టిప్పు సుల్తాన్ మత మార్పిళ్లకు పాల్పడ్డారా? చరిత్ర ఏం చెబుతోంది

ఫొటో సోర్స్, PRINT COLLECTOR
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ హిందీ కోసం
ముంబయిలో ఒక పార్కుకు టిప్పు సుల్తాన్ పేరు పెట్టటం వివాదాస్పదమైంది. మరాఠా పాలకులైన పేష్వాలు.. టిప్పు సుల్తాన్‌తో, ఆయన తండ్రి హైదర్ అలీతో యుద్ధాలు చేశారు కాబట్టి.. టిప్పు సొంత రాష్ట్రానికి చెందిన చరిత్రకారులకు ఈ వివాదం ఆశ్చర్యం కలిగించలేదు.
18వ శతాబ్దంలో బ్రిటిష్‌వారితో పోరాడుతూ యుద్ధ రంగంలో కన్నుమూసిన ఏకైక భారత పాలకుడు టిప్పు సుల్తాన్. ఆ చరిత్ర గురించి అవగాహన లేకుండా జనంలో ఉన్న ప్రచారం ప్రాతిపదికగా ఇపుడు టిప్పు వ్యతిరేకంగా వివాదం నడుస్తోంది.
టిప్పు సుల్తాన్ పట్ల ప్రస్తుతమున్న ‘వ్యతిరేకతను’ పరిగణనలోకి తీసుకుంటే.. ఒక పార్కుకు ఆయన పేరు పెట్టాలని కానీ, ఒక ప్లేగ్రౌండ్‌కి ఆయన పేరును ఖరారు చేయాలని కానీ ఆలోచించటం ‘రాజకీయంగా పొరపాటు’ అవుతుందని ఒక చరిత్రకారుడు నమ్ముతున్నారు.
‘‘టిప్పు సుల్తాన్ ఒక నేషనల్ హీరో అని మహారాష్ట్ర ప్రజలకు తెలియక పోవచ్చు. ఎందుకంటే 19వ శతాబ్దం వరకూ భారతీయ అస్తిత్వం ఉనికిలో లేదు. ఆ యుగంలో మరాఠా అస్తిత్వం, బెంగాలీ అస్తిత్వం, మూసూర్ అస్తిత్వం ఉండేవి’’ అని మైసూర్ యూనివర్సిటీలో టిబు చైర్ మాజీ ప్రొఫెసర్ సెబాస్టియన్ జోసెఫ్ బీబీసీతో పేర్కొన్నారు.
అయితే.. టిప్పు సుల్తాన్‌ను ‘‘దక్షిణ భారతదేశంపై దండెత్తిన క్రూరమైన దురక్రమణదారుల్లో ఒకడు’’గా అభివర్ణించటం చరిత్రకారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
‘‘అతడు దండెత్తివచ్చిన ఆక్రమణదారుడు కాదు. అతడు ఎక్కడి నుంచో రాలేదు. చాలా మంది భారతీయ పాలకులకన్నా తన జన్మభూమిలో బలమైన మూలాలున్న పాలకుడు అతడు. అతడిని దండెత్తి వచ్చిన ఆక్రమణదారుడిగా వర్ణించటం.. అతడిని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోవటమే అవుతుంది’’ అని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన మాజీ హిస్టరీ ప్రొఫెసర్ జానకి నాయర్ చెప్పారు.
‘‘బ్రిటిష్, మరాఠా, హైదరాబాద్ నిజాంల సంయుక్త బలగాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప దేశభక్తుల్లో టిప్పు ఒకడు. అతడిని జాతీయ శత్రువుల్లో ప్రథముడిగా ప్రచారం చేయటానికి కారణం వివక్షే’’ అని మరో చరిత్రకారుడు ప్రొఫెసర్ ఎన్.వి.నరసింహయ్య పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, BHARAT ITIHAS SANSHODHAK MANDAL
టిప్పు సుల్తాన్ – పేష్వాలు
‘‘చరిత్ర తెలియని వారు మాత్రమే ‘మేం టిప్పు సుల్తాన్‌ను ద్వేషిస్తాం’ అని చెప్తారు. టిప్పు సుల్తాన్ మీద యుద్ధం చేయటానికి బ్రిటిష్ వారితో, మరాఠాలలతో జట్టుకట్టిన హైదరాబాద్ నిజాం గురించి వారు అలా మాట్లాడరు’’ అని ఆయన చెప్పారు.
పేష్వా రఘునాథరావు పట్వర్థన్ నాయకత్వంలో జరిగిన దాడి నుంచి తప్పించుకోవటానికి కర్కలకు పారిపోయిన శృంగేరి మఠం స్వామీజీ ఉదంతాన్ని ఆయన ఉటంకించారు. ‘‘పేష్వా సైన్యం వారి ఆలయం మీద దాడి చేసింది. నగలన్నీ తీసుకెళ్లింది. మూలవిరాట్టును అవమానించింది’’ అని చెప్పారాయన.
‘‘పేష్వా సైన్యం లూటీ చేసిన ప్రతి దానినీ టిప్పు సుల్తాన్ భర్తీ చేశాడు. తన రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించాలని కోరుతూ స్వామీజీకి అనేక లేఖలు కూడా రాశాడు. నంజుండేశ్వర ఆలయం సహా పలు ఇతర దేవాలయాలకూ ఇదే విధంగా సాయం చేశాడు. నంజుండేశ్వర ఆలయంలో తన కంటి సమస్య నయమైంది కనుక ఆ ఆలయాన్ని హకీం నంజుండ అని టిప్పు అభివర్ణించాడు’’ అని ప్రొఫెసర్ నరసింహయ్య వివరించారు.
మెల్కోట్, కొల్లూర్ మూకాంబికాలయం సహా అనేక ఇతర దేవాలయాలకు టిప్పు సుల్తాన్ నగలు అందించాడని, భద్రత కల్పించాడని ప్రభుత్వ రికార్డుల్లో నమోదైంది.
‘‘యుద్ధాలు చేయటంలో మరాఠాలు కూడా తక్కువేమీ కాదు. మరాఠాలు బెంగాల్ వరకూ ఆక్రమించటాన్ని ఈ రోజుకూ ఒక భయంకర జ్ఞాపకంగా ఉంది. వీరంతా విచక్షణ చూపని 18వ శతాబ్దపు చక్రవర్తులు’’ అని ప్రొఫెసర్ నాయర్ వ్యాఖ్యానించారు.
‘‘గతాన్ని ఇప్పుడు పక్షపాతం సృష్టించటానికి వాడుకుంటున్నారు. గతాన్ని చారిత్రక అవగాహన కోసం ఉపయోగించటం లేదు’’ అన్నారామె.
అతడు ఇప్పటికీ నేషనల్ హీరోయేనా?
‘‘ఇప్పుడేమాత్రం కాదు. 18వ శతాబ్దపు రాచరికపు స్వభావమైన బలవంతపు మత మార్పిడి, మతవివక్ష అకృత్యాలు ఇప్పుడు ప్రధానాంశాలుగా ముందుకు తెచ్చారు. అతడి వ్యక్తిత్వం మరణానంతరం ఎన్నో రూపాలు మారింది’’ అంటారు ప్రొఫెసర్ నాయర్.
మొదట బ్రిటిష్ వాళ్లు అతడొక నియంత అని రాశారు. అతడు బ్రిటిష్ వారితో పోరాడి యుద్ధ రంగంలో చనిపోయాడనే వాస్తవం చివరికి మరుగునపడిపోయింది. ‘‘అందుకు కారణం అతడొక ముస్లిం కాబట్టి. ఇతర పాలకుల లాగానే అతడు కూడా తన శత్రువులపై అకృత్యాలకు పాల్పడ్డాడు కాబట్టి. కొంత మతమార్పిళ్లు చేశాడు కాబట్టి. కానీ ఆ సంఖ్యను భూతద్దంలో చూపుతున్నారు. హిందువుల ఆధిక్యం గల దేశాన్ని భారీ మతమార్పిళ్లు చేయటం ద్వారా అతడు పరిపాలించలేడు’’ అని పేర్కొన్నారు ప్రొఫెసర్ నాయర్.
నిజానికి టిప్పు సుల్తాన్ సైన్యంలో ఆరు విభాగాలున్నాయని ప్రొఫెసర్ నాయర్ తెలిపారు. ముస్లింలలో వేర్వేరు తరగుతుల మధ్య అతడు భేదం చూపలేదని, అతడి సైన్యంలో మరాఠాలు, రాజపుత్రులతో కూడిన రెండు విభాగాలున్నాయని వివరించారు. ‘‘మతాల మధ్య కూడా అతడు భేదం చూపలేదు. అందరికీ గౌరవప్రదమైన వేతనం ఇచ్చాడు’’ అన్నారామె.
1960-1970లలో చరిత్రకారులు టిపు సుల్తాన్ ఆర్థిక కార్యక్రమాలు, వ్యవసాయం, పట్టు పరిశ్రమ అభివృద్ధి తదితరాలను పరిశీలించారని.. ఆ రంగాల్లో అతడు చాలా వినూత్నంగా కృషి చేశాడని ఆమె ఉటంకించారు.

ఫొటో సోర్స్, DD NEWS
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌కు చెందిన ప్రొఫెసర్ నరేందర్ పాణి ఒక ఇంటర్వ్యూలో.. తను రాసిన పుస్తకం ‘రిఫార్మ్స్ టు ప్రిఎంప్ట్ చేంజెస్ – లాండ్ లెజిస్లేషన్ ఇన్ కర్ణాటక’ పుస్తకంలో నుంచి ఒక అంశాన్ని ప్రస్తావించారు.
‘‘టిప్పు కాలంలో సాగుభూమిని రాజ్యం నుంచి నేరుగా సాగుదారుడికే కౌలుకు ఇచ్చేవారు. సాగుదారులు వారసత్వం ప్రాతిపదికగా ఆ భూమిని సాగుచేసేవారు. అందరికీ భూమి దక్కేది. కానీ టిప్పు మలబార్‌లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టటంలో విఫలమయ్యాడు. ఎందుకంటే అక్కడి పెద్ద భూస్వాములకు వేరే వ్యవస్థ ఉండేది’’ అని ఆయన బీబీసీతో చెప్పారు.
నిజానికి టిప్పు పతనమైన తర్వాత.. అతడు అమలు చేసిన వ్యవసాయ విధానాన్నే బ్రిటిషర్లు స్వయంగా ‘రైత్వారీ వ్యవస్థ’ పేరుతో అమలుచేశారు. టిపు తన సొంత వ్యవసాయ వ్యవస్థను అమలు చేసినందున.. లార్డ్ కార్నవాలిస్ ప్రవేశపెట్టిన జమీందారీ వ్యవస్థ మైసూరులో పనిచేయలేదు.
1980ల చివర్లో టిప్పు సుల్తాన్‌కు వ్యతిరేకంగా నిరసన పెరగటం మొదలైందని ప్రొఫెసర్ నాయర్ చెప్తున్నారు. ‘‘రెండు ప్రధాన కథనాలు ముందుకు వచ్చాయి. ఒకటి మతమార్పిళ్లు చేశాడని, కన్నడ భాషను ప్రోత్సహించలేదని. ఆలయాల ధ్వంసం అంశం కూడా ఉంది. కానీ అతడు ఆలయాలకు మద్దతిచ్చాడనేందుకు చాలా ఆధారాలున్నాయి’’ అన్నారామె.
‘‘రైట్ వింగ్ చరిత్రకారుల్లో ఒకరిగా పరిగణించే సూర్యనాథ్ యు ఉమాకాంత్ కూడా.. తన కర్ణాటక చరిత్ర పుస్తకంలో టిప్పు సుల్తాన్‌కు సరైన స్థానం ఇచ్చారు. అయితే గడచిన రెండు దశాబ్దాల్లో ఏదో మారిపోయింది’’ అని వ్యాఖ్యానించారు ప్రొఫెసర్ నాయర్.

ఫొటో సోర్స్, Getty Images
ఏం మారింది?
చరిత్ర అంటే ఏమిటి? దాని గురించి ప్రజల్లో ఉన్న అవగాహన ఏమిటి? అనే వాటిమధ్య విస్పష్టమైన చారిత్రక అగాథం ఉందని చరిత్రకారులు చెప్తున్నారు. అందుకు వివిధ కారణాలను వారు చూపుతున్నారు.
టిప్పు సుల్తాన్ అనే పాత్ర చాలా మిశ్రమమైనది. సంక్లిష్టమైనది. దురదృష్టవశాత్తు.. అతడి గురించి చారిత్రక దృక్కోణంలో మంచి మాటలు చెప్పటం దేశవ్యతిరేకమనే స్థితికి మనం చేరుకున్నాం. అదే సమయంలో రాకెట్లలో విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞాన్ని అభివృద్ధి చేసినందుకుగాను నాసా దగ్గర టిప్పు సుల్తాన్ ఫొటో ఉంది. ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని బ్రిటిష్ వారు దొంగిలించారు’’ అని ప్రొఫెసర్ నాయర్ చెప్పారు.
‘‘టిప్పు సుల్తాన్ నేషనల్ హీరో ఇమేజీ మీద కొత్త రాజకీయ చర్చ ప్రభావం చూపింది. భారత స్వాతంత్ర్య పోరాటంలో కొత్త ఇమేజీలను, కొత్త హీరోలను సృష్టించే పథకంలో భాగంగా ఉద్దేశపూర్వకంగానే అది జరిగింది. నిజమైన నేషనల్ హీరోలను నేలమట్టం చేయటానికి ఈ ప్రయత్నం జరిగింది’’ అంటారు ప్రొఫెసర్ సెబాస్టియన్ జోసెఫ్.
‘‘ముంబయిలోని ప్లేగ్రౌండ్ లేదా పార్క్ విషయంలో వివాదాలకు – చరిత్రలో ఏం జరిగిందనే దానికి ఏమాత్రం సంబంధం లేదు. తీవ్ర దాడిని ఎదుర్కొంటున్న ముస్లింలు తమ కోసం తాము బలంగా నిలబడటాన్ని వ్యతిరేకించటానికి టిప్పు సుల్తాన్ ఒక చిహ్నంగా మారిపోయాడని నాకు అనిపిస్తుంది. ముస్లింల కోణం నుంచి.. టిప్పు సుల్తాన్ గురించి చెప్పుకోవటం గర్వకారణం’’ అన్నారు ప్రొఫెసర్ నాయర్.
ఇవి కూడా చదవండి:
- ‘మా అక్కపై అత్యాచారం చేసి, మొహానికి నల్ల సిరా రాసి, మెడలో చెప్పులదండతో ఊరేగించారు’
- టీఆర్ఎస్ రూ. 301 కోట్లు, టీడీపీ రూ. 188 కోట్లు, వైసీపీ రూ. 143 కోట్లు
- పిల్లల ఆహారం విషయంలో తల్లులు చేసే నాలుగు తప్పులు
- వీధుల్లో అడుక్కుంటున్న డాక్టర్లు.. ఆకలేస్తోంది, ఆహారం లేదు.. 8 నెలలుగా జీతాలు అందట్లేదు..
- లాక్డౌన్లో యూట్యూబ్ చానల్‌తో లక్షల ఫాలోవర్లు .. 22 దేశాలు చుట్టేసిన యువకుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












