ఒమిక్రాన్: ‘11 డోసుల కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న వృద్ధుడు’... వైద్యాధికారులు ఏం చేశారంటే...

బ్రహ్మ్‌డియో మండల్
ఫొటో క్యాప్షన్, బ్రహ్మదేవ్ మండల్
    • రచయిత, సౌతిక్ బిస్వాస్
    • హోదా, బీబీసీ న్యూస్

బిహార్‌కు చెందిన 65 సంవత్సరాల బ్రహ్మదేవ్ మండల్ గత సంవత్సరంలో కనీసం ఎనిమిదిసార్లు కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్నట్లు వైద్య అధికారి ఒకరు చెప్పారు.

అయితే, తాను 11 డోసులు తీసుకున్నానని బ్రహ్మదేవ్ అంటున్నారు. ఆయన పోస్టుమాస్టర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు.

కోవిడ్ వ్యాక్సీన్ డోసులు తీసుకోవడం వల్ల ఒళ్ళు నొప్పులు తగ్గి ఆరోగ్యంగా ఉన్నానని ఆయన చెప్పారు. వ్యాక్సీన్ వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఎదురు కాలేదని అన్నారు.

గత వారం ఆయన 12వ డోసు తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా సిబ్బంది ఆయన్ను గుర్తించి ఆపారు.

మాధేపురా జిల్లాలో నివాసముంటున్న ఆయన ఇన్ని డోసులు ఎలా తీసుకోగలిగారనే విషయంపై విచారణ కొనసాగిస్తున్నారు.

"ఆయన నాలుగు వేర్వేరు చోట్ల కనీసం 8 డోసులు తీసుకున్నట్లు ఆధారాలు లభించాయి" అని మాధేపురాలో సివిల్ సర్జన్ అమరేంద్ర ప్రతాప్ షాహి చెప్పారు.

గత ఏడాది జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి భారతదేశంలో ప్రధానంగా కోవిషీల్డ్, కోవాక్సీన్ టీకాలు ఇస్తున్నారు.

ఈ వ్యాక్సీన్లు తీసుకునేందుకు రెండు డోసుల మధ్య ఒక దానికి 12-16 వారాల వ్యవధి ఉండాల్సి రాగా, మరొక దానికి 4- 6 వారాల వ్యవధి ఉండాలి.

కొన్నిసార్లు కోవిన్ యాప్‌లో వివరాలు నమోదు చేసుకోకుండా కూడా వాక్‌ఇన్ వ్యాక్సినేషన్లు చేస్తున్నారు.

అయితే, వ్యాక్సీన్ తీసుకునే ముందు లబ్ధిదారులు వారి ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా మరేదైనా ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

వ్యాక్సీన్ తీసుకున్న వారి నుంచి సేకరించిన సమాచారం కోవిన్ వ్యాక్సీన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు.

బిహార్ వ్యాక్సినేషన్ క్యాంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వ్యాక్సినేషన్ క్యాంప్

అర గంట వ్యవధిలో రెండు డోసులు

రెండు వ్యాక్సీన్ డోసులకు మధ్య వ్యవధి కనీసం 4 - 6 వారాలు ఉండాల్సి రాగా, మండల్ మాత్రం అరగంట వ్యవధిలో రెండు డోసులు తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ రెండు డోసుల వివరాలు కోవిన్ పోర్టల్‌లో ఉన్నాయి.

ఇదెలా జరిగిందనే విషయం పట్ల చాలా అయోమయంగా ఉంది. పోర్టల్ వైఫల్యం ఉండి ఉండవచ్చని అనుకుంటున్నాను. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యమేమన్నా ఉందేమోనని కూడా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రతాప్ షాహి చెబుతున్నారు.

సైట్లలో లభించిన వ్యాక్సినేషన్ డేటా పోర్టల్‌లోకి చేర్చేందుకు జరిగే సుదీర్ఘ జాప్యం వల్ల కూడా ఇలా జరిగి ఉండవచ్చని పబ్లిక్ హెల్త్ నిపుణులు చంద్రకాంత్ లహరియా చెప్పారు.

"కానీ, ఇంతకాలం పాటు ఇన్ని డోసులు తీసుకునేవరకు కనిపెట్టలేకపోవడం మాత్రం వింతగానే ఉంది" అని అన్నారు.

మండల్ మాత్రం ఆయన వ్యాక్సీన్ తీసుకున్న తేదీలు, రోజులు, సమయం, క్యాంపులతో సహా వివరంగా రాసి పెట్టుకున్నారు. గతేడాది ఫిబ్రవరి నుంచి డిసెంబరు మధ్యలో మొత్తం 11 డోసులు తీసుకున్నట్లు ఆయన చెబుతున్నారు.

మాధేపురా జిల్లాలో ఉన్న వ్యాక్సినేషన్ శిబిరాలతో పాటు పక్క జిల్లాల్లో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యాక్సినేషన్ శిబిరాలకు కూడా వెళ్లినట్లు ఆయన బీబీసీకి చెప్పారు.

ఆయన పోస్టుమ్యాన్ ఉద్యోగం చేయక ముందు గ్రామంలో నకిలీ వైద్యునిగా వ్యవహరించేవారని స్థానికులు చెప్పారు. ఆయనకు రోగాల గురించి కొంత అవగాహన ఉన్నట్లు తెలిపారు.

"ఈ వ్యాక్సీన్ డోసులు తీసుకున్న తర్వాత నాకు ఒళ్లు నొప్పులు మాయమయ్యాయి. నాకు మోకాలు నొప్పి ఉండేది. కర్ర పట్టుకుని నడిచేవాడిని. ఇప్పుడు కర్రతో నడిచే అవసరం రావడం లేదు" అని ఆయన చెప్పారు.

కోవిడ్-19 వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత సాధారణంగా జ్వరం, తలనొప్పి, అలసట, నొప్పులు వస్తున్నట్లు జనం చెబుతుంటారు. తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు అరుదుగా కనిపిస్తున్నాయి.

"సాధారణంగా ఇలాంటి ప్రభావాలు మొదటి, రెండవ డోసు తర్వాత కనిపిస్తూ ఉంటాయి. వ్యాక్సీన్ల తయారీలో హానికారక పదార్ధాలను వాడకపోవడం వల్ల, శరీరంలో యాంటీబాడీలు అంతకు ముందే తయారై ఉండటం వల్ల వ్యాక్సీన్ డోసులను ఎక్కువసార్లు తీసుకోవడం వల్ల జరిగే హాని ఏమి ఉండకపోవచ్చు" అని డాక్టర్ లహరియా చెప్పారు.

మరోవైపు, 11 డోసుల వ్యాక్సీన్ వేయించుకున్నానని చెప్పిన బ్రహ్మదేవ్‌ మండల్‌పై వైద్య సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయనపై శనివారం పురైనీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

11 డోసుల టీకా ఎలా తీసుకోగలిగారు?

వేర్వేరు మార్గాల ద్వారా, వేర్వేరు గుర్తింపు కార్డుల ద్వారా బ్రహ్మదేవ్ మండల్ 11సార్లు టీకా వేయించుకుని ఉండొచ్చని మాధేపురా జిల్లా అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ చెప్పారు.

బ్రహ్మదేవ్ మండల్ తన ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్‌తో ఎనిమిదిసార్లు వ్యాక్సీన్ వేయించుకున్నారని, ఓటర్ కార్డు, తన భార్య ఫోన్ నెంబర్‌తో మరో మూడుసార్లు టీకా తీసుకున్నారని చెబుతున్నారు.

వైద్య సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేశామని మాధేపుర ఎస్పీ రాజేశ్ కుమార్ చెప్పారు. ఆయన్ను అరెస్ట్ చేయబోమని, కానీ చార్జీషీట్ మాత్రం ఫైల్ చేస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)