భారత్ చైనాపై ఆధారపడడం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు ఎందుకు

ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫిబ్రవరి 5న హైదరాబాద్‌లో 216 అడుగుల ఎత్తున్న రామానుజాచార్యుని విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ విగ్రహాన్ని 'స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ (సమతామూర్తి)'గా మోదీ ప్రభుత్వం అభివర్ణిస్తోంది. ''స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, చైనాలో తయారైంది. ఈ ఆధునిక భారతం, చైనాపై ఆధారపడుతోందా?'' అని ఫిబ్రవరి 9న చేసిన ట్వీట్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
మీడియా నివేదికల ప్రకారం, ఈ సమతామూర్తి విగ్రహాన్ని చైనాకు చెందిన 'ఏరోసన్ కార్పొరేషన్' తయారు చేసింది. రాహుల్ లేవనెత్తిన ఈ ప్రశ్నకు కేంద్ర సాంస్కతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు.
''సమతామూర్తి విగ్రహ నిర్మాణంలో ప్రభుత్వ ప్రమేయం లేదు. ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమం. దీని తయారీని 8 సంవత్సరాల క్రితమే ప్రారంభించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ క్యాంపెయిన్ ప్రారంభం కాకముందే ఈ విగ్రహ తయారీ ప్రారంభమైంది'' అని ఆయన బదులిచ్చారు.
ఈ వివాదం సంగతి పక్కన పెడితే... భారత్‌లో లక్ష్మీ, దుర్గా దేవి విగ్రహాల నుంచి గాలిపటాల మాంజా వరకు అన్నిటినీ చైనా విక్రయిస్తోందనే విషయం చాలాకాలంగా వినిపిస్తోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
చైనాకు ప్రత్యామ్నాయం లేదు
అన్ని విషయాల్లో శత్రువుపై ఆధారపడటాన్ని దౌత్యపరంగా బలహీనతగా పరిగణిస్తారు. ఒకవేళ చైనాను భారత్ శత్రువుగానే పరిగణిస్తున్నట్లతే... భారత్ చాలా విషయాల్లో ఎక్కువగా చైనాపై ఆధారపడుతోందన్నది కూడా ఒక చేదు నిజం.
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భారత్ కూడా ఉంది. కానీ అలా జరగడం లేదు.
వ్యూహాత్మక సామర్థ్యాల ద్వారా కాకుండా దేశాలన్నీ ఆర్థిక పరిపుష్టి కారణంగా ఇక గుర్తింపు పొందుతాయని 2017 ఆగస్టు 3న డోక్లామ్ సంక్షోభంపై అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. భారత్‌లో పెరుగుతోన్న ఆర్థిక పెట్టుబడుల్లో ఎక్కువ శాతం చైనా నుంచే వస్తున్నట్లు ఆమె చెప్పారు.
''2014 మే నెలకు ముందు చైనా పెట్టుబడులు 116 బిలియన్ డాలర్లు. కానీ ఇప్పుడు అవి 160 బిలియన్ డాలర్లకు పెరిగాయి. భారత్‌లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇక్కడ వారి ముప్పు ఎక్కువగా ఉంది'' అని ఆమె పేర్కొన్నారు.
2020 ఏప్రిల్‌లో ఎల్‌ఏసీ వద్ద ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత, 2017లో సుష్మా స్వరాజ్ చెప్పిన దానికి భిన్నంగా మోదీ సర్కారు చర్యలు తీసుకుంది. చైనా నుంచి వచ్చే పెట్టుబడులపై నిఘా పెంచిన భారత ప్రభుత్వం... చైనా నుంచి దిగుమతులను మాత్రం తగ్గించలేకపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
రికార్డు వ్యాపారం
కరోనా మహమ్మారి కారణంగా సరఫరా వ్యవస్థకు అంతరాయం కలిగినప్పుడు చైనాపై ఆధారపడటం పెరిగింది. 2021లో కూడా చైనా నుంచి భారత్‌కు దిగుమతులు పెరిగినట్లు గత నెలలో విడుదలైన 'వాణిజ్య డేటా' ప్రకారం తెలుస్తోంది.
భారత్, చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతోన్న సమయంలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్యం కూడా పెరుగుతోంది. పెరుగుతోన్న వాణిజ్యం ఆధారంగా ఇరు దేశాల మధ్య పరిస్థితులు సర్దుకున్నాయని చెప్పలేం.
భారత్‌తో వ్యాపారానికి సంబంధించిన డేటాను 'ద చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ (జీఏసీ)' సంస్థ జనవరిలో విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం, 2021లో చైనాతో భారత వాణిజ్యం 125.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
చైనాతో 100 బిలియన్ డాలర్లకు పైగా వాణిజ్యం జరగడం ఇదే తొలిసారి. ఇందులో భారత దిగుమతులు 97.5 బిలియన్ డాలర్లు కాగా... ఎగుమతులు 28.1 బిలియన్ డాలర్లు. ఎగుమతులు, దిగుమతుల పరంగా చైనాతో ఇదే రికార్డు వాణిజ్యం.
2019తో పోలిస్తే మహమ్మారి కారణంగా 2020లో చైనాతో భారత వాణిజ్యం తగ్గింది. చైనా నుంచి భారత్‌లోకి దిగుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. 'వాణిజ్య లోటు' అనేది భారత్‌కు ఎప్పటి నుంచో ఉన్న ఆందోళన. ఇప్పుడు ఇది అంతం కాకపోగా పైపెచ్చు పెరిగిపోతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచమంతా ఆధారపడుతోంది
భారత్ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం చైనాపై ఆధారపడటం పెరిగిపోయింది. విలీ షిహ్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్. ఆయన అమెరికా, చైనా సరఫరా గొలుసు అంశంపై చాలా రచనలు చేశారు.
''తయారీ రంగంలో ప్రపంచం మొత్తం చైనాపై ఆధారపడుతోంది. వైద్యసామగ్రి సరఫరాకే ఇది పరిమితం కాలేదు. అర ట్రిలియన్ ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్, బొమ్మలు ఇలా ప్రతిదీ చైనానే ఎగుమతి చేస్తోంది. ఒకవేళ మీరు చైనాతో తలపడాలనుకుంటే, దానివల్ల ఎదురయ్యే పర్యావసానాలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి'' అని 2020 ఏప్రిల్ 24న 'ద అట్లాంటిక్'కు రాసిన ఒక ఆర్టికల్‌లో ఆయన పేర్కొన్నారు.
గత ఏడాదితో పోలిస్తే భారత్, చైనాల మధ్య ఎగుమతులు, దిగుమతులు రెండూ పెరిగాయి. కానీ వాణిజ్య లోటు మాత్రం భారత్ వైపే ఉంది. వాణిజ్య లోటు అంటే... చైనా కంటే భారత్ అధికంగా కొనుగోలు చేయడం, తక్కువగా అమ్మడం. చైనా నుంచి భారత దిగుమతులు 46.2 శాతం పెరిగాయి. ఎగుమతుల్లో కూడా 34.2 శాతం పెరుగుదల నమోదైంది.
ఎలక్ట్రానిక్స్, మెకానికల్ యంత్రాల పరికరాలతో పాటు చాలా రకాల రసాయనాలను కూడా చైనా నుంచే భారత్ కొనుగోలు చేస్తుంది. భారత్‌లో ఫార్మా పరిశ్రమకు ఈ రసాయనాలు చాలా ముఖ్యం. వీటితో పాటు విడిపరికరాలు, మెడికల్ సామగ్రి కూడా చైనా నుంచే తెప్పించుకుంటుంది.
భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ వస్తువుల దిగుమతులు 2021లో మరింతగా పెరిగాయి. ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌లతో పాటు చైనా నుంచి ఎసిటిక్ యాసిడ్ దిగుమతి రికార్డు స్థాయిలో పెరిగింది. భారత్ ప్రధానంగా బియ్యం, కూరగాయలు, సోయాబీన్స్, పండ్లు, పత్తి, సీఫుడ్‌ను చైనాకు విక్రయిస్తుంది. పూర్తిగా తయారైన వస్తువులను చైనాకు భారత్ అమ్మదు.
''భారత్‌లోని ఫార్మా పరిశ్రమలో వినియోగించే 50 నుంచి 60 శాతం రసాయనాలు, ఇతర సామగ్రి చైనా నుంచి దిగుమతి చేసుకున్నవే'' అని చైనాలోని అధికార కమ్యూనిస్టు పార్టీకి ప్రతినిధిగా పరిగణించే ఇంగ్లిష్ వార్తా పత్రిక 'గ్లోబల్ టైమ్స్' రాసుకొచ్చింది.
జీఏసీ ప్రకారం... 2021లో చైనాకు భారత్, 15వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.
గత ఐదేళ్ల డేటాను పరిశీలిస్తే, చైనాతో భారత వాణిజ్యలోటు క్రమంగా పెరుగుతున్నట్లు మనకు అర్థమవుతుంది. 2017లో 51 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు, 2021 నాటికి 69.4 బిలియన్ డాలర్లకు పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
సరిహద్దు ఉద్రిక్తతలు కూడా వాణిజ్యాన్ని తగ్గించలేకపోయాయి
ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలోనూ చైనా నుంచి భారత్‌కు దిగుమతులు పెరుగుతున్నాయి. 2020 ఏప్రిల్‌లో వాస్తవాధీన రేఖ వద్ద సైనిక ప్రతిష్టంభణ ఏర్పడిన తర్వాత... సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య మిగిలిన సంబంధాలు కూడా ముందులా ఉండబోవని చైనాకు భారత్ స్పష్టంగా చెప్పింది.
మోదీ సర్కారు పలు ఆంక్షలు విధించడం వల్ల చైనా నుంచి పెట్టుబడులు తగ్గిపోయాయి. 5జీ ట్రయల్స్ నుంచి కూడా చైనాను పక్కకుబెట్టింది. 200 కంటే ఎక్కువ యాప్స్‌పై భారత్ నిషేధం విధించింది. భారత్‌లోని చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు 'షియోమీ'పై ఈ ప్రభావం పడింది. మిగతా చైనీస్ కంపెనీలు కూడా ఆంక్షలపై తీవ్ర అభ్యంతరాలను తెలిపాయి.
చైనాపై భారత్ ఆధారపడటం పెరిగిపోవడం గురించి బీబీసీ హిందీతో జేఎన్‌యూలోని సెంటర్ ఫర్ చైనీస్ స్టడీస్ ప్రొఫెసర్ బీఆర్ దీపక్ మాట్లాడారు.
''భారత్‌లో చైనా మొబైల్ మార్కెట్ చాలా పెద్దది. మొబైల్ మార్కెట్‌లో 55 నుంచి 56 శాతం వాటాను చైనా కలిగి ఉంది. దీని హోరులో ఇప్పుడు శాంసంగ్ కంపెనీ వెనుకబడింది. ఢిల్లీ మెట్రోలో కూడా చైనా భాగస్వామ్యమైంది. ఎస్‌యూజీసీ (షాంఘై అర్బన్ గ్రూప్ కార్పొరేషన్) అనే కంపెనీ ఢిల్లీ మెట్రోలో పని చేస్తోంది.''
''చైనా నుంచి ఔషధ ముడిపదార్థాలను భారత్ దిగుమతి చేసుకుంటుంది. ఈ అంశంలోనూ భారత్, చైనాపై పూర్తిగా ఆధారపడింది. గత నాలుగు దశాబ్ధాలుగా పాశ్చాత్య సాంకేతికను కాపీ కొడుతోన్న చైనా దాన్ని చౌకగా విక్రయిస్తోంది'' అని ఆయన చెప్పుకొచ్చారు.
తన హయాంలో డొనాల్డ్ ట్రంప్, చైనాతో వాణిజ్య యుద్ధం చేశారు. అయినప్పటికీ ఆ రెండు దేశాల మధ్య వాణిజ్యం 2021లో 755.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2021లో ఇది 28.7 శాతం పెరిగింది. అందులో అమెరికా ఎగుమతులు 179.53 బిలియన్ డాలర్లు మాత్రమే. 2021లో చైనా మొత్తం విదేశీ వాణిజ్యం 6 ట్రిలియన్ డాలర్లు కాగా, అందులో 12 శాతం అమెరికాదే. ప్రపంచంలోనే అమెరికా, చైనా దేశాలు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య
- ఏబీజీ షిప్‌యార్డ్ కేసు: ఇప్పటివరకు దేశంలో అతిపెద్ద బ్యాంక్ మోసం ఇదేనా, అసలేం జరిగింది?
- పదో తరగతి పాసైన వారికి ఉచిత శిక్షణ, రైల్వేలో ఉద్యోగ అవకాశం
- యుక్రెయిన్ యుద్ధ సమయంలో జరిగిన ఆత్మహత్యలు ఎందుకు రహస్యంగా మిగిలిపోయాయి
- వైజాగ్‌లోనూ ఓ ‘తాజ్‌మహల్’ ఉంది.. దాని వెనకున్న ప్రేమకథ ఇది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














