అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ: 'మై లవ్, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్

ఫొటో సోర్స్, ANI
విరాట్ కోహ్లి కోసం ఆయన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు.
టెస్టు కెప్టెన్‌గా తప్పుకుంటున్నానని విరాట్ కోహ్లి శనివారం ప్రకటించిన నేపథ్యంలో అనుష్క శర్మ తన భర్త కోహ్లీని ఉద్దేశిస్తూ ఈ పోస్ట్ పెట్టారు.
విరాట్‌ను టెస్టు కెప్టెన్‌గా నియమించిన 2014 నాటి సంగతులను గుర్తు చేసుకున్నారామె.
''నాకు 2014లోని ఆ రోజు ఏం జరిగిందో ఇంకా గుర్తుంది. టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలని ధోని నిర్ణయం తీసుకోవడంతో మిమ్మల్ని కెప్టెన్‌గా ఎంపిక చేశారని మీరు నాతో చెప్పారు.''
''ఆరోజు మనిద్దరితో మాట్లాడుతూ ధోని సరదాగా అన్న మాటలు కూడా గుర్తున్నాయి. 'ఇక చూడు నీ గడ్డం ఎంత తొందరగా నెరుస్తుందో' అని ధోని మీతో అన్నారు. అప్పుడు మనం ముగ్గురం ఆ మాటకు పగలబడి నవ్వాం'' అని అనుష్క తన సందేశాన్ని ప్రారంభించారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
సవాళ్లు కేవలం మైదానంలోనే ఉండవు: అనుష్క శర్మ
కెప్టెన్‌గా విరాట్ కోహ్లి, టీమిండియా సాధించిన విజయాల పట్ల తాను చాలా గర్వంగా ఉన్నానని అనుష్క శర్మ పేర్కొన్నారు.
''ఆరోజు తర్వాత నుంచి నేను, మీ గడ్డం నెరవడంతో పాటు చాలా అంశాలను చూశాను. మీ ఎదుగుదలను చూశాను. మీ అంతర్గత ఎదుగుదలతో పాటు మీరు భాగమైన ప్రతి అంశంలోనూ ఎదుగుదల కనిపించింది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా మీరు సాధించిన విజయాల పట్ల, మీ నేతృత్వంలో జట్టు ప్రదర్శన పట్ల చాలా గర్విస్తున్నా. అంతకంటే ఎక్కువగా ఒక వ్యక్తిగా మీరు సాధించిన పరిణతి పట్ల చాలా గర్వంగా ఉన్నా'' అంటూ ఆమె రాసుకొచ్చారు.
ఈ భావోద్వేగ పోస్టులో, గత ఏడేళ్లలో విరాట్ కోహ్లి ఎదుర్కొన్న సవాళ్లనూ ఆమె ప్రస్తావించారు.
''2014లో మనం చాలా చిన్నవాళ్లం. అమాయకంగా ఉండేవాళ్లం. జీవితంలో ముందుకెళ్లడానికి మంచి ఉద్దేశాలు, మంచి ఆలోచనలు, లక్ష్యాలు ఉంటే సరిపోతుందని అనుకున్నాం. ఇవన్నీ కూడా జీవితంలో ముందుకు సాగడానికి అవసరమే. కానీ సవాళ్లను ఎదుర్కోకుండా మనం ముందుకు సాగలేం.''

ఫొటో సోర్స్, ANI
''మీరు ఎదుర్కొన్న అన్ని సవాళ్లు మైదానానికే చెందినవి కావు. కానీ అదే జీవితం. కనీసం మనం ఊహించలేని విషయాల్లోనే జీవితం మనల్ని పరీక్షిస్తుంది. అలాంటి పరీక్షలు ఎదుర్కోవడం చాలా అవసరం కూడా. అయినప్పటికీ మీరు ఎప్పుడూ మీ మంచి ఉద్దేశాలను వదిలిపెట్టలేదు. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది.''
మ్యాచ్ చేజారినప్పుడు విరాట్ కోహ్లి ఏడుస్తూ కూర్చొన్న క్షణాలను కూడా తాను చూశానని అనుష్కా పేర్కొన్నారు. కోహ్లి ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదని వెల్లడించారు.
''గెలవడం కోసం మీ శరీరంలోని శక్తినంతా కూడదీసి ఆడారు. విజయానికి ఉదాహరణగా నిలిచారు. కొన్ని ఓటముల అనంతరం నేను మీ పక్కన వచ్చి కూర్చున్నప్పుడు మీ కళ్లలో నీళ్లు తిరిగేవి. నేను ఇంకా ఏం చేసి ఉండాల్సింది అని మీరు మథనపడుతుండేవారు'' అని అనుష్క అన్నారు.

ఫొటో సోర్స్, ANI
మిగతా వారి కంటే మీరు భిన్నం
సుదీర్ఘంగా రాసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో మిగతా వారి కంటే కోహ్లిని భిన్నంగా నిలిపే లక్షణాల గురించి చెప్పారు.
''అందరిలో మీరు చాలా భిన్నం. నిజాయతీగా, ముక్కుసూటిగా ఉంటారు. ఇతరుల నుంచి కూడా అదే ఆశిస్తారు. గొప్పలకు పోవడాన్ని మీరు శత్రువుగా భావిస్తారు. ఈ స్వభావం వల్లే నా దృష్టిలో, మిమ్మల్ని ఆరాధించేవారి దృష్టిలో మీరు మరింత మహోన్నతంగా కనబడతారు. మీరెప్పుడూ స్పష్టమైన, మంచి ఉద్దేశాలను కలిగి ఉన్నారు. దీన్ని అందరూ అర్థం చేసుకోలేరు. మీకు సన్నిహితంగా ఉంటూ, మీ గురించి తెలుసుకునే అవకాశం లభించినవారు నిజంగా ధన్యులు.''

ఫొటో సోర్స్, ANI
'మీ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు'
''అందరిలాగే మీలో కూడా లోపాలు ఉన్నాయి. మీరు పూర్తిగా పరిపూర్ణులు కాదు. కానీ మీరెప్పుడూ ఆ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించలేదు. మీరెప్పుడూ కఠినమైనప్పటికీ సరైన పని చేసేందుకే నిలబడ్డారు. మీరు ఎప్పుడూ దురాశతో ఏ పని చేయలేదు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. మీ పట్ల నాకు అనంతమైన ప్రేమ ఉంది'' అని అనుష్క తన ప్రేమను వెల్లడించారు.
టెస్టు కెప్టెన్సీని వదులుకోకముందు నుంచే బీసీసీఐ, విరాట్ కోహ్లి మధ్య కొంతకాలంగా భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి.
టి20 ప్రపంచకప్ కంటే ముందే భారత టీ20 కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు కోహ్లి ప్రకటించాడు. దీని తర్వాత వన్డే కెప్టెన్సీ పగ్గాలు కూడా కోహ్లి స్థానంలో రోహిత్ శర్మకే కట్టబెట్టారు. తాజాగా టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు శనివారం కోహ్లి ప్రకటించాడు.
ఇవి కూడా చదవండి:
- పెరుగుతున్న కోవిడ్ కేసులు - తెలుగు రాష్ట్రాలలో ఎలా ఉంది
- విరాట్ కోహ్లి: టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌కు ఈ తరహా వీడ్కోలు ఏంటి? దాని వెనక కారణమేంటి
- బీజేపీ నుంచి చేరికలతో అఖిలేశ్ యాదవ్‌కు కొత్త తలనొప్పులు - సమాజ్‌వాది పార్టీలో టికెట్ల చిక్కులు
- వీర గున్నమ్మ: రైతుల కోసం బ్రిటిష్ వారితో పోరాడిన ఈ ఉత్తరాంధ్ర వీర వనిత గురించి తెలుసా?
- ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు: బీజేపీలో తిరుగుబాటు రగులుతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













