7 లక్షల జనాభా ఉన్న చిన్న దేశంతో చైనా ఒప్పందం: భయపడుతోన్న ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికా...

ఫొటో సోర్స్, Getty Images
చైనా, సోలోమన్ దేశంతో ఒక భద్రతా ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ఒప్పందం గురించి ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికా దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
పసిఫిక్ మహాసముద్ర ద్వీప దేశమైన సోలోమన్‌తో ఈ వారమే చైనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే, అక్కడ చైనా నావిక స్థావరాన్ని నిర్మిస్తుందేమో అనే భయం ఈ దేశాల్లో పెరిగింది.
సోలోమన్ దీవులకు ఎక్కువగా సహాయపడే ఆస్ట్రేలియా, ఈ ఒప్పందాన్ని అడ్డుకునేందుకు చివరివరకు ప్రయత్నించింది. కానీ, విఫలమైంది.
పసిఫిక్ రీజియన్‌లోని శాంతి, సామరస్యాలకు ఈ ఒప్పందం వల్ల ఎలాంటి హాని కలగదని సోలోమన్ ప్రధాని మనాసె సోగోవరె అన్నారు.
ఒప్పందంలోని నిబంధనలను తాను వెల్లడించబోనని ఆయన చెప్పారు. జాతి ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఒప్పందంలోని లీకైన ముసాయిదా ప్రకారం, సోలోమన్ దీవుల్లో ఉండటానికి చైనా యుద్ధనౌకలకు అనుమతి ఉంటుంది. ఉద్రిక్త పరిస్థితులు చెలరేగినప్పుడు పరిస్థితులు అదుపులోకి తీసుకురావడానికి చైనా, తమ భద్రతా బలగాలను ఇక్కడికి పంపవచ్చు. ఈ ముసాయిదాను ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ధరించింది.
దాదాపు 7 లక్షల జనాభా కలిగిన సోలోమన్... అనేక ద్వీపాలతో కలగలిసి ఏర్పడిన చిన్న దేశం. ఈ దీవుల్లో భారీ అగ్నిపర్వతాలు ఉంటాయి.
ప్రధానమంత్రి సోగోవరెకు వ్యతిరేకంగా కొన్నేళ్లుగా ఇక్కడ నిరసనలు జరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్‌లో రాజధాని హోనియారాలో జరిగిన అల్లర్లను ఆపడానికి ఆస్ట్రేలియా ఇక్కడికి భద్రతా బలగాలను పంపించింది. ఇదే తరహాలో ఇప్పుడు చైనా కూడా తమ బలగాలను ఇక్కడకు పంపవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
సోలోమన్ దీవులతో చైనా సంబంధాలు
సోలోమన్ ప్రభుత్వం, 2019లో తైవాన్‌తో దౌత్యపర సంబంధాలను తెంచుకొని చైనాతో జట్టు కట్టింది.
తైవాన్, సోలోమన్ దేశాల మధ్య 36 ఏళ్లుగా దౌత్యసంబంధాలు ఉన్నాయి. కానీ, ఏ దేశమైనా తమతో దౌత్య సంబంధాలను కోరుకుంటే... తైవాన్‌ను అధికారికంగా గుర్తించడం మానేయాలంటూ చైనా చెబుతోంది.
గత ఏడాది నవంబర్‌లో ఇక్కడ భారీ నిరసనలు జరిగాయి. ప్రధానమంత్రిని తప్పించాలంటూ నిరసనకారులు పార్లమెంట్‌ను ముట్టడించారు. మూడు రోజుల పాటు ఈ నిరసనలు కొనసాగాయి.
రాజకీయంగా బలపడటానికి ప్రధాని... చైనా నుంచి డబ్బు తీసుకుంటున్నారని, ఆయన విదేశీ శక్తుల కోసం పనిచేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి.
ఆర్థికంగా చైనా అగ్రరాజ్యం కాబట్టి ఆ దేశంతో దౌత్యపర సంబంధాలను పటిష్టం చేసుకున్నట్లు ప్రధాని సోగోవరె చెప్పారు.
సోషల్ ఆర్డర్‌ను నిర్వహించడానికి సంబంధించిన నిబంధనలు ఆ ఒప్పందంలో ఉన్నట్లు చైనా విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మంగళవారం ధ్రువీకరించారు.

ఆస్ట్రేలియా విదేశాంగ విధానం వైఫల్యం
ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిస్ పైన్ దీనిపై మాట్లాడుతూ... '' ఈ ఒప్పందం చాలా నిరాశపరిచింది. ఒప్పందం పారదర్శకత గురించి ఆందోళన చెందుతున్నామని'' అన్నారు.
ఇక్కడి భద్రతా అవసరాలను తీర్చడానికి పసిఫిక్ రీజియన్ సరిపోతుందని తాము నమ్ముతున్నట్లు చెప్పారు.
సోలోమన్, చైనా మధ్య జరిగిన ఈ డీల్‌ను గత 80 ఏళ్లలో విదేశాంగ విధానంలో జరిగిన అతిపెద్ద వైఫల్యంగా ఆస్ట్రేలియా ప్రతిపక్షాలు పిలుస్తున్నాయి.
ఆస్ట్రేలియాలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిస్ కష్టాలు అధికం అయ్యాయి. సోలోమన్ దీవులతో దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయనే అంశాన్ని ఆయన ఖండించారు.
సోలోమన్ దేశాల నేతలు ఏం చేయాలో, ఏం చేయకూడదో తాను నిర్దేశించలేనని ఆయన అన్నారు.
ఈ ఒప్పందంపై న్యూజీలాండ్ విదేశాంగ మంత్రి ననాయ మహుతా కూడా విచారం వ్యక్తం చేశారు.
చైనాతో భద్రతా ఒప్పందం చేసుకోబోతున్నట్లు సోలోమన్ గత నెలలోనే ధ్రువీకరించింది.
సోలోమన్ దీవులకు కేవలం 2000 కి.మీ దూరంలో ఉన్న ఆస్ట్రేలియాకు ఈ ఒప్పందంతో కష్టాలు పెరిగాయి.
రాబోయే రోజుల్లో అమెరికా జాతీయ భద్రతా మండలి అధికారులు కూడా అత్యున్నత స్థాయి చర్చల కోసం సోలోమన్ దీవులకు వెళ్లనున్నారు.
సోలోమన్ దీవుల్లో చైనా జోక్యం పెరిగిపోవడంతో తమ రాయబార కార్యాలయాన్ని తెరవాలని అమెరికా నిర్ణయించుకుంది. 1993 నుంచి ఈ రాయబార కార్యాలయం మూసి ఉంది.
''ఇక్కడి రాజకీయ, వ్యాపారవేత్తలతో సంబంధాలను ఏర్పరచుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. ఇది నిజంగా ఆందోళన కలిగించే చర్య'' అని అమెరికా అధికారి ఒకరు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నెహ్రూ-లియాఖత్ ఒప్పందం ఏంటి? సర్దార్ పటేల్, శ్యామ ప్రసాద ముఖర్జీ దీనిని ఎందుకు వ్యతిరేకించారు?
- అజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా: మసీదుల్లో మైకులు ఇప్పుడు ఎందుకు వివాదంగా మారాయి? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- ఇంద్రవెల్లి ఘటనకు 41ఏళ్లు: ‘స్వతంత్ర భారత జలియన్‌వాలా బాగ్’ కథ ఇదీ
- మనకు తగినంత విటమిన్-డి అందాలంటే ఏ సమయంలో, ఎంతసేపు ఎండలో ఉండాలి
- లీటర్ పెట్రోల్ రూ.373, డీజిల్ 329.. ఆందోళనకు దిగిన ప్రజలపై పోలీసుల కాల్పులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














