అనీ బిసెంట్: నాస్తికత నుంచి తాత్వికత వైపు మళ్లి, హిందూ మతంపై ప్రసంగాలు ఇచ్చిన బ్రిటిష్ మహిళ

ఫొటో సోర్స్, Hulton Deutsch/Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
నాస్తికత నుంచి తాత్విక మార్గం పట్టిన ఐర్లాండ్‌కు చెందిన ఓ మహిళ భారత పర్యటనకు వచ్చిన 40 ఏళ్ల పాటు ఇక్కడే ఉండిపోయారు. భారత్‌లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఆమే అనీ బిసెంట్.
గాంధీ అంటే ఆరాధనతో తన జీవన శైలిని, అలవాట్లను మార్చుకుని నిరాడంబర మార్గంలో నడుస్తూ భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు మరో బ్రిటిష్ మహిళ. ఆమె పేరు మేడ్‌లీన్ స్లేడ్(మీరా బెన్).
గాంధీ ఆశయాలను నమ్మి ఆచరించి భారతదేశాన్ని సొంతిల్లుగా మార్చుకుని ఉత్తర భారతంలో మహిళల సంక్షేమానికి, పర్యావరణ అభివృద్ధికి పాటు పడ్డారు ఇంకో బ్రిటిష్ మహిళ. ఆమె పేరు క్యాథరీన్ హీల్మన్(సరళా బెన్)
బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన ఈ ముగ్గురు విదేశీ మహిళలు భారత స్వాతంత్రోద్యమంలో పోషించిన పాత్ర గురించి చరిత్రకారుడు రామచంద్ర గుహ తన 'రెబెల్స్ ఎగెనెస్ట్ ది రాజ్' పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
అనీ బీసెంట్: నాస్తికత నుంచి తాత్వికత వైపు
లండన్‌లో జన్మించిన అనీ బీసెంట్ నాస్తిక భావజాలంతో సోషలిస్ట్ ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. భారతీయ సంస్కృతిని ఆకళింపు చేసుకుని, భారత రాజకీయ, విద్యా రంగంలో చెరగని ముద్ర వేశారు. ఆమె ఐరిష్ సంతతికి చెందిన మహిళ.
చార్లెస్ బ్రాడ్‌లాగ్‌తో కలిసి నాస్తికతను ప్రచారం చేస్తున్న సమయంలో చర్చి, మతాధికారుల నుంచి విమర్శలు, బెదిరింపులు ఎదుర్కొన్నారు. ఆమె పై రాళ్లు రువ్వారు. ఆమె అప్పటికే ఇద్దరు పిల్లల తల్లి.
భర్తతో విడాకులు తీసుకున్నతర్వాత సోషలిస్ట్ ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. కార్మికుల సంక్షేమం కోసం ర్యాలీలు నిర్వహించారు. 'మై పాథ్ టు ఎథీయిజమ్' అనే పుస్తకాన్ని రాశారు. బీసెంట్ బౌద్ధ, హిందూ, ప్రాచీన ఈజిప్ట్ ఆధ్యాత్మిక గ్రంథాలనూ చదివారు.

ఫొటో సోర్స్, RAMACHANDRA GUHA/TWITTER
అనీబీసెంట్ తత్వవేత్తగా ఎలా మారారు
1888 నుంచి ఆమె జీవితంలో థియోసఫీ ప్రవేశించింది. లండన్‌లో రష్యన్ తత్వవేత్త బ్లావట్స్కీతో జరిగిన ఒకే ఒక్క భేటీ ఆమె ఆలోచనలను మార్చేసింది.
ఆ సమావేశంలో బ్లావట్స్కీ రూపురేఖలను ఆమె ఇలా వర్ణించారు.
"పై నుంచి కింద వరకు శరీరాన్ని పూర్తిగా కప్పిన నల్లని గౌను ధరించారు. తలకు స్కార్ఫ్ చుట్టుకున్నారు. తీక్షణమైన చూపు, చేతి వేళ్ల మధ్య ఒడుపుగా సిగరెట్ పెట్టుకుని వరుసగా సిగరెట్లు కాలుస్తున్నారు" బ్లావట్స్కీ సీక్రెట్ డాక్ట్రిన్ రచయత. ఆమె ప్రతిపాదించిన సిద్ధాంతాలు చాలా వివాదాస్పదమయ్యాయి కూడా. శాస్త్రీయ సమాజం ఆమె వాదనలను ఖండించింది.
ఆ ఒక్క సమావేశం బీసెంట్‌ను థియోసాఫికల్ సొసైటీ సభ్యురాలిగా చేరేలా చేసింది. బ్లావట్స్కీ మరణం తర్వాత థియోసాఫికల్ సొసైటీ తత్వాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. బిసెంట్ మంచి వక్త కూడా.

ఫొటో సోర్స్, Universal History Archive/GETTY IMAGES
భారత్‌లో బీసెంట్ ప్రయాణం
కొన్ని రోజుల పాటు పర్యటించి వెనక్కి వెళ్లాలనే ఆలోచనతో భారత్‌లో అడుగు పెట్టిన బీసెంట్ 40 ఏళ్ల పాటు భారత్‌లోనే ఉండిపోయారు.
ఆమె ఎడ్ల బండ్లపై, రైళ్లలో దక్షిణ భారతదేశంలో పర్యటించారు. మదురై, తిరునల్వేలి, హైదరాబాద్‌లో ప్రసంగాలు చేశారు. ఆమెను దక్షిణ భారతదేశంలో పెరియమ్మ అని ఉత్తరాదిలో బడీ మేమ్ సాహిబ్ అని పిలిచేవారు.
హిందూ మతం, ఆకర్షణ శక్తి, శాఖాహారం గురించి ప్రసంగాలిచ్చారు. దీంతో ఆమెకు లండన్ యూనివర్సిటీ డిగ్రీ ఇవ్వడానికి కూడా నిరాకరించింది. ఈ నిర్ణయం ఆమె భారత్‌లో యూనివర్సిటీ స్థాపించాలనే ఆలోచనకు బీజం వేసింది.

ఫొటో సోర్స్, CENTRAL HINDU BOYS SCHOOL
విద్యా రంగంలో అడుగులు
బీసెంట్ బెనారస్‌లో సెంట్రల్ హిందూ బాయ్స్ స్కూల్ స్థాపించారు. ఇందుకోసం బెనారస్, కశ్మీర్ రాజులు ఆమెకు స్థలం, విరాళాలను ఇచ్చారు.
1904లో ఆమె రెసిడెన్షియల్ హిందూ బాలికల పాఠశాల కూడా స్థాపించారు. అప్పటికి అదొక విప్లవాత్మక ప్రయత్నం అని చెప్పవచ్చని నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ అన్నారు. ఆయన విశాఖపట్నంలోని సెంటర్ ఫర్ గాంధియన్ స్టడీస్ చైర్మన్ గా ఉన్నారు.
అనీ బిసెంట్ సంప్రదాయ విద్యతో ఆధునిక విద్యను సమ్మేళనం చేయాలని అనేవారు. అమ్మాయిలు సంప్రదాయ దుస్తులు ధరించాలని పట్టుబట్టేవారు. భారతీయ కళలు, ఉత్పత్తిదారులను ప్రోత్సహించాలని అనేవారు. మహిళలకు అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం ఉండాలని మాట్లాడే ఆమె నెమ్మదిగా మహిళలు పురుషులకు అణిగిమణిగి ఉండాలని అనడం మొదలుపెట్టారు.
ఈ యూనివర్సిటీలోనే ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
గాంధీకి అనీ బిసెంట్‌తో పరోక్ష పరిచయం ఉంది. ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలుసు. గాంధీ తన రచనల్లో బీసెంట్‌కు అత్యున్నత స్థానం ఇచ్చేవారు. కానీ, బీసెంట్ మాత్రం గాంధీకి భారతదేశంలో పెరుగుతున్న ఆదరణను స్వీకరించలేకపోయేవారు.
నెల్లూరులో 1915లో ఒక బహిరంగ సభలో ప్రసంగించడానికి ముందు ఆమె గాంధీని సభకు పరిచయం చేశారు. ఈ సభలో గాంధీ త్యాగ నిరతిని, ఆదర్శాలను కొనియాడారు. ఆయన ఆశయాలు భారతదేశాన్ని భవిష్యత్తులో బలపరుస్తాయని అన్నారు.
కానీ, సరిగ్గా 9 నెలల తర్వాత ఆమె బెనారస్ హిందూ యూనివర్సిటీలో గాంధీ ప్రసంగానికి ఆటంకం కలిగించారు.
ఈ ప్రసంగంలో గాంధీ.. యూనివర్సిటీ పోషకులను విమర్శించారు. "భారీగా అలంకరించుకుని సమావేశానికి హాజరైన రాజులను, అంత అలంకరణ అవసరమా అని ప్రశ్నించారు. తల నుంచి కాలి వేళ్ల వరకు అలంకరించుకోవడం అవసరమా? మనలో స్వీయ పాలన పట్ల ఎవరికీ ఆసక్తి లేదు. బ్రిటిష్ అధికారులు భారతీయుల సమస్యలపై దృష్టి పెట్టరని విమర్శించారు".
గాంధీ ఇలా ప్రసంగిస్తుండగా, 'ఆపండి ఆపండి' అంటూ బీసెంట్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కానీ, విద్యార్థులు మాత్రం ఆయన ప్రసంగాన్ని కొనసాగించమని కోరారు.
కానీ, దర్భాంగా మహారాజు జోక్యం చేసుకుని గాంధీని సభ నుంచి వెళ్లమని ఆదేశించారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ ప్రవేశం
అనీ బీసెంట్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగా ఆమెను అరెస్టు చేశారు. ఆమె అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేశారు. 1917లో ఆమెను విడుదల చేశారు.
అనీ బిసెంట్1917లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ కార్యదర్శి ఎడ్విన్ మాంటేగ్, వైస్‌రాయ్ లార్డ్ ఛెమ్స్‌ఫర్డ్ ఆమెను... రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారని అడగగా, "నాకు మొదట్నుంచీ రాజకీయ ఆలోచనలున్నాయి. కానీ, దేశం గురించి మొదట తెలుసుకోవాలని అనుకున్నాను. అందుకే విద్యా రంగం వైపు దృష్టి పెట్టాను" అని సమాధానం చెప్పారు.
నిజానికి 1908 నాటికి ఆమెకు రాజకీయ ఆలోచనలు లేవని రామచంద్ర గుహ అంటారు.
"భారతదేశం స్వాతంత్రం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఆ డిమాండ్‌ను తీర్చలేని పక్షంలో మీరొక దేశానికి వ్యతిరేకంగా వెళుతున్నట్లే" అని ఆమె బ్రిటిష్ అధికారులకు స్పష్టం చేశారని నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ చెప్పారు.

ఫొటో సోర్స్, Hulton Archive/GETTY IMAGES
స్వదేశీ ఉద్యమాన్ని ఎందుకు వ్యతిరేకించారు?
అనీ బీసెంట్ స్వదేశీ ఉద్యమంలో పాల్గొనలేదు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారి ఆగ్రహానికి గురయ్యేందుకు ఆమె సంసిద్ధంగా లేరు.
ఆమె భారతీయ సంస్కృతిని, కట్టుబాట్లను, ఆచారాలను ప్రేమిస్తూనే బ్రిటిష్ వారికి విశ్వాసపాత్రురాలుగా కూడా ఉండేవారు. విద్యార్థుల్లో స్వతంత్ర భావనలు, వేర్పాటువాదాన్ని కలగకుండా చూసుకునేవారు.
కానీ, భారతదేశంలో జిల్లాలకు, గ్రామ కౌన్సిల్‌కు ఎక్కువ అధికారాలివ్వాలని బ్రిటిష్ పాలకులను అడిగేవారు.
మహిళలకు ఓటు హక్కు
1918లో బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన ఫ్రాంచైజ్ (సార్వత్రిక ఓటు హక్కు) కమిటీ దేశమంతా పర్యటించింది. భారతీయ మహిళలకు ఓటు ఇవ్వరాదని ఈ కమిటీ తీర్మానించింది. అయితే, మహిళలను వోటింగ్ హక్కుల నుంచి పక్కన పెట్టడం భారతీయుల ఆశలకు, ఆశయాలకు తీవ్ర భంగం కలిగించినట్లవుతుందని ఆమె ఇంగ్లాండ్ వెళ్లి పార్లమెంటరీ కమిటీకి చెప్పారు.
ఇంగ్లిష్ మహిళల కంటే భారతీయ మహిళలకు ఓటు హక్కు ఎక్కువ అవసరమని ఆమె తన ప్రసంగాల్లో చెప్పారు. ఆధునిక భావాలతో మాట్లాడుతున్నారని పత్రికలు ఆమెను విమర్శించాయి.
అయితే ఆమె ఏ ఉద్యమంలో చేరినా అక్కడ ఆమె పెత్తనం చెలాయించాలని చూసేవారని చరిత్రకారులు అంటారు. ఆమె సిద్ధాంతాలను ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశంతోనే పని చేసేవారని శ్రీరాం ఐఏఎస్ శిక్షణ కేంద్రంలో చరిత్ర బోధించే శ్రీరంగం శ్రీరామ్ అన్నారు.

ఫొటో సోర్స్, Keystone-France/GETTY IMAGES
ఆమెకు జిడ్డు కృష్ణమూర్తికి సంబంధం ఏంటి?
ఆమె 1909లో జిడ్డు కృష్ణమూర్తిని కలిశారు. ఆ తర్వాత రెండు దశాబ్దాలు ఆమె జీవితం జేకేతో ముడిపడి ఉంది. ఆమె జేకేని దత్త పుత్రునిగా స్వీకరించారు. జేకేలో బుద్ధుడు, క్రీస్తు, జొరాస్టర్ కనిపిస్తున్నారని అనేవారు.
అయితే, ఆమె మోసం చేసి తన కొడుకులను పెంచుకుందంటూ జిడ్డు కృష్ణమూర్తి తండ్రి కోర్టులో కేసు వేశారు. జేకే సోదరులను ఆక్స్‌ఫర్డ్ లో చేర్చాలని ఆమె తీవ్రంగా ప్రయతించారు.
ఆ తర్వాత జేకే తాను ఎవరికీ గురువును కాదంటూ, ఆత్మజ్ఞానం కోసం ఎవరి దారి వారే వెతుక్కోవాలంటూ 1929లో బహిరంగ సభలో ప్రకటించి ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయారని శ్రీరామ్ చెప్పారు.
బీసెంట్ స్వదేశీ సంస్థ ప్రచారం కోసం జేకేను ఉపయోగించుకోవాలని చూశారని ఆయన అంటారు. జేకే చర్యతో ఆమె ఆధ్యాత్మిక వారసుడిని కోల్పోయారు.

ఫొటో సోర్స్, Topical Press Agency/GETTY IMAGES
బీసెంట్కు గాంధీకి వైరం ఎందుకు?
"గాంధీ రాజకీయాల్లో చంటి పిల్లాడు. ఆయనకు అర్ధం కాని, పరిచయం లేని ప్రపంచంలో తిరుగుతూ కలలు కంటున్నారు" అని బీసెంట్ ఒక స్నేహితునితో అన్నారు.
బహుశా బెనారస్ యూనివర్సిటీలో జరిగిన సంఘటన, అనీ బీసెంట్ తత్త్వం వారి మధ్య సయోధ్యను కలుగచేసి ఉండకపోవచ్చు.
రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన సమావేశంలో దేశంలో చోటు చేసుకున్న హింసకు గాంధీ విధానాలే కారణమని బీసెంట్ విమర్శించారు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైంది.
కానీ, గాంధీ మాత్రం ఆమెకు సమున్నత గౌరవం ఇచ్చేవారు.
గ్రామ కౌన్సిల్, కాంగ్రెస్ ప్రతినిధులు, ఖాదీ నేత గురించి వారిద్దరి మధ్య వాదనలు జరిగేవి. గాంధీ ప్రతిపాదించిన సిద్ధాంతాలను ఆమె వ్యతిరేకించేవారు.
"ఆమె వయసు, పరిణతి వల్ల నా అభిప్రాయాలను ఒక తల్లి ఎదుట కొడుకులా విన్నవించాను" అని గాంధీ అనేవారు.
హోమ్ రూల్‌ను ఆమె ప్రతిపాదించినంతగా మరెవ్వరూ ప్రతిపాదించలేదని గాంధీ ఆమెను కొనియాడారు.
సెప్టెంబరు 20, 1933లో అనీ బీసెంట్ మరణించారు.
"భారతదేశం ఉన్నంత కాలం అనీ బీసెంట్ దేశానికి చేసిన సేవలు ప్రజల జ్ఞాపకాల్లో ఉంటాయి. బీసెంట్ ఎప్పటికీ సజీవంగా ఉంటారు. భారతదేశాన్ని ఆమె దత్తత తీసుకుని తనను తాను జాతికి అంకితం చేసుకున్నారు" అంటూ గాంధీ ఆమెకు నివాళి అర్పించారు".

ఫొటో సోర్స్, Keystone-France/MADELINE SLADE
మీరా బెన్‌గా మారిన మేడ్‌లీన్ స్లేడ్
"ఒకే ఇంట్లో ఉండే భార్యాభర్తల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తినప్పుడు ఎవరో ఒకరు బయటకు వెళ్లడం ఉత్తమం" అంటూ భారతీయులు స్వాతంత్య్రం కోరుకుంటున్న విషయాన్ని బ్రిటిష్ అధికారులతో చెప్పారామె. ఆమె భారతీయురాలు కాదు.
బ్రిటన్‌కు చెందిన ఉన్నత వర్గ కుటుంబంలో పుట్టి, గుర్రపు స్వారీలు, పియానో కచేరీలు చేసే అమ్మాయి విలాసాలన్నిటినీ వదిలిపెట్టి, గాంధీపై పెంచుకున్న ఆసక్తితో ఆశ్రమ జీవితం గడిపేందుకు భారత్ వచ్చేశారు. బీథోవెన్ సంగీతాన్ని ఆమె బాగా ఇష్టపడేవారు.
ఆమె పేరు మేడ్‌లీన్ స్లేడ్. ఆమెను గాంధీ కూతురుగా భావించి మీరా బెన్ అని పేరు పెట్టారు.

ఫొటో సోర్స్, Universal History Archive/GETTY IMAGES
గాంధీ పట్ల ఎలా ఆకర్షితులయ్యారు?
ఫ్రెంచ్ రచయత రొమైన్ రోలండ్‌తో సంభాషణల్లో వచ్చిన గాంధీ ప్రస్తావన ఆమెను గాంధీ విధానాలకు ఆకర్షితురాలిని చేసింది. గాంధీ గురించి తెలుసుకున్న వెంటనే ఆమె భారత్‌కు ప్రయాణమవ్వాలని అనుకున్నారు.
మఠం వేసి కూర్చోవడం నేర్చుకున్నారు. శాఖాహారం అలవాటు చేసుకున్నారు. మద్యం మానేశారు. హిందీ నేర్చుకున్నారు. దేశం గురించి, సంస్కృతి గురించి పుస్తకాలు చదవడం మొదలుపెట్టారు.
ఆమె గాంధీని కలవాలనే కోరికను వ్యక్తం చేస్తూ లేఖ రాసి, ఆ ఉత్తరంతో పాటు 20 పౌండ్ల చెక్ కూడా పంపారు. ఆ ఉత్తరం చదివిన గాంధీ ఆమెకు వెంటనే ఆహ్వానం పంపలేదు.
"ఒక సంవత్సరం తర్వాత కూడా నీకు రావాలని అనిపిస్తే అప్పుడు భారత్‌కు రావడానికి సరైన సమయం" అని గాంధీ ఆమెకు సమాధానమిచ్చారు.
సంవత్సరం తర్వాత కూడా ఆమె నిర్ణయాన్ని మార్చుకోలేదని చెబుతూ, "భారతీయ తత్త్వం గురించి చదువుతున్నకొద్దీ, నేనెప్పుడో కోల్పోయిన ఇంటిని చేరుతున్నట్లుగా అనిపిస్తోంది" అని గాంధీకి సమాధానమిచ్చారు.
ఆమెకు ఆశ్రమానికి వచ్చేందుకు అనుమతి లభించింది. అప్పటికి ఆమె 33వ ఏట అడుగు పెట్టేందుకు ఒక నెల రోజులు ఉంది. 1925లో ఆమె ఇండియా వచ్చారు.
గాంధీ పర్యటనలకు వెళుతున్నప్పుడు ఆమె గాంధీని తీవ్రంగా మిస్ అవుతూ ఉండేవారు. ఆమె రోజుకు 3-4 సార్లు గాంధీకి ఉత్తరం రాసేవారు. గాంధీ రాసే రచనలను సరిదిద్దేవారు. చీర కట్టుకోవడం నేర్చుకున్నారు. అయితే, ఆమెకు చివరి వరకు చీర కట్టుకోవడం సరిగ్గా రాలేదని గుహ అంటారు. బ్రహ్మచారిణిగా ఉండాలని నిర్ణయించుకుని గుండు కూడా చేయించుకున్నారు.
30లలో బ్రహ్మచర్యం స్వీకరించాలని అనుకున్న ఆమె తన 40లలో మాత్రం ఆశ్రమంలోని పృథ్వీ సింగ్ అనే విప్లవకారునితో ప్రేమలో పడ్డారు. కానీ, పృథ్విసింగ్ ఆమె ప్రేమను అంగీకరించకపోవడంతో ఆ ప్రేమ పెళ్లికి దారి తీయలేదు.
ఆయన పట్ల కలిగిన ఇష్టాన్ని గాంధీతో చెప్పినప్పుడు గాంధీ ఆయనను పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. కానీ, పృథ్వి మాత్రం ఆమెను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించలేదు. ఆయన ఆమెను ఒక స్నేహితురాలిగానే ఉండమన్నారు కానీ, జీవిత సహచరిగా అంగీకరించలేదు.
గాంధీ సంరక్షణను ఆమె చూసుకునేవారు. ఆయన రాట్నాన్ని తీసి పక్కన పెట్టడం, పండ్లు ఒలిచి ఇవ్వడం, మేక పాలును చెంబులో వేయడం, ఆయన బీపీ చూడటం లాంటి పనులను చేసేవారు.
ఆమె గాంధీని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేకపోయేవారు. "అదొక ఆత్మ బంధం" అని అంటారు ప్రొఫెసర్ బాలమోహన్ దాస్.
ఈ విషయాన్ని గ్రహించిన గాంధీ ఆమెను ఆశ్రమం నుంచి దూరంగా పంపాలని భావించి దేశవ్యాప్త ఖాదీ ప్రచారానికి పంపించారు. ఈ పర్యటనలోనే ఆమె మొదటిసారి హిమాలయాలు సందర్శించారు.
సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత ఆమె కూడా మూడు నెలల పాటు జైలులో ఉన్నారు. ఆమె మత గ్రంథాలు, ఖురాన్ చదివేవారు. పాశ్చాత్య దేశాల ధోరణిని వ్యతిరేకించేవారు.

ఫొటో సోర్స్, Imagno/GETTY IMAGES
బ్రహ్మచర్యంపై గాంధీతో చర్చలు
దంపతులు కూడా పిల్లలకు జన్మనివ్వడానికి తప్ప మిగిలిన సమయంలో బ్రహ్మచర్యాన్ని అవలంబించాలనే గాంధీ వాదనను ఆమె సమర్థించలేదు.
దీని గురించి మీరా బెన్, గాంధీ మధ్య చాలా చర్చలు జరిగాయి.
ఇలాంటి నిబంధన తప్పని ఆమె వాదించేవారు. ఇది వ్యక్తిగత అవసరాలకనుగుణంగా అనుసరించాల్సిన విషయం. దంపతుల్లో ఏ ఒక్కరి ఇష్టానికి వ్యతిరేకంగా జరిగినా కూడా అది తప్పే. ఏదైనా నియమాన్ని బలవంతంగా పాటించినప్పుడు మనుషులు మానసిక సమతుల్యతను కోల్పోయే అవకాశముంది" ఆమె అనేవారని ది న్యూ యార్క్ టైమ్స్‌లో 'ఏ లైఫ్ విత్ గాంధీ' అనే వ్యాసంలో రాశారు.
"గాంధీకి కూడా విపరీతమైన లైంగిక కోరికలు ఉండేవి. కానీ, ఆయన చాలా సున్నితంగా ఉండేవారు. జీవితంలో శృంగారం అవసరం ఉందని ఆయన భావించేవారు" అని మీరా చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది.
ఆమె బ్రిటన్‌లో భారతదేశ స్వాతంత్ర్య అవసరం గురించి ప్రసంగాలు చేశారు. అమెరికాలోనూ పర్యటించారు. గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేశారు.
మీరా బెన్ తన ఆత్మతో గాంధీ విశ్వాసాలను, భారతదేశాన్ని ప్రేమించిన వ్యక్తి అని ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ అన్నారు. ఆమెలో గాంధీ పట్ల అమితమైన ప్రేమ, ఆయన సిద్ధాంతాలపై విశ్వాసం, భారతదేశంపై ఇష్టం ఉన్నాయన్నారు.

ఫొటో సోర్స్, Vinod Kumar
ప్రేమలో వైఫల్యం మీరా బెన్‌ను బాగా కుంగదీసింది. హిమాలయాలకు వెళ్లారు.
గాంధీ ఆమెను బ్రిటిష్ అధికారులతో సంప్రదింపులు జరిపేందుకు పంపేవారు. కానీ, చర్చలు ఫలించలేదు. భారతీయులు స్వాతంత్ర్యం కోరుకుంటున్న విషయాన్ని మాత్రం ఆమె గట్టిగా అధికారులకు చెప్పేవారు.
గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రకటించారు. ఆమె తిరిగి జైలుకు వెళ్లారు. ఒక బ్రిటిష్ మహిళ గాంధీని అనుసరించడాన్ని బ్రిటిష్ వారు సహించలేకపోయారు.
జైలు నుంచి విడుదలైన తర్వాత హరిద్వార్ వెళ్లి అక్కడ ఆశ్రమాన్ని స్థాపించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆమె దిల్లీ వచ్చారు.
ఫారిన్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ అనే పుస్తకంలో రచయత పి.కొండలరావు ఇలా అంటారు.
"భారత స్వతంత్రం కోసం కృషి చేయాల్సిన అవసరం భారతీయులకు ఉంది. కానీ, భారత స్వాతంత్య్రం కోసం కృషి చేయడానికి అమెరికన్లకు, బ్రిటిషర్లకు అవసరం లేదు. కానీ, భారత స్వాతంత్య్రం కోసం కృషి చేసిన చాలా మంది విదేశీయులున్నారు".
గాంధీ మరణం తర్వాత దేశంలో నెలకొన్న రాజకీయ స్థితిని చూసి ఆమె కలవరపడ్డారు. దేశంలో అవినీతి పెరిగిపోతోంది అంటూ ఆమె ప్రధాని నెహ్రూకి లేఖ రాశారు.
కానీ, దేశంలో స్వాతంత్ర్యం తర్వాత నెలకొన్న రాజకీయ పరిస్థితులలో ఇమడలేక 1959లో వియన్నా వెళ్లారు. ఆమె యూరప్ వెళ్లే ముందు వరకు కూడా గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కోసం పని చేశారు. ఆమె హిందూస్తాన్ టైమ్స్‌లో పర్యావరణ సంబంధిత వ్యాసాలు రాసేవారు. ఈ దేశంలోమనిషి ప్రాథమిక అవసరాలు తీర్చే స్వయం సమృద్ధితో కూడిన గ్రామాలు ఉండాలని ఆమె అనేవారు.
1982లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించింది. రిచర్డ్ అటెన్‌బరో నిర్మించిన గాంధీ చిత్రానికి కావల్సిన సమాచారాన్ని చాలా వరకు మీరా బెన్ అందచేసినట్లు ‘ది న్యూ యార్క్ టైమ్స్’ కథనం పేర్కొంది.
అదే ఏడాది ఆమె ఆస్ట్రియాలో తుది శ్వాస విడిచారు. మీరాబెన్‌ను తొలి భారతదేశపు 'ఎకో ఫెమినిస్ట్' అని అంటారని ఆకాశవాణి మాజీ స్టేషన్ డైరెక్టర్ నాగసూరి వేణుగోపాల్ అంటారు. ఆయన గాంధేయవాదంపై అనేక రచనలు చేశారు.

ఫొటో సోర్స్, Mani Bhavan Gandhi Sangrahalaya/FACE BOOK
సరళ బెన్‌గా మారిన క్యాథరీన్ మేరీ హీల్మన్
"మానవత్వానికి రంగు, జాతి, రాజకీయం ఉండదు. ప్రభుత్వం న్యాయంగా పోరాటం చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలనుకుంటే నాకు చెప్పేందుకు ఏమీ లేదు. విపత్తు సమయంలో ప్రతిఘటించేవారు దాని పరిణామాలనూ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. చుట్టు పక్కల అందరూ అనారోగ్యంతో, కరవుతో ఇబ్బంది పడుతుంటే నేను ఆశ్రమంలో కూర్చుని ఉండలేను. ఈ విషయంలో నేను నా అంతరాత్మను అనుసరిస్తాను కానీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని కాదు" అని ఆమె సమాధానమిచ్చారు.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి మద్దతిచ్చినందుకు బ్రిటిష్ పాలకులు నియంత్రించాలని చూసినప్పుడు ఒక మహిళ చెప్పిన సమాధానం ఇది. ఆమె భారతీయ మహిళ కూడా కాదు.
ఆమె క్యాథరీన్ మేరీ హీల్మన్. ఆ తరువాత సరళ బెన్‌గా మారారు.
1901లో లండన్‌లో జన్మించిన ఆమె హిస్టరీ, ఇంగ్లీష్, భౌగోళిక శాస్త్రం,ఫ్రెంచ్, జర్మనీ నేర్చుకుని మధ్య తరగతి కుటుంబానికి చెందిన మహిళ.
మోహన్ సింగ్ మెహతా అనే భారతీయ అధికారి దగ్గర గాంధీ గురించి విన్న ఆమె భారతదేశానికి వచ్చారు. దేశంలో నిరక్షరాస్యత , అంటరానితనాన్ని రూపుమాపేందుకు గాంధీ చేసిన కృషిని తెలుసుకున్నారు.
ఆమె భారత్ వచ్చిన కొత్తలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒక పాఠశాలలో పని చేసేవారు. కానీ, ఉత్తరాదిలో అమలులో ఉన్న పరదా, సామాజిక పరిస్థితుల్లో ఆమె ఇమడలేకపోయారు. అక్కడ నుంచి బయటపడి ఆమె భారత్‌లో ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఇలా రాసుకున్నారు.
"ఇరుకైన మనస్తత్వాలు ఉన్న రాష్ట్రం నుంచి బయటపడి ఉత్తర భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లో పర్యటిస్తుంటే కొత్తగా ఊపిరి తీసుకున్నట్లుగా అనిపించింది" ఇది అప్పటి సామాజిక పరిస్థితులకు దర్పణం పడుతోందని ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ అన్నారు.

ఫొటో సోర్స్, NEW SOUTHWALES STATE LIBRARY
మూడేళ్ళ పాటు విద్యా భవన్‌లో పనిచేసిన తర్వాత భారతదేశం అంతా పర్యటించి చివరకు వార్ధా ఆశ్రమం చేరుకున్నారు. అక్కడే ఆమె వినోబా భావేను కూడా కలిశారు. తన పేరును సరళగా మార్చుకున్నారు.
ఆమె ఆరోగ్యం కోసం 1941లో హిమాలయాల్లో ఉన్న చనౌదా ఆశ్రమంకు వెళ్లారు. హిందీలో ప్రావీణ్యం సంపాదించారు. నెమ్మదిగా నూలు వడకడం, నేయడం మొదలుపెట్టారు. ఆ ప్రాంత సౌందర్యానికి ఆకర్షితురాలై అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు.
1942లో గాంధీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్‌తో సంబంధం ఉన్న అందరినీ అరెస్ట్ చేయడం ప్రారంభించారు.
సరళ ఈ నిరసనలకు దూరంగా ఉంటూ స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు సహకారం అందిస్తూ ఉండేవారు. వారికి ఆహారం, ఔషధాలు, న్యాయ సలహాలు ఇవ్వడం, సందేశాలు చేరవేయడం లాంటి పనులు చేస్తూ ఉండేవారు.
సరళ ఇంగ్లీష్ మహిళ కావడంతో ఆమెను అరెస్టు చేయలేదు. కానీ, ఆమె కదలికల పై నిఘా పెట్టమని మాత్రం ఆదేశించారు.
బ్రిటిష్ అధికారుల ఆదేశాలకు లొంగకపోవడంతో ఆమెను అరెస్టు చేసి అల్మోరా జైలుకు పంపారు ఆమె వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఆమెకు మూడు నెలల జైలు శిక్ష విధించారు.
కస్తూర్బా మరణం తర్వాత మెమోరియల్ ఫండ్ కోసం సెప్టెంబరు 1944 నాటికి ఆమె రూ. 45,000 విరాళాలు సేకరించారు.
ఆమెను తిరిగి అరెస్టు చేసి ఒక ఏడాది పాటు జైలు శిక్ష విధించారు. ఆమె పర్యటనలను ఆపేస్తే విడుదల చేస్తామని చెప్పారు. అయితే, ఆమె మాత్రం అందుకు అంగీకరించకపోవడంతో ఆమెను లక్నోలో జైలుకు పంపారు.
ఆమె శక్తిని పూర్తిగా గ్రామీణ మహిళల సంక్షేమానికి, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేశారని నాగసూరి వేణుగోపాల్ అంటారు. ఆమె లింగ వివక్షను రూపుమాపేందుకు కూడా పని చేశారు. భావే భూదాన్ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. ఆమె ఆశ్రమంలో శిక్షణ పొందిన వారు మరిన్ని చిన్న ఆశ్రమాలు ప్రారంభించడం మొదలుపెట్టారు.
సరళాబెన్ 1950, 60 దశాబ్దాలలో చండి ప్రసాద్ భట్, సుందర్ లాల్ బహుగుణ, విమలా బహుగుణ, రాధాభట్ వంటి ఎంతోమంది సామాజిక కార్యకర్తలను తీర్చిదిద్దారని వేణుగోపాల్ అన్నారు.
ఆమె తండ్రి తిరిగి తమ దేశానికి రమ్మని అడిగినా కూడా తన దేశానికి వెళ్లకుండా భారతీయుల కోసమే పని చేశారు.
"ప్రపంచం కళ్ళు తెరుచుకోని సమయంలో పర్యావరణ భావనను గాంధీజీ, కుమారప్ప ప్రతిపాదిస్తే.. ఆ భావనలను ఆచరించడమే కాక ప్రచారం చేసిన మహిళలు మీరాబెన్, సరళాబెన్" అని నాగసూరి వేణుగోపాల్ అన్నారు.
ఆమె 1982 జులై 6న సరళ బెన్ మరణించారు. గాంధేయవాదులను నిజాయితీగా ఉండమని సందేశాన్నిచ్చారు.
"ఈ మహిళలతో పాటు దేశం కోసం కృషి చేసిన వారు చేసిన పనులు, చెప్పిన మాటలు నేటికీ భారతీయులకు వినిపిస్తూనే ఉంటాయి. మనం వినగలిగితే" అని రామచంద్ర గుహ అంటారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి పర్యటన కోసం సామాన్యుల కార్లు ఎందుకు? సీఎంకు ప్రత్యేక కార్లు ఉండవా?
- కాకాణి Vs అనిల్: 1960ల నుంచీ నెల్లూరు రాజకీయాల్లో వర్గ పోరు చరిత్ర ఇదీ..
- 7 లక్షల జనాభా ఉన్న చిన్న దేశంతో చైనా ఒప్పందం: భయపడుతోన్న ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికా...
- ఇళయరాజా: నరేంద్ర మోదీని అంబేడ్కర్‌తో ఎందుకు పోల్చారు? 'భారత రత్న' ఇవ్వాలని ఎవరు డిమాండ్ చేశారు?
- నెహ్రూ-లియాఖత్ ఒప్పందం ఏంటి? సర్దార్ పటేల్, శ్యామ ప్రసాద ముఖర్జీ దీనిని ఎందుకు వ్యతిరేకించారు?
- అజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా: మసీదుల్లో మైకులు ఇప్పుడు ఎందుకు వివాదంగా మారాయి? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













