రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ, ఏపీ శకటాలకు దక్కని స్థానం - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, EPA
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 26న దిల్లీ రాజ్‌పథ్‌లో జరిగే వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాలకు స్థానం దక్కలేదని రక్షణ శాఖ తెలిపినట్లు 'ఈనాడు' కథనంలో తెలిపింది.
ఈసారి మొత్తం 12 రాష్ట్రాలు, 9 శాఖలకు చెందిన శకటాలే కవాతులో పాలుపంచుకోనున్నాయి.
అరుణాచల్‌ప్రదేశ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, జమ్మూకశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చోటు దక్కింది.
విద్య-నైపుణ్యాభివృద్ధి, పౌర విమానయానం, న్యాయశాఖ సహా తొమ్మిది శాఖల శకటాలూ ప్రదర్శనలో పాల్గొనబోతున్నాయి.
అమృతోత్సవాల ఇతివృత్తంతో కూడిన అంశాలను ఇవి ప్రదర్శించనున్నాయి. ఈసారి కవాతు ప్రారంభమయ్యే సమయాన్ని ఉదయం 10 గంటలకు బదులు 10.30కి మార్చారు.
మంచు కమ్మేసే అవకాశం ఉన్నందున ప్రేక్షకులకు స్పష్టంగా కనిపించేందుకు ఈ మార్పుచేశారు. ఈసారి ఫ్లైపాస్ట్‌లో విమానాలు, హెలికాప్టర్లు 15 విభిన్న భంగిమల్లో ఎగరనున్నాయి.
కవాతులో కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల శకటాలను చేర్చరాదన్న నిర్ణయంపై ఎలాంటి పునరాలోచన లేదని కేంద్రం స్పష్టంచేసింది.
తమ రాష్ట్రాల శకటాలకు స్థానం కల్పించకపోవడంపై ప్రధాని వెంటనే జోక్యం చేసుకోవాలని పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేసిన నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తేల్చిచెప్పింది.
కరోనా నేపథ్యంలో ఈసారి గణతంత్ర వేడుకలకు అతిథులుగా మధ్య ఆసియా దేశాల అధినేతలు ఎవరూ హాజరుకావడం లేదని'' ఈనాడు పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఏపీలో కోవిడ్ పరీక్ష ధర రూ. 350
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్ష ఆర్టీపీసీఆర్ రేటును సవరిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసినట్లు 'సాక్షి' పేర్కొంది.
''ఐసీఎంఆర్ గుర్తింపు కలిగిన ఎన్‌ఏబీఎల్ ప్రైవేటు ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్ ధరను రూ.350గా నిర్ణయించింది. ఆస్పత్రులు, ల్యాబ్‌లలో కచ్చితంగా సవరించిన రేట్లను ప్రదర్శించాలని ఆదేశించింది.
జిల్లా వైద్యాధికారులు సవరించిన రేట్లకే పరీక్షలు జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టుకు రూ.475, అలాగే ఎన్‌ఏబీఎల్ ల్యాబ్‌లలో రూ.499 వసూలుచేస్తున్నారు.
గడిచిన 24 గంటల్లో (సోమవారం ఉదయం 9 నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు) రాష్ట్ర వ్యాప్తంగా 38,055 నమూనాలను పరీక్షించగా 6,996 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,534 కేసులు వెలుగుచూశాయి. విశాఖపట్నంలో 1,263, గుంటూరులో 758, శ్రీకాకుళంలో 573, అనంతపురంలో 462, ప్రకాశంలో 424, విజయనగరంలో 412 కేసులు వచ్చాయి.
వైరస్ బారిన పడి విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఒక్క రోజులో 1,066 మంది కోవిడ్ నుంచి కోలుకోవడం విశేషం.
మణుగూరు భారజల కర్మాగారంలో ఆక్సీజన్-18 ప్లాంటు ప్రారంభం
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్లాంట్ అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మణుగూరు భార జల కర్మాగారం మరో మైలురాయిని అధిగమించింది. జీవరసాయన చర్యల్లో వినియోగించే హెచ్-2 ఓ-18 ఉత్పత్తి మంగళవారం మణుగూరు హెవీవాటర్ ప్లాంట్‌లో ప్రారంభమైందని 'ఆంధ్రజ్యోతి' ఒక వార్తను రాసుకొచ్చింది.
''దేశంలోనే ఓ-18 ఉత్పత్తి ఈ ప్లాంట్‌లోనే జరగడం గమనార్హం. ఈ ప్లాంట్‌ను సోమవారం భారత అణుశక్తి విభాగం చైర్మన్ కె.ఎన్.వ్యాస్ వర్చువల్‌గా ప్రారంభించారు.
కాగా 26న జరగనున్న రిపబ్లిక్ డే ఉత్సవా ల్లో ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ఈ ప్లాంట్‌ను జాతికి అంకితం ఇవ్వనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.
ఓ-18 ఐసోటోప్ ద్వారా మానవ శరీరంలోని ట్యూమర్లు, కేన్సర్ ప్రేరేపిత కారకాలు, డిమెన్షియావంటి వ్యాధుల మూలాలను ఖచ్చితంగా నిర్ధారించేందుకు ఉపయోగించనున్నారు.
ఇప్పటివరకు అమెరికా, చైనా వంటి దేశాలు మాత్రమే ఓ-18ని ఉత్పత్తి చేస్తుండగా... భారత్‌లో ఇదే తొలి ప్లాంట్'' అని ఆంధ్రజ్యోతి కథనం తెలపింది.

ఫొటో సోర్స్, Telangagna cmo/face book
ఉద్యోగులకు మూడు డీఏల మంజూరుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
ప్రభుత్వ ఉద్యోగులకిచ్చే కరువుభత్యం (డీఏ) త్వరలోనే అందనున్నట్లు 'నమస్తే తెలంగాణ' ఒక వార్తను ప్రచురించింది.
''పెండింగ్‌లో ఉన్న 5 డీఏలకు గాను ప్రస్తుతానికి మూడు డీఏలను ఇవ్వనున్నట్లు వార్తలో తెలిపింది. ఈ మూడు కలుపుకుంటే ఉద్యోగులకు బేసిక్ పే మీద 10.01శాతం డీఏ రానున్నది. ఈ మేరకు త్వరలో జీవోలు విడుదల కానున్నాయని తెలిసింది.
ఉద్యోగులకు డీఏ మంజూరుపై సోమవారం నాటి క్యాబినెట్‌లో చర్చ జరిగింది. ఉద్యోగులకు జనవరితో కలుపుకుంటే 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు వివరించారని తెలిసింది. దీంతో మూడు డీఏలు ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు'' నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది.
ఇవి కూడా చదవండి:
- మోదీ టెలిప్రాంప్టర్ లేకుండా ప్రసంగించలేరా? రాహుల్ గాంధీ ఆరోపణ ఏమిటి
- కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా 2000 పెంపుడు జంతువులను చంపేయాలని నిర్ణయం
- కరోనా వ్యాక్సీన్‌తో నరాల బలహీనత తగ్గుతుందా.. కదల్లేని ఈయన టీకా వేసుకున్నాక ఎలా నడుస్తున్నారు
- ‘తనతో ఫొటోలు దిగేవాళ్లను ఏమీ అనేది కాదు’.. 29 పిల్లలను కన్న ఆడపులికి ప్రజల నివాళి
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, నియంత్రణకు ఏం చర్యలు తీసుకుంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








