Rail Kaushal Vikas Yojana: పదో తరగతి పాసయ్యారా.. అయితే ఖర్చులేకుండా రైల్వే జాబ్, ఉపాధి పొందే మార్గం ఇదీ..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నాగ సుందరి
- హోదా, బీబీసీ కోసం
దేశ యువత స్వయం సాధికారతను సాధించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన స్కీము రైల్ కౌశల్ వికాస్ యోజన. స్థానిక యువతకు స్కిల్ ట్రైనింగ్ అందించే ఉద్దేశంతో రైల్వే మంత్రిత్వ శాఖ 'రైల్ కౌశల్ వికాస్ యోజన-Rail Kaushal Vikas Yojana' (ఆర్‌కేవీవై-Rail KVY)కు శ్రీకారం చుట్టింది.
నాలుగు అంశాల్లో మూడు వారాల పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సెంటర్లలో శిక్షణ అందిస్తారు. అది పూర్తయ్యాక ప్లేస్‌మెంట్ కల్పిస్తారు. ఎవరైనా స్వయం ఉపాధి పొందాలనుకున్నా అందుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తారు.
* శిక్షణ పూర్తిగా ఉచితం.
* దేశవ్యాప్తంగా రైల్వేలకు చెందిన 75 సంస్థలు ఈ శిక్షణను అందిస్తాయి.
*మెషినిస్టు, వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ అనే నాలుగు ట్రేడ్‌లలో శిక్షణ ఇస్తారు. జోనల్ అవసరాలకు తగిన విధంగా భవిష్యత్తులో ఇతర విభాగాలకు కూడా శిక్షణను విస్తరించాలని అనుకుంటున్నారు.
* మారుమూల ప్రాంతాలలోని యువతకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా మొబైల్ యూనిట్ల ఏర్పాటు ఆలోచన కూడా ఉంది.
* ఇది మొత్తం వంద గంటలు లేదా మూడు వారాల శిక్షణ కార్యక్రమం. ఇందులో ప్రాక్టికల్, థియరీ రెండూ ఉంటాయి.
* రైల్వేలకు పనికివచ్చే ఉద్యోగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి శిక్షణ ఇస్తారు.
* భారతీయ రైల్వేలో అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తారు. లేదా ఆ రంగంలోని వివిధ సంస్థల్లో ఉపాధి అవకాశాలు చూపిస్తారు.
* ఎవరైనా సొంతంగా ఉపాధి పొందాలనుకుంటే వాళ్ల అవసరాలను బట్టి సహాయం అందిస్తారు. టూల్ కిట్లు ఇవ్వడం, లోన్లు తీసుకోవడంలో అధికారులు సాయం చేస్తారు.
* మూడేళ్లలో 50 వేల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అర్హతలు, నిబంధనలు..
* 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయసు ఉన్న అభ్యర్థులు అర్హులు.
* పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
* భారతీయ పౌరులై ఉండాలి.
* మంచి ఫిట్‌నెస్ ఉండాలి. రిజిస్టర్డ్ ఎంబీబీఎస్ వైద్యుడి నుంచి చూపు, వినికిడి, మానసిక ఆరోగ్యం బాగున్నాయనే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ దరఖాస్తు పత్రంతో పాటు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థికి ఎలాంటి అంటువ్యాధులు లేవనే ధ్రువీకరణ కూడా అవసరం.
* మెట్రిక్యులేషన్ (పదో తరగతి)లో వచ్చిన మార్కుల ద్వారా దరఖాస్తుదారులను ఎంపిక చేస్తారు.
* ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు.
* అప్లికేషన్లు ఆన్‌లైన్లో కూడా తీసుకుంటారు.
* శిక్షణ ముగిసిన తర్వాత ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 'నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇనిస్టిట్యూట్' సర్టిఫికేట్లను అందజేస్తుంది.
ఆసక్తి ఉన్న వాళ్లు వెంటనే దరఖాస్తు చేయండి
ఆర్‌కేవీవై కొత్త నోటిఫికేషన్ ఫిబ్రవరి 7న (2022) విడుదలైంది.
దరఖాస్తు చేరాల్సిన చివరి తేదీ 21.2.22. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
శిక్షణ:
రైల్ కౌశల్ వికాశ యోజన నైపుణ్యాలను పెంచే శిక్షణా కార్యక్రమం.
రైల్వే మంత్రిత్వశాఖ, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ కింద దీన్ని అందిస్తున్నారు.
శిక్షణలో భాగంగా స్టైపెండ్, ఇతర అలవెన్సుల లాంటివేమీ ఇవ్వరు. ఈ స్కీము కింద రిజర్వేషన్లు లేవు. కుల,మతం, జాతి, తెగ ఇలాంటి తేడాలు లేకుండా శిక్షణను అందిస్తారు. ఒక ట్రేడ్‌లో ఒక పర్యాయం మాత్రమే అభ్యర్థిని అనుమతిస్తారు.
ట్రైనింగ్‌లో కొనసాగడానికి, సర్టిఫికేట్ పొందడానికి 75 శాతం హాజరు తప్పనిసరిగా అభ్యర్థికి ఉండాలి.
శిక్షణ పూర్తయిన తర్వాత పరీక్ష ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే సర్టిఫికేట్లు అందజేస్తారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు యువతకు ఈ స్కీము డిజైన్ చేశారు.
ఈ శిక్షణ పూర్తి చేసిన స్థానిక యువత ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి
రైల్ కౌశల్ వికాస్ యోజన వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసిన దరఖాస్తును ట్రైనింగ్ సెంటర్లకు పోస్టు ద్వారా పంపచ్చు.
ఫిట్టర్, వెల్డర్, మెషినిస్టు, ఎలక్ట్రీషియన్ నాలుగు ట్రేడ్లు ఉన్నాయి.
ఫిట్టర్, వెల్డర్ల శిక్షణ కోసం దరఖాస్తులను వర్క్‌షాపు ట్రైనింగ్ సెంటర్, ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ వర్క్‌షాప్ మేనేజర్, కారేజ్ అండ్ వాగన్ వర్కుషాప్, పెరంబూర్, చెన్నై- 600 023కు పంపించాలి.
మెషినిస్టు, ఎలక్ట్రీషియన్ల శిక్షణ కోసం దరఖాస్తులను వర్క్ షాప్ ట్రైనింగ్ సెంటర్, ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ వర్కుషాప్ మేనేజర్, సిగ్నల్ అండ్ టెలికమ్ వర్కుషాప్, పొదనూర్, కోయంబత్తూర్ -641023 అనే చిరునామాకు పంపించాలి.
ఫిట్టర్ అండ్ ఎలక్ట్రీషియన్లకు వర్క్‌షాప్ ట్రైనింగ్ సెంటర్, ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ వర్కుషాప్ మేనేజర్, సెంట్రల్ వర్కుషాప్, పొన్మలై, ట్రిచీ-620004 అనే అడ్రస్‌కు మీ దరఖాస్తులు పంపించాలి.
ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌కు మల్టీ డిసిప్లనరీ డివిజనల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ రైల్వే కాలనీ, హేమాంబికా నగర్, కల్లెకునంగారా పీవో, పాలక్కాడ్ - 678009, కేరళ అనే చిరుమానాకు దరఖాస్తు చేసుకోవాలి.
స్కీమ్ లక్ష్యం
భారత రైల్వేకు సంబంధించిన శిక్షణా సంస్థల ద్వారా పారిశ్రామిక రంగాలకు చెందిన విభాగాలలో శిక్షణతో పాటు టూల్ కిట్‌లు కూడా ఇచ్చి యువతకు ఉపాధి కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.
టూల్ కిట్ ఇవ్వడం ద్వారా వారి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడంతోపాటు స్వయం ఉపాధి అవకాశాలను కూడా ఈ శిక్షణ మెరుగుపరుస్తుంది.
ఆర్‌కేవివై ప్రోగ్రామ్‌కు ఇండియన్ రైల్వేస్ ప్రొడక్షన్ యూనిట్ అయిన బనారస్ లోకోమోటివ్ వర్స్క్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. కోర్సు కంటెంట్, ట్రైనింగ్ అసెస్మెంట్ ప్రక్రియ కూడా ఈ ప్రొడక్షన్ యూనిట్టే రూపొందిస్తుంది.
మరిన్ని వివరాల కోసం https://railkvy.indianrailways.gov.in/rkvy_userHome/ చూడొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
నిరుద్యోగ యువతకు ఇదొక మంచి అవకాశం
'ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు రైల్ కౌశల్ వికాస్ యోజన పేరుతో చేపట్టిన శిక్షణా కార్యక్రమం వారి స్కిల్ డెవలప్‌మెంట్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. నిరుద్యోగులు వారి ఆసక్తి బట్టి ఇందులో శిక్షణ కార్యక్రమాన్ని ఎంచుకుని ట్రైనింగ్ పొందవచ్చు.
శిక్షణ తరువాత వారు స్వయం ఉపాధి పొందవచ్చు. రైల్వేలో టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ సమయంలో ప్రాధాన్యత ఉంటుంది. వేరే సంస్థల్లో ఉద్యోగాలు ఉన్నా అవకాశాలు కల్పిస్తాం' అని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ సీహెచ్ రాకేష్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:
- పిల్లల పెళ్లి నాటికి రూ.71 లక్షలు పొందే మార్గం ఇది
- మొక్కల వ్యర్థాలు చేపలకు ఆహారం.. చేపల వ్యర్థాలు మొక్కలకు ఆహారం.. వృధా ఆహారాన్ని ఉపయోగించుకోవటం ఎలా?
- IPL-2022 వేలం: ఇషాన్ కిషన్‌కు రూ. 15.25 కోట్లు... దీపక్ చహర్, శ్రేయస్ అయ్యర్‌లకు జాక్‌పాట్
- యుక్రెయిన్ ఉద్రిక్తతలు: 'రష్యా ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చు' - అమెరికా హెచ్చరిక
- అమెరికాలో హత్యకు గురైన తెలుగు యువకుడు సత్యకృష్ణ చిత్తూరి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












