రిపబ్లిక్ డే పరేడ్: కొన్ని రాష్ట్రాల శకటాలకు లభించని చోటు, కేంద్ర, రాష్ట్రాల వాదనలేంటి?

గణతంత్ర దినోత్సవం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రభాకర్ మణి తివారీ, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ హిందీ కోసం

గణతంత్ర వేడుకల్లో కొన్ని రాష్ట్రాల శకటాలకు ప్రాతినిధ్యం లభించకపోవడం పట్ల కేంద్రం, ఆయా రాష్ట్రాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి.

వేడుకల్లో తమ రాష్ట్రాల శకటాలకు స్థానం కల్పించకపోవడంపై పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేరళ కూడా తీవ్ర ఆరోపణలు చేసింది.

ఈ మూడూ బీజేపీయేతర పాలక రాష్ట్రాలు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని... ఆయా రాష్ట్రాల గుర్తింపును, చిహ్నాలను దెబ్బతీసేందుకు బీజేపీ తీసుకున్న 'రాజకీయ నిర్ణయం'గా అవి అభివర్ణించాయి.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ లేఖ రాశారు.

నిపుణులతో కూడిన సెలక్షన్ కమిటీ, పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకొని శకటాలను ఎంపిక చేస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

గణతంత్ర దినోత్సవం

ఫొటో సోర్స్, Getty Images

సెలక్షన్ కమిటీ ఏ అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటుంది?

కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మొత్తం 12 శకటాలను ఎంపిక చేసింది. ఈ కమిటీలో కళా రంగం, సాంస్కృతి, పేయింటింగ్, శిల్పం, సంగీతం, వాస్తుకళ, కొరియోగ్రఫీ తదితర రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు.

ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో శకటాల థీమ్‌ల గురించి కూడా కేంద్రం, రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. స్వాతంత్ర్యపోరాటం నేపథ్యంలో భారత్ @75, వినూత్న ఆలోచనలు@75, విజయాలు@75, తీర్మానాలు@75 థీమ్‌లతో పరేడ్‌ను నిర్వహించనున్నట్లు చెప్పింది.

తమిళనాడు శకటం మూడుసార్లు నిపుణుల కమిటీ పరిశీలనకు వచ్చింది. మరోవైపు తమ రాష్ట్ర శకటం గురించి అసలు పరిశీలనలోకి తీసుకోకుండానే ఎలాంటి కారణం లేకుండానే తిరస్కరించారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురు థీమ్‌తో రూపొందించిన కేరళ శకటానికి ఐదోసారి సమావేశంలో మౌఖికంగా ఆమోదం లభించిందని, కానీ రక్షణ మంత్రిత్వ శాఖ స్థాయిలో ఆమోదం దక్కలేదని అధికారి ఒకరు చెప్పారు.

2018, 2021 గణతంత్ర వేడుకల్లో కేరళ శకటానికి స్థానం దక్కింది. తమిళనాడు రాష్ట్ర శకటం 2016, 2017, 2019, 2020, 2021 వేడుకల్లో... పశ్చిమ బెంగాల్ శకటం 2016, 2017, 2019, 2021 ఉత్సవాల్లో ప్రాతినిధ్యం వహించాయి.

గణతంత్ర దినోత్సవం:

ఫొటో సోర్స్, Getty Images

పశ్చిమ బెంగాల్ శకటం

గణతంత్ర వేడుకల పరేడ్‌లో పశ్చిమ బెంగాల్ శకటానికి ఆమోదం లభించకపోవడం పట్ల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 'ఇది బెంగాల్ ప్రజలను అవమానించడమేనని, స్వాతంత్ర్య పోరాటంలో వారి పాత్రను తిరస్కరించడమేనని'' ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన రెండు పేజీల లేఖలో మమతా బెనర్జీ పేర్కొన్నారు.

అదే సమయంలో తమ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని మోదీని కోరుతూ బీజేపీ నేత, మేఘాలయ మాజీ గవర్నర్ తథాగథ రాయ్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు.

గణతంత్ర వేడుకల్లో పశ్చిమ బెంగాల్ శకటాన్ని ఎందుకు ఎంపిక చేయలేదో వివరిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు.

రాజ్‌నాథ్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాజ్‌నాథ్ సింగ్

''జనవరి 16న మీరు రాసిన లేఖకు సమాధానంగా మీకు చెప్పాలనుకునేది ఏంటంటే... స్వాతంత్ర్య సంగ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం చిరస్మరణీయమైనది. అందుకే నేతాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని జనవరి 23ను 'పరాక్రమ దినోత్సవంగా' జరుపుకోవాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. గణతంత్ర వేడుకలను కూడా 23నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తాం'' అని రాజ్‌నాథ్ సింగ్ లేఖలో తెలిపారు.

''గణతంత్ర వేడుకల్లో పాల్గొనే శకటాల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుందని నేను మీకు హామీ ఇవ్వాలనుకుంటున్నా. కళలు, సంస్కృతి, సంగీతం, నృత్యం తదితర రంగాలకు చెందిన ప్రముఖులతో కూడిన కమిటీ.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను అనేక దఫాలుగా పరిశీలించింది. 29 ప్రతిపాదనల్లో నుంచి 12 రాష్ట్రాలకు మాత్రమే ఆమోదం తెలిపింది''

అయితే నిపుణుల కమిటీ తీసుకున్న నిర్ణయంపై మమతా బెనర్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఆమె కోరారు.

''ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలను తీవ్రంగా బాధిస్తుంది. రాష్ట్ర శకటాన్ని తిరస్కరించేందుకు సరైన కారణాలు, వివరణలు కూడా లేవు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి పురస్కరించుకొని శకటాన్ని రూపొందించాం. ఆజాద్ హిందు ఫౌజ్ సేవలకు గుర్తుగా రూపొందించాం'' అని ఆమె పేర్కొన్నారు.

మమతా బెనర్జీ

ఫొటో సోర్స్, ANI

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పశ్చిమ బెంగాల్ ప్రజలు తీవ్రంగా బాధపడ్డారని మమతా బెనర్జీ తన లేఖలో పేర్కొన్నారు. స్వాత్రంత్ర్య పోరాటంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన పోరాట యోధుల సేవలకు గణతంత్ర్య వేడుకల్లో చోటు దక్కకపోవడం విస్మయాన్ని కలిగిస్తోందని అన్నారు.

అరబింద ఘోష్ నుంచి బిర్సా ముండా, బంకిం చంద్ర చటర్జీ వరకు ఇలా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నవారి ప్రతిరూపంగా శకటాన్ని రూపొందించినట్లు రాష్ట్ర అధికార వర్గాలు తెలిపాయి.

''జాతీయవాదానికి తొలి మంత్రమైన వందేమాతర గీతాన్ని బంకించంద్ర చటర్జీ రాశారు. రమేశ్‌చంద్ర దత్ తన రచనల్లో బ్రిటీష్ పాలకుల విధానాలను విమర్శించారు. భారతీయ తొలి రాజకీయ సంస్థ 'ఇండియన్ అసోసియేషన్'ను సురేంద్రనాథ్ బందోపాధ్యాయ్ ఏర్పాటు చేశారు. ఇంతటి నేపథ్యమున్న రాష్ట్ర శకటాన్ని తిరస్కరించారంటే, చరిత్రను తిరస్కరించినట్లే'' అని ఆమె లేఖలో రాశారు.

రాజకీయ కారణాల కోసం నేతాజీ వారసత్వాన్ని పాక్షికంగా దుర్వినియోగం చేశారని వార్తా సంస్థ పీటీఐతో నేతాజీ కుమార్తె అనితా బోస్ ప్రాఫ్ అన్నారు. ఆమె జర్మనీలో ఉంటారు.

''రాష్ట్ర శకటానికి వేడుకల్లో ఎందుకు చోటు దక్కలేదో నాకు తెలియదు. దాని వెనుక ఏవో కారణాలు ఉండొచ్చు. కానీ మా నాన్న 125వ జయంతి సమయంలో దేశ గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర శకటానికి చోటు దక్కలేదంటే నమ్మశక్యంగా లేదు. ఇది చాలా విచిత్రం'' అని అనితా పేర్కొన్నారు.

గతేడాది గణతంత్ర దినోత్సవాల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి, పశ్చిమ బెంగాల్ సర్కారుకు మధ్య వాదోపవాదాలు జరిగాయి. బెంగాల్ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ఆధారంగా ఆ రాష్ట్రం రూపొందించిన శకటాన్ని కేంద్రం తిరస్కరించింది. ఆ సమయంలో కూడా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య సుదీర్ఘ వాగ్వాదం జరిగింది. ఈసారి కూడా రాష్ట్ర శకటం అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది.

గణతంత్ర దినోత్సవం:

ఫొటో సోర్స్, Getty Images

తమిళనాడు ఆరోపణలేంటి?

తమిళనాడు ప్రతిపాదించిన శకటంపై తొలుత నిపుణుల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు. తమిళనాడు స్వాతంత్ర్య సమరయోధులు వి.ఒ చిదంబర్‌నార్, సుబ్రమణియం బర్తీలతో పాటు రాణి వేలు నచియార్, మరుదుపంధియార్ బ్రదర్స్‌లతో కూడిన శకటాన్ని తమిళనాడు ప్రతిపాదించింది.

బ్రిటీష్ వారిని ఎదుర్కోవడానికి చిదంబర్‌నార్ స్వదేవీ స్టీమ్ నావిగేషన్ కంపెనీని 1906లో స్థాపించారు. అయితే, ఆ తర్వాత ఆయనపై దేశద్రోహం కేసును మోపి జైలుకు పంపించారు.

ఆయనతో పాటు శకటం డిజైన్‌లో సుబ్రమణియం బర్తీకి కూడా చోటిచ్చారు. స్వాత్రంత్యోద్యమ కాలంలో దేశభక్తి పాటలు, రచనల ద్వారా ఆయన ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించారు. 'వీరమాంగై'గా పేరుతెచ్చుకొన్న రాణి వేలు నచియార్ ధైర్య సాహసాలకు పేరు గాంచారు. శకటంలో చోటు దక్కించుకున్న మరుదుపంధియార్ బ్రదర్స్‌, ఈస్టిండియా కంపెనీతో పోరాడారు.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్

ఫొటో సోర్స్, M. K. STALIN @FACEBOOK

ఫొటో క్యాప్షన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్

''తమిళనాడు శకటానికి ఆమోదం దక్కకపోతే రాష్ట్ర ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయి. రాష్ట్రం ప్రతిపాదించిన ఏడు డిజైన్లను కమిటీ తిరస్కరించింది. ఇది అమోదయోగ్యం కాదు. తమిళనాడు ప్రజలకు సంబంధించి ఇది తీవ్రమైన విషయం'' అని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు.

డీఎంకే అధికార ప్రతినిధి అన్నాదురై శరవణన్ దీని గురించి బీబీసీ హిందీతో మాట్లాడారు. ''మేం కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుతున్నామంటే వారు మా స్వాతంత్ర్య సంగ్రామానికి చిహ్నాలు. మేం ప్రతిపాదించిన శకటం మూడో రౌండ్‌ను దాటి ముందుకు వెళ్లలేకపోయిందని కేంద్రం కొన్ని కారణాలు చెబుతోంది''

''దక్షిణ భారతానికి చెందిన గొప్ప వ్యక్తులను, సాంస్కృతిక చిహ్నాలకు ప్రచారం కల్పించకూడదని కేంద్రం భావిస్తున్నట్లుగా మాకు అనుమానంగా ఉంది. దీని వెనుక పెద్ద చరిత్రే ఉంది. ఎందుకంటే సంస్కృతం, హిందీలను ప్రోత్సహిస్తూ తమిళ్‌ను అణిచివేయాలని కేంద్రం చూస్తోంది'' అని ఆయన చెప్పుకొచ్చారు.

కేరళ శకటం

ఫొటో సోర్స్, Getty Images

కేరళ అభ్యంతరం

ఈ విషయంలో కేరళకు మరో భిన్నమైన అనుభవం ఎదురైంది. ఆది శంకరాచార్య నేపథ్యంతో శకటం రూపొందించాలని కేంద్రం, కేరళకు సూచించింది.

''ఆది శంకరాచార్య థీమ్‌పై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆయన జాతీయ స్థాయి వ్యక్తి'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి అన్నారు. కేరళ తరఫున గొప్ప సామాజిక సంస్కర్త, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన శ్రీ నారాయణ గురుకు కూడా శకటంలో స్థానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

కేరళ ప్రతిపాదనపై తొలి నాలుగు రౌండ్లలో చర్చించారని ఆ అధికారి వెల్లడించారు.

''కేరళ సర్కారు డిజైన్‌ను నిపుణుల కమిటీ ప్రశంసించింది. డిజైనర్‌కు క్రెడిట్ ఇచ్చింది. మేం ప్రతిపాదించిన శకటం ముందు భాగంలో శ్రీ నారాయణ గురు, జటాయు పృథ్వీ కేంద్ర ఉంటాయి. ఇవి రాష్ట్ర వారసత్వానికి గుర్తులు''

''చివరి రౌండ్‌లో కూడా శ్రీ నారాయణ గురు సమేతంగా శకటాన్ని రూపొందించమని జ్యూరీ మాకు చెప్పింది. దీనికి సంబంధించి కొన్ని సలహాలు, సూచనలు కూడా చేసింది. కానీ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే.. శకటాల ఎంపిక నిర్ణయం కేవలం జ్యూరీకి సంబంధించినదే కాదు. ఇతర రాష్ట్రాల అనుభవాల ప్రకారం చూస్తుంటే ఇది అర్థమవుతోంది. రక్షణమంత్రిత్వ శాఖ వద్దకే తుది జాబితా వెళ్తుంది. ఇది ఒక రాజకీయ నిర్ణయం'' అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, తాజ్‌మహల్‌లో బ్రిటిషన్లు ఏమేం దోచుకెళ్లారో తెలుసా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)