ఇరాన్ ఆ రెండు అమెరికా స్థావరాలపైనే ఎందుకు దాడి చేసింది?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా - ఇరాన్ మధ్య ప్రస్తుతం యుద్ధవాతావరణం అలముకొంది. మొదట ఇరాన్ సైనిక కమాండర్ కాశిం సులేమానీని అమెరికా మట్టుబెట్టింది. ఆ తరువాత అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడిచేసింది.
ఇరాన్ చుట్టూ అమెరికాకు చెందిన అనేక సైనిక స్థావరాలు ఉన్నప్పటికీ రెండు స్థావరాలనే ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
ఇరాన్ క్షిపణుల దాడికి గురైన మొదటి అమెరికా సైనిక స్థావరం పేరు ‘అల్ అసద్ ఎయిర్ బేస్’. ఇది ఇరాన్‌కు సమీపంలో ఇరాక్ భూభాగంలో ఉంది. ఆ ప్రాంతానికి అమెరికా సేనల రాక మొదలైనప్పటి నుంచి దాని రూపు రేఖలే మారిపోయాయి. అక్కడ సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, ఫాస్ట్ ఫుడ్ రెస్టరెంట్ల లాంటివన్నీ వచ్చాయి. బస్సులు ప్రయాణించడానికి వీలుగా రెండు రహదారుల్ని కూడా నిర్మించారు.
మొదట 1980ల్లో ఇరాక్ సైనిక అవసరాలకు వీలుగా బగ్దాద్‌కు వంద మైళ్ల దూరంలో ఎడారి ప్రాంతంలో ఆ స్థావరాన్ని నిర్మించారు.

కానీ, 2003లో అమెరికా సేనలు ఇరాక్‌లోకి ప్రవేశించాక ‘అల్ అసద్’ వారి అతిపెద్ద సైనిక స్థావరాల్లో ఒకటిగా మారిపోయింది. తమ అవసరాలకు అనుగుణంగా అమెరికా సేనలు అక్కడ అనేక ఏర్పాట్లు చేసుకున్నాయి.
2006లో బీబీసీ ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఆ వైమానిక స్థావరం చుట్టూ రాళ్లు, పొదలు, ఇసుకే కనిపించింది. కానీ, ఇప్పుడు చూస్తే అదో చిన్నపాటి ఆధునిక అమెరికా పట్టణంలా కనిపిస్తుంది.
అక్కడ సౌకర్యాలు ఎంత బావుంటాయంటే, అమెరికా సేనలు ఆ స్థావరాన్ని ‘క్యాంప్ కప్‌కేక్’ అని పిలుచుకుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
2009, 2010లో అమెరికా దళాలు అక్కడి నుంచి వెనక్కు వచ్చి ఆ స్థావరాన్ని ఇరాకీలకు అప్పగించాయి. కానీ, దాని పరిసరాల్లో ఉన్న అన్బర్ ప్రావిన్సుపై ఇస్లామిక్ స్టేట్ పట్టు బిగించడంతో ఆ స్థావరంపై దాడి జరిగింది.
2014 నాటికి ఆ ప్రాంతం చుట్టూ ఐఎస్ ప్రాబల్యం పెరిగిపోయింది. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం మరోసారి బీబీసీకి లభించింది. అప్పటికి అక్కడ అమెరికా వదిలివెళ్లిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి.
అమెరికా సైనికుల క్వార్టర్ట్స్, ఓపెన్ చేయని ఆహార ప్యాకెట్లు, ఫిరంగి గుండ్ల లాంటివి కనిపించాయి.
అదే ఏడాది ఐఎస్‌పై పోరాడేందుకు అమెరికా దళాలు మళ్లీ అల్ అసద్ స్థావరానికి చేరుకున్నాయి. స్థావరాన్ని పునర్నిర్మించి దుర్బేధ్యంగా మార్చాయి.

2018 డిసెంబరులో అల్ అసద్ వైమానిక స్థావరాన్ని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సందర్శించారు.
ఇరాక్, సిరియాల్లోని ఐఎస్ఐఎస్ మిలిటెంట్లను ఓడించడంలో అల్ అసద్ స్థావరంలోని మహిళా, పురుష సైనిక సిబ్బందే కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు.
కానీ, అక్కడ ఉన్నంత సేపూ తన భార్య భద్రత గురించి కూడా ఆందోళన చెందినట్టు ఆయన వ్యాఖ్యానించారు.
గత నవంబర్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా ‘థ్యాంక్స్ గివింగ్’ వేడుకల్లో భాగంగా ఆ స్థావరాన్ని సందర్శించారు.

ఫొటో సోర్స్, AFP
మొత్తం ఇరాక్‌లో 5 వేల అమెరికా సైనిక దళాలు ఉన్నాయని, అల్ అసద్ స్థావరంలో 1500 అమెరికా - సంకీర్ణ దళాలు ఉన్నాయని అంచనా. ఆ దళాల్ని దేశం నుంచి పంపేయాలని ఈ వారం జరిగిన ఓటింగ్‌లో ఇరాకీ పార్లమెంట్ నిర్ణయించింది.
దానిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అల్ అసద్ వైమానిక స్థావరం నిర్మాణ వ్యయానికి సంబంధించిన ప్రస్తావనను ఆయన తీసుకొచ్చారు.
‘‘అత్యంత ఖరీదైన వైమానిక స్థావరం అక్కడుంది. నేను అధ్యక్ష పదవి చేపట్టడానికి ఎంతో కాలం ముందే వందల కోట్ల డాలర్లను ఖర్చు చేసి దాన్ని నిర్మించారు. ఆ నిర్మాణానికి అయిన డబ్బు తిరిగి చెల్లించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదు’’ అని ఆయన చెప్పారు.

ఇరాన్ చేసిన దాడిలో దెబ్బతిన్న మరో అమెరికా సైనిక స్థావరం కుర్దిస్తాన్ రాజధాని ప్రాంతమైన ఇర్బిల్‌లో ఉంది.
13 దేశాలకు చెందిన 3600 మంది సైనిక, ప్రభుత్వ సిబ్బంది అక్కడ ఉన్నారని గత సెప్టెంబరులో యూఎస్ ఆర్మీ తెలిపింది.
స్థానిక దళాలకు శిక్షణ ఇచ్చేందుకు ఆ స్థావరాన్ని వినియోగిస్తారు. ఆ ప్రాంతంలో మొట్టమొదటి మహిళా సైనిక శిక్షకులు ఇర్బిల్ స్థావరం నుంచే తర్ఫీదు పొందారని గత నెలలో అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.
అలా అమెరికాకు ఎంతో కీలకమైన ఆ రెండు సైనిక స్థావరాలపై నేడు ఇరాన్ దాడులు చేసింది.
ఇంకా అమెరికా దళాలు ఇరాక్‌లో ఎంత కాలం ఉంటాయనే దానిపై స్పష్టత లేదు. అమెరికా తమ బలగాలను ఇరాక్ నుంచి వెనక్కు రప్పించట్లేదని ఈ వారమే అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
- కాసిం సులేమానీ: ఇరాన్లో అంత్యక్రియల్లో తొక్కిసలాట.. 50 మంది మృతి
- ఇస్రో: 'గగన్‌యాన్' వ్యోమగాముల ఎంపిక ఎలా జరుగుతుంది?
- ఉదయించే సూర్యుడు ఉన్న ఈ జెండాపై వివాదమెందుకు?
- వివాహ వేదికల నుంచి ఉచిత న్యాయ సేవల వరకు... పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా యువత ఎలా ఉద్యమిస్తున్నారు?
- పాకిస్తానీ మెమన్స్: పిసినారి తనం వీళ్ల ఘన వారసత్వం... అన్ని రంగాల్లో వీళ్లదే ఆధిపత్యం
- ఏడాదిలో జార్ఖండ్ సహా ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి నరేంద్ర మోదీ, అమిత్ షా వైఫల్యమా?
- జపాన్: బడి మానేస్తున్న చిన్నారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది... ఎందుకు?
- మద్యం తాగేవాళ్లు తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను హింసించే అవకాశం ‘ఆరు రెట్లు ఎక్కువ’
- క్రిస్మస్ కార్గో అద్భుతం: 60 మందిని తీసుకెళ్లేలా డిజైన్ చేసిన ఓడలో 14,000 మంది ఎక్కారు
- ఇంత స్పష్టమైన సూర్య గ్రహణాన్ని 2031 వరకూ చూడలేరు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








