నోబెల్‌ పీస్‌ ప్రైజ్: డోనల్డ్ ట్రంప్‌కు ఇవ్వాలని ప్రతిపాదించిన నెతన్యాహు, ఈ బహుమతిపై గతంలో వచ్చిన 6 వివాదాలు ఏంటంటే...

డోనల్డ్ ట్రంప్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో విందు సందర్భంగా డోనల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒక కవరును అందజేశారు.

ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని పొందాలనేది అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చిరకాల కోరికగా చెబుతారు. అందుకు తగినట్లుగానే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు.

''మనం అనుకుంటున్నట్లుగానే ఆయన శాంతి స్థాపనకు విశేష కృషి చేస్తున్నారు. ఒక దేశంలో, ఒక ప్రాంతంలో, ఇంకా మరో చోట'' అని ట్రంప్ గురించి ప్రైజ్ కమిటీకి పంపిన లేఖలో నెతన్యాహు పేర్కొన్నారు.

ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చింది నెతన్యాహు ఒక్కరే కాదు. జూన్‌లో పాకిస్తాన్ కూడా నోబెల్ ‌ప్రైజ్‌కు ట్రంప్ పేరును ప్రతిపాదించే ఆలోచన ఉందని ప్రకటించింది.

అంతకుముందు మే నెలలో భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు ఆయన మధ్యవర్తిత్వం ఉపయోగపడిందని పాకిస్తాన్ తెలిపింది.

అలా ప్రకటించిన మర్నాడే పొరుగున ఇరాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో పాకిస్తాన్ వెనక్కి తగ్గింది.

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతి...

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతిగా భావించే ఈ పీస్ ప్రైజ్‌‌కు స్వీడన్ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త, దాత ఆల్ఫ్రెడ్ నోబెల్ ఏర్పాటు చేశారు. నోబెల్ ప్రైజుల్లో ఆరు విభాగాలున్నాయి. ఇందులో శాంతి బహుమతి ఒకటి. ఆరో బహుమతిని ఆర్ధిక రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు. ఎకనామిక్స్‌లో నోబెల్ ప్రైజ్‌ను ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణానంతరం ఏర్పాటు చేశారు. వీటికి విజేతలను నార్వే పార్లమెంటు ఎన్నుకున్న ఐదుగురు సభ్యుల కమిటీ ఎంపిక చేస్తుంది.

ఒకవేళ డోనల్డ్ ట్రంప్‌నే ఈ బహుమతి వరిస్తే, ఆయనను కూడా వివాదాస్పద విజేతగానే చాలామంది పరిగణించే అవకాశం ఉంది.

మిగతా ఐదు రంగాలలో కన్నా నోబెల్ శాంతి బహుమతే రాజకీయ కారణాల రీత్యా తరచుగా వివాదాలలో చిక్కుకుంటోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నోబెల్ చరిత్రలో పలు వివాదాలు...

నోబెల్ శాంతి బహుమతి చరిత్ర చూస్తే అత్యంత వివాదాస్పదమైన ఆరు సందర్భాలు ఉన్నాయి. వారికి నోబెల్ ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ ఆరు సందర్భాలు ఇవీ...

బరాక్ ఒబామా

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా

1. బరాక్ ఒబామా...

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు 2009లో నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించినప్పుడు అనేక మంది అభ్యంతరం చెప్పారు.

అధ్యక్ష పదవిలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే ఈ బహుమతి ప్రకటించడంతో ఆయనే తొలుత ఆశ్చర్యపోయారనే వార్తలు వచ్చాయి. ''ఎందుకు ఇస్తున్నారు?''... ఇదీ ప్రకటన వెలువడిన వెంటనే తన తొలి స్పందన అని ఒబామా 2020లో స్వీయ రచనలో ప్రస్తావించారు.

నోబెల్ బహుమతి ప్రకటన నాటికి ఒబామా అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చొని తొమ్మిది నెలలే అయింది. నామినేషన్ల గడువు నాటికైతే కేవలం 12 రోజులే అయింది. అందుకే ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలనే నిర్ణయం ప్రీమెచ్యూర్ ( మరీ తొందరపాటు) అనే విమర్శలు వ్యక్తమయ్యాయి.

2015లో నోబెల్ ఇన్‌స్టిట్యూట్ మాజీ డైరెక్టర్‌గా ఉన్న గెయిర్ లండేస్టడ్ బీబీసీతో మాట్లాడుతూ, ఒబామాకు అవార్డు ఇవ్వాలన్న కమిటీ నిర్ణయానికి చింతించానని చెప్పారు.

ఒబామా రెండు దఫాల అధికార కాలం (2009-2017)లో అమెరికా సైనిక దళాలు అఫ్గానిస్తాన్, ఇరాక్, సిరియా దేశాల్లో యుద్ధంలో ఉన్నాయి.

యాసర్ అరాఫత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1994 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యాసర్ అరాఫత్

2. యాసర్ అరాఫత్...

ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు పరిష్కారం లభిస్తుందని 1990ల్లో ఓస్లో శాంతి ఒప్పందం ఆశలు రేకెత్తించింది. ఈ ఒప్పందం కుదిరేలా చేసిన కృషికిగాను 1994లో పాలస్తీనా నాయకుడు యాసర్ అరాఫత్‌కు అప్పటి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఇత్జాక్ రాబిన్, ఆ దేశ విదేశాంగ మంత్రి షిమోన్ పెరేజ్‌లతో సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి లభించింది.

పూర్వాశ్రమంలో పారామిలిటరీ కార్యకలాపాల్లో పాల్గొన్న యాసర్ అరాఫత్‌కు నోబెల్ ఇవ్వాలన్న నిర్ణయంపై ఇజ్రాయెల్‌లోనూ, బయటా విమర్శలు వచ్చాయి.

చివరకు, అరాఫత్ నామినేషన్ నోబెల్ కమిటీలో కూడా అంతర్గతంగా కలకలం రేపింది.

ఈ కమిటీలో సభ్యుడైన నార్వే రాజకీయ నాయకుడు కరే క్రిస్టియన్సెన్ తన పదవికి రాజీనామా చేశారు.

హెన్రీ కిసింజర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1973లో అమెరికా నుంచి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత హెన్రీ ఆల్ఫ్రెడ్ కిసింజర్

3. హెన్రీ కిసింజర్

1973లో అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. వియత్నాం యుద్ధంలో కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో కీలక పాత్ర పోషించినందుకు ఉత్తర వియత్నాం నాయకుడు లీ డ్యూక్ థో, కిసింజర్‌లకు సంయుక్తంగా ఈ బహుమతిని నోబెల్ కమిటీ ప్రకటించింది.

కాంబోడియాలో రహస్య బాంబుదాడులు, దక్షిణ అమెరికాలో పలుచోట్ల క్రూరమైన సైనిక పాలనకు మద్దతు తదితర అమెరికా విదేశాంగ విధానంలోని పలు అత్యంత వివాదాస్పదమైన ఘట్టాలతో సంబంధం ఉన్న వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతి ప్రదానం చేయడంపై అప్పట్లో పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

నిరసనగా నోబెల్ ప్రైజ్ కమిటీలో ఇద్దరు సభ్యులు తమ పదవికి రాజీనామా చేశారు.

'నోబెల్ వార్ ప్రైజ్' అని సంబోధిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక న్యూస్ ప్రచురించింది.

అబియ్ అహ్మద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఓస్లో సిటీ టౌన్ హాల్‌లో 2019 నోబెల్ శాంతి బహుమతి ప్రదానోత్సవంలో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న తర్వాత ఇథియోపియా ప్రధాన మంత్రి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అబియ్ అహ్మద్ అలీ ఇలా పోజ్ ఇచ్చారు.

4. అబియ్ అహ్మద్

పొరుగు దేశమైన ఎరిట్రియాతో సుదీర్ఘకాలంగానున్న సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో కృషి చేసినందుకు 2019లో ఇథియోపియా ప్రధాన మంత్రి అబియ్ అహ్మద్‌ను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసినట్లు కమిటీ ప్రకటించింది.

కానీ స్వల్ప కాలానికే, అది సరైన నిర్ణయమేనా అన్న ప్రశ్నలు రేకెత్తాయి.

టిగ్రే ఉత్తర ప్రాంతంలో సైనిక దళాలను మోహరించడంతో అబియ్ అహ్మద్‌పై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమయ్యాయి.

అబియ్ నిర్ణయం అంతర్యుద్ధానికి దారితీసింది. ఆహారం, మందులు, కనీస సౌకర్యాలకు లక్షలాది మంది దూరమయ్యారు. ఫలితంగా భారీ సంఖ్యలో మృతి చెందారని భావిస్తున్నారు.

ఆంగ్ సాన్ సూచీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఓస్లో సిటీ హాల్‌లో నోబెల్ ఉపన్యాసం సందర్భంగా ప్రసంగించిన నోబెల్ గ్రహీత ఆంగ్ సాన్ సూచీ.

5. ఆంగ్ సాన్ సూచీ

మియన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా అహింసా విధానంలో పోరాటం చేస్తున్న బర్మా రాజకీయ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీకి 1991లో నోబెల్ బహుమతి లభించింది.

కానీ 20 సంవత్సరాల తర్వాత, తన దేశంలో ముస్లిం రోహింజ్యా తెగ ప్రజలను సామూహింగా ఊచకోత కోస్తున్నా, తీవ్రస్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా, ఈ పరిస్థితులను ఐక్యరాజ్య సమితి 'మారణ హోమం' అని ప్రకటించినా సరే, ఆంగ్ సాన్ సూచీ ఈ చర్యలను అడ్డుకోలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు.

చివరకు, ఆమె నుంచి అవార్డును వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. కానీ అలాంటి చర్యలకు నోబెల్ కమిటీ నిబంధనలు అనుమతించవు.

వంగరి మథాయి

ఫొటో సోర్స్, Corbis via Getty

ఫొటో క్యాప్షన్, కెన్యా పర్యావరణ, రాజకీయ కార్యకర్త వంగారి మతాయి

6. వంగారి మతాయి

2004లో కెన్యా సామాజిక కార్యకర్త వంగారి మతాయి నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నారు. ఈ గౌరవం దక్కిన తొలి ఆఫ్రికా మహిళ కూడా ఆమెనే.

గ్రీన్ బెల్ట్ మూవ్‌మెంట్ ద్వారా లక్షలాది మొక్కలు నాటడానికి ఆమె చేసిన కృషికి గాను ఈ బహుమతి దక్కింది.

కానీ హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ విషయంలో ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

నల్ల జాతీయులను అంతం చేయడానికి కృత్రిమంగా సృష్టించిన జీవాయుధం (బయోలాజికల్ వెపన్) హెచ్ఐవీ వైరస్ అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే తన వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు చూపలేకపోయారు.

మహాత్మా గాంధీ

ఫొటో సోర్స్, Keystone/Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రిటిష్ పాలనకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న మహాత్మా గాంధీ.

అతిపెద్ద విస్మరణ- గాంధీకి శాంతి బహుమతి

నోబెల్ శాంతి బహుమతి ప్రకటించడంలో కొంతమందిని విస్మరించారని కూడా కమిటీపై విమర్శలున్నాయి.

శాంతి బహుమతి కేటగిరీలో మహాత్మా గాంధీని విస్మరించడానికి స్పష్టమైన కారణాలేవీ కనిపించవు.

20వ శతాబ్దంలో శాంతియుత ఉద్యమాలకు చిహ్నంగా ఉన్న ఈ భారత నాయకుడి పేరును నోబెల్ శాంతి బహుమతి కోసం ఐదుసార్లు ప్రతిపాదించారు. కానీ అవార్డు మాత్రం రాలేదు.

2006లో నోబెల్ శాంతి బహుమతి విజేతల ఎంపిక కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన నార్వే చరిత్రకారుడు గెయిర్ లండేస్టడ్ మాట్లాడుతూ, గాంధీ సాధించిన విజయాలకు గుర్తింపు లేకపోవడం నోబెల్ చరిత్రలో అతిపెద్ద విస్మరణ అని వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)