయంలో ఆయన ఆస్ట్రేలియా జీవవైవిధ్య నిపుణుడిగా ఉన్నారు.
అన్ని కోట్ల ప్రాణులపై ప్రభావం పడిందన్న అంచనాకు తాను ఎలా వచ్చారో చెబుతూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన శీర్షికలో జంతువులు చనిపోయాయని ప్రస్తావించినప్పటికీ, ఆ వ్యాసంలో మాత్రం మంటల ప్రభావానికి గురైన జంతువుల గురించే చర్చించారు. అవి చనిపోయాయని చెప్పలేదు.
కార్చిచ్చు కారణంగా ఆస్ట్రేలియా జీవజాతులపై పడుతున్న ప్రభావం గురించి డిక్‌మన్ మరో రచయితతో కలిసి 2007లో వరల్డ్ వైడ్ ఫండ్ కోసం ఓ నివేదికను తయారు చేశారు. అందులో పొందుపరిచిన వివరాల ఆధారంగానే ఆయన ప్రస్తుత కార్చిచ్చు ప్రభావానికి గురైన జంతువుల సంఖ్యపై అంచనాకు వచ్చారు.

ఫొటో సోర్స్, PAUL SUDMALS / REUTERS
గతంలో ఆయన విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అక్కడి అడవుల్లో ఒక హెక్టారు విస్తీర్ణంలో దాదాపు 18 క్షీరధాలు, 21 పక్షులు, 130 సరీసృపాలు ఉన్నాయి.
ఆ అంకెలను ఆధారం చేసుకొని, ఇప్పుడు మంటల కారణంగా దెబ్బతిన్న మొత్తం భూభాగాన్ని, అన్ని హెక్టార్లలో ఉన్న ప్రాణుల సంఖ్యతో గుణించి దాదాపు 50 కోట్ల జంతువులు మంటలకు బలయ్యాయన్న అంచనాకు వచ్చారు.
'కేవలం న్యూ సౌత్ వేల్స్‌లో 30లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించిన మంటల ప్రభావం 50 కోట్ల జంతువులపై పడుంటుందన్న అంచనాకు మేం వచ్చాం' అని రెండు వారాల క్రితం డిక్‌మన్ పేర్కొన్నారు. దాన్ని బట్టి చూస్తే మొత్తం ఆస్ట్రేలియాలో ఆ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు.
కానీ, డిక్‌మన్ అంచనా ఇందుకు భిన్నంగా ఉంది. మంటలు తమ దాకా రాకముందే వాటి నుంచి తప్పించుకునే శక్తి కంగారూలు, ఈమూల లాంటి అనేక ప్రాణులకు ఉంటుందని ఆయన చెప్పారు.
''ఎక్కువగా అడవిపైనే ఆధారపడుతూ, ఎక్కువ దూరం ప్రయాణించలేని జీవులపైనే ఈ మంటల ప్రభావం అధికంగా ఉంటుంది. మంటల నుంచి తప్పించుకున్న జంతువులు కూడా మున్ముందు ఆహారం దొరక్కో, ఆవాసం లేకో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది'' అని డిక్‌మన్ చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
'50 కోట్ల ప్రాణులు చనిపోయాయి' అంటూ వస్తున్న కథనాలు వాస్తవానికి దూరంగా ఉండే అవకాశముందని యార్క్ యూనివర్సిటీకి చెందిన ఎకాలజిస్ట్ కోలిన్ బీల్ అన్నారు.
'ఆఫ్రికాలో నేను పనిచేసే ప్రాంతాల్లో మంటల కారణంగా అడవుల్లో చాలా తక్కువ పక్షులే చనిపోతుంటాయి. ఎగరడం వాటి సహజ గుణం. మంటల నుంచి అవి సులభంగా తప్పించకోగలవు. ఆస్ట్రేలియాలో కూడా అదే పరిస్థితి' అని ఆయన చెప్పారు.
మరోపక్క ప్రొఫెసర్ డిక్‌మన్ చెప్పినదాని ప్రకారం ఒక్క న్యూ సౌత్‌వేల్స్ ప్రాంతంలోనే 50 కోట్ల జంతువులు ప్రమాదం బారిన పడ్డాయి. ఆ తరువాత మంటలు విక్టోరియా అడవులకు సైతం వ్యాపించాయి.
అలాగే మంటలు కూడా 30 లక్షల హెక్టార్ల పరిధిని ఎప్పుడో దాటేశాయి. దాన్ని బట్టి చూస్తే మంటల ప్రభావానికి గురైన జంతువుల సంఖ్య కూడా ఇంకా ఎక్కువగానే ఉంటుంది.
కానీ, ఈ అంకెలన్నీ అంచనాలు మాత్రమేనని వీటిని విడుదల చేసిన ప్రొఫెసర్లు అంటున్నారు. ముఖ్యంగా సరీసృపాల విషయంలో ఈ అంచనాలు మరింత తప్పే అవకాశం ఉందని, అడవుల్లోని మొత్తం జీవుల్లో వాటి వాటానే మూడొంతులు ఉంటుందని వాళ్లు అంటున్నారు.

ఫొటో సోర్స్, EPA
'జంతువుల సాంద్రత అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదు. ఏ జీవికి ఎక్కడ ఎక్కువ అనుకూల పరిస్థితులు ఉంటే, అవి అక్కడ ఎక్కువ సంఖ్యలో నివసిస్తాయి. కాబట్టి ఒకే సూత్రం ఆధారంగా లెక్కలుగట్టి బాధిత జీవుల సంఖ్యను అంచనా వేయలేం' అని రీడింగ్ యూనివర్సిటీ అప్లయిడ్ ఎకాలజీ ప్రొఫెసర్ టామ్ ఓలివర్ చెప్పారు.
'మంటలను సరీసృపాలు ఎంత సమర్థంగా ఎదుర్కోగలవో చెప్పడం కష్టం. ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల్లో ఎక్కువ శాతం సరీసృపాలు మట్టిలోనే జీవిస్తాయి. కాబట్టి బొరియల్లో దాక్కోవడం ద్వారా చాలా ప్రాణులు ఎంత తీవ్రమైన మంటల నుంచైనా తప్పించుకునే అవకాశం ఉంది' అని యార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాలిన్ బేల్ వివరించారు.
దీన్ని బట్టి చూస్తే మంటల ప్రభావానికి గురైన ప్రాణులన్నీ చనిపోయాయని అనుకోవడం సరికాదని, అన్ని కోట్ల ప్రాణులు చనిపోయాయని చెప్పడం తప్పని ఆయన అన్నారు. అయితే మంటల నుంచి తప్పించుకున్నా, ఆ తరువాత కూడా చాలా ప్రాణులు ఎక్కువ కాలంపాటు జీవించలేకపోవచ్చన్నది ఆయన మాట.

ఇవి కూడా చదవండి:
- నిర్భయ దోషులకు డెత్ వారెంట్, జనవరి 22న ఉరిశిక్ష
- JNU విద్యార్థులపై హింసాత్మక దాడి వెనుక... వాట్సాప్ గ్రూప్స్ సీక్రెట్ చాటింగ్
- ఈ భవనాలు హిరోషిమా అణు బాంబును తట్టుకున్నాయి..
- జపాన్: బడి మానేస్తున్న చిన్నారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది... ఎందుకు?
- అత్యాచారం కేసులో జర్నలిస్టుకు రూ. 21.5 లక్షల పరిహారం
- ఫూమీ: ఏసుక్రీస్తు విగ్రహాలను బలవంతంగా కాలితో తొక్కించే ఈ ఆచారం ఏంటి?
- కాసిం సులేమానీ: ఇరాన్లో అంత్యక్రియల్లో తొక్కిసలాట.. 50 మంది మృతి
- ఇస్రో: 'గగన్‌యాన్' వ్యోమగాముల ఎంపిక ఎలా జరుగుతుంది?
- ఉదయించే సూర్యుడు ఉన్న ఈ జెండాపై వివాదమెందుకు?
- సీఈఎస్ 2020: శాంసంగ్ బాలీ.. నీడలా వెంటాడే రోబో బంతి
- ఆ రెండు అమెరికా స్థావరాలపైనే ఇరాన్ క్షిపణి దాడులు ఎందుకు చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








