రిపబ్లిక్ డే: ఈ రోజంటే మదరసా విద్యార్థులకు భయమెందుకు?

- రచయిత, మహమ్మద్ షాహిద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గణతంత్ర దినోత్సవం(జనవరి 26), స్వతంత్ర దినోత్సవం(ఆగస్ట్ 15) రోజుల్లో కుర్తా-పైజామా తలపై టోపీ, చేతిలో మువ్వన్నెల జెండా ఉన్న యువకులు లేదా పిల్లల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
సాధారణంగా దానిని ఒక మదరసా విద్యార్థిలా అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో మదరసాలను కేవలం ఇస్లాం బోధించే ఒక సంస్థలాగే చూస్తారు. అయితే చాలా మదరసాలు తమ విద్యార్థులకు హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్ కూడా చెబుతున్నాయి.
భారత్‌లో ఎన్నో మదరసాలు ఉన్నాయి. వీటిలో అతిపెద్ద మదరసా ఉత్తర ప్రదేశ్‌లోని దారుల్ ఉలూమ్ దేవబంద్.
దారుల్ ఉలూమ్ దేవబంద్ ఇటీవల తమ హాస్టల్లో ఉన్న విద్యార్థులతో రిపబ్లిక్ డే సెలవుల్లో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలని ఒక నోటీసులో హెచ్చరించింది.

ఫొటో సోర్స్, FACEBOOK/DARUL ULOOM DEOBAND
గణతంత్ర దినోత్సవం రోజున సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుందని. ఒక భయం లాంటి వాతావరణం ఉంటుందని కూడా వారు చెప్పారు. ఆ నోటీసులో ఒక వేళ విద్యార్థులు ఎవరైనా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ఎవరితోనూ వాదించవద్దని గట్టిగా చెప్పారు.
గణతంత్ర, స్వతంత్ర దినోత్సవం రోజున మదరసాల్లో ఎలాంటి వేడుకలు జరగవనే వాదనలు చాలా రోజుల నుంచీ వస్తూనే ఉన్నాయి. అక్కడ జాతీయ జెండాను ఎగరేయరని, మదరసాలకు సెలవులు కూడా ఉండవని చెప్పుకుంటారు. గత ఏడాది స్వతంత్ర దినోత్సవం రోజున యూపీలోని యోగీ ప్రభుత్వం మదరసాల్లో జెండా ఎగరేయడం తప్పనిసరి కూడా చేసింది. ఇప్పుడు వారి రంజాన్ సెలవులు తగ్గించడంపై కూడా చర్చ నడుస్తోంది.
అసలు గణతంత్ర దినోత్సవం రోజున మదరసాల్లో ఏం జరుగుతుంది అనే ఒక చర్చ కూడా ఉంది. మదరసాల్లో విద్యార్థులు బయటికెళ్తే ఆరోజు వారిని ఎవరైనా హింసిస్తారా? ఈ ప్రశ్నలకు జవాబులు వెతికేందుకు మేం దిల్లీలోని కొన్ని మదరసాలకు వెళ్లాం.

ఫొటో సోర్స్, Getty Images
రిపబ్లిక్ డే రోజున మదరసాల్లో ఏం జరుగుతుంది?
ఈశాన్య దిల్లీలోని ముస్తఫాబాద్‌లో పెద్ద మదరసాల్లో ఒకటైన అష్రఫియా తాలిముల్ ఖురాన్‌కు దేవబంద్‌తో కూడా సంబంధాలు ఉన్నాయి.
ఇందులో సుమారు 350 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 32 మంది ఉత్తర ప్రదేశ్, బిహార్, పశ్చిమ బంగకు చెందినవారు.
ఈ మదరసాలో చదువు అయిన తర్వాత పైచదువుల కోసం విద్యార్థిని మరో మదరసా దేవబంద్‌కు పంపిస్తారు.
1990 నుంచి ఈ మదరసాను చూసుకుంటున్న కారీ అబ్దుల్ జబ్బార్ దేవబంద్ విద్యార్థులకు ఇచ్చే సూచనలు సరైనవే అంటారు.

"దేవబంద్ నుంచి మాకు అలాంటి ఏ సలహాలూ అందలేదు, కానీ మదరసాలకు విద్యార్థులను చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, వాళ్లు ఎక్కడికైనా వెళ్లాలని భావిస్తే, దాని గురించి వారు మొదట సమాచారం ఇవ్వాలి, తర్వాతే వెళ్లాలి" అని జబా తెలిపారు.
గణతంత్ర, స్వతంత్ర దినోత్సవాల రోజులలో వారి మదరసాల్లో కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ రోజు అందరూ కలిసి 'సారే జహాసె అచ్చా' ఆలపిస్తారు. పాఠాలు బోధించేవారు ఆ రోజు ప్రాధాన్యం గురించి విద్యార్థులకు చెబుతారు.

14 ఏళ్ల మహమ్మద్ జైద్ మీరఠ్ నుంచి వచ్చారు. తను ఈ మదరసాలో ఉర్దూ-అరబ్బీ చదువుతున్నాడు.
ఆగస్టు 15కు మదరసాలో ఏం చేస్తావని అడిగినపుడు, అతడు ఆ రోజున మేం గాలిపటాలు ఎగరేస్తామని చెప్పాడు.
ఆ రోజున తాను బయటకు ఎక్కడికీ వెళ్లనని, మదరసాలోనే ఉంటానని జైద్ చెప్పాడు. తన స్నేహితులు కొందరు మాత్రం బయట తిరగడానికి వెళ్తారన్నారు.
అదే మదరసాలో హాఫిజా చేసే 19 ఏళ్ల మహమ్మద్ సాహిల్ ఖాన్ స్వతంత్ర దినోత్సవం గురించి చెప్పాడు.
ఆ రోజున మన దేశానికి స్వతంత్రం వచ్చిందన్నాడు. ఆగస్టు 15, జనవరి 26కు ఎప్పుడూ ఇండియా గేట్ దగ్గరికి వెళ్తానని చెప్పాడు.

మదరసా విద్యార్థుల్లో భయం ఎందుకు?
ముస్తఫాబాద్‌లోనే బరేల్వీ ప్రాంతంలో ఉండే మదరసా ఇస్లామియా హుసేనియా నూరియా. దిల్లీ బయటి ప్రాంతాల నుంచి వచ్చే 30 మంది విద్యార్థులు ఇక్కడే ఉండి చదువుకుంటారు.
ఈ మదరసాకు నేను వెళ్లినపుడు అక్కడ గణతంత్ర దినోత్సవం కోసం ముందే జెండాను తీసుకొచ్చి ఉంచారు.
ఆ మదరసా బాధ్యతలు చూసుకుంటున్న మౌలానా హసీబ్-ఉర్-రహమాన్ విద్యార్థులు బయటికెళ్లేటపుడు అప్రమత్తంగా ఉండాలన్న దేవబంద్ సలహాతో ఏకీభవించలేదు.
దానికి ఆయన కారణం కూడా చెప్పారు. "కొంతమంది భయం వ్యాప్తి చేయాలని చూస్తారు, దాని వల్ల మదరసాల్లో విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం సమయంలోనే కాదు, బయిటికి వెళ్లాలన్న ప్రతిసారీ సమస్యలు ఎదురు కావచ్చు అన్నారు.
గణతంత్ర దినోత్సవం, స్వతంత్ర దినోత్సవం రోజున ఈ మదరసాలో ఏం జరుగుతుంది అనే ప్రశ్నకు "మేం ప్రతిసారీ మదరసాలో జెండా ఎగరేస్తాం. విద్యార్థులకు ఆ రోజు ప్రాధాన్యం, చరిత్ర గురించి చెబుతాం. దానితోపాటూ జాతీయ గీతం, దేశభక్తి గీతాలు పాడడం చేస్తాం" అన్నారు.

ఇదే మదరసాలో చదివే కిషన్‌గంజ్(బిహార్)కు చెందిన నాహిద్ అఖ్తర్ గణతంత్ర దినోత్సవం రోజున మన దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నాడు.
నేను గణతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఏడాదీ మదరసా నుంచి బయటికి వెళ్తాను. నాకు ఎప్పుడూ ఎలాంటి భయం అనిపించదు. ఈరోజు కూడా తిరగడానికి వెళ్తాను అన్నాడు.
లోనీ(ఉత్తర్ ప్రదేశ్)కు చెందిన మహమ్మద్ షహజాద్ ప్రయాణం చేసే సమయంలో తనకు ఎప్పుడూ ఎలాంటి భయం ఉండదన్నాడు. ఈ ఏడాది కూడా కచ్చితంగా ఊరికి వెళ్తానన్నాడు.
2017లో ఈద్ కోసం లోకల్ రైల్లో దిల్లీ నుంచి ఇంటికి బల్లభ్‌గఢ్ వెళ్తున్న 16 ఏళ్ల జునైద్‌ను హత్య చేశారు.

ఆ సమయంలో అతడు కుర్తా-పైజామా, టోపీ పెట్టుకుని ఉన్నాడు. రైల్లో సీటు కోసం కొందరు యాత్రికులతో అతడికి గొడవ జరిగింది.
జాఫరాబాద్‌లో బాబుల్ ఉలూమ్ అనే మదరసాలో దిల్లీ బయటి నుంచి వచ్చిన 250 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు.
వీరిలో మేవాత్(హరియాణా)కు చెందిన 15 ఏళ్ల అబ్దుల్లా ఒకడు. తను వేసుకున్న బట్టల వల్ల ప్రయాణం చేస్తున్నప్పుడు జనాలు తనను ఉరిమి చూస్తుంటారని చెప్పాడు.
మెట్రోలో జనం నా టోపీ చూసి వీడెక్కడికి వెళ్తున్నాడో చూడు అన్నారు. జనం ముఖం తిప్పుకుంటారు.
రైల్లో చాలాసార్లు నన్ను సీట్లో నుంచి కూడా లేపేశారు. నేను జనవరి 26న మదరసాలోనే ఉంటాను. ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటాను. బయటికి ఎక్కడికీ వెళ్లను.

"పాకిస్తాన్ క్రికెట్ టీమ్ గెలిస్తే ముస్లింల ప్రాంతాల్లో టపాసులు పేలుతాయి. వాళ్లు దేశభక్తులు కాదు. వారికి పాకిస్తాన్ అంటేనే ఇష్టం". వాట్సప్‌లో షేర్ అయ్యే ఇలాంటి మాటలు ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా మీరు కూడా వినే ఉంటారు.
బాబుల్ ఉలుమ్ మదరసా ప్రిన్సిపల్ మౌలానా మహమ్మద్ దావూద్, "దేవబంద్ దానికి సంబంధించిన మదరసాలన్నీ చాలా ముందు నుంచే గణతంత్ర, స్వతంత్ర దినోత్సవం రోజున సెలవు ఇస్తున్నాయి. అక్కడ జెండా కూడా ఎగరేస్తాం. మా రసూల్ మహమ్మద్ సాహబ్ మనం ఏ దేశంలో ఉంటే ఆ దేశాన్నిప్రేమించాలని చెప్పారు. రేపు సరిహద్దు దగ్గర అవసరం అయితే, అక్కడికి వెళ్లి ప్రాణాలు అర్పించేందుకు మొదట మేమే వెళ్తాం. మేం దేశభక్తి సర్టిఫికెట్ అడుక్కుంటూ తిరగాల్సిన అవసరం లేదు" అని అన్నారు.

దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం
అయితే, గత నాలుగైదేళ్లు దేశంలో విద్వేష వాతావరణం నెలకొంది. ఈ సమయంలో కొంతమంది ద్వేషం వ్యాప్తి చేస్తున్నారు. వాళ్లు వెళ్తున్న మదరసా పిల్లల్ని ఏడిపిస్తారు. వాళ్ల గడ్డం గురించి ప్రశ్నిస్తారు, అందుకే దేవబంద్ అలాంటి సలహా ఇచ్చింది.
"దేశంలో 95 శాతం మంది ముస్లిమేతరులు మంచివాళ్లే. ఇలా విద్వేషం పుట్టించేవారు 90 శాతం మంది అయిపోతే ఇక్కడ నివసించడమే కష్టం అయిపోతుంది" అంటారు దావూద్.
మౌలానా హసీబ్ కూడా మౌలానా దావూద్ లాగే చెబుతారు. తన పూర్వీకులు ఇదే మట్టిలో కలిశారని, అలాంటప్పుడు తను వేరే దేశాన్ని ఎందుకు ఇష్టపడతానని ప్రశ్నిస్తారు.

ఫొటో సోర్స్, AFP
"మేం ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వగలం. సుమారు 20 ఏళ్ల క్రితం నా గడ్డం, నా దుస్తులు చూసి నాతో కొంతమంది దురుసుగా ప్రవర్తించారు. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో నా దేశానికి ద్రోహం చేయను. నేను ఇక్కడే ఉంటాను".
2014లో మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆవుల దొంగతనం పేరుతో చాలా మంది ముస్లింలను కొట్టారు. వారిని హత్య కూడా చేశారు.
నబీ మహమ్మద్ సాహబ్ "మన పాలకుడి గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడకు" అన్నారని కారీ అబ్దుల్ జబ్బార్ చెబుతారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








