ట్రంప్: 'నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వలేదు, నేనింకా శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా?''

డోనల్డ్ ట్రంప్, నోబెల్ శాంతి బహుమతి, గ్రీన్‌లాండ్

ఫొటో సోర్స్, REUTERS/Kevin Lamarque

    • రచయిత, మ్యాలరీ మెన్చ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గతేడాది తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కనందున.. ఇక శాంతి గురించి మాత్రమే ఆలోచించాల్సిన బాధ్యత తనకు లేదు అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

నార్వే ప్రధానమంత్రి జోనాస్ గార్ స్టోర్‌కు లేఖ రాసిన ట్రంప్, తనకు నోబెల్ శాంతి బహుమతి అందజేయకపోవడంపై ఆ దేశాన్ని తప్పుబట్టారు.

ట్రంప్ లేఖకు నార్వే ప్రధాని సమాధానమిచ్చారు.

నోబెల్ బహుమతుల అంశాన్ని ఓ స్వతంత్ర కమిటీ చూసుకుంటుందని, ఇది నార్వే ప్రభుత్వం పని కాదని ట్రంప్‌కు రాసిన సమాధానంలో స్టోర్ వివరించారు.

వెనెజ్వెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాదోకు గతేడాది అక్టోబరులో నోబెల్ శాంతి బహుమతి లభించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘గ్రీన్‌లాండ్‌పై పూర్తిస్థాయి నియంత్రణ కావాలి’

గ్రీన్‌లాండ్‌పై "పూర్తి, మొత్తం నియంత్రణ అమెరికాకు అవసరం" అని స్టోర్‌కు పంపిన సందేశంలో ట్రంప్ అన్నారు.

గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకోవడానికి బలగాలని ఉపయోగించాలనే ప్రణాళిక ఉందా అని తర్వాత అడగగా… "నో కామెంట్" అని ట్రంప్ సమాధానమిచ్చారు.

అమెరికా కీలక భాగస్వామిగా ఉన్న నాటోలో డెన్మార్క్ ఓ సభ్య దేశం. ఇతర దేశాలేవైనా దాడులు చేసినప్పుడు సభ్య దేశాలన్నీ కలిసి ఎదుర్కోవాలనే సూత్రం ఆధారంగా ఈ కూటమి పని చేస్తుంది.

1949లో ఈ కూటమి స్థాపించినప్పటి నుంచి ఒక సభ్య దేశంపై మరో సభ్య దేశం దాడి జరిపిన దాఖలాలు లేవు.

గ్రీన్‌లాండ్‌లో అమెరికా సైనిక చర్య చేపడితే అది నాటోకు ముగింపు పలికినట్లే అవుతుందని డెన్మార్క్ హెచ్చరించింది. ఆ దేశానికి కూటమిలోని యూరోపియన్ సభ్యదేశాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. కొన్ని దేశాలు… గతవారమే గ్రీన్‌లాండ్‌లోకి తమ బలగాలను కూడా పంపాయి.

అయితే, ఈ మోహరింపు తర్వాత ట్రంప్… గ్రీన్‌లాండ్ స్వాధీనం చేసుకోవాలనే తన ప్రతిపాదనను వ్యతిరేకిస్తే ఫిబ్రవరి 1 నుంచి నాటో కూటమిలోని యూకే సహా 8 దేశాలపై 10శాతం సుంకాలు విధిస్తానని ప్రకటించారు. జూన్ నాటికి ఈ సుంకాలను 25శాతం పెంచుతానని చెప్పారు.

డోనల్డ్ ట్రంప్, నోబెల్ శాంతి బహుమతి, గ్రీన్‌లాండ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నోబెల్ శాంతి బహుమతి తనకు ఇవ్వాలని ట్రంప్ పదే పదే కోరారు.

"అమెరికాకు ఏది మంచో, అదే ఆలోచిస్తాను"

ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో.. తన తరఫున అలాగే ఫిన్‌లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ తరఫున డోనల్డ్ ట్రంప్‌కు నార్వే ప్రధాని జోనాస్ స్టోర్ ఈ సందేశం పంపారు.

"మనమంతా కలిసి నిలవాల్సిన చోట, మన చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలను చల్లార్చడానికి, తొలగించడానికి మనమంతా కలిసి పని చేయాలి" అని ఆ ఇద్దరు నేతలు కోరారు.

"ఎనిమిదికిపైగా యుద్ధాలను ఆపినప్పటికీ నాకు మీ దేశం నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోవడంతో… ఇక నేను ఎంతమాత్రం పూర్తిగా శాంతి కోసం కట్టుబడి ఉండాలని అనుకోవడం లేదు. ఇది ప్రధానమైన అంశమైనప్పటికీ… అమెరికాకు ఏది మంచో, ఏది తగినదో దానిపై మాత్రమే ఆలోచిస్తాను" అని ట్రంప్ తన రిప్లై‌లో రాశారు.

అలాగే ఆయన గ్రీన్‌లాండ్‌ను రష్యా లేదా చైనా నుంచి డెన్మార్క్‌ కాపాడుకోలేదని కూడా అన్నారు.

" అయినా వాళ్లకు "యాజమాన్య హక్కు" ఎలా ఉంటుంది? వాళ్ల దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. కేవలం వందల ఏళ్ల కిందట అక్కడ ఓ పడవను ల్యాండ్ చేశారు. కానీ, మా పడవలు కూడా అక్కడ ల్యాండ్ అయ్యి ఉన్నాయి" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

"నాటోను స్థాపించినప్పటి నుంచి ఎవరూ చేయలేనంతగా నేను నాటో కోసం చేశాను. ఇప్పుడు నాటో అమెరికాకు కోసం కొంత చేయాలి"

"గ్రీన్‌లాండ్‌పై మా నియంత్రణ సంపూర్ణంగా లేకపోతే ప్రపంచం సురక్షితంగా ఉండదు" అని ట్రంప్ అన్నారు.

తక్కువ జనాభా, అధిక వనరులతో ఉన్న ఆర్కిటిక్ ద్వీపం గ్రీన్‌లాండ్. క్షిపణి దాడులు జరిగేటప్పుడు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలకు, అలాగే ఈ ప్రాంతంలో నౌకలను పర్యవేక్షించడానికి అనువైన ప్రదేశంలో ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)