దిల్లీ: ‘మా అక్కపై అత్యాచారం చేసి, మొహమంతా నల్ల సిరా రాసి, మెడలో చెప్పులదండ వేసి ఊరేగించారు’

దిల్లీలోని షాహ్‌దరా ప్రాంతంలోని కస్తూర్బానగర్‌లో ఓ యువతిపై సామూహిక అత్యాచారం కేసులో 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
తన అక్కకు గుండు గీసి, మొహమంతా నల్ల రంగు సిరా పులిమి, మెడలో చెప్పుల దండ వేసి వీధుల్లో నడిపించారని బాధితురాలి సోదరి ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితురాలి వయసు 20 ఏళ్లు. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మంది మహిళలు సహా 11 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. త్వరలో మరింత మందిని అరెస్టు చేయనున్నట్లు తెలిపారు.
ఈ ఘటనపై బాధితురాలి భర్త బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. ఘటన జరిగినప్పుడు ఆయన ఆ పరిసరాల్లో లేరు.
ఇంటి యజమాని ద్వారా సమాచారం తెలుసుకున్న ఆయన ఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని విడిపించారు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు.
‘‘మా పొరుగునున్న ఓ అబ్బాయి గత ఏడాది నవంబరులో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు మా అక్కను ప్రేమించినట్లు వారు చెబుతున్నారు. ఆ అబ్బాయి మరణానికి మా అక్కే కారణమంటూ వారు ఇదంతా చేశారు’’అని బాధితురాలి సోదరి పీటీఐతో చెప్పారు.

బాధితురాలి సోదరి ఏం చెప్పారు?
‘‘మా అక్కను నవంబరు నుంచి వేధిస్తూనే ఉన్నారు. చాలాసార్లు భయపెట్టారు. మా అక్క నిరాకరించడంతోనే ఆ అబ్బాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునట్లు వారు ఆరోపించారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని చాలాసార్లు బెదిరించారు’’అని బాధితురాలి చెల్లి వివరించారు.
‘‘బుధవారం గోధుమలు ఇచ్చేందుకు మా ఇంటికి అక్క వస్తుండగా కొందరు ఆమె వెంబడించారు. వారి చేతిలో కర్రలు ఉన్నాయి. ఒక మహిళ చేతిలో కత్తెర కూడా ఉంది.’’
‘‘మా అక్క ఇంటికి వచ్చి నన్ను కిందకు రమ్మని పిలిచింది. ఇంతలోనే ఆమెను కొందరు ఆటోలోకి బలవంతంగా ఎక్కించారు.’’
‘‘వారు నా ఫోన్ లాక్కున్నారు. దీంతో పోలీసులకు ఫోన్ చేయడం కూడా కుదరలేదు. నా కళ్ల ముందే వారు మా అక్కను ఎత్తుకెళ్లారు. ఆటోలోనే మా అక్క జుత్తు కత్తిరించారు. ఆ తర్వాత ఆమె వారు ఇంటికి తీసుకెళ్లారు. బాగా కొట్టి, అత్యాచారం చేశారు’’అని బాధితురాలి సోదరి చెప్పారు.
‘‘మా మేనల్లుడ్ని కూడా వారు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అయితే, ఇంటిలోకి పరిగెత్తి దాక్కుని వారి నుంచి తప్పించుకున్నాడు’’అని ఆమె వివరించారు.

‘‘ఈ దారుణం జరిగేటప్పుడు మా అక్కను కాపాడటానికి ఎవరూ రాలేదు. ఇరుగుపొరుగు వారు అలానే చూస్తూ ఉండిపోయారు’’అని బాధితురాలి సోదరి వివరించారు.
కేసులో అరెస్టైన 11 మందికీ ఇదివరకు అక్రమ మద్యం కేసుతో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. ఆ 11 మందిలో ఇద్దరు మైనర్లు ఉన్నారని, వారిద్దరిపై ప్రస్తుతం అత్యాచార ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు.
2018లో బాధితురాలికి వివాహమైంది. ఆమెకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. వీరు దిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో ఉంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘వారు భయపెట్టిన ప్రతిసారీ మేం పోలీసులకు ఫిర్యాదు చేసేవాళ్లం. అయితే, అక్కడ రాజీ కుదిరేది. కానీ, వారు ఇంత పని చేస్తారని మేం ఊహించలేదు’’అని బాధితురాలి సోదరి చెప్పారు.
బాధితురాలి తండ్రి పక్షవాతంతో బాధపడుతున్నారు. తల్లి గుండెపోటుతో 2020లోనే మరణించారు. అప్పటి నుంచి ఇంటి బాధ్యతను బాధితురాలే చూసుకుంటున్నారు.
‘‘మా అమ్మాయి పెళ్లి జరిగినప్పుడు ఎలాంటి సమస్యా రాలేదు. గత ఏడాది నుంచీ వారు వేధించడం మొదలుపెట్టారు. వారు అమ్మాయిలను బెదిరించేవారు. నేను మంచానికే పరిమితం అయ్యాను. నేనేం చేయగలను?’’అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
న్యాయం కోసం..
ఘటన తర్వాత బాధితురాలిని చూసేందుకు ఆమె ఇంటికి బంధువులు, ఇరుగుపొరుగు వారు వస్తున్నారు. ఆమెకు న్యాయం జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
‘‘నిందితులకు కఠిన శిక్ష విధించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి’’అని బాధితురాలి తాతయ్య డిమాండ్ చేశారు.
ఈ ఘటనను సిగ్గుచేటుగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
ఈ కేసుకు సంబంధించి దిల్లీ పోలీసులకు దిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీచేసింది. వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించింది.
‘‘ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. బాధితురాలికి కౌన్సెలింగ్‌తోపాటు అవసరమైన సాయం అందిస్తున్నాం’’అని దిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ ఆర్ సత్యసుందరం చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఏపీలో కొత్త పీఆర్సీతో ఉద్యోగులకు జీతాలు ఎంత తగ్గుతున్నాయి, పెన్షనర్లకు ఎంత నష్టం? ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలా
- RRB: ఇరుకు గదులు.. ఖాళీ జేబులు.. కళ్లల్లో కొలువుల కలలు
- జయప్రకాశ్ నారాయణ్ భార్య బ్రహ్మచర్యం ఎందుకు స్వీకరించారు? జేపీని ప్రేమించిన యువతికి కరెంట్ షాకులు ఎందుకు ఇచ్చారు?
- పద్మశ్రీ గ్రహీత మొగిలయ్యకు కేసీఆర్ రూ. కోటి నజరానా
- 'దేవుడు నా బ్రా కొలతలు తీస్తున్నాడు' అంటూ శ్వేత తివారి వివాదాస్పద వ్యాఖ్యలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










