UP Election 2022: బీజేపీ నుంచి చేరికలతో అఖిలేశ్ యాదవ్‌కు కొత్త తలనొప్పులు - సమాజ్‌వాది పార్టీలో టికెట్ల చిక్కులు

ఫొటో సోర్స్, ANI
- రచయిత, అభినవ్ గోయల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. ముగ్గురు మంత్రులు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరడంతో బీజేపీని వీడే వారి సంఖ్య మరింత పెరగనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సమాజ్‌వాదీ పార్టీకి ఇది శుభవార్తే. కానీ అఖిలేశ్ యాదవ్‌కు మాత్రం పెద్ద తలనొప్పిని తెచ్చి పెట్టింది.
సీట్ల కేటాయింపు విషయంలో ఈ నేతలందర్నీ ఎలా సంతృప్తి పరుస్తారనేది ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ ముందున్న సవాలు. బీజేపీ నుంచి వచ్చే నేతల కోసం ఎవరి సీట్లను త్యాగం చేయాలనే ప్రశ్న సమాజ్‌వాది పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది.
స్వామి ప్రసాద్ మౌర్యతో కష్టమేంటి?
స్వామి ప్రసాద్ మౌర్యకు ఎర్ర తివాచీ పరచి అఖిలేశ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీలోకి ఆహ్వానించారు. ఎస్పీలో చేరిన వెంటనే మౌర్య కూడా తాను బీజేపీని వదిలిపెడుతున్నట్లు ప్రకటించారు.
''ఈరోజు, జనవరి 14. మకర సంక్రాంతి, భారతీయ జనతా పార్టీకి అంతిమ చరిత్రను లిఖించబోతోంది. ఈరోజు భారతీయ జనతా పార్టీకి చెందిన పెద్ద నేతలందరూ కుంభకర్ణుడి నిద్రలో ఉన్నారు. వారికి ఇప్పటివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాట్లాడేందుకు సమయమే చిక్కలేదు. కానీ ఇప్పుడు మా రాజీనామాల తర్వాత వారికి నిద్రే పట్టడం లేదు'' అని మౌర్య అన్నారు.

ఫొటో సోర్స్, TWITTER/@YADAVAKHILESH
ఓబీసీల్లో బలమైన నాయకుడైన స్వామి ప్రసాద్ మౌర్య ఖుషీనగర్ జిల్లాలోని పద్రౌనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఇప్పుడు సమస్యంతా ఆయన కుమారుడు ఉత్కృష్ట్‌కు సంబంధించిందే..
2017లో ఉత్కృష్ట్, ఊంచహార్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ అక్కడ ఆయన ఓడిపోయారు. సమాజ్‌వాదీ పార్టీ నేత మనోజ్ పాండే దాదాపు 2000 ఓట్ల మెజార్టీతో ఉత్కృష్ట్‌పై గెలుపొందారు. అంతకుముందు 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉత్కృష్ట్, మనోజ్ పాండే చేతిలోనే ఓడిపోయారు.
బీబీసీతో చర్చ సందర్భంగా మాట్లాడిన మనోజ్ పాండే, ''మేం ఊంచహార్ నుంచి పోటీ చేస్తాం. అక్కడ నుంచి బరిలో దిగాలని జాతీయ నాయకత్వం మమ్మల్ని ఆదేశించింది. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా నేను చాలా కష్టపడి పనిచేస్తున్నా'' అని అన్నారు.
లఖ్‌నవూకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ బ్రిజేశ్ శుక్లా దీని గురించి మాట్లాడారు. ''కొన్ని ప్రాంతాలకు చెందిన బీజేపీ నేతలు తాజాగా ఎస్పీలోకి చేరారు. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ఎస్పీ నేతల్లో ఒక రకమైన భయం నెలకొంది. వారంతా తరచుగా రాష్ట్ర రాజధానికి వెళ్లి పార్టీ పెద్దలను కలుస్తున్నారు. మనోజ్ పాండే కూడా లఖ్‌నవూ వెళ్లారు. ఊంచహార్ నుంచి మాత్రమే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు'' అని బ్రిజేశ్ అన్నారు.
ఒకవేళ సమాజ్‌వాదీ పార్టీ, ఊంచహార్ టికెట్‌ను మళ్లీ మనోజ్ పాండేకు కేటాయిస్తే... స్వామి ప్రసాద్ మౌర్య కుమారుడైన ఉత్కృష్ట్‌కు మరో నియోజకవర్గం టికెట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా ఎవరినీ నొప్పించకుండా ఆయనకు సీటును కేటాయించాలి.
''జౌన్‌పూర్ సీటును తన కొడుకు కోసం స్వామి ప్రసాద్ మౌర్య కోరుకుంటున్నారు. దాని గురించే పార్టీలో మంతనాలు జరుగుతున్నాయి'' అని బ్రిజేశ్ శుక్లా పేర్కొన్నారు.
జౌన్‌పూర్ నుంచి ఉత్కృష్ట్‌ను పోటీలో దించితే, అక్కడ గెలవడం కోసం ఎస్పీ మళ్లీ కొత్తగా పని చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇదొక్కటే సమస్య కాదు. ఇక్కడ నుంచి పోటీచేసేందుకు చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు.

ఫొటో సోర్స్, TWITTER/AKHILESH YADAV
ధర్మ సింగ్ సైనీకి ఎక్కడ సీటు కేటాయించనున్నారు?
ధర్మ సింగ్ సైనీ, 2017లో సహారన్‌పూర్ జిల్లాలోని నకుడ్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేశారు. దాదాపు 94 వేల ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని సాధించారు. అంతకంటే ముందు బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) తరఫున కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన ఎస్పీలో చేరారు.
సహారన్‌పూర్ జిల్లాలో బలమైన ఓబీసీ నేతగా ధర్మ సింగ్ సైనీకి మంచి పేరుంది. ఇప్పుడు ధర్మ సింగ్ విషయంలో కూడా ఎస్పీ గందరగోళంలో పడింది. దానికి కారణం ఇమ్రాన్ మసూద్. సహారన్‌పూర్ జిల్లాలో మసూద్ పెద్ద లీడర్. ఆయన ఇటీవలే కాంగ్రెస్ నుంచి ఎస్పీలో చేరారు.
2012, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఇమ్రాన్ మసూద్‌పై ధర్మ సింగ్ సైనీ గెలుపొందారు. ఈసారి నకుడ్ స్థానం నుంచి వీరిద్దరిలో ఎవరిని అభ్యర్థిగా నిలపాలనేది ఇప్పుడు ఎస్పీ ముందున్న పెద్ద సవాలు. వీరిద్దరూ బలమైన నేతలే.
''సహారన్‌పూర్‌లో ఇమ్రాన్ మసూద్ కార్యకర్తలు ధర్మ సింగ్ సైనీని ఇష్టపడరు. నకుడ్‌కు బదులుగా మరొక ప్రాంతం నుంచి ఇమ్రాన్ పోటీ చేయవచ్చు'' అని బ్రిజేశ్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, TWITTER/AKHILESH YADAV
ధారా సింగ్ చౌహాన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు?
యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌లో ధారా సింగ్ చౌహాన్ మంత్రిగా పని చేశారు. ఆయనకు పార్టీలు మారడం కొత్తేమీ కాదు. 2000 నుంచి 2006 వరకు రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా పనిచేశారు.
2009లో ఘోసీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున బరిలోకి దిగిన ఆయన పార్లమెంట్‌లో అడుగు పెట్టారు. కానీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత హరినారాయణ్ చేతిలో ఆయన ఓడిపోయారు.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మధుబన్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి అమ్రేశ్ చంద్‌పై 29 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పుడు ఆయన బీజేపీ నుంచి బయటకొచ్చారు. రాబోయే రోజుల్లో ధారా సింగ్ ఎస్పీలో చేరతాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
లక్నోకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ జ్ఞానేంద్ర కుమార్ శుక్లా మాట్లాడుతూ, ''ధారా సింగ్ చౌహాన్ ఈసారి మధుబన్ నుంచి పోటీ చేసేందుకు ఇష్టపడట్లేదు. వేరే నియోజకవర్గం నుంచి పోటీచేయాలని ఆయన అనుకుంటున్నట్లుగా చెప్పుకుంటున్నారు'' అని అన్నారు.
ఎస్పీ సీటుపై కన్నేసిన బీజేపీ రెబల్ ఎమ్మెల్యేలు
బీజేపీని వీడి ఎస్పీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు కథ దాదాపు ఒకేతీరుగా ఉంది.
''బీజేపీ, ఎమ్మెల్యేలపై సర్వేను నిర్వహించింది. సర్వేలో రిపోర్టు సరిగా లేనివారు, టికెట్ దక్కదని భావించేవారు పార్టీని వీడుతున్నారు. ఈ సర్వే ప్రకారం 100 మందికి టికెట్ లభించే అవకాశం లేదనే వార్తలు వచ్చాయి'' అని జ్ఞానేంద్ర కుమార్ శుక్లా అన్నారు.
ఒకవేళ ఇదే నిజమైతే, ఎస్పీలో చేరే బీజేపీ రెబల్ నేతల సంఖ్య మరింత పెరగనుంది. ప్రస్తుతం బీజేపీని వదిలిపెట్టిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా ఎస్పీ టికెట్ మీద పోటీ చేయాలని అనుకుంటున్నారు.
భగవతి ప్రసాద్ సాగర్, 2017లో బిల్హౌర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఎస్పీ నేత కమలేశ్ చంద్ర దివాకర్‌ను 31 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఎస్పీకి చెందిన శివ కుమార్ బెరియా దాదాపు 60 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ములాయం సింగ్ యాదవ్‌కు సన్నిహితుడైన శివ కుమార్ బేరియా, ఎస్పీలో చాలా పాత నాయకుడు.
''భగవతి ప్రసాద్, తన కుమారుని కోసం బిల్హౌర్ స్థానం నుంచి టికెట్‌ను ఆశిస్తున్నారు. తాను మౌరానీపూర్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ భగవతి ప్రసాద్ సాగర్‌కు సీటును కేటాయించడం ఇప్పుడు ఎస్పీకి సవాలుగా మారనుంది'' అని సీనియర్ జర్నలిస్ట్ బ్రిజేశ్ శుక్లా వివరించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలి? ఎవరికి ఇవ్వకూడదు అనే విషయంలో అఖిలేశ్ యాదవ్‌కు పెద్ద తలనొప్పిగా మారనుంది.
''బల్హౌర్ నియోజకవర్గంలో శివ కుమార్ బేరియా బలమైన పోటీదారు. ఒకవేళ అతనికి పార్టీ టికెట్ లభించకపోతే, ఆయన సమాజ్‌వాదీ పార్టీకి సమస్యగా మారే అవకాశముంది'' అని జ్ఞానేంద్ర కుమార్ శుక్లా అన్నారు.
ఫిరోజాబాద్ జిల్లాలోని షికోహాబాద్ నియోజకవర్గం నుంచి 2017లో పోటీ చేసిన ముకేశ్ వర్మకు దాదాపు 87 వేల ఓట్లు లభించాయి. ఎస్పీకి చెందిన సంజయ్ కుమార్‌పై దాదాపు 11 వేల ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. ముకేశ్ వర్మ ఇప్పుడు బీజేపీని వదిలిపెట్టి, సమాజ్‌వాదీ పార్టీ టికెట్ మీద షికోహాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. కానీ సమాజ్‌వాదీ పార్టీకి ఇప్పటికే ఈ స్థానంలో బలమైన అభ్యర్థి ఉన్నారు.
బాలా అవస్థీ, 2017 ఎన్నికల్లో ధౌర్‌హరా నియోజకవర్గం నుంచి పోటీ చేసి దాదాపు 80వేల సీట్లను సాధించి గెలుపొందారు. ఆయన సమాజ్‌వాదీ పార్టీకి చెందిన యశ్‌పాల్ సింగ్ చౌధరీపై 3.5వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ నేత యశ్‌పాల్ సింగ్ బలమైన నేతగా ఉన్నారు. ఇప్పుడు, ఈ సీటును ఎవరికి కేటాయించాలో అనే విషయంలో కూడా అఖిలేశ్ యాదవ్‌కు కష్టాలు మొదలయ్యాయి.

ఫొటో సోర్స్, TWITTER/SAMAJWADI PARTY
సీనియర్ నాయకులను ఎలా సంతృప్తి పరచాలి?
బ్రిజేశ్ ప్రజాపతి తింద్వారీలో బీజేపీ టికెట్‌పై 37 వేల ఓట్ల తేడాతో బీఎస్పీకి చెందిన జగదీశ్ ప్రసాద్ ప్రజాపతిపై గెలుపొందారు.
''ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా బ్రిజేశ్ ప్రజాపతి, తన సొంత ప్రభుత్వాన్ని అనేక సార్లు ప్రశ్నించారు. ఆయన మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా బహిరంగంగానే వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఈ నియోజకవర్గంలో విషంభర్ ప్రసాద్ నిషద్ బలమైన నేతగా ఉన్నారు. ఆయన సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు కూడా. బ్రిజేశ్ ప్రజాపతికి టికెట్ ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదు'' అని బ్రిజేశ్ శుక్లా చెప్పారు.
ఇలాంటి పరిస్థితుల్లో బ్రిజేశ్ ప్రజాపతికి టికెట్ లభిస్తే, ఎస్పీకి చెందిన పాత నేతలు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది.
రోషన్‌లాల్ వర్మ కూడా ఎస్పీలో చేరారు. 2017లో బీజేపీ అభ్యర్థిగా తిల్హార్ నియోజకవర్గం నుంచి 82 వేల ఓట్లు సాధించి గెలుపొందారు. ఆయన కాంగ్రెస్ నేత జతిన్ ప్రసాద్‌పై విజయం సాధించారు.
''2017 ఎన్నికల్లో రోషన్‌లాల్ వర్మ 'ఈసారి రాజభవనం, గుడిసెల మధ్య పోరాటం' అనే నినాదం ఇచ్చారు. ఆయనను గెలిపించడానికి బీజేపీ చాలా శ్రమించింది. ఈసారి టికెట్ రాదని భయపడి ఆయన బీజేపీని వీడి ఎస్పీలోకి చేరారు'' అని బ్రిజేశ్ శుక్లా చెప్పారు.
మరోవైపు 2017 ఎన్నికల్లో ఔరయా జిల్లాలోని బిధునా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా వినయ్ షాక్యా గెలుపొందారు. ఆయన ఎస్పీ నేత దినేశ్ కుమార్ వర్మపై దాదాపు 4 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ స్థానంలో దినేశ్ కుమార్ వర్మ చాలా బలమైన అభ్యర్థి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ నుంచి వచ్చిన తిరుగుబాటు నేతలకు ఎస్పీలో ఎలా స్థానం కల్పిస్తారనేదే ప్రశ్న.
''అసలు అగ్ని పరీక్షను అఖిలేశ్ యాదవ్ ఎదుర్కోనున్నారు. పార్టీలోని సీనియర్ నేతలను ఎలా ఒప్పిస్తారనేది ఇప్పుడు ఆయన ముందున్న అతిపెద్ద సవాలు. యూపీ అసెంబ్లీ మండలిలోని 36 సీట్ల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. అఖిలేశ్ యాదవ్ కొంతమంది నాయకులను శాసన మండలికి కూడా పంపవచ్చు. ఒకవేళ ఎన్నికల్లో గెలుపొందితే, కొందరిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా, మరికొందరిని బోర్డు అధ్యక్షులుగా నియమించడం ద్వారా వారి ఆగ్రహం నుంచి తప్పించుకోవచ్చు'' అని జ్ఞానేంద్ర కుమార్ శుక్లా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పెరుగుతున్న కోవిడ్ కేసులు - తెలుగు రాష్ట్రాలలో ఎలా ఉంది
- విరాట్ కోహ్లి: టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌కు ఈ తరహా వీడ్కోలు ఏంటి? దాని వెనక కారణమేంటి
- కరోనావైరస్: కోవిడ్ మహమ్మారి ముగింపు దశకు చేరుకుందా?
- ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు: బీజేపీలో తిరుగుబాటు రగులుతోందా?
- చైనా, తైవాన్‌ల మధ్య ఎందుకీ ఘర్షణ? మీరు తెలుసుకోవాల్సిన 6 విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













