కస్తూర్బా గాంధీ: చదవడం, రాయడం తెలియని ఆమె డైరీ ఎలా రాశారు, మునిమనవడు తుషార్ గాంధీ దీనిపై ఏమన్నారు?

కస్తూర్బా గాంధీ

ఫొటో సోర్స్, KEYSTONE/GETTY IMAGES

    • రచయిత, పాయల్ భుయన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మధ్యప్రదేశ్ ఇందౌర్‌లోని ఒక ఆశ్రమంలో బయటపడిన డైరీపై చర్చ జరుగుతోంది. ఇది మహాత్మా గాంధీ భార్య కస్తూర్బా గాంధీ డైరీ అని కొందరు ప్రముఖులు చెబుతున్నారు.

అయితే, ఇది కస్తూర్బా డైరీ కాదని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఇది తమ నాన్నమ్మ డైరీనే అని గాంధీజీ మునిమనవడు తుషార్ గాంధీ అంటున్నారు.

ఈ డైరీపై ‘‘ద లాస్ట్ డైరీ ఆఫ్ కస్తూర్ మాయి బా’’ పేరుతో తుషార్ గాంధీ ఒక పుస్తకం కూడా రాశారు.

ఈ డైరీకి సంబంధించిన కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానాల కోసం తుషార్ గాంధీతో బీబీసీ మాట్లాడింది.

కస్తూర్బా గాంధీ

ఫొటో సోర్స్, Kanu Gandhi

డైరీ వెనుక కథ

అసలు ఈ డైరీ ఎలా వెలుగులోకి వచ్చిందో తుషార్ గాంధీ బీబీసీతో చెప్పారు.

‘‘కొన్నేళ్ల క్రితం జలగావ్‌లో గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్ పేరుతో ఒక సంస్థ ఏర్పాటైంది. ముఖ్యంగా గాంధీకి సంబంధించిన సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఈ సంస్థ కృషి చేస్తోంది. దీని కోసం పనిచేస్తున్న సిబ్బంది.. దేశంలోని భిన్న ప్రాంతాలకు చెందిన గాంధీ సంస్థల నుంచి ఆయన స్మృతులు, సాహిత్యం సేకరిస్తున్నారు’’అని ఆయన చెప్పారు.

‘‘దీనిలో భాగంగానే ఒక బృందం ఇందౌర్‌లోని కస్తూర్బా ట్రస్టుకు వెళ్లింది. అక్కడ ఏళ్ల నుంచి తెరవని కొన్ని పెట్టెలు కనిపించాయి. వాటిని తెరవడంతో చాలా పుస్తకాలు, వస్తువులు వెలుగులోకి వచ్చాయి. అక్కడున్న ఒక పెట్టె నుంచి తాజా డైరీ బయటపడింది. మొదట్లో అసలు ఈ డైరీని ఎవరు రాశారో తెలియలేదు. అయితే, గుజరాతీ తెలిసిన ఒక వ్యక్తి దీనిపై లోతుగా పరిశోధన చేపట్టారు. అప్పుడే దీనిలో ఎవరో తమ దినచర్యను రాసినట్లు తెలిసింది. ఆ తర్వాత పరిశోధనలో ఇది కస్తూర్బా గాంధీ డైరీ అని తెలుసుకున్నాం’’అని ఆయన చెప్పారు.

‘‘ఇది కస్తూర్బా డైరీనేనని ధ్రువీకరించేందుకు.. ఆ సమయంలో కస్తూర్బా ఎక్కడ ఉండేవారో కనుక్కున్నాం. దీంతో మా సందేహం నిజమైంది. ఆ డైరీలోని ప్రతి పేజీ కస్తూర్బా జీవితంతో సరిపోలుతోంది’’అని ఆయన వివరించారు.

అయితే, చాలా మంది ఈ డైరీ కస్తూర్బాది కాదని వాదిస్తున్నారు. ఎందుకంటే ఆమెకు చదవడం, రాయడం రాదని చెబుతున్నారు.

కస్తూర్బా గాంధీ

ఫొటో సోర్స్, TOPICAL PRESS AGENCY/GETTY IMAGES

ఇది ఎలా సాధ్యం?

ఒకవేళ నిజంగానే కస్తూర్బా చదువుకోకపోతే.. ఈ డైరీ ఆమెదేనని తుషార్ గాంధీ ఎలా ధ్రువీకరిస్తున్నారు?

చదువుకోనప్పటికీ ఆమెకు ప్రాథమిక అక్షర జ్ఞానం ఉందని తుషార్ గాంధీ చెబుతున్నారు.

‘‘ఆ డైరీని మొదటిసారి చూసినప్పుడు అసలు ఇది కస్తూర్బాది ఎలా అవుతుందని నేనూ అనుకున్నాను. ఎందుకంటే ఆమె చదువుకోలేదు. ఆమెకు రాయడం కూడా రాదు. కానీ, ఆ డైరీ చదివినప్పుడు అది కస్తూర్బాదేనని అనిపించింది. దీంతో ఈ విషయం గురించి మా నాన్నతో మాట్లాడాను. దీనిలోని పదాలు, భాష, వ్యాకరణం, వాక్య నిర్మాణం లాంటివన్నీ.. మనం మాట్లాడే భాషలోనే ఉన్నాయి. కేవలం మాట్లాడటం మాత్రమే తెలిసినవారు రాసిన డైరీలా ఇది అనిపించింది’’అని తుషార్ వివరించారు.

‘‘చాలా చోట్ల కాఠియావాడీ మాండలిక పదాలు కనిపించాయి. ఇది గుజరాతీలోని ఒక మాండలికం. కస్తూర్బా ఇలానే మాట్లాడేవారు. ఆమెతో కలిసి జీవించిన చాలా మంది ఆమె కాఠియావాడీ మాత్రమే మాట్లాడేవారని కొన్ని పుస్తకాల్లో పేర్కొన్నారు’’అని తుషార్ చెప్పారు.

‘‘హాస్పిటల్ అనే పదాన్ని ఇస్పిటల్ అని కొన్ని చోట్ల రాశారు. కొన్నిపదాలు ఒక్కోచోట ఒక్కోలా కనిపించాయి. సూపెరెంటైన్, సప్లెయింటెన్.. లాంటి చాలా పదాలు సూపరింటెండ్ కోసం ఉపయోగించారు. పెద్దగా రాయడంతో పరిచయం లేనివారు మాత్రమే ఇలా రాస్తారు. ఒకవేళ కస్తూర్బా చెప్పేటప్పుడు వేరే ఎవరైనా రాసివుంటే.. ఆమె తప్పుగా పలికే పదాలను రాసే వ్యక్తి సరిచేసి ఉండేవారు. కానీ, అలా జరగలేదు. దీంతో ఇది కస్తూర్బానే రాసినట్లు నాకు అనిపించింది’’అని ఆయన చెప్పారు.

కస్తూర్బా గాంధీ

ఫొటో సోర్స్, FOX PHOTOS/GETTY IMAGES

ఇంతకీ డైరీలో ఏముంది?

మనం చరిత్ర గురించి చదువుకునేటప్పుడు కస్తూర్బా గాంధీ పేరు చాలా తక్కువగా వినిపిస్తుంది. అసలు 1933లో రాసినట్లుగా కనిపిస్తున్న ఈ డైరీలో ఆమె గురించి ఏముంది?

ఈ ప్రశ్నపై తుషార్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘కస్తూర్బా తన గురించి వ్యక్తిగత విషయాలేమీ రాయలేదు. ఆ సమయంలో గాంధీ నుంచి ఆమెను వేరుగా ఉంచారు. ఆమెను వేరే జైలులో పెట్టారు. బాపూను మరో జైలులో ఉంచారు. గాంధీ నుంచి దూరంగా ఉన్నప్పట్టి పరిస్థితులను కస్తూర్బా డైరీలో రాశారు. ఆమె రోజువారీ జీవితం ఎలా గడిచేదో వివరించారు’’అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, ఇందిరా గాంధీ: జననం నుంచి మరణం దాకా...

అయితే, కస్తూర్బా తన దినచర్యను మాత్రమే రాస్తున్నప్పుడు చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉండేవనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి.

‘‘చుట్టుపక్కల పరిస్థితులను డైరీలో కస్తూర్బా వివరించలేదు. ఎందుకంటే అప్పటికే చాలాసార్లు తన రాజకీయ దృక్పథాలను ఆమె వెల్లడించారు’’అని తుషార్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, మహాత్మాగాంధీకి, పొందూరు ఖాదీకి ఉన్న అనుబంధం ఏంటి?

బాపూ బలం..

మహాత్మా గాంధీ జీవితంపై కస్తూర్బా ప్రభావం ఎలా ఉండేదనే ప్రశ్నపై తుషార్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘తన పక్కన కస్తూర్బా లేకపోతే తన జీవితం అలా ముందుకు వెళ్లేదికాదని, చాలా విజయాల్లో ఆమెది కూడా కీలకపాత్ర అని గాంధీజీ కూడా అంగీకరించారు’’అని తుషార్ చెప్పారు.

‘‘పరిస్థితులకు అనుగుణంగా కస్తూర్బా మారుతూ.. గాంధీజీకి అండగా నిలిచారు. నిరంతరం ఆయనకు వెన్నంటే ఉన్నారు. ఎప్పుడూ తన వెనుక ఒకరు ఉన్నారనే భరోసాను బాపూకు ఆమె ఇచ్చేవారు. కస్తూర్బా తన పక్కన లేకపోతే బాపూ ఏదో వెలితిగా ఉండేవారు’’అని తుషార్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)