మగ్దూం మొహియుద్దీన్: విప్లవాగ్నిని.. మల్లెపూల పరిమళాన్ని విరజిమ్మిన కవి

ఫొటో సోర్స్, Rektha.org
- రచయిత, పాశం యాదగిరి
- హోదా, సీనియర్ పాత్రికేయులు, బీబీసీ కోసం
తెలంగాణ నేలలో వీరుల రక్తం, గాలిలో శౌర్యం ఇమిడి పోయిందని పోరాటాల ద్వారా, కవిత్వం ద్వారా ప్రపంచానికి తుపాను మోతతో వినిపించిన ప్రజా కవి మగ్దూం మొహియుద్దీన్.
బిర్యానీకి, షేర్వాణీకి, కుబానీకి మాత్రమే కాకుండా మానవత్వానికి, సంస్కారానికి, సాహిత్యానికి కూడా హైదరాబాద్ కేంద్ర బిందువని అనేక మంది ఉర్దూ, తెలుగు కవులు చాటారు. వీరిలో మగ్దూంది ప్రత్యేక స్థానం.
మగ్దూం కవిత పాతాళం అంత లోతు, నదీమైదానాల్లాగా విశాలం, గాజా పిరమిడ్ వలె సమున్నతం. అతిశయోక్తిగా అనిపించవచ్చు కానీ మగ్దూం కవితా గోష్ఠికి టికెట్లు కొని తొలిరోజు సినిమాకు వచ్చినట్లు జనం తండోపతండాలుగా వచ్చేవారనేది అక్షర సత్యం.
మగ్దూం అంటే కవిత్వానికి ఆలంబన. సన్నజాజి తీగకు పందిరి (చమేలీ కా మండ్వా). నూతన మానవుణ్ని (నయా ఆదమ్) ఆవిష్కరించడానికి మగ్దూం ప్రతి నిమిషం కలలు కన్నాడు.
ఆ కలలను నిజం చేసుకోవడానికి చివరి శ్వాస వరకు నిజాయతీగా పోరాటం చేశాడు. కార్మికవర్గం పోరులో అలిసి, కవిత్వంలో సేద తీరి, తిరిగి కొత్త ఉత్సాహంతో విద్యార్థులు, యువకుల మధ్య ఉపన్యాసకునిగా మారి, ఏనాడూ గుండెకు విశ్రాంతినియ్యని ఆ మహాయోధుడు సరిగ్గా యాభై ఏళ్ల క్రితం ఇదే రోజు (ఆగస్టు 25) గుండెను పోగొట్టుకున్నాడు.
దిల్లీలో కవి సమ్మేళనంలోనే అలసిపోయిన ఆయన గుండె శాశ్వత విశ్రాంతి కోరింది. నిన్న, నేడు హైదరాబాద్‌లో, ఇతర ప్రాంతాల్లో మగ్దూం సంస్మరణ సభల్లో వక్తలను వింటుంటే మగ్దూం వేలాది మంది హృదయ స్పందనగా మారాడని స్పష్టమవుతుంది.

ఫొటో సోర్స్, HindustaniLanguage
హైందవ, ఇస్లామిక్ మత దురహంకారం మానవత్వానికి శత్రువులని నమ్మి, చివరి వరకు రాజీలేని పోరులో ధృవతారగా వెలిగాడు మగ్దూం. మగ్దూం కవిత్వంలో పసిబాలుని చిరునవ్వు పలకరిస్తుంది. పోరాట యోధుని సంకల్ప దీక్ష గోచరమవుతుంది. మాతృమూర్తి కరుణ తల నిమురుతుంది. మేధావి ఘోష కర్తవ్యం బోధిస్తుంది. ప్రవక్త సందేశం దిక్కులు పిక్కటిల్లజేస్తుంది.
దేశంలో ప్రగతిశీల (తరఖ్కీ పసంద్) కవితా ఉద్యమానికి పునాది మగ్దూం. కిషన్ చందర్, అలీ సర్దార్ జాఫ్రీ, ఫైజ్ ఆహ్మద్ ఫైజ్, ఆలం ఖుంద్మీరి, ఓంకార్ ప్రసాద్, జవ్వాది రజ్వీ, ఆబిద్ అలీఖాన్, బూర్గుల నర్సింగరావు, సిబ్తె హసన్ వంటి కవి సైన్యానికి మగ్దూం స్ఫూర్తి ప్రదాత.
మఖ్దూం కవితల్లో తిరుగుబాటు, ఎర్రబావుటా కనిపిస్తాయి. అన్యాయానికి గురైన పేదవాడి బలహీనమైన ఆర్తనాదాలు వినిపిస్తాయి. కవిత్వమూ, ఉద్యమమూ కలగలిసిన సంగమస్థలి ఆయన జీవితం.
పీడిత ప్రజల్లో చైతన్యం రగిలించడానికి ఒక చేత్తో కవిత్వం రాస్తూ, మరోవైపు ప్రజా ఉద్యమాలకు సారథ్యం వహిస్తూ జాతిని జాగృతం చేసిన బహుముఖ వ్యక్తిత్వం మగ్దూంకే చెల్లింది. శరత్ సాహిత్యం, షిబ్లీ నోమాని, సర్ సయ్యద్, ఖాజీ అబ్దుల్ గఫార్, ప్రేమ్‌చంద్ వంటి కవుల రచనలు మగ్దూం సాహిత్యానికి ప్రేరణగా నిలిచాయి.
మగ్దూం పల్లెలో పుట్టి పల్లెలోనే పెరిగాడు. అందుకని పల్లెజనం బాధలు, కష్టాలు ఆయన కవితల్లో ప్రస్ఫుటమవుతుంటాయి. మగ్దూం నిరంకుశ రాజరిక వ్యవస్థను ప్రశ్నించాడు. హైదరాబాద్‌లో కమ్యూనిస్టు ఉద్యమానికి బునియాది అయ్యాడు. నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు.

ఫొటో సోర్స్, Chavakiran
హైదరాబాద్‌లో సత్యనారాయణ రెడ్డి, రాజ్ బహదూర్ గౌర్, కేఎల్ మహేంద్ర వంటి ఉద్ధండులతో కలిసి బలమైన కార్మిక వర్గ ఉద్యమాన్ని నిర్మించారు. శ్రమ దోపిడి పోవాలంటే శ్రామిక వర్గాల ఐక్యత ఒక్కటే మార్గమని నమ్మిన మగ్దూం... 'కామ్రేడ్స్ అసోసియేషన్' స్ధాపించారు. అప్పటికే అన్ని భావజాలాల వాళ్లతో కలిసి సలసలా కాగుతున్న ఆంధ్ర మహాసభతో కామ్రేడ్ అసోసియేషన్ జత కలిసింది.
దీంతో నాలుగైదు సంవత్సరాల్లోనే ఆంధ్ర మహాసభ స్వరూపమే మారిపోయింది. 1942 నుంచి 1946 వరకు కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం తొలగిపోవడంతో కార్మిక, రైతాంగ, విద్యార్థి సంఘాల ఉద్యమాలు తిరిగి పుంజుకున్నాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఆ పిలుపు ప్రకటనపై సంతకం చేసిన ముగ్గురు తెలంగాణ బిడ్డల్లో మగ్దూం మొహియుద్దీన్ ఒకరు.
తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం సాంకేతికంగా 1934 సెప్టెంబర్ 11న ప్రారంభం అయినప్పటకీ, 1944 భువనగిరి పదకొండో ఆంధ్ర మహాసభ నాటి నుంచి పోరాటం ఎరుపెక్కింది. జనగామ తాలూకాలో రైతాంగం కదలికలతో రాజుకున్న నిప్పురవ్వలు 1946 జులై 4న కడవెండిలో దొడ్డి కొమురయ్య అమరత్వంతో దావానలమయ్యాయి.
'నైజాం నిరంకుశ పాలన పోవాలి - ప్రజారాజ్యం స్థాపించుకోవాలి' అని హైదరాబాద్ కమ్యూనిస్టు పార్టీ స్టేట్ కమిటీ తీర్మానంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ క్రమంలో కమ్యూనిస్టు పార్టీ మీద మళ్లీ నిషేధం వల్ల అరెస్టు నుంచి తప్పించుకోవడానికి మగ్దూం అజ్ఞాతంలోకి వెళ్లారు. నాలుగు సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం నుంచే సాయుధ పోరాటాన్ని, కార్మికోద్యమాన్ని, విద్యార్థి ఉద్యమాన్ని నడిపారు.
మగ్దూం లాంటి కవులు, కార్మిక నాయకులు, విప్లవ కారులు నేడు మన మధ్య లేకపోవడం ఆశ్చర్యం కాదు. వారంతా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు, ప్రపంచ ప్రజల శ్రామిక పోరాటాలు, రాచరికానికి, ఫ్యూడల్ దోపిడీకి వ్యతిరేకంగా సాగిన రైతాంగ పోరాటాల నేపథ్యం నుంచి భూమి రాతిపొరలను చీల్చుకొని పొటమరించిన భూమి బిడ్డలు. భూమి గురించి, భూమి నుంచి వచ్చే బువ్వ గురించి క్షుణ్ణంగా తెలిసినవారు. కష్ట జీవుల కష్టం, వారు ఓడ్చిన చెమట, వారు చిందించిన రక్తం విలువ వెలకట్టలేనివని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవారు.
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భౌతిక పరిస్థితులు ఆనాటికన్నా భయంకరంగా ఉన్నప్పటికీ ప్రజల మానసిక పరిస్థితి రకరకాల ఆకర్షణల్లో,వ్యామోహాల్లో, కుహనా అస్తిత్వంలో కొట్టుకుపోతోంది. పరిస్థితులు త్వరలోనే మరింత దుర్భరంగా మారనున్న నేపథ్యంలో మగ్దూం ప్రాసంగికత మరింత పెరిగింది. మగ్దూం కంటే బలంగా, ఘాటుగా కవిత్వం రాసేవారు కోకొల్లలుగా పుట్టుకొని రావొచ్చు. వారికి మగ్దూం కవిత నర్సరీ పాఠశాలగా మారుతుందనేది నిస్సందేహం.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








