చైనా, తైవాన్‌ల మధ్య ఎందుకీ ఘర్షణ? మీరు తెలుసుకోవాల్సిన 6 విషయాలు

తైవాన్ సైనికుడు
ఫొటో క్యాప్షన్, తైవాన్ సైనికుడు
    • రచయిత, డేవిడ్ బ్రౌన్
    • హోదా, బీబీసీ న్యూస్

ఇటీవలి కాలంలో చైనా తైవాన్‌ల మధ్య ఘర్షణ మరింత పెరిగింది. గత ఏడాదిలో తైవాన్ డిఫెన్స్ జోన్‌లోకి చైనా యుద్ధవిమానాలు చొరబడటం రికార్డు స్థాయికి చేరింది.

ఈ పరిణామాల వెనక చైనా పునరేకీకరణ అంశం అంతర్లీనంగా ఉంది. తమ దేశంతో తైవాన్ పునరేకీకరణ తప్పకుండా జరగాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ఇందుకోసం బలప్రయోగాన్ని ఆయన తోసిపుచ్చలేదు.

స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన తైవాన్ ఒకప్పుడు తమ దేశంలో భాగమని, ఇది ఎప్పటికైనా తిరిగి దేశంలో విలీనం కావాల్సిందేనని చైనా భావిస్తోంది.

కానీ, తైవాన్ మాత్రం తనను తాను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకులున్న స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది.

చైనా, తైవాన్

1. తైవాన్ ఎక్కడ ఉంది?

ఆగ్నేయ చైనా తీరానికి దాదాపు 100 మైళ్ల దూరంలో ఉన్న ఒక ద్వీపమే తైవాన్. అమెరికా అనుకూల ద్వీపాల శ్రేణిలో తైవాన్ మొదటి స్థానంలో ఉంటుంది. అమెరికా విదేశాంగ విధానంలో ఈ ద్వీపాల శ్రేణి చాలా కీలకం.

చైనా తైవాన్‌ను స్వాధీనం చేసుకుంటే, పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో తన బలాన్ని ప్రదర్శించడానికి ఇది చైనాకు ఉపయోగపడుతుందని, అవసరమైతే గువామ్, హవాయి దీవుల్లోని అమెరికా రక్షణ స్థావరాలను ఇది టార్గెట్ చేయగలదని కొందరు పాశ్చాత్య రక్షణ నిపుణులు చెబుతున్నారు.

అయితే,తమ ప్రయత్నాలు పూర్తిగా శాంతియుత ప్రయోజనాలకేనని చైనా స్పష్టం చేస్తోంది.

2. చైనా నుంచి తైవాన్ ఎందుకు విడిగా ఉంది?

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, చైనా ప్రధాన భూభాగంలో జాతీయవాద ప్రభుత్వ దళాలు, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మధ్య పోరాటం జరిగినప్పుడు ఇద్దరి మధ్య చీలిక వచ్చింది.

1949లో కమ్యూనిస్టులు గెలిచారు. వారి నాయకుడు మావో జెడాంగ్ బీజింగ్‌ పై పట్టు సాధించారు. ఇక జాతీయవాద పార్టీ కోమింటాంగ్ నేతలు తైవాన్‌కు పారిపోయారు.

కొమింగ్‌టాంగ్ నాయకుడు చాంగైషేక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొమింగ్‌టాంగ్ నాయకుడు చాంగైషేక్

3. తైవాన్ తనను తాను రక్షించుకోగలదా?

ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం వంటి సైనికేతర మార్గాల ద్వారా తైవాన్‌ ను తనతో పునరేకీకరణకు చైనా ప్రయత్నం చేయవచ్చు.

సైనిక ఘర్షణ అంటూ జరిగితే అందులో చైనా సాయుధ బలగాలు తైవాన్ సైన్యాన్ని కచ్చితంగా ఓడిస్తాయి.

దేశ రక్షణ కోసం చైనా, ఒక్క అమెరికా తప్ప మిగతా అన్ని దేశాల కన్నా అధికంగా బడ్జెట్‌ను కేటాయిస్తుంది. నౌకాదళం నుంచి క్షిపణి సాంకేతికత, సైబర్ దాడుల వరకు భారీ శ్రేణి సామర్థ్యాన్ని చైనా ఉపయోగించగలదు.

చైనా, తైవాన్‌ల మధ్య సైనిక శక్తిలో భారీ తేడాలున్నాయి.

ఘర్షణ అంటూ జరిగితే, చైనా అటాకింగ్‌ను నెమ్మదింపజేయడానికి తైవాన్ ప్రయత్నించవచ్చని, అవసరమైతే గెరిల్లా యుద్ధానికి దిగే అవకాశం ఉందని పాశ్చాత్య భద్రతా నిపుణులు అంచనా వేస్తున్నారు.

అమెరికా నుంచి తైవాన్‌కు ఆయుధాలు అందే అవకాశం ఉంది. అయితే, తైవాన్‌కు సాయం విషయంలో అమెరికా వ్యూహం అస్పష్టంగా ఉంది.

మరో మాటలో చెప్పాలంటే, దాడి జరిగినప్పుడు తైవాన్‌ను రక్షించాలా లేదా అనే దానిపై అమెరికా వద్ద స్పష్టత లేదు.

దౌత్యపరంగా అమెరికా వన్‌ చైనా విధానానికి కట్టుబడి ఉంది. అయితే, ఇది బీజింగ్‌లోని చైనా ప్రభుత్వాన్ని మాత్రమే గుర్తిస్తుంది. తైవాన్‌తో కాకుండా చైనాతో మాత్రమే అధికారిక సంబంధాలను కొనసాగిస్తుంది.

చైనా, తైవాన్

4. పరిస్థితి మరింత దిగజారుతుందా?

2021లో తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్‌లోకి సైనిక విమానాలను పంపడం ద్వారా చైనా ఒత్తిడిని పెంచినట్లు కనిపించింది.

ఇది తైవాన్‌లో జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా విదేశీ విమానాలను గుర్తించడం, పర్యవేక్షించడం, నియంత్రించడం వంటి స్వీయ-అధికారాలను కలిగి ఉన్న ప్రాంతం.

2020 లో తమ భూభాగంలోకి చైనా విమానాల చొరబాట్లకు సంబంధించిన డేటాను బయటపెట్టింది.

అక్టోబరు 2021లో నాటికి చొరబడిన విమానాల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ నెలలలో ఒక రోజులో 56 చొరబాట్లు జరిగాయి.

5. మిగతా దేశాలకు తైవాన్‌తో సంబంధమేంటి?

తైవాన్ ఆర్థిక వ్యవస్థ చాలా కీలకమైంది. ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ వినియోగించే ఎలక్ట్రానిక్ పరికరాలైన ఫోన్‌ల నుంచి ల్యాప్‌టాప్‌లు, గడియారాలు, గేమింగ్ కన్సోల్స్ వరకు- తైవాన్‌లో తయారైన కంప్యూటర్ చిప్‌ల ఆధారంగా పని చేస్తాయి.

తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (టీఎస్ఎంసీ) ప్రపంచ మార్కెట్‌లో సగానికి పైగా వాటాను సంపాదించిందంటే దీని విస్తృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

టీఎస్ఎంసీ కంపెనీ 2021లో దాదాపు 100 బిలియన్ డాలర్లు (రూ.75 లక్షల కోట్లు) విలువైన పరిశ్రమగా మారింది.

తైవాన్‌‌ను స్వాధీనం చేసుకోవడం వల్ల ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పరిశ్రమల్లో ఒకదానిపై బీజింగ్‌కు కొంత నియంత్రణ లభిస్తుంది.

చైనా సైనికుడి చిత్రం
ఫొటో క్యాప్షన్, చైనా సైనికుడి చిత్రం

6. తైవాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారా?

చైనా, తైవాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, చాలా మంది తైవాన్ ప్రజలు ఇబ్బంది ఎదుర్కోలేదని పరిశోధనలు సూచిస్తున్నాయి.

‘చైనాతో యుద్ధం జరుగుతుందని భావిస్తున్నారా’ అని అక్టోబరులో తైవాన్ పబ్లిక్ ఒపీనియన్ ఫౌండేషన్ ప్రజలను అడిగింది.

దాదాపు మూడింట రెండొంతుల మంది (64.3%) యుద్ధం వస్తుందని భావించడం లేదని చెప్పారు.

చాలామంది తైవాన్‌ ప్రజలు తమను తాము తైవానీస్ పిలిపించుకోవడానికి ఇష్టపడతారని ఒక స్పెషల్ రీసెర్చ్ సూచించింది. భిన్నమైన గుర్తింపును వారు కోరుకోవడం లేదు.

1990ల ప్రారంభం నుంచి నేషనల్ చెంగ్‌చి యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలు చైనీస్ లేదా చైనీస్ అండ్ తైవానీస్ అనే రెండు గుర్తింపులను ఇష్టపడే వారి సంఖ్య పడిపోయిందని, చాలామంది తమను తాము తైవానీస్‌గా పరిగణిస్తున్నారని సూచిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)