కోనసీమ రైల్వే లైన్‌: వందేళ్ల నాటి ఈ ప్రతిపాదన ఎందుకు ముందుకు కదలడం లేదు... కోనసీమలో రైలు కూత వినబడేదెన్నడు?

కోనసీమ రైలు
ఫొటో క్యాప్షన్, కోనసీమ రైల్వే లైను దశాబ్ధాలుగా హామీగా మిగిలింది.
    • రచయిత, శంకర్ వి
    • హోదా, బీబీసీ కోసం

"కోనసీమ రైల్వే లైన్‌ సాధిస్తాం''

"రాబోయే ఐదేళ్లలో కోనసీమలో రైల్వే కూత వినిపిస్తాం"

"కేంద్రంతో పోరాడి కాకినాడ-నర్సాపురం రైల్వే లైన్‌ను పూర్తి చేస్తాం."

ఇలాంటి మాటలు కోనసీమ వాసులు కొన్ని దశాబ్దాలుగా ప్రతీ ఎన్నికల్లోనూ వింటూనే ఉన్నారు. కానీ ఆ ప్రాంతవాసుల కల ఇంకా నెరవేర లేదు. ఈరోజు ఇండియన్ రైల్వే డే సందర్భంగా ఈ అభ్యర్థన మరోమారు బలంగా వినిపిస్తోంది.

లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన ఆనాటి అమలాపురం ఎంపీ జీఎంసీ బాలయోగి నుంచి ఆ తర్వాత కొందరు కొంత మేరకు ప్రయత్నం చేసినా అసలు లక్ష్యాన్ని మాత్రం చేరలేదు.

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులు రాక పోవడంతో పనులు ముందుకు సాగడం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు.

ఏపీ ప్రభుత్వం భూసేకరణ కోసం దాదాపు రూ.300 కోట్లు వెచ్చించాల్సి ఉన్న సమయంలో తగిన రీతిలో స్పందించడం లేదనే అభిప్రాయం కోనసీమ ప్రజా సంఘాల నుంచి వినిపిస్తోంది.

కోనసీమ రైలు
ఫొటో క్యాప్షన్, కోనసీమలో జల రవాణా ఇప్పటికీ కొనసాగుతోంది

బ్రిటీష్‌ కాలం నాటి ప్రతిపాదనలు..

ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి ప్రవాహం మూలంగా ఈ నదీ పాయల మధ్య ఓ ద్వీపం మాదిరిగా కోనసీమ ఉంటుంది. ఎటు నుంచి ఎటు వెళ్లాలన్నా నదులు దాటాల్సిందే.

తొలినాళ్లలో పంట్లు, బోట్లు ఆధారంగా గోదావరి దాటిన అక్కడి ప్రజలకు ప్రస్తుతం పలు వంతెనలు అందుబాటులోకి రావడంతో రోడ్డు రవాణా మెరుగుపడింది. కానీ రైల్వేలైన్ కోసం వారు తరతరాలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు.

బ్రిటీష్‌ హయంలో కాకినాడ నుంచి కోటిపల్లి వరకూ 1928లో మొదట రైల్వే లైన్‌ నిర్మించారు. కానీ కోటిపల్లి వద్ద వంతెన నిర్మించాల్సి ఉండడంతో అక్కడికే ఈ లైన్ పరిమితం అయిపోయింది.

ఆ తర్వాత 1940లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో ఈ రైల్వే లైన్ సామాగ్రి ఇతర ప్రాంతాలలో యుద్ధ అవసరాల కోసం తరలించారు.

కోనసీమ రైలు
ఫొటో క్యాప్షన్, వంతెనలు లేకపోవడంతో ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు.

రెండు దశాబ్దాల కిందట పునర్నిర్మాణం

కాకినాడ- కోటిపల్లి రైల్వే మార్గం సుమారు 6 దశాబ్దాల తర్వాత మళ్లీ పట్టాలెక్కింది. 1999లో నాటి రైల్వే మంత్రి, ప్రస్తుత పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కోనసీమ రైల్వే లైన్ కోసం శంకుస్థాపన చేశారు.

నాటి పార్లమెంట్ స్పీకర్ జీఎంసీ బాలయోగి ప్రతిపాదనల మేరకు ఈ రైల్వే లైన్ పనులకు మోక్షం కలిగింది. ఆ తర్వాత కాకినాడ నుంచి కోటిపల్లి వరకూ 45 కి.మీ. మేర రైల్వే ట్రాక్, స్టేషన్ల నిర్మాణం ఐదేళ్లలో పూర్తి చేశారు.

2004లో అధికారికంగా ఈ రైల్వే లైన్ ప్రారంభించారు.

అదే సమయంలో నవంబర్ 13, 2004న అమలాపురం రైల్వే స్టేషన్ నిర్మాణానికి నాటి రైల్వే శాఖ సహాయమంత్రి ఆర్.వేలు శంకుస్థాపన చేశారు.

కోటిపల్లి వద్ద గౌతమీ నదిపై వంతెన నిర్మాణం పూర్తి చేసి అమలాపురం వరకూ రైల్వే రాకపోకలకు త్వరలోనే మార్గం సుగమం చేస్తామని అప్పట్లో ఆయన ప్రకటించారు. కానీ ఆ తర్వాత పనులు ముందుకు సాగలేదు. నేటికీ కోటిపల్లి వద్ద వంతెన నిర్మాణ పనుల్లోనే ఉంది.

కోనసీమ రైలు
ఫొటో క్యాప్షన్, ఈ ప్రాంతంలో మూడు వంతెనల నిర్మాణం రైల్వేలకు కీలకం

మూడు వంతెనల నిర్మాణమే అసలైన వ్యయం

కోనసీమకి రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే రైల్వేలకి అనేక విధాలా లాభం ఉంటుందని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయాధారిత ప్రాంతం నుంచి కొబ్బరి, ఆక్వా ఉత్పత్తులు, ఇతర వ్యవసాయ సరుకుల రవాణాకి మార్గం సుగమం అవుతుంది.

అటు ఉత్పత్తిదారులకు రవాణా ఖర్చులు తగ్గడం ద్వారా ఉపశమనం, ఇటు రైల్వేలకు ఆదాయం సమకూరుతుంది. కానీ కాకినాడ నుంచి నర్సాపురం వరకూ రైల్వే లైన్ నిర్మాణం కోసం మూడుచోట్ల గోదావరిపై వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం పెరిగిన నిర్మాణ వ్యయం అంచనా ప్రకారం ఒక్కో వంతెనకు రూ. 300 కోట్లకు పైగా వెచ్చించాల్సి ఉంటుంది

కోటిపల్లి, బోడసకుర్రు, దిండి వద్ద ఈ రైల్వే వంతెనలను నిర్మించి కాకినాడ నుంచి నర్సాపురం అనుసంధానం చేయాలనే ప్రతిపాదనలు, ప్రణాళికలు వేశారు. కానీ దానికి అనుగుణంగా నిధులు కేటాయింపు జరగడం లేదన్నది స్థానికుల అభిప్రాయం.

"బాలయోగి స్పీకర్‌గా ఉన్న సమయంలో శంకుస్థాపన జరిగినప్పుడు రోడ్డు వంతెనలు పూర్తయినట్టేనని, రైల్వే లైన్ కూడా అయిపోతుందని అంతా ఆశించాం. కానీ అనూహ్యంగా ఆయన చనిపోయిన తర్వాత కేంద్ర స్థాయిలో తగిన ఒత్తిడి కనిపించలేదు. కొందరు ఎంపీలు ప్రయత్నించినా వారి ప్రయత్నాలు సరిపోలేదు. హామీలు తప్ప నిధులు రాలేదు." అని అమలాపురం పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ టీకే విశ్వనాథం బీబీసీతో అన్నారు.

"కేంద్రం ఎంతో కొంత నిధులు విడుదల చేసినా అవి మొదటి వంతెన పూర్తి చేయడానికి కూడా సరిపోలేదు. ప్రస్తుతం రెండు వంతెనల పనులు నిర్మాణం మధ్యలో ఉన్నాయి. వాటిని పూర్తి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రయత్నిస్తే కోనసీమ వాసుల కల నెరవేరుతుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

కోనసీమ రైలు
ఫొటో క్యాప్షన్, కోటిపల్లి రైల్వే స్టేషన్‌

మూడు రెట్లు పెరిగిన అంచనా వ్యయం

కోటిపల్లి నుంచి నర్సాపురం వరకూ కొత్త రైల్వే లైన్ 57.21 కిలోమీటర్ల మేర నిర్మాణం కోసం 2000-01 సం. రైల్వే బడ్డెట్ లోనే ఆమోదం తెలిపారు.

అప్పట్లో అంచనాల ప్రకారం వంతెనలు, రైల్వే లైన్ నిర్మాణం కోసం రూ. 710 కోట్లు అంచనా వ్యయంగా పేర్కొన్నారు. అయితే నిర్మాణంలో జరిగిన జాప్యంతో అంచనా వ్యయం మూడు రెట్లు పెరిగింది.

ప్రస్తుతం దానిని రూ. 2,192 కోట్లుగా అంచనా వేస్తున్నారు. అందులో 25 శాతం ఏపీ ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా భూసేకరణ భారం ఏపీ ప్రభుత్వం మోయాల్సి ఉంటుంది. సుమారు 110 ఎకరాలను సేకరించాల్సి ఉందని అంచనాలు వేశారు.

ఈ వ్యయంలో ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ ద్వారా రూ. 751 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 2.69 కోట్లు ఖర్చు చేయగా మరో రూ. 309 కోట్లు విడుదల చేయాల్సి ఉంది.

ఏపీ ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేస్తే తాము పనులు చేస్తామంటూ రైల్వేశాఖ అంటోంది. ఆరేళ్ల క్రితం ప్రారంభించిన కోటిపల్లి రైల్వే వంతెన నిర్మాణం 25 శాతం కూడా పూర్తికాలేదు.

" కోనసీమ వాసుల నిరీక్షణ ఫలించినట్లే అనిపించింది. కానీ కొన్నాళ్లుగా తాత్సారం జరుగుతుండడంతో ఆందోళన కలుగుతోంది. ఈ విషయంలో కేంద్రం చొరవ చూపాలి. నిధుల భారాన్ని రైల్వేశాఖ భరించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పందం మేరకు నిధులు విడుదల చేస్తే పనులకు ఆటంకాలు తొలగుతాయి.రైల్వే లైన్ ద్వారానే కోనసీమ అభివృద్ధి ఆధారపడి ఉంది. రోడ్డు మార్గం ద్వారా కొంత పురోగతి వచ్చింది. రైల్వే మార్గం వస్తే వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా పారిశ్రామిక రంగంలో కూడా కోనసీమ అడుగులు వేసేందుకు అవకాశం ఉంటుంది" అని కోనసీమ అభివృద్ధి సమితి అధ్యక్షుడు నేలపూడి స్టాలిన్ బాబు బీబీసీతో అన్నారు.

కోనసీమ రైలు
ఫొటో క్యాప్షన్, 2004లో అమలాపురం రైల్వే స్టేషన్‌ కు శంకుస్థాపన చేశారు.

రైలు బస్సు కూడా ఆగిపోయింది..

కాకినాడ నుంచి కోటిపల్లి వరకూ రైల్వే లైన్ పూర్తయిన తర్వాత రైలు బస్సు పేరుతో సింగిల్ బోగీ రైలును కొన్నాళ్ల పాటు నడిపారు. అయితే ఈ మార్గంలో రోడ్డు రవాణా అందుబాటులో ఉండడం, రైలు బస్సు రోజుకి ఒక్కసారి మాత్రమే రావడంతో అత్యధికులు అటు మొగ్గు చూపలేదు.

చివరకు ఆ రైలు బస్సు లాభదాయకం లేదనే కారణంతో నాలుగేళ్ల క్రితం రైల్వేశాఖ దీనిని నిలిపివేసింది. అప్పటి నుంచి కాకినాడ - కోటిపల్లి మధ్యలో నిర్మించిన రైల్వే స్టేషన్‌లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి.

కోటిపల్లి వంతెన పూర్తయితే కోనసీమ వాసులు ఎక్కువ మంది మొగ్గు చూపేందుకు అవకాశం ఉండేది. కానీ అక్కడ జాప్యం రైలు బస్సు మీద పడిందని స్థానికుడు ఎం.రాజగోపాల్ బీబీసీతో అన్నారు.

కోనసీమ రైలు
ఫొటో క్యాప్షన్, కోనసీమ వాసులు రైల్వే లైనుపై ఆశలు పెట్టుకున్నారు.

స్పందించని కోనసీమ ఎంపీ- త్వరలో పూర్తి చేస్తామన్న రైల్వేశాఖ

కోనసీమ రైల్వే అంశంపై అమలాపురం ఎంపీ చింతా అనురాధను బీబీసీ సంప్రదించింది. ఆమె ప్రయత్నాల గురించి అడగ్గా, ఇప్పుడేమీ చెప్పలేనని ఆమె అన్నారు. చాలాకాలంగా పెండింగులో ఉన్న సమస్య కదా అన్న ప్రశ్నకు కూడా తాను స్పందించలేనని తెలిపారు.

ఇక రైల్వే అధికారులు మాత్రం కోనసీమ రైల్వే లైన్ ప్రాజెక్టు పూర్తి అవుతుందనే ధీమా వ్యక్తం చేశారు.

"రైల్వే శాఖ ఈ పనులకు ప్రాధాన్యతనిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటే రాబోయే మూడేళ్లలో పూర్తవుతుంది" అని విజయవాడ డీఆర్ఎం కార్యాలయంలో పీఆర్వో వెల్లడించారు.

ఈ రైల్వేలైన్ విషయంలో గడిచిన మూడు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరగడం, కొంత కదలిక రావడం, ఆ తర్వాత మళ్లీ రకరకాల కారణాలతో ఆగిపోయిన పరిస్థితుల్లో తమ కల ఎప్పటికి నెరవేరుతుందోనని వారు నిస్పృహ వ్యక్తం చేస్తున్నారు.

వీడియో క్యాప్షన్, కోనసీమ రైల్వే లైన్ కార్యరూపం దాల్చడం లేదెందుకు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)