తైవాన్: లారీ పట్టాలపైకి రావడమే తైవాన్ రైలు ప్రమాదానికి కారణమా?

ఫొటో సోర్స్, EPA
తైవాన్‌లోని ఒక సొరంగం లోపల ప్రయాణికుల రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 50 మంది మరణించారు. మరో 200 మంది రైలులో చిక్కుకునిపోయి ఉంటారని చెబుతున్నారు.
ప్రమాదానికి గురైన ఈ రైలులో సుమారు 500 మంది ప్రయాణిస్తున్నారు. దారుణంగా ధ్వంసమయిన రైలు బోగీల నుంచి ప్రయాణికులను రక్షించేందుకు సహాయకులు చాలా కష్టపడాల్సి వస్తోంది.
సొరంగ ప్రవేశం దగ్గర పట్టాల మీద జారిపడిన ఒక నిర్మాణ రంగ వాహనాన్ని ఈ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఈ రైలులో మొత్తం 8 బోగీలు ఉన్నాయి.
తైవాన్ రాజధాని తైపై నుంచి తైతుంగ్ కి ప్రయాణిస్తున్న ఈ రైలులో వారాంతం సెలవుల కోసం ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఉన్నారు.
రైలు కిక్కిరిసి ఉండటంతో చాలా మంది రైలులో నిలబడే ఉన్నారు.

ఫొటో సోర్స్, Reuters
గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ 408 రైలును సురక్షితమైన వేగవంతమైన రైలుగానే పరిగణిస్తారు.
ఈ రైలులో 490 మంది ఉన్నట్లు నేషనల్ ఫైర్ ఏజెన్సీ తెలిపింది. అందులో 41 మంది మరణించారు. 60 మందికి గాయలయ్యాయి.
రైలు వెనక భాగంలో ఉన్న ప్రయాణికులు ఎటువంటి గాయాలు లేకుండా బయట పడగలిగారు. ఇప్పటి వరకు రైలు ముందు భాగంలో ఉన్న 4 బోగీల నుంచి 100 మందిని రక్షించారు. ఇప్పటికీ మరో 200 మంది లోపలే చిక్కుకుని ఉన్నారు.
"రైలు ఒక్కసారిగా ఊగినట్లు అనిపించేసరికి నేను కిందకి పడిపోయానని అర్ధమయింది. కిటికీ పగలగొట్టుకుని బయటకు వచ్చాం" అని ప్రమాదం నుంచి బయటపడిన ఒక మహిళ తైవాన్ యూడీఎన్ చానెల్‌తో చెప్పారు.
"నేను కింద పడిపోవడంతో తలకు గాయమై, రక్తం కారడం మొదలయింది" అని మరో మహిళ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ఇప్పుడు అక్కడ ఎలా ఉంది?
ప్రమాదానికి కారణాలేంటి అన్నదానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
రైలు ప్రమాదానికి కారణంగా భావిస్తున్న నిర్మాణ కంపెనీపై కేసు నమోదు చేయాలని, కన్‌స్ట్రక్షన్ సైట్ మేనేజర్‌ను అరెస్టు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
సంఘటనా స్థలంలో శిథిలాలను తొలగించే పనిని అధికారులు, సిబ్బంది కొనసాగిస్తున్నారు.
ప్రమాదం ఎలా జరిగింది?
ఈ ప్రమాదం స్థానిక కాలమానం ప్రకారం పొద్దున 9 గంటలకు జరిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని తైవాన్ అధ్యక్షుడు సై ఇంగ్ వెన్ చెప్పారు.
రైలు డ్రైవర్ మరణించినట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి.
పట్టాల పక్కన పసుపు రంగులో ఉన్న ఒక పెద్ద ట్రక్ పడి ఉన్నట్లు ఫొటోలను చూస్తే తెలుస్తోంది. ఈ సొరంగం ఉత్తరభాగం వైపు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే, గట్టు మీద నుంచి ఆ వాహనం ఎలా కింద పడిపోయిందనే వివరాలు తెలియలేదు.
ప్రమాదం నుంచి బయటపడిన వారు తమ సామాన్లు పట్టుకుని పట్టాల మీదుగా నడిచి వెళ్లే ఫొటోలు కూడా ఆన్ లైన్ లో కనిపించాయి. ప్రమాదంలో గాయాలయిన వారిని స్ట్రెచర్ల పై తీసుకుని వెళుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ రైలులో ప్రయాణిస్తున్న వారు చాలా మంది తైవాన్‌లో జరిగే "టోంబ్ స్వీపింగ్ ఫెస్టివల్"కు హాజరయ్యేందుకు వెళుతున్నారు.
మరణించిన తమ కుటుంబ సభ్యుల సమాధులను సందర్శించి వారికి నివాళులర్పించడం ఈ పండుగలో ఒక ఆచారం.
ఇది గత కొన్ని దశాబ్దాల్లో జరిగిన అత్యంత దారుణమైన ప్రమాదంగా చెప్పవచ్చు. తైవాన్‌లో 2018 లో జరిగిన భారీ రైలు ప్రమాదంలో 18 మంది మరణించారు.
తైవాన్‌లో 1991లో రెండు రైళ్లు ఢీకొని 30 మంది ప్రయాణికులు మరణించగా, 112 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదమే ఇప్పటి వరకు ఘోర ప్రమాదంగా చెబుతున్నారు. తాజా ప్రమాదంలో 50మంది చనిపోయారు.
ఇవి కూడా చదవండి:
- సెక్స్‌కు ఒకసారి ఒప్పుకుంటే... ప్రతిసారీ ఒప్పుకున్నట్లేనా?
- లాక్డౌన్: జనతా కర్ఫ్యూకి ఏడాది.. దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- రూ. 2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ ఆపేసింది... పెద్ద నోటు మళ్లీ రద్దవుతుందా?
- బ్యాంకుల సమ్మె ఎందుకు? మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తోంది?
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
- కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా?
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- కరోనా వైరస్ సోకినవారిలో కనిపించే లక్షణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








