ఝార్ఖండ్: కరోనా వ్యాక్సీన్‌తో నరాల బలహీనత తగ్గుతుందా.. కదల్లేని ఈయన టీకా వేసుకున్నాక నడవడం నిజమేనా

భార్య, గ్రామస్థులతో దులార్‌చంద్ ముండా
ఫొటో క్యాప్షన్, భార్య, గ్రామస్థులతో దులార్‌చంద్ ముండా
    • రచయిత, రవి ప్రకాశ్
    • హోదా, బీబీసీ కోసం

బిహార్‌లోని మాధేపురాకు చెందిన 65 ఏళ్ల బ్రహ్మదేవ్ మండల్ గత సంవత్సరంలో 12 సార్లు కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న కథనం మీరు వినే ఉంటారు.

కోవిడ్ టీకా తీసుకున్నప్పటి నుంచి తనకు మోకాళ్ల నొపులు తగ్గాయని మండల్ నమ్మారు. అందుకే మళ్లీ మళ్లీ టీకా వేయించుకున్నారు. చివరికి అధికారులకు దొరికారు.

బిహార్ పోలీసులు బ్రహ్మదేవ్ మండల్‌పై 'మోసం' కేసు నమోదు చేశారు.

ఇప్పుడు ఝార్ఖండ్‌కు చెందిన మరో వ్యక్తి కూడా మండల్ చెప్పినట్లే చెబుతున్నారు.

కోవిషీల్డ్ ఒక డోసు వేసుకున తరువాత తనకు నరాల నొప్పి సమస్య తగ్గిందని ఝార్ఖండ్‌లోని బొకారో జిల్లాకు చెందిన దులార్‌చంద్ ముండా అంటున్నారు.

దులార్‌చంద్ ముండా సుమారు ఏడాదిగా మంచంపైనే ఉన్నారు. కానీ, కోవిడ్ టీకా వేసుకున్న తరువాత లేచి నిల్చోగలుగుతున్నారని చెబుతున్నారు. అలాగే, ఆయన మాట తడబడేది. ఇప్పుడు స్పష్టంగా వస్తోందని అంటున్నారు.

దులార్‌చంద్‌కు కోవిడ్ వ్యాక్సీన్ వేసినట్లు స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్, డాక్టర్ అలబేల్ కెర్కెట్టా నిర్ధరించారు. ఆయన చెబుతున్న విషయాన్ని వైద్యుల బృందం పరిశీలిస్తోందని చెప్పారు.

దులార్‌చంద్‌ శరీరంపై వ్యాక్సీన్ ప్రభావం పరిశోధనాంశమని బొకారోకు చెందిన సివిల్ సర్జన్ డాక్టర్ జితేంద్ర అభిప్రాయపడ్డారు.

దులార్‌చంద్ ముండా, గ్రామ ఉపాధ్యాయుడు రాజు ముండా (కుడి)

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC

ఫొటో క్యాప్షన్, దులార్‌చంద్ ముండా, గ్రామ ఉపాధ్యాయుడు రాజు ముండా (కుడి)

రోడ్డు ప్రమాదం జరిగినప్పటి నుంచి కదలిక లేదు

దులార్‌చంద్ ముండా బొకారోలోని పెతర్వార్ బ్లాక్‌లో సల్గాడిహ్ గ్రామంలో నివసిస్తున్నారు. ఆయనకు కోవిడ్ టీకాతో నరాల నొప్పి తగ్గిందన్న విషయం బయటికి పొక్కడంతో మీడియా, టీకా సంబంధిత వైద్యులు ఆయన ఇంటికి వచ్చారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఆయన్ను చూసేందుకు వస్తున్నారు.

కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం దులార్‌చంద్ ముండా జీవితాన్ని మార్చేసింది. అప్పటి నుంచి ఎముకలలో భరించలేని నొప్పి, నడవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.

కుటుంబసభ్యులు ఆయనకు ధన్‌బాద్, బొకారోలోని ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. ఆ తరువాత 2021 జూన్‌లో రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌‌లో చేర్చారు. అక్కడ న్యూరోసైన్స్ విభాగంలో నెల రోజుల పాటు చికిత్స పొందారు.

దాంతో కొంత ఉపశమనం లభించినా, పూర్తిగా కోలుకోలేదు. అప్పటి నుంచి నడక, మాటలు సరిగ్గా రాక అవస్థ పడుతున్నారు. అప్పటి నుంచి ఆయన జీవితం మంచం పైనే గడుస్తోంది. పూర్తిగా నిస్సహాయులైపోయారు. తన పనులన్నింటికీ కుటుంబ సభ్యులపైనే ఆధారపడుతున్నారు.

మంచంపైనే ఉండి, ఉండి విసిగిపోయానని దులార్‌చంద్ బీబీసీతో చెప్పారు.

దులార్‌చంద్ ముండా

"మంచంపైనే ఉండి విసుగు కలుగుతోంది. తదుపరి వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేవు. రెండు కాళ్లపై నిల్చునే పరిస్థితి కూడా లేదు. భోజనం, వసతికి కుటుంబ సభ్యులపైనే ఆధారపడుతున్నాను. ఎవరి సహాయం లేకుండా టాయిలెట్‌కు వెళ్లలేను, నా చేతులతో భోజనం చేయలేను. నా కుటుంబానికి ఓ భారంగా మారాను" అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

"ఈ జనవరి 6న టీకాలు వేసే వ్యక్తులు మా ఇంటికొచ్చి నాకు కరోనా వ్యాక్సీన్ ఇచ్చారు. మరుసటి రోజు నా చేతుల్లో కదలిక వచ్చింది. ఒక రోజు తరువాత పాదాలు కూడా పైకి లేచాయి. నా మాట తడబడడం తగ్గింది. ఇప్పుడు నేను స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాను. ఇదంతా కోవిడ్ టీకా వల్లే జరిగింది.

నా భార్య నా చేయి పట్టుకుంటే లేచి నడవగలుగుతున్నాను. కూర్చోగలుగుతున్నాను. నా నొప్పులు తగ్గాయి. టీకా తయారుచేసినవారికి, వేసినవారికి కృతజ్ఞతలు తెలుపాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని దులార్‌చంద్ బీబీసీకి చెప్పారు.

డాక్టర్ అల్బేల్ కెర్కెట్టా

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC

ఫొటో క్యాప్షన్, డాక్టర్ అల్బేల్ కెర్కెట్టా

ఇందులో నిజం ఎంత?

ఇంటింటికీ వ్యాక్సినేషన్ ప్రచారంలో భాగంగా దులార్‌చంద్‌కు కరోనా వ్యాక్సీన్ మొదటి డోసు అందించినట్లు డాక్టర్ కెర్కెట్టా తెలిపారు. ఆయనకు వ్యాక్సీన్ ఇచ్చిన బృందంలో సల్గాడిహ్ గ్రామ సేవిక యశోదా దేవి, ఏఎన్ఎం సోని కుమారి ఉన్నారు.

"దులార్‌చంద్ మెడికల్ హిస్టరీ చూశాను. ఆయన వెన్నెముకకు గాయమైంది (స్పైనల్ ఇంజురీ). లేచి నడవలేరు. తన పనులు తాను చేసుకోలేరు. కానీ, కోవిషీల్డ్ మొదటి డోసు ఇచ్చిన తరువాత ఆయన శరీరంలో చలనం వచ్చింది. ఆయన అనారోగ్యం నుంచి కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

టీకా ఇచ్చిన తరువాత దులార్‌చంద్ శరీరంలో కణజాల మార్పులు ఏమైనా జరిగాయా అన్నది పరిశీలించాలి. ఆయనతో మాట్లాడాను. సివిల్ సర్జన్‌కు కూడా విషయాన్ని వివరించాను. మళ్లీ దులార్‌చంద్ ఇంటికి వెళ్లి పరిశీలించమని చెప్పారు. ఆయన ఆదేశాల తరువాత, ఇప్పుడు ఒక బృందం ఈ కేసును పరిశీలిస్తోంది" అని డాక్టర్ కెర్కెట్టా చెప్పారు.

బొకారో సివిల్ సర్జన్ డాక్టర్ జితేంద్ర కుమార్ మాట్లాడుతూ, దులార్‌చంద్ ముండాకు సంబంధించిన సమాచారం అందిందని తెలిపారు. ఆయన శరీరంపై కరోనా వ్యాక్సీన్ చూపించిన ప్రభావం ఒక పరిశోధనాత్మక అంశం అని అన్నారు.

దులార్‌చంద్‌ ముండా అనారోగ్యం కారణంగా ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు మొదట టీకా ఇప్పించలేదని గ్రామ ఉపాధ్యాయుడు రాజు ముండా చెప్పారు.

"టీకా వేయిస్తే ఆయన పరిస్థితి మరింత దిగజారిపోతుందని భయపడ్డారు. అందుకే గత ఏడాది ఆయనకు వ్యాక్సీన్ వేయించలేదు. కానీ, ఈసారి కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చిందనగానే ఎలాగైనా టీకా వేయించుకోవాలని ఆయన్ను ఒప్పించాం. జనవరి 6న కోవిషీల్డ్ మొదటి డోసు వేయించుకున్నారు. తరువాత, ఆయన కాళ్లు, చేతులు కదలడంతో వాళ్లింట్లోవాళ్లు నాకు ఫోన్ చేశారు. ఎందుకంటే, నేనే ఆయన చికిత్స కోసం అక్కడకీ, ఇక్కడికీ తిరుగుతుంటాను. మొదట్లో వాళ్ల మాటలు నమ్మలేదుగానీ దులార్‌చంద్‌ మాట విని ఆశ్చర్యపోయాను. అప్పుడు కొంచం ఊతమిచ్చి నడిపించాను. చేతికర్ర సహాయంతో ఇంటి గుమ్మం వరకూ నడిచారు. ఇప్పుడు ఆయన కుర్చీలో కూచుని మాట్లాడగలుగుతున్నారు. ఇదెలా జరిగిందో మాకు తెలీదు. కానీ, టీకా తీసుకున్న తరువాతే ఇదంతా జరిగింది. ఇది నిజం" అని రాజు ముండా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)