వాలెంటైన్స్ డే: ‘వైజాగ్ తాజ్‌మహల్’ వెనుక దాగిన ప్రేమకథ తెలుసా

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విశాఖ బీచ్ రోడ్డులో భీమిలి వైపుగా వెళ్తుంటే చూడగానే ఆకట్టుకునే నిర్మాణశైలితో వందేళ్లు దాటిన ఒక కట్టడం మౌనంగా మనవైపు చూస్తున్నట్లు ఉంటుంది.
అది తన భార్యపై ప్రేమతో ఆమె మరణాంతరం ఒక జమీందారు నిర్మించిన కట్టడం. ఆ జమీందారు తన ప్రాణాలు పోయేంత వరకు అక్కడే గడిపారు.
అనకాపల్లి జమీందారు గోడే నారాయణ గజపతిరావు రెండవ కుమార్తెకు, కురుపాం జమీందారు రాజా వైరిచెర్ల వీరభద్ర బహదూర్‌కు 1895లో వివాహం జరిగింది. తర్వాత ఏడేళ్లకు ఆమె మరణించారు.

ఫొటో సోర్స్, V. Kishore Chandra deo
ఆమె ప్రేమను, జ్ఞాపకాలను రాజా వీరభద్ర బహదూర్ మర్చిపోలేకపోయారని కురుపాం సంస్థాన ప్రస్తుత వారసులు వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ బీబీసీకి చెప్పారు.
“రాణి లక్ష్మీ నరస్సాయమ్మ పట్టమహాదేవి అనకాపల్లి గోడే వంశ జమీందార్ల అమ్మాయి. ఆమెను మా తండ్రి గారి తాతగారైన వీరభద్ర బహదూర్ వివాహం చేసుకున్నారు. వివాహనికి ముందు వీరువురు ఒకరికి ఒకరు తెలియకపోయినా, వివాహానంతరం ప్రేమికుల్లానే జీవించారు.
కానీ ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె హఠాత్తుగా మరణించారు. ఆమె మరణాన్ని వీరభద్ర బహదూర్ తట్టుకోలేకపోయారు. చాలా రోజులు ఏం చేయాలో తెలియక కోటకే పరిమితమై., ప్రజలెవరికీ కనిపించలేదు. నిరంతరం ఆమె ఆలోచనలతోనే గడిపారు. ఆ ఆలోచనల్లో నుంచి పుట్టిందే ఈ కట్టడం. ఇప్పుడు అందరూ దీన్ని 'వైజాగ్ తాజ్‌మహల్' అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు” అని కిషోర్ చంద్రదేవ్ వివరించారు.

ఫొటో సోర్స్, V. Kishore Chandra Deo
‘తీరంలో తాజ్ మహల్’
విశాఖ తీరంలో వాల్తేరు బస్ డిపోకు సమీపంలో కనిపించే ఈ నిర్మాణం చాలా భిన్నమైన సంప్రదాయల మేళవింపులతో కట్టినట్లు ఉంటుంది.
షాజహన్ తన భార్యపై ప్రేమతో యమునా తీరంలో తాజ్ మహల్ కట్టిస్తే, కురుపాం రాజు తన భార్య జ్ఞాపకార్థం విశాఖ సాగర తీరంలో ఈ ప్రేమ మందిరాన్ని నిర్మించారు.
“రాణి సాహెబా మరణాన్ని తట్టుకోలేకపోయిన రాజా వీరభద్ర బహదూర్ చాలా రోజుల వరకు కోలుకోలేదు. కాస్త కుదుటపడ్డాక ఆమె స్మృతిగా ఒక కట్టడాన్ని నిర్మించాలని అనుకున్నారు. రాణి పట్టమహాదేవి విగ్రహాన్ని తయారు చేయించి, దాని కోసం విశాఖ సాగర తీరంలో ఉన్న కురుపాం జమీందార్ల స్థలంలో ఒక నిర్మాణాన్ని చేపట్టారు. తన భార్యపై ప్రేమతో నిర్మించిన కట్టడం కావడంతో, దానిని తాజ్ మహల్‌తో పోల్చి స్థానికులంతా 'వైజాగ్ తాజ్ మహల్' అని పిలుస్తున్నారు. అయితే ఈ నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
వీరభద్ర బహదూర్ అప్పటికే వివిధ రాష్ట్రాలు, దేశాలతో షిప్పింగ్ బిజినెస్ చేస్తుండేవారు. దాంతో ఆయన ఆయా దేశాలకు వెళుతుండేవారు. లేదా అక్కడికి వెళ్లిన వారు ఆ దేశాల, ప్రాంతాల సంస్కృతులు, సంప్రదాయాలకు సంబంధించిన వస్తువులను తీసుకొస్తుండేవారు. అలా రాజా వీరభద్ర బహదూర్‌కు వివిధ దేశాల, ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయలపై అవగాహన ఉండేది.
అప్పటికే ఈ ప్రాంతంలో మొఘలుల పాలన ఉండటంతో ఆ సంస్కృతి ప్రభావం కూడా ఈ నిర్మాణంలో కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ కట్టడంలో యూరోపియన్, రాజస్థాన్, బెంగాల్, ఆంధ్ర, ఒడిశా, మొఘల్ నిర్మాణ శైలులు కనిపిస్తాయి. అందువల్లే ఇది ఎంతో భిన్నంగా ఉంటుంది. చిన్న చిన్న విష్ణుమూర్తి విగ్రహలు సైతం ఈ కట్టడంలో కనిపిస్తాయి” అని కిషోర్ చంద్రదేవ్ వివరించారు.

ఫొటో సోర్స్, V. Kishore Chandra deo
అసలు పేరు 'ప్రేమ నివేదన రూపం’
ఈ కట్టడాన్ని అంతా వైజాగ్ తాజ్‌మహల్ అంటారుగానీ, దీనికి రాజ వీరభద్ర బహదూర్ పెట్టిన పేరు వేరే ఉంది.
దీని అసలు పేరు ‘ప్రేమ నివేదన రూపం’ అని ఈ కట్టడంపై పరిశోధనలు చేసిన ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ (INTACH) సభ్యులు, చరిత్రకారులు విజ్జేశ్వరం ఎడ్వార్డ్ పాల్ తెలిపారు.
“వైజాగ్ తాజ్ మహల్ అని అంతా అంటున్నారు కానీ, ఈ నిర్మాణం ఏ విధంగానూ తాజ్ మహల్‌ను పోలి ఉండదు. కాకపోతే రెండూ ప్రేమకు గుర్తుగా నిర్మించినవి కావడంతో అలా పిలుస్తున్నారు. అయితే, దీని అసలు పేరు ‘ప్రేమ నివేదన రూపం’. భార్యపై తనకున్న ప్రేమను నివేదిస్తూ.. అంటే వ్యక్తపరుస్తూ నిర్మించిన కట్టడం ఇది.
దీనిపై చెక్కిన అనేక కళాకృతులు ఆకర్షణీయంగా ఉంటాయి. సూక్ష్మంగా ఉండే చెక్కడాలు, నగిషీలు, విష్ణుమూర్తి చిత్రాలు అనేకం కనిపిస్తాయి. అన్నింటి కంటే ముఖ్యంగా చనిపోయిన రాణిని స్మరిస్తూ, ఆమె కోసం తెలుగు, ఇంగ్లిష్‌లో రాసిన కొన్ని కవితలు కూడా ఉండేవి. అయితే ప్రస్తుతం అవి కనిపించడం లేదు” అని ఎడ్వార్డ్ పాల్ బీబీసీతో చెప్పారు.

‘రాణి విగ్రహాం దొంగతనం’
వైజాగ్ తాజమహల్ అని పిల్చుకుంటున్న ఈ నిర్మాణ పరిసరాలన్నీ దుర్భరంగా ఉంటాయి. పైగా ఒకప్పుడు విశాలంగా ఉండే ఈ కట్టడం చుట్టూ పొదలు పెరిగిపోవడం, చుట్టుపక్కలంతా అపార్ట్‌మెంట్లు రావడంతో, ఇక్కడ వైజాగ్ తాజ్ మహల్ అనేది ఒకటుందనే విషయమే చాలామందికి తెలీదు.
“రాణి లక్ష్మీ నరసాయమ్మ పట్టమహాదేవిపై ప్రేమతో నిర్మించిన ఈ కట్టడం సాగర తీరానికి సమీపంలో ఉండటంతో టూరిస్టు అట్రాక్షన్‌గా ఉండేది. ఈ ప్రేమ మందిరంలో రెండున్నర అడుగల ఎత్తున రాణి విగ్రహాం కూడా ఉండేది. అయితే దానిని 30 ఏళ్ల క్రితమే ఎవరో ఎత్తుకెళ్లిపోవడం, ఈ నిర్మాణం చుట్టు పక్కలంతా తుప్పలు, పొదలు పెరిగిపోవడంతో టూరిస్టుల సంఖ్య తగ్గింది. అలాగే, దీని గుర్తింపు కూడా పోయింది. ఎంతో పేరున్న కురుపాం సంస్థానానికి చెందినదే అయినా ఇప్పుడు అనాథలా మిగిలిపోయింది. దీనిని కాపాడుకోవాలి, ఎందుకంటే ఇది మన సంస్కృతి, చరిత్రకు చిహ్నం.
సాగర తీరానికి సమీపంలో ఉన్నా కూడా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని నిలబడిన కట్టడం ఇది. దీనిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కానీ, ఇది ప్రైవేటు ఆస్తి కావడంతో కురుపాం సంస్థాన వారసులే దీనికి మళ్లీ జీవం పోయాలి. కావాలంటే మేం సహకరిస్తాం” అని ఎడ్వార్డ్ పాల్ తెలిపారు.

‘రవివర్మ గీసిన అదుదైన చిత్రాల్లో ఇదొకటి’
ప్రేమ నివేదన మందిరాన్ని నిర్మించి దాదాపు 115 ఏళ్లు గడిచింది. ఆ కట్టడాన్ని స్థానికులు ‘తాజ్ మహల్’ అని పిల్చుకుంటూ, ఆ దంపతుల ప్రేమను తల్చుకుంటారు. టూరిస్టులతో పాటు ప్రేమికుల దినోత్సవం రోజున కొందరు ప్రేమికులు దీనిని సందర్శిస్తుంటారు.
“రాణి జ్ఞాపకార్థం నిర్మించిన ఈ కట్టడంలో రాణి నరస్సాయ్యమ్మ పట్టమహదేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే దానికి సరైన సెక్యూరిటీ లేకపోవడంతో ఎవరో ఎత్తుకుపోయారు. అప్పట్లో భారత దేశ ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ ఆమె చిత్రాన్ని గీస్తే, దాని ఆనవాలుతో విగ్రహాన్ని తయారు చేయించారు. ఆ మందిరంలోని రాణి విగ్రహం వద్దే రాజా వీరభద్ర బహదూర్ ఎక్కువగా గడిపేవారు. 40 ఏళ్ల వయసులో ఆయన కూడా మరణించారు. చివరి వరకూ ఆమె జ్ఞాపకాలతోనే గడిపారు. తర్వాత రాజా వీరభద్ర బహదూర్ దంపతుల తైల వర్ణ చిత్రాన్ని కూడా రవివర్మే గీశారు. రాజా రవివర్మ గీసిన చిత్రం కురుపాం కోటలో ఉంది” అని కిషోర్ చంద్రదేవ్ తెలిపారు.
ప్రేమ మందిరం నుంచి తీరం వరకు ఒక సొరంగం కూడా ఉండేదని కిషోర్ చంద్రదేవ్ తెలిపారు. దీని ద్వారా రాజా వీరభద్ర బహదూర్ మందిరానికి, తీరానికి రాకపోకలు సాగించేవారని చెప్పారు.

‘త్వరలోనే రాణి విగ్రహాన్ని ప్రతిష్టిస్తాం’
ఒకప్పుడు టూరిస్టు స్పాట్‌గా పేరు పొందిన ఈ ప్రేమ మందిరం ప్రముఖ దర్శకుడు బాల చందర్ తీసిన 'మరో చరిత్ర' సినిమాలో కనిపిస్తుంది. అయితే, ఇప్పుడు వైజాగ్ తాజ్ మహాల్‌ను పట్టించుకునే వారే లేరు.
దీనిని సంరక్షించాలని స్థానికులు కురుపాం రాజులను కోరుతున్నారు. పురావాస్తు శాఖ కూడా ఇది ప్రైవేటు ప్రాపర్టీ కావడం వలన తాము దీని విషయంలో ముందుకు అడుగులు వేయలేకపోతున్నామని చెప్తోంది.
“ఈ కట్టడం కోసం రోడ్డు పక్కన వదిలేసిన దాదాపు రెండెకరాల స్థలం క్రమంగా ఆక్రమణలకు గురైంది. కోర్టు ద్వారా ఆ స్థలాన్ని తిరిగి పొంది, కట్టడం కోసం కొంత స్థలాన్ని వదిలేసి మిగతా స్థలంలో అపార్టుమెంట్లు నిర్మించాం. దీని నిర్మాణ శైలి చెడిపోకుండా మరమ్మత్తులు చేయించి, దొంగలించబడిన విగ్రహం స్థానంలో రాణి గారి మరో విగ్రహాన్ని తిరిగి పెడతాం. ఆ దిశగా పని జరుగుతుంది. త్వరలోనే మళ్లీ వైజాగ్ తాజ్ మహల్‌కు టూరిస్టులు వచ్చేలా తీర్చిదిద్దుతాం” అని కిషోర్ చంద్రదేవ్ బీబీసీకి చెప్పారు.

కురుపాం రాజులెవరు?
1672లో కురుపాం సంస్థానం ప్రారంభమైంది. కొండదొర తెగకు చెందిన సన్యాసిదొర కురుపాం సంస్థానానికి మూలపురుషుడని ఆంధ్ర విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ తెలిపారు.
“అప్పట్లో విజయనగరం, బొబ్బలి రాజుల తర్వాత కురుపాం సంస్థానానికే పెద్ద పేరుండేది. వీరి కోట కురుపాంకు సమీపంలో విశ్వనాథపురంలో ఉండేది.
విజయనగరం, జైపూర్ రాజులకు మధ్య జరిగిన యుద్ధాల్లో సన్యాసిదొర జైపూర్ రాజులకు సహకరించారు. దాంతో, వారు కురుపాం రాజ్యాన్ని ఏర్పాటుచేశారు.

ఈ రాజులకు రాజా బహదూర్ అనే బిరుదు ఉండేది. దాన ధర్మాలు, జనరంజక పాలనలో వీరికి మంచి పేరే ఉంది. బ్రిటిష్ రాజు జార్జి-2 పట్టాభిషేకం పురస్కరించుకొని విశాఖలో కురుపాం మార్కెట్‌ను ప్రజలకు అంకితం చేశారు.
అలాగే, అనకాపల్లికి చెందిన గోడే వంశీయులు కూడా సంపన్న జమీందార్లు. కరువు, కాటకాల సమయంలో వీరి ఎస్టేట్లను ప్రజలకు పునరావాస కేంద్రాలుగా వినియోగించేవారు“ అని ప్రొఫెసర్ సూర్యనారాయణ తెలిపారు.

ఇవి కూడా చదవండి:
- శ్రీకాళహస్తి కలంకారీ: ఈ సంప్రదాయ కళ ఏనాటిది... ఈ వస్త్రాల ప్రత్యేకత ఏంటి?
- అరుంధతీ రాయ్: 'బీజేపీ ఒక నియంత పార్టీ, మోదీ ప్రభుత్వం ఈ దేశాన్ని ఫాసిజం వైపు నడిపిస్తోంది'
- నిరుద్యోగం: ఆత్మహత్యలు చేసుకుంటున్న యువత సంఖ్య పెరుగుతోందా.. గణాంకాలు ఏం చెబుతున్నాయి..
- యుక్రెయిన్: రష్యాకు వ్యతిరేకంగా ఏకమైన ఈ నగరంలో ఇప్పుడు ఏం జరుగుతోంది?
- బాయ్‌ఫ్రెండ్ ఆమె కొడుకుని చంపేశాడు.. కానీ, ఆమె జైలుకు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














