కరోనావైరస్ - ఆంధ్రప్రదేశ్: టీచర్లు స్కూళ్లకు రావాలంటూ ఉత్తర్వులు... ఎలా సాధ్యం అంటున్న ఉపాధ్యాయ సంఘాలు

- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉపాధ్యాయులు మళ్లీ బడి బాట పట్టారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పాఠశాలలకు హాజరవుతున్నారు. విధులకు వస్తున్నప్పటికీ పిల్లలు లేని సమయంలో ఖాళీగా ఎందుకు ఉంచుతున్నారో అర్థం కావడం లేదంటున్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఖాళీగా బడిలో కూర్చోవడం కోసం తప్పనిసరిగా రావాలనే నిబంధన ఎందుకని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అధికారులు మాత్రం అందరూ విధులకు రావాల్సిందేనంటున్నారు.
పాఠశాలల, విద్యార్థుల వివరాలను రికార్డ్ చేసే ప్రక్రియ పూర్తి చేయడం తప్పనిసరి అని చెబుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే పాఠశాల విద్యా కమిషనర్ తో ఉపాధ్యాయ సంఘాలు చర్చలు కూడా జరిపాయి. కానీ, సమస్య మాత్రం కొలిక్కి వచ్చినట్టు కనిపించడం లేదు.
లాక్ డౌన్ నిబంధనల సడలింపుల తర్వాత అన్ని చోట్లా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అలాంటి సమయంలో ఉపాధ్యాయులు బడికి రావాల్సిందేనని చెప్పడం వివాదాస్పదమవుతోంది. అందుకు తోడుగా బయోమెట్రిక్ కొనసాగించాలనే నిబంధన పట్ల కూడా ఉపాధ్యాయసంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
అధికారులు మాత్రం నీతిఅయోగ్ కి సమర్పించాల్సిన రికార్డుల కోసం తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సిందేనని అంటున్నారు.

కమిషనర్ సర్క్యులర్ లో ఏముంది
ప్రతీ విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల ప్రతిభ, పాఠశాలలో మౌలిక వసతులకు సంబంధించిన సమగ్ర సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఈ వివరాలను సీఎస్ఈ పోర్టల్ లో పొందు పరచాలి. దానికి గానూ 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించిన అన్ని తరగతుల విద్యార్థుల మార్కుల వివరాలు పొందు పరచడం కోసం పాఠశాలల విధులకు హాజరుకావాలంటూ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు.
జూన్ 24న విడుదలయిన ఈ సర్క్యులర్ ప్రకారం 26వ తేదీలోగా దానిని పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దానికి గానూ అన్ని రీజనల్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులు బాధ్యత తీసుకుని ఉపాధ్యాయులంతా విధులకు హాజరయ్యేలా చూడాలని పేర్కొన్నారు.
మార్చి 18 తర్వాత ఏపీలో పాఠశాలలు మూతపడ్డాయి. లాక్ డౌన్ కి ముందుగానే విద్యార్థుల ముందు జాగ్రత్త కోసం వాటిని మూసివేశారు. ఆ తర్వాత జూన్ 12న షెడ్యూల్ ప్రకారం విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఈసారి అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల వివరాలను నమోదు చేసే ప్రక్రియ ఆలస్యం అయింది.
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల వివరాలను విద్యాశాఖ పోర్టల్ లో నమోదు చేస్తే ఆ వివరాలను నీతి అయోగ్ కి సమర్పించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా నీతి అయోగ్ ఆయా రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయిస్తుంది. నిధుల విషయంలో వాటికి ప్రాధాన్యం ఉంటుంది. దాంతో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అధికారులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Veerabhadrudu/Facebook
అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు విధులుకు వెళ్లడం లేదా?
పాఠశాలలకు ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాల్సిందేననే నిబంధనపై ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడుని బీబీసీ సంప్రదించింది.
ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపుల తర్వాత అన్ని శాఖల అధికారులు, సిబ్బంది విధులకు హాజరవుతున్నప్పుడు ఉపాధ్యాయులకు మాత్రం ఇబ్బంది ఏముంటుందని అన్నారు.
"కరోనావైరస్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే తెలియజేశాం. పాఠశాలల రికార్డులు అప్ గ్రేడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. అది రెండు వారాలు ఆలస్యమైంది. ఇప్పటికే నాడు-నేడు పనులు జరుగుతున్నాయి. వాటిని పర్యవేక్షించాల్సి ఉంది. బయోమెట్రిక్ కూడా రేషన్ సరకుల పంపిణీలో కూడా వినియోగిస్తున్నారు. స్కూళ్లలో తక్కువ సంఖ్యలో ఉండే ఉపాధ్యాయులకు ఇబ్బంది అని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఈ విద్యా సంవత్సరంలో ఎదురైన సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నాం" అని వీరభద్రుడు అన్నారు.
అలాగే, ఆన్ లైన్ క్లాసులు కూడా జరుగుతున్నాయని, వాటిలో విద్యార్థుల భాగస్వామ్యం పెంచడానికి అందరూ బాధ్యతతో విధులకు హాజరుకావడం అవసరం అని ఆయన కోరుతున్నారు.
ఖాళీ క్లాసుల్లో కూర్చోవడానికి స్కూల్ కి రావాలంటే ఎలా...
ప్రభుత్వ ఉత్తర్వుల పట్ల ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కూడా అభ్యంతరం చెబుతున్నారు. ఈ అంశంపై రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ కత్తి నరసింహరెడ్డి బీబీసీతో మాట్లాడారు.
"పిల్లలకు పాఠాలు చెప్పడానికి టీచర్లు బడికి రావాలంటే ఎవరూ మాట్లాడరు. కనీసం ఆన్ లైన్ క్లాసులకు అనుగుణంగా వినియోగించుకున్నా తప్పులేదు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. డైస్ రికార్డులు ఇంటి దగ్గర నుంచి కూడా నమోదు చేసే అవకాశం ఉంది. దాని కోసం స్కూల్ కి రావాల్సిందేననడం వెను కారణాలు అంతుబట్టడం లేదు. అయినప్పటికీ, స్కూల్ కి రావాల్సిందే అనడంలో అసలు లక్ష్యం అర్థం కావడం లేదు. ఇప్పటికే వయసు పైబడిన, అనారోగ్య సమస్యలతో ఉన్న వారు తీవ్రంగా సతమతమవుతున్నారు. ఈ విషయంపై అధికారులు పునరాలోచన చేయాలి. పట్టుదల శ్రేయస్కరం కాదు. కమిషనర్‌తో చర్చల్లో కూడా సానుకూల స్పందన రాలేదు అని నరసింహారెడ్డి అన్నారు.

లాక్ డౌన్ లో కూడా విధులు నిర్వహించాం
వాస్తవానికి ఈ ఏడాది వేసవిలో కూడా ఉపాధ్యాయులు విధులు నిర్వహించాల్సి ఉంది. జనగణన కోసం ఇప్పటికే వారికి శిక్షణ కూడా ఇచ్చారు. కానీ అనూహ్యంగా మారిన పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఇంటికే పరిమితం అయ్యారు. అయితే కరోనా సహాయక కార్యక్రమాల్లో ఏపీలో కొందరు ఉపాధ్యాయులకు ప్రభుత్వం డ్యూటీలు కూడా వేసింది. చివరకు మద్యం దుకాణాల వద్ద కూడా టీచర్లను వినియోగించడం అప్పట్లో విమర్శలకు దారితీసింది. ఆ తర్వాత అలాంటి ప్రయత్నాలు ఉపసంహరించుకున్నారు.
యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు జి ప్రభాకర్ వర్మ బీబీసీతో మాట్లాడుతూ, "విధులకు హాజరుకావాలని ఉపాధ్యాయులం కూడా అనుకుంటాం. కానీ, ప్రస్తుతం విద్యార్థులు స్కూలు వచ్చే పరిస్థితి లేదు. లాక్ డౌన్ లో కూడా మేము విధులు నిర్వహించాం. ఇటీవల పిల్లల షూ కొలతలు తీసుకోవాలని ఆదేశించగానే వాటిని పూర్తి చేశాం. కానీ, ఇప్పుడు రవాణా సదుపాయాలు లేక ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తూ కొందరు ప్రమాదాలకు కూడా గురయ్యారు. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న స్కూళ్లు మూసివేసినప్పటికీ, ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ఉపాధ్యాయుల రాకపోకలు ఎలా అన్నది అంతుబట్టడం లేదు. ప్రభుత్వం చెబుతున్న రికార్డులన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే పూర్తయ్యాయి. కొన్ని ప్రైవేట్ స్కూళ్లలోనే ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు స్కూల్ కి రావాలనడంలో ఆంతర్యం కనిపించడం లేదు. పైగా నాడు- నేడు పనుల మూలంగా బాత్రూమ్స్ సదుపాయాలు, విద్యుత్ నిలిచిపోయాయి. దాంతో మహిళా ఉపాధ్యాయులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు" అని అన్నారు.

వారానికి ఒకరోజు స్కూల్ రావాలని నిబంధన.. బహిష్కరించిన టీచర్లు
బ్రిడ్జి స్కూల్ పేరుతో ప్రభుత్వం ఆన్ లైన్ తరగతుల నిర్వహణకు పూనుకుంది. దూరదర్శన్ తో పాటుగా మన టీవీ ద్వారా వినిపిస్తున్న పాఠాలలో అనుమానాలు తీర్చేందుకు వారానికి ఒక్క రోజు పిల్లలంతా స్కూళ్లకు వస్తారంటూ తొలుత ఆదేశాలు వచ్చాయి. ప్రతీ మంగళవారం టీచర్లు కూడా స్కూళ్లకు వచ్చి పిల్లల అనుమానాలు తీర్చాలని ఆదేశాలు ఇచ్చారు.
అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. ఇప్పుడున్న సమయంలో పిల్లలందరినీ స్కూళ్లకు రప్పించడం శ్రేయస్కరం కాదని చెబుతూ వారానికి ఒకరోజు స్కూల్ కి రావడానికి నిరాకరించారు. ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాల మూలంగా ఆ తర్వాత ఈ ప్రయత్నం ఆగిపోయింది.
ఇప్పుడు అందరూ నిత్యం స్కూల్ కి రావాల్సిందేననే నిబంధన ముందుకు రావడంతో ఉపాధ్యాయులు , వారి ప్రతినిధులు నిరసన తెలుపుతున్నారు. వారానికి ఒక్క రోజు స్కూల్ కి వచ్చి ప్రబుత్వ కార్యకలాపాలు పూర్తి చేయడానికి సిద్ధపడినట్టు ఎస్టీయూ నేతలు తెలిపారు. అయినా కమిషనర్ అంగీకరించలేదని అంటున్నారు..
అటు ఉపాధ్యాయుల అభ్యంతరాలు, ఇటు అధికారుల ఆదేశాలతో ఏపీ పాఠశాల విద్యారంగంలో పరిస్థితి ఎటుమళ్లుతుందోననే చర్చ మొదలయ్యింది.
ఇవి కూడా చదవండి:
- సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్'
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- చైనాలో మరో కొత్త వైరస్, మహమ్మారిగా మారనుందా
- భారత్ బయోటెక్: జులై నుంచి మనుషులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు
- చైనా ప్రభుత్వానికి మేం భారతీయ యూజర్ల డాటా ఇవ్వలేదు: టిక్ టాక్
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- రెండు నెలలకు సరిపడా గ్యాస్ సిలెండర్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశం.. యుద్ధానికి సూచనా?
- నిజంగానే భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకర దేశమా? రాయిటర్స్ నివేదికలో వాస్తవమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








