లాక్‌డౌన్‌ ఎఫెక్ట్: రోడ్డు పక్కన ఇడ్లీ బండి నడుపుకుంటున్న స్కూల్ ప్రిన్సిపల్

వీడియో క్యాప్షన్, లాక్‌డౌన్‌ ఎఫెక్ట్: ఉద్యోగం పోయి, రోడ్డు పక్కన ఇడ్లీ బండి నడుపుకుంటున్న స్కూల్ ప్రిన్సిపల్

కరోనావైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా చాలామంది తమ ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయారు.

ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మార్గాని రాంబాబు. 17 ఏళ్ల పాటు ప్రేవేటు టీచర్‌గా పనిచేశారు.

లాక్‌డౌన్ ముందు వరకూ తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఒక ప్రైవేటు స్కూల్‌లో ప్రిన్సిపల్‌గా ఉన్నారు.

ప్రిన్సిపల్‌గా నెలకు రూ.22 వేల జీతం ఆయనకు లభించేది.

లాక్‌డౌన్ కారణంగా కొన్ని సంస్థలు ఉద్యోగులను తొలగిస్తుంటే, మరికొన్ని సంస్థలు జీతాలు ఇవ్వట్లేదు.

‘‘కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియలేదు. దీంతో ఆత్మాభిమానాన్ని చంపుకుని, రోడ్డు పక్కన.. ఫుట్‌పాత్ మీద టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాను’’ అని మార్గాని రాంబాబు బీబీసీతో చెప్పారు.

హాసిని టీ, టిఫిన్ సెంటర్ పేరుతో ఆయన ఇప్పుడు ఫుట్‌పాత్ పైన ఒక తోపుడు బండిని పెట్టుకున్నారు. రూ.2 వేలతో ఆయన ఈ వ్యాపారం ప్రారంభించారు. ఇడ్లీ, పునుగు బజ్జీ, అట్టు, వడ, మిర్చి బజ్జీ అమ్ముతున్నారు.

టిఫిన్ తయారీలో రాంబాబుకు ఆయన భార్య కూడా సహకరిస్తున్నారు.

లాక్‌డౌన్ ప్రభావం చిన్న స్థాయి ప్రైవేటు స్కూళ్లపై తీవ్రంగా పడింది. ఎంతోమంది టీచర్లు ఉపాధి కోల్పోయారు. పలువురు రోజు కూలీలుగా పనిచేస్తుంటే, మరికొందరు చిరు వ్యాపారులుగా మారారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)