సంక్రాంతి: మూడు రోజుల్లో హైదరాబాద్ ప్రజలు ఎంత చికెన్ తిన్నారంటే..- ప్రెస్ రివ్యూ

కోడి చికెన్

ఫొటో సోర్స్, Getty Images

గ్రేటర్‌ హైదరాబాద్ ప్రజలు సంక్రాంతి పండగకు రికార్డు స్థాయిలో చికెన్‌ తిన్నారని, శుక్రవారం నుంచి ఆదివారం వరకు సుమారు 60 లక్షల కిలోల చికెన్‌ కొనుగోలు చేశారని సాక్షి పత్రిక తెలిపింది.

ప్రధానంగా మటన్‌ కంటే చికెన్‌ వైపే ప్రజలు మొగ్గుచూపారు. ఇందుకు కారణం చికెన్‌ ధర మటన్‌ కంటే తక్కువగా ఉండటమే. మాంసం కిలో రూ.850- రూ.900 ఉండగా.. చికెన్‌ రూ.240 పలికింది. గ్రేటర్‌ పరిధిలో సాధారణంగా రోజుకు 10 లక్షల కిలోల చికెన్‌ వినియోగం అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు.

శుక్ర, శనివారాల్లో దాదాపు 30 లక్షల కిలోల చికెన్‌ విక్రయాలు జరగగా, ఆదివారం ఒక్కరోజే ఏకంగా 30 లక్షల కిలోల చికెన్‌ అమ్ముడుపోయినట్లు అంచనా.

మామూలు రోజుల్లో మటన్‌ రెండు లక్షల కిలోల విక్రయాలు జరుగుతాయి. ఆదివారం ఐదు లక్షల కిలోల మటన్‌ గ్రేటర్‌ ప్రజలు కొనుగోలు చేశారు. మూడు రోజుల్లో మటన్‌ దాదాపు 10 నుంచి 15 లక్షల కిలోల విక్రయాలు జరిగినట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారని ఈ వార్తలో రాశారు.

ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఎలాన్ మస్క్

మస్క్‌ మా రాష్ట్రానికి రండి - కేటీఆర్

‘‘భారత్‌లో కార్ల వ్యాపారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాం’’ అంటూ ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో చేసిన ట్వీట్‌ రాజకీయవర్గాల్లో దుమారం రేపగా.. దీనిని పలు రాష్ట్రాలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో తెలిపింది.

ఈ విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అందరికన్నా ముందుగా స్పందించారు. ఆయనను తెలంగాణకు ఆహ్వానించారు.

‘‘హే ఎలన్‌.. నేను భారత్‌లోని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిని. కొత్త పరిశ్రమల ఏర్పాటులో తెలంగాణ రాష్ట్రం.. దేశంలోనే అగ్రశ్రేణి వ్యాపార గమ్యస్థానం. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తే భాగస్వామిగా కలిసి పనిచేసేందుకు, ఏర్పాటుకు అయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ముందుంటాం’’ అంటూ ట్వీట్‌ చేశారు.

కేటీఆర్‌ ట్వీట్‌కు పలువురు సినీ ప్రముఖులు మద్దతుపలికారు. నటులు విజయ్‌ దేవరకొండ, నిఖిల్‌, దర్శకులు మెహర్‌ రమేశ్‌, గోపిచంద్‌ మలినేని.. టెస్లా సీఈవోను ఉద్దేశిస్తూ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి రావాలని కోరారు.

మహారాష్ట్ర, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌ సైతం టెస్లాను తమ రాష్ట్రాలకు ఆహ్వానించాయి. దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రలో కార్ల తయారీ కర్మాగారాన్ని ప్రారంభించాలని ఆహ్వానిస్తున్నామంటూ ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి జయంత్‌ పాటిల్‌ కోరారు.

పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ సైతం తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని మస్క్‌ను కోరారు. టెస్లా కంపెనీని పశ్చిమబెంగాల్‌లో ఏర్పాటు చేయాలంటూ ఆ రాష్ట్ర మంత్రి రబ్బానీ ఆహ్వానించారని ఈ వార్తలో రాశారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్‌ వ్యవస్థ బలోపేతమవుతోంది.. గుడ్‌ గవర్నెన్స్‌–2021 నివేదిక

ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్‌ వ్యవస్థ మరింతగా బలోపేతమైందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని, ప్రధానంగా దోషులకు శిక్షలు పడేలా సమర్థ దర్యాప్తు, మహిళా పోలీసుల ప్రాతినిధ్యం పెరగడం సానుకూల పరిణామమని పేర్కొందని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘గుడ్‌ గవర్నెన్స్‌–2021’ నివేదిక జ్యుడిషియరీ–పబ్లిక్‌ సెక్యూరిటీ అనే అంశం కింద వివిధ రాష్ట్రాల్లో పోలీసు వ్యవస్థ ఎలా ఉందనే విషయాలను విశ్లేషించింది.

2019–20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020–21లో ఏపీ మెరుగైన పనితీరు కనబరిచిందని నివేదిక స్పష్టంగా పేర్కొంది. దోషులకు సత్వరం శిక్షలు విధించడం, జనాభాను బట్టి పోలీసు అధికారులు– సిబ్బంది నిష్పత్తి, ప్రత్యేకంగా మహిళా పోలీసుల నిష్పత్తి, కేసుల పరిష్కార తీరు అనే నాలుగు ప్రామాణిక అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ణయించింది.

వివిధ రకాల నేరాలకు పాల్పడిన దోషులను గుర్తించి సత్వరం శిక్షలు విధించడంలో ఆంధ్రప్రదేశ్‌ సమర్థవంతమైన పనితీరు కనబరిచింది. 2019–20లో 26.10 శాతం కేసుల్లో దోషులను గుర్తించి శిక్షలు విధించారు. కాగా 2020–21లో 38.40 శాతం కేసుల్లో దోషులను గుర్తించి శిక్షలు విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కెసీఆర్

ఫొటో సోర్స్, TRSPARTY/FACEBOOK

ఫొటో క్యాప్షన్, కేసీఆర్

తెలంగాణలో పాలనా సంస్కరణలు చేపట్టిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల సత్వర భర్తీ, కొత్త జిల్లాల్లో సజావుగా విధుల నిర్వహణకు అవసరమైన పోస్టుల గుర్తింపు తదితర అంశాల అధ్యయనానికి నలుగురు ఐఏఎస్ అధికారులతో ఉన్నత స్థాయి పరిపాలనా సంస్కరణ కమిటీని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారని ఈనాడు పత్రిక తెలిపింది.

ఉద్యోగుల పనితీరు మెరుగుపరచి ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్ని స్థాయిల వారికీ భాగస్వామ్యం కల్పించడం వంటి అంశాలపైనా ఈ కమిటీ సూచనలు ఇవ్వనుంది.

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త జోనల్ విధానంలో భాగంగా జిల్లాలు, జోన్లు, బహుళజోన్లలో ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)