గాంధీ జయంతి : సూటూబూటూ వదిలేసి గాంధీజీ 'అర్ధనగ్న ఫకీరు' వేషాన్ని ఎందుకు ఎంచుకున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వందన
- హోదా, బీబీసీ సీనియర్ ఎడిటర్
“మిస్టర్ గాంధీ లాంటి దేశద్రోహి, టెంపుల్ వకీలు అర్థనగ్నంగా వైస్రాయ్ ప్యాలెస్ మెట్లు ఎక్కి, రాజు ప్రతినిధితో మాట్లాడటం చాలా ప్రమాదకరమైనది, అసహ్యంగా ఉంది.”
చర్చిల్ చేసిన ఈ ప్రకటన చరిత్ర పుస్తకాల్లో ఉంది. 1931లో బ్రిటన్ రాజు జార్జ్ 5 ఆహ్వనం మేరకు గాంధీ బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లినప్పుడు ఇది జరిగింది.
అప్పుడు గాంధీ తనదైన శైలిలో చిన్న దోతీ ధరించారు. దీన్ని ఆంగ్లేయులు లుంగీ లేదా లంగోటా అని పిలిచేవారు,
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గాంధీజీ కొల్లాయిని వ్యూహాత్మకంగా ఉపయోగించేవారని ఆయన ముని మునవడు, ఆయనపై అనేక పుస్తకాలు రాసిన తుషార్ గాంధీ భావిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
“భారతీయ నాయకుడు తమను కలవడానికి వచ్చినప్పుడల్లా ఆంగ్లేయుల వస్త్రధారణలో రావడం బ్రిటిష్ వారికి అలవాటుగా మారింది. ఇది వారికి సహజంగానే అనిపించేది. అయితే గాంధీ అలా చెయ్యకపోవడంతో ఆంగ్లేయులు ఆందోళన చెందారు.
ఇతనెందుకు మనలా కనిపించేందుకు ప్రయత్నించడం లేదు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేటప్పుడు కూడా ఆయన రాజు గారి ముందుకు అర్ధనగ్నంగా వెళ్లడం చూసి ఆంగ్లేయులు ఆశ్చర్యపోయారు. చర్చల సమయంలో గాంధీజీ సైకలాజికల్ గేమ్ ఆడేవారు. మీరు బేరమాడేటప్పుడు అందులో సైకలాజికల్ ట్రిక్స్ ప్లే చేయాలని అని గాంధీ భావించారు” అని తుషార్ గాంధీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చిన్న ధోతీ మాత్రమే ధరించాలనే నిర్ణయం
గాంధీ తొలినాళ్లలో ఫోటోలు చూస్తే వాటిలో ఆయన సూటు బూటు వేసుకుని దర్జాగా కనిపించేవారు. తర్వాత ఆయన గుజరాత్‌లోని కతియవాడి వేషధారణలోనూ కనిపించారు.
గాంధీజీకి గుర్తింపుగా మారిన దోతీ, కండువా ఎప్పుడు అస్తిత్వంలోకి వచ్చాయి?. దేశ విదేశాల్లో అవి గాంధీజికి ఒక ప్రతీకగా ఎలా మారాయి? అన్నదే అసలు ప్రశ్న.
1921లో గాంధీజీ తమిళనాడులోని మధురైలో ఉన్నారు. అప్పుడే ఆయన స్వదేశీ దుస్తులే ధరించాలని నిర్ణయించుకున్నారు. విదేశీ దుస్తుల్ని తగలబెట్టాలన్న ఆయన పిలుపు ఉద్యమంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
తమిళనాడులో ఓసారి ఆయన రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు సాధారణ తరగతిలోని ప్రయాణికులతో మాట్లాడినప్పుడు చాలా మంది పేదల వద్ద డబ్బుల్లేవని అందుకే వారు పాత దుస్తుల్ని తగలబెట్టి కొత్త ఖాదీ దుస్తులు కొనుక్కోలేరని తెలుసుకున్నారు.
గాంధీ తన రైలు ప్రయాణం గురించి ఇలా రాశారు “ రైలులో నేను వాళ్లను చూసినప్పుడు వారికి స్వదేశీ ఉద్యమంలో వారు చెయ్యగలిగింది ఏమీ లేదనిపించింది. వారిలో ఒకతను విదేశీ దుస్తులు ధరించాడు. నేను వారితో మాట్లాడినప్పుడు, ఖరీదైన ఖాదీ కొనడం వారికి సాధ్యం కాదని చాలా మంది చెప్పారు.
నేను టోపీ, పంచె, లాల్చీ ధరించి ఉన్నాను. అప్పుడు నేను ఒకటే ఆలోచించాను. దీనికి ఎలా సమాధానం చెప్పాలి. మర్యాదగా ఇలాగే ఉండాలా? లేక నా శరీరంపై బట్టలు త్యాగం చెయ్యాలా? లేక వారి స్థాయికి సమానంగా రావాలా? మదురైలో సమావేశం ముగిసిన మరుసటి రోజే నేను దానిని అమలు చేశాను.

ఫొటో సోర్స్, Getty Images
మొదట్లో సూటు బూటు వేసుకున్న గాంధీ
1921 సెప్టెంబర్ 22న గాంధీజీ తన పాత వస్త్ర ధారణ వదిలేసి చిన్న గోచీ మాత్రమే పెట్టుకుని పైన కండువా వేసుకోవడం మొదలు పెట్టారు. మార్పు ఒక్కసారిగా రాలేదని తుషార్ గాంధీ చెప్పారు.
“గాంధీజీ లా ప్రాక్టీస్ చేయడానికి ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు, ఆయన కోటు, బూటు కొనుక్కున్నారు. మొదట్లో బట్టల గురించి చాలా ఆలోచనతో ఉన్నట్లు తన ఆత్మకథలో రాసుకున్నారు. ఇంగ్లాండ్‌లో అప్పుడున్న ఫ్యాషన్ ప్రకారం ఆయన ఫ్యాన్సీ టోపీ ధరించారు. కాబ్ వాచ్ కొనుక్కున్నారు. దక్షిణాఫ్రికాకు వచ్చాక అక్కడి లాయర్ల వేషధారణను అనుసరించారు. అయితే దక్షిణాఫ్రికాలో ఉంటూ వివిధ సమస్యలపై సత్యాగ్రహం చేయడం ప్రారంభించినప్పటి నుంచి గాంధీజీలో నెమ్మదిగా మార్పు కనిపించడం మొదలైంది. జీవతంలో అవసరాలను తగ్గించారని" తుషార్ గాంధీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బట్టల ద్వారా సందేశం ఇవ్వడంలో ప్రాముఖ్యతను గాంధీజీ అర్థం చేసుకున్నారని తుషార్ గాంధీ చెప్పారు.
“దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం ముగించేటప్పుడు గాంధీజీలో పెద్ద మార్పు కనిపించింది అప్పుడు గాంధీ పొడవాటి కుర్తా, లుంగీ ధరించడాన్ని మీరు చూడవచ్చు. అక్కడ సత్యాగ్రహంలో మరణించిన భారతీయ తమిళులకు గాంధీ నిలబడి నివాళులు అర్పించారు. ఇదే గాంధీ విధానం” అని తుషార్ గాంధీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కాటియావాడీ పోషకుడి నుంచి ధోతీ వరకు..
దక్షిణాఫ్రికా నుంచి భారత దేశం వచ్చిన తర్వాత కూడా గాంధీజీ అనేక రకాలుగా మారారని తుషార్ గాంధీ అన్నారు.
ఆయన భారత దేశానికి వచ్చినప్పుడు భారతీయుడిలాగే కనిపించాలని అనుకున్నారు. అందుకే 1915లో కతియవాడి దుస్తులు ధరించడం మొదలు పెట్టారు. ధోతీస కుర్తా, పై కండువా, తలపాగా అందులో ఉండేవి. గోఖలే సలహాతో ఆయన భారతదేశ యాత్రకు బయల్దేరారు.
అప్పుడు ఆయనకు భారత దేశ పరిస్థితుల గురించి అవగాహన వచ్చింది. చంపారన్‌లో ఒక కుటుంబం మొత్తం అర్ధనగ్నంగా ఉండేవారు. వారి దగ్గర అవి తప్ప వేరే దుస్తులు కూడా ఉండకపోవడాన్ని ఆయన గుర్తించారు.
ఆ సమయంలో గాంధీజీ తన శరీరంపై బట్టలను చూసి, వాటిని తగ్గించుకోవాలని అనుకున్నారు. కేవలం కుర్తా, ధోతీ ధరించి యాత్ర చేశారు. అక్కడ నుంచి క్రమంగా ఆయన వస్త్ర ధారణలో మార్పు మొదలైంది. యాత్ర తమిళనాడుకు చేరుకున్న తర్వాత అది ధోతీగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
గాంధీజీ తన దుస్తుల్ని మార్చుకోవాలనే నిర్ణయాన్ని “నాటకీయంగా” తీసుకోలేదని గుజరాత్‌లో ప్రముఖ రచయిత, గాంధీ గురించి అధ్యయనం చేసిన ఉర్విష్ కొఠారి చెప్పారు.
“గాంధీజీ మొదట ప్రశాంతమైన మనసుతో ఆలోచించి, నిర్ణయం తీసుకుని తొలుత ఆయనే ఆచరించేవారు. స్వదేశీ ఉద్యమం జరుగుతున్నప్పుడు, 1921 సెప్టెంబర్ 22న అక్టోబరు 31 వరకు చిన్న ధోతీ మాత్రమే ధరిస్తానని ఆయన ప్రకటించారు. అలాగే చేశారు. అయితే అక్టోబర్ 31 తర్వాత కూడా అదే కొనసాగింది” అని ఉర్విష్ కొఠారి తెలిపారు.
ఆయనింకా ఏమన్నారంటే.. “ ఆయన నిర్ణయం ఆచరణాత్మకమైనది. స్వదేశీ ఉద్యమంలో బాగంగా విదేశీ బట్టలు తగలబెట్టి ఖాదీ కొనుక్కోమని ప్రజలకు చెప్పాలనుకున్నారు. అయితే చాలా మందికి కొత్త ఖాదీ వస్త్రం కొనడానికి తగినంత డబ్బు లేదని ఆయన గుర్తించారు. అందుకే గాంధీజీ సగం ధోతీ కూడా సరిపోతుందని చెప్పారు.
మదురైలో తొలిసారి గాంధీజీ తొలిసారిగా కొత్తరకం వేషధారణలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రాంతాన్ని గాంధీజీ పోర్టల్‌గా పిలుస్తున్నారు. అక్కడ గాంధీజీవిగ్రహం ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ధోతీలో వెళ్లి బ్రిటన్ రాజుతో భేటీ
1931లో గాంధీజీ ధోతీ ధరించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు బయల్దేరినప్పుడు బ్రిటన్‌లో పత్రికలు ధోతీలో ఉన్న గాంధీజీ ఫొటో వేసి ఎగతాళి చేశాయి.
సీనియర్ రచయిత దయాశంకర్ శుక్లా సాగర్ బీబీసీ కోసం రాసిన వ్యాసంలో బ్రిటిష్ పత్రికల తీరుపై గాంధీజీ స్పందన గురించి ప్రస్తావించారు “ బ్రిటిషర్లు నా వస్త్రధారణను ఇష్టపడరు, దానిని విమర్శిస్తారు, ఎగతాళి చేస్తారు. ఇది ఎందుకు వేసుకున్నారని అడిగారు.
బ్రిటీష్ వాళ్లు భారతదేశానికి వెళ్ళినప్పుడు.. యూరోపియన్ దుస్తులను వదిలి భారతీయ దుస్తులు ధరిస్తారా? అలా చెయ్యరు. నేను ధోతీని ఏదో సౌకర్యం కోసం కట్టుకోవడం లేదు. నా జీవితంలో వచ్చిన మార్పుల వల్లనే నా వేషధారణ మారింది.”

ఫొటో సోర్స్, Getty Images
ఇది గాందీజీ మాస్టర్ స్ట్రోక్ అనుకోవచ్చా?
గాంధీలో ఈ మార్పు అర్థం ఏమిటి? ఆయన మాటల్లో చెప్పాలంటే “ బట్టలు వదులుకోవడం అవసరం. ఇది సంతాపానికి చిహ్నం. కాలం గడుస్తున్నా స్వరాజ్యం రాకపోవడంతో మేము నిజంగా దుఃఖిస్తున్నాం."
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో గాంధీజీ తీసుకున్న ఈ అద్భుతమైన నిర్ణయాన్ని ఉర్విష్ కొఠారి ఇలా వర్ణించారు.
“గాంధీజీ తన వేషాన్ని మార్చుకున్నప్పుడు, అది అతని గుర్తింపుగా మారింది. మీ శరీరాన్ని కప్పి ఉంచడానికి మీరు తక్కువ దుస్తులు ధరించవచ్చు. కానీ, మీరు ధరించే దుస్తులు దేశీయంగా ఉండాలని గాంధీ సందేశం ఇచ్చారు. స్వదేశీకి ప్రాధాన్యం ఇచ్చేందుకు గాంధీ మార్గం ప్రభావవంతంగా మారింది. కానీ కాలం గడిచేకొద్దీ మన నాయకుడు మనలాగే ఉంటాడు, మనం వేసుకున్నవే వేసుకుంటాడు, అందులో కృత్రిమత్వం లేదు అనే భావన ప్రజల్లో పెరిగింది. ఇది గాంధీజీ గొప్పదనం .”

ఫొటో సోర్స్, Getty Images
గాంధీజీ తీసుకున్న ఈ నిర్ణయం మాస్టర్ స్ట్రోక్ లాంటిదని తుషార్ గాంధీ అభివర్ణించారు. గాంధీజీ ప్రసంగం లేదా మాట్లాడే విధానం ప్రత్యేకంగా ఏమీ ఉండదు. కానీ ఆయన ప్రయత్నం సాధారణ ప్రజలు తనతో కనెక్ట్ అయ్యేలా చెయ్యడం. గాంధీజీ కంటే ముందున్న కాంగ్రెస్ నాయకులు సభలకు ఆడంబర వేషధారణలతో వచ్చేవారు, తలపాగా లాంటి బట్టలు వారి కులం, రంగు, సంపదలను ప్రతిబింబించేవి. అయితే గాంధీజీ ధోతీ మాత్రమే కట్టుకుని రావడం వల్ల నాయకులకు, ప్రజలకు మధ్య దూరం తగ్గింది. గాంధీజీ ఆడంబరాలను విడిచిపెట్టి కొత్త వాతావరణాన్ని సృష్టించారు.
గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఆయన స్వయంగా వివక్షను ప్రదర్శించారని, జాత్యాహంకారానికి పాల్పడ్డారని దక్షిణాఫ్రికా, ఘనాలోని కొంతమంది ఆరోపించారు. దక్షిణాఫ్రికాలో మేధావులు అశ్విన్ దేశాయ్, గులాం వాహిద్ 1893 నుండి 1913 వరకు సుమారు ఇరవై సంవత్సరాలు తమ దేశంలో నివసించిన గాంధీపై పరిశోధించి పుస్తకం రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశాయ్, గులాం తమ పుస్తకం 'ద సౌత్ ఆఫ్రికా గాంధీ: స్ట్రెచర్ బేరర్ ఆఫ్ ఎంపైర్'లో వ్రాశారు, గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో 'భారతీయుల పోరాటాన్ని ఆఫ్రికన్లు ఇతర నల్లజాతీయుల పోరాటం నుండి వేరు చేశారు.'
గాంధీజీ ఆఫ్రికాకు వచ్చనప్పుడు ఆయనకు 24 ఏళ్లు. ఆయన దక్షిణాఫ్రికాలోని నల్లజాతీయుల పట్ల కొన్ని సార్లు అహంకారం, పక్షపాతంతో వ్యవహరించారని గాంధీజీ జీవిత చరిత్ర రాసిన ఆయన మనవడు రాజ్‌మోహన్ గాంధీ పదే పదే చెప్పారు. అయితే గాంధీ తన జీవితాంతం కాలంతో పాటు తనను తాను మార్చుకున్నారనేది కూడా నిజం.

ఫొటో సోర్స్, Getty Images
గుర్తింపుగా మారిన కొల్లాయి
వస్త్రధారణ మార్చుకోవాలనే గాంధీజీ నిర్ణయాన్ని ఆంగ్లేయుల కోణంలో విశ్లేషించిన తుషార్ గాంధీ మరో విషయం కూడా చెప్పారు. “ఈ వ్యక్తి చేసే పనులకు మన దగ్గర సమాధానం లేదని బ్రిటిష్ వారు భావించారు. ఆయన ప్రవర్తించే విధానానికి కూడా సమాధానం లేదు. ఆయన నీచమైన వ్యక్తి అని కూడా వాళ్లు చెప్పలేరు.
గాంధీ సగం ధోతీ ధరించి రాజ నివాసానికి చేరుకున్నప్పుడు, ఆయన్ని వెనక్కి పంపలేరు. లోపలకు పిలిస్తే ఓటమిని అంగీకరించాల్సి ఉంటుందని వారికి తెలుసు. ఏం చేసినా ఏదో ఒకటి తప్పని స్థితి”
కింగ్ జార్జ్ 5 పూర్తి రాజవైభవంతో కూర్చున్న చోటుకు కూడా ఆయన ఆయన సగం ధోతీ కట్టుకునే వెళ్లారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజును కలిసిన తర్వాత గాంధీజీ బయటకు వచ్చినప్పుడు, బ్రిటిష్ జర్నలిస్టులు ఆయనను ఒక ప్రశ్న అడిగారు. 'మిస్టర్ గాంధీ, మీరు రాజును కలవడానికి తగిన దుస్తులు ధరించారా?'
గాంధీకి ఈ ప్రశ్న ఎప్పుడోకప్పుడు ఎదురవుతుందని తెలుసు.
అప్పుడు గాంధీ, 'నా బట్టల గురించి చింతించకు. మీ రాజు మా ఇద్దరికి సరిపడా బట్టలు వేసుకున్నారు.’ గాంధీ చెప్పిన ఈ సమాధానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
గాంధీజీ వేషధారణ గురించి ప్రముఖ రచయిత రాబర్ట్ పైన్ మాటల్లో చెప్పాలంటే 'ఆయన అర్థ నగ్నత్వం గౌరవానికి అధికారిక చిహ్నంగా మారింది.'
(నేడు గాంధీ జయంతి సందర్భంగా 2023లో ప్రచురితమైన ఈ కథనాన్ని మరోసారి అందిస్తున్నాం)
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఎలాంటి భోజనం వడ్డిస్తున్నారు? సోషల్ మీడియాలో చర్చకు కారణం ఏంటి?
- తెలంగాణలో పసుపు బోర్డ్ ఏర్పాటైతే రైతులకు కలిగే లాభమేంటి?
- Sexual Health: సెక్స్‌లో ఎంతసేపు పాల్గొన్నా భావప్రాప్తి కలగకపోవడానికి కారణమేంటి? ఇది వ్యాధి లక్షణమా?
- ‘సెక్స్ కోరికలు పెంచే ఆ హార్మోన్ తీసుకున్నాక నాకు కొడుకు పుట్టాడు’
- పువ్వును కాయగా మార్చే యంత్రం











