PRC: ఏపీలో వేతన సవరణలతో ఉద్యోగులకు జీతాలు ఎంత తగ్గుతున్నాయి, పెన్షనర్లకు ఎంత నష్టం? ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలా

పీఆర్సీ

ఫొటో సోర్స్, ugc

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీ మాకొద్దు, పాత పీఆర్సీ ప్రకారమే మాకు జీతాలు ఇవ్వండంటూ ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు.

కొత్త పీఆర్సీ ప్రకటించాలని ఉద్యమాలు చేసిన ఉద్యోగులు, ప్రకటించిన తర్వాత మాకు కొత్త పీఆర్సీ వద్దు అంటూ వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు.

కొత్త పీఆర్సీ ప్రకటించగానే ఆనందించిన ఉద్యోగులు, ఆ తర్వాత రెండు రోజులకే ఈ పీఆర్సీ వద్దంటూ ఆందోళన బాట పట్టారు. పీఆర్సీ అంటే జీతాలు పెరుతాయి కానీ... పీఆర్సీతో జీతాలు తగ్గడం చరిత్రలో ఇదే తొలిసారి అని ఉద్యోగులు చెప్తున్నారు.

ఇది పే రివిజన్ కమిటీ కాదు, పే రిడక్షన్ కమిటీ అంటూ యువ ఉద్యోగులు సోషల్ మీడియా వేదికల్లో సెటైర్లతో తమ ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు.

ఉద్యోగులు జీతాల బిల్లుల వ్యవహారం చూసే ఖజానా శాఖ కూడా తామూ ఉద్యోగులమే అంటూ ఈ నెల బిల్లులు చేసేందుకు నిరాకరించింది.

అయితే, ప్రభుత్వం మాత్రం... జీతం పెరుగుతుంది కానీ తగ్గదంటూ బిల్లులు చేయడానికి తొందరపెడుతోంది, ట్రెజరీ అధికారులపై ఒత్తిడి పెంచుతోంది.

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయా? ఈ కొత్త పీఆర్సీ పెన్షనర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

వీడియో క్యాప్షన్, ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన జగన్ ప్రభుత్వం

పీఆర్సీ అంటే పే రివిజన్ కమిటీ. దీనినే తెలుగులో వేతన సవరణ సంఘం అని అంటాం. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లనూ ఐదేళ్లకోసారి సమీక్షించి... ప్రస్తుత ధరలకు అనుగుణంగా వారి జీతాలను సవరించే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతుంది వేతన సవరణ సంఘం.

పీఆర్సీ ప్రతిపాదనల్లో బేసిక్ పే, ఫిట్‌మెంట్, డీఏ, హెచ్ఆర్ఏ, ఐఆర్ వంటి పదాలు ఉంటాయి, వాటిని గురించి తెలుసుకుంటే పీఆర్సీని సులభంగా అర్థం చేసుకోవచ్చు.

బేసిక్ పే (మూలవేతనం): ఉద్యోగంలో చేరిన వెంటనే ఒక ఉద్యోగికి ఎలాంటి అలవెన్సులు లేకపోయినా, తప్పనిసరిగా ఇవ్వాల్సిన వేతనం. సాధారణంగా చెల్లించే మొత్తం వేతనం (గ్రాస్ పే)లో కనిష్ఠంగా 30, గరిష్ఠంగా 60 శాతం వరకు ఉంటుంది.

డీఏ - Dearness Allowance (కరవు భత్యం): కరవు భత్యం అంటే పెరిగిన ధరలకు అనుగుణంగా ఇచ్చే పరిహారం. అప్పటి వరకు అందుకుంటున్న వేతనం తగ్గకుండా పెంచే భత్యం. సాధారణంగా ఏడాదికి రెండుసార్లు జనవరి, జులై నెలల్లో ప్రకటిస్తుంటారు. ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా ఇది ఉంటుంది. పీఆర్సీతో దీనికి సంబంధం ఉండదు.

డీఏను ఉద్యోగులకు ప్రకటించిన వెంటనే కాకుండా ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును బట్టి అప్పుడప్పుడు చెల్లిస్తుంటారు.

హెచ్ఆర్ఏ - House Rent Allowance (ఇంటి అద్దె భత్యం): ఇంటి అద్దె భత్యం వేతనంలో భాగంగా ఉద్యోగులకు లభిస్తుంది. ఒక ఉద్యోగి జీతం, నివసిస్తున్న ప్రాంతం వంటి అంశాలు ప్రాతిపదికగా తీసుకుని హెచ్ఆర్ఏ చెల్లిస్తుంటారు. చెల్లించే ఇంటి అద్దెకు ఆదాయపు పన్ను చట్టం కింద మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఫిట్‌మెంట్‌: ప్రస్తుత ద్రవ్యోల్బణం ధరల సూచికను ఆధారం చేసుకొని మూల వేతనం పెంచే శాతాన్నే ఫిట్‌మెంట్‌ అంటారు. అయిదేళ్ల కాలంలో ధరల పెరుగుదలను లెక్కకట్టి...దానికి అనుగుణంగా ఉద్యోగి జీతాన్ని ఫిట్‌మెంట్‌ ద్వారా పెంచుతారు.

ఐఆర్‌ - Interim Relief (మధ్యంతర భృతి): పీఆర్‌సీ కమిటీ తన ప్రతిపాదనలు పంపి, అవి అమల్లోకి వచ్చేలోగా జరిగే ఆలస్యానికి ప్రతిఫలంగా ఉద్యోగి నష్టపోకుండా అందించే భృతినే మధ్యంతర భృతి అంటారు. ఇది ప్రస్తుత ధరలు, ద్రవ్యోల్భణం విలువలపై ఆధారపడి లెక్కిస్తారు. పీఆర్‌సీ అమల్లోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి రద్దవుతుంది.

పీఆర్సీ

ఫొటో సోర్స్, ugc

'కొత్త పీఆర్సీ వద్దు...జీతం తగ్గుతోంది'

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి లభిస్తోంది.

2018 నాటికి పే రివిజన్ కమిషన్ సిఫార్సుల అమలులో ఆలస్యమవుతున్న కారణంగా ప్రభుత్వం 27 శాతం ఐఆర్ ప్రకటించింది. తాజా పీఆర్సీలో ఫిట్‌మెంట్‌ను ఐఆర్‌ కంటే తక్కువగా 23.29 శాతం ప్రకటించారు.

దీంతో ఇప్పటికే తీసుకుంటున్న జీతాల్లో ఉద్యోగులకు 3.71 శాతం మేర వేతనం తగ్గుతుందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.

"ఉద్యోగులకు డీఏను ఆరు నెలలకోసారి ధరల పెరుగుదలకు అనుగుణంగా ఎంతోకొంత ప్రకటిస్తారు. ఇది ఉద్యోగుల హక్కు. దీనిని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. పీఆర్సీ ప్రకటించి...ఈ పెండింగ్ డీఏలను వచ్చే నెల జీతంలో కలిపి ఇస్తోంది. డీఏకు పీఆర్సీకి అసలు సంబంధమే ఉండదు.

ఇప్పటివరకు పెండింగులో ఉన్న డీఏ(20.2%)లను ఇస్తారు. ఫిట్‌మెంట్ తగ్గింపును...పే స్లిప్‌లో కనిపించే తగ్గుదల కనిపించకుండా ఈ డీఏలను వేసి సర్దుబాటు చేస్తోంది. దీంతో జీతం తగ్గినట్లు అనిపించదు. నిజానికి ఉద్యోగులుగా జీతాన్ని నష్టపోతున్నాం" అని యూటీఎఫ్ విశాఖ జిల్లా అధ్యక్షుడు గొంది చినబ్బాయ్ బీబీసీకి వివరించారు.

పీఆర్సీ

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, చినబ్బాయ్ జీతం వివరాలు. 2021 డిసెంబరు జీతం... కొత్త పీఆర్సీ అమలైతే 2022 జనవరిలో జీతం ఎంత తగ్గుతుందో వివరించే పట్టిక (చినబ్బాయ్ లెక్క ప్రకారం)

'జిల్లాల విభజనతో మరింత నష్టం'

"హెచ్ఆర్ఏలను కూడా ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటి వరకు 20 శాతం ఉన్నవారికి 16 శాతం, 14.5 ఉన్నవారికి 8 శాతం, 12 శాతం ఉన్నవారకి కూడా 8 శాతానికి తగ్గించారు. ఇంతకు ముందు శ్రీకాకుళం, విజయనగరం సిటీలలో పని చేస్తే హెడ్ క్వార్టర్ అని చెప్పి 20 శాతం హెచ్ఆర్ఏ ఇచ్చేవారు. ఇప్పుడు దానిని జనాభా లెక్కల ప్రతిపాదికగా చూపుతూ 8 శాతానికి కుదించారు.

జనాభా లెక్కలు 2011 నాటివి ప్రాతిపదికగా తీసుకున్నారు. ఈ పది సంవత్సరాల్లో పెరిగిన జనాభాని లెక్కకట్టడం లేదు. పైగా జిల్లాల విభజనతో జనాభా ప్రతిపాదికన ఇస్తున్న హెచ్ఆర్ఏ మరింత తగ్గుతుంది.

పీఆర్సీ నివేదికలో 5 లక్షల నుంచి 50 లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో హెచ్‌ఆర్‌ఏను 16 శాతంగా, మిగతా చోట్ల 8 శాతంగా చెల్లించాలని సిఫార్సు చేసింది.

దీంతో రాష్ట్రంలోని 80 శాతం ఉద్యోగులు హెచ్ఆర్ఏని సరాసరిన ఆరుశాతం వరకు నష్టపోతున్నారు" అని చినబ్బాయ్ చెప్పారు.

అలాగే ఇప్పుడు తనకు వస్తున్న జీతం ఎంత... కొత్త పీఆర్సీతో ఎంత నష్టపోతున్నాననేది వివరించారు.

పీఆర్సీ

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, కొత్త పీఆర్సీతో బెజ్జల శంకరరావు జీతం ఎంత తగ్గుతుందో వివరించే పట్టిక (శంకరరావు లెక్క ప్రకారం)

జీతం ఎంత తగ్గుతుందంటే..

ప్రకాశం జిల్లాలో పని చేస్తున్న బెజ్జల శంకరరావు అనే ఉద్యోగి కూడా తాను ఎలా నష్టపోతున్నారో లెక్కలు చెప్పారు. "ఈ పే స్లిప్స్ చూస్తే మూలవేతనం చాలా పెరిగినట్టుగా ఉంది. కానీ కొత్త పీఆర్సీ కమిటీ సిపార్సుల మేరకు డీఏ, హెచ్ఆర్ఏలు తగ్గిపోతున్నాయి. అలాగే పాత, కొత్త జీతాలు సరిపోల్చుకుంటే...వచ్చే నెల తక్కువ జీతాలే అందుకుంటాం. అందుకే కొత్త పీఆర్సీ వద్దు అని అంటున్నాం" అని శంకరరావు తెలిపారు.

ఉద్యోగుల ధర్నా

పెన్షనర్లకు భారీ నష్టం

"సీసీఏ (సీటి కాంపెంటెటరీ అలవెన్స్) పేరుతో సిటిలో ఉండే ఉద్యోగికి కరువు భత్యం, మెడికల్ ఖర్చులు ఇస్తారు. కొత్త పీఆర్సీలో ఇది కూడా లేదు.

డీఏ ప్లస్ ఫిట్‌మెంట్‌తో వేతనం పెరగాలి. కానీ తగ్గుతుంది. పెన్షనర్లకు కూడా ఈ పీఆర్సీలో తీవ్ర నష్టం జరుగుతోంది.

70 ఏళ్లకు చేరుకున్నవారికి 10 శాతం, 75 ఏళ్ల వారికి 15 శాతం, 80 ఏళ్ల వారికి 20 శాతం పెన్షన్ పెంచాలి. కానీ ఇప్పడు 80 ఏళ్లకు మాత్రమే 20 శాతం పెంచుతామని పేర్కొన్నారు.

45 ఏళ్ల మహిళలకు పెన్షన్ పథకం పెట్టిన సీఎం వృద్ధుల విషయంలో మాత్రం ఎందుకీ వివక్ష చూపుతున్నారో?

చివరకు ఉద్యోగి/పెన్షనర్ల మరణానంతర కర్మకాండల ఖర్చులపై సైతం పరిమితి విధించారు. గ్రాట్యుటీని కూడా రూ. 16 లక్షలకే పరిమితం చేశారు" అని ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు అంటున్నారు.

నిరసనల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు
ఫొటో క్యాప్షన్, నిరసనల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు

'ట్రెజరీ ఉద్యోగులపై ప్రభుత్వం ఒత్తిడి'

మాకు పాత జీతాలే ఇవ్వండి...కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వద్దు అంటూ ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. కానీ, ఆర్థికశాఖ మాత్రం కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేయ్యాల్సిందేనంటూ ట్రెజరీ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఈ బిల్లులు ప్రాసెస్ చేయాల్సింది కూడా ఉద్యోగులే.

"మేం ప్రభుత్వ ఉద్యోగులమే. మేం నష్టపోతున్నాం. శాలరీ బిల్లుల ప్రాసెస్ ఉదయంలోగా అయిపోవాలి, సాయంత్రానికి పూర్తిచేయాలంటూ మమ్మల్ని అడుగుతున్నారు. రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్ని కూడా కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తున్నాయి. మేం కూడా ఆ ఉద్యమంలో భాగమే. దయచేసి బిల్లులు ప్రాసెస్ చేయమని మాపై ఒత్తిడి తీసుకురావద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాం" అని పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. వెంకటేశ్వరరెడ్డి చెప్పారు. దీనిపై ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.

పీఆర్సీ

ఫొటో సోర్స్, ugc

'డిమాండ్లు...క్రమశిక్షణ చర్యలు'

కొత్త పీఆర్సీ ప్రకారం కాకుండా పాత జీతాలనే వేయడానికి అంగీకరిస్తేనే ప్రభుత్వంతో చర్చిస్తామని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కానీ జీతాల బిల్లుల క్లియరెన్స్ ప్రాసెస్ మొదలుపెట్టకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని ప్రభుత్వం ట్రెజరీ ఉద్యోగులను హెచ్చరించింది. ఫిబ్రవరి 1వ తేదీ నాటికి జీతాలు జమయ్యేలా చూడాలని ట్రెజరీ అధికారులకు ఆర్థిక శాఖ సూచించింది.

"కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు చెల్లిస్తాం. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు, ఉద్యోగ సంఘ నాయకులు పెట్టిన డిమాండ్లకు సంబంధం లేదు. ముఖ్యమైన హెచ్ఆర్ఏ సవరణ అంశాన్ని ఉద్యోగ సంఘాలు ప్రస్తావించటం లేదు. ఉద్యోగ సంఘాలు...మంత్రుల కమిటీతో చర్చలకు వస్తే పాత జీతాలు చెల్లించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించి ఉండేది. కొత్త పే స్కేళ్లతో వేతన బిల్లులను రూపొందిస్తున్న డీడీఓలను పని చేసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారు.

హెచ్ఆర్ఏ శ్లాబులపై నష్టం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు భావిస్తే దానిపై చర్చించడానికి మంత్రుల కమిటీ సిద్ధమే. ఉద్యోగ సంఘాల కంటే ఎక్కువే ఉద్యోగుల బాగోగుల గురించి ప్రభుత్వం ఆలోచించింది. ప్రాధాన్యత దృష్ట్యా ఫిట్‌మెంట్‌పై నిర్ణయమే కీలకమని ఉద్యోగ సంఘాలు చెప్పాయి. ఇప్పుడు మాటమార్చి మరోలా వ్యవహరించటం సరికాదు" అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.

జగన్

'ఉద్యోగి అనుమతి లేకుండా జీతాలు ఎలా వేస్తారు'

జనవరి నెల జీతాలు పాత పద్దతి ప్రకారమే చెల్లించాలి, కొత్త పీఆర్సీ ప్రకారం చెల్లించే ప్రయత్నం చేస్తే ఏ ఉద్యోగి కూడా జీతాలు తీసుకోరని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.

"ప్రభుత్వం అమలు చేయాలని ప్రయత్నిస్తున్న కొత్త పీఆర్సీ ప్రకారం చూసుకుంటే ప్రతి ఉద్యోగి కనీసం రూ. 20 వేల నుంచి గరిష్టంగా రూ. 3 లక్షలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 2019 జూలై నుంచి 2021 డిసెంబర్ వరకు తీసుకున్న జీతాల నుంచి ఈ కటింగ్స్ అవుతున్నట్లు లెక్క. కొత్త పీఆర్సీ అమలైతే ఈ కటింగులు జరిగిపోతాయి. అయినా ఒక ఉద్యోగి అనుమతి లేకుండా కొత్త పీఆర్సీ ప్రకారం జీతం ఎలా వేస్తారు?" అని ఏపీ ఎన్జీవో విశాఖ జిల్లా నాయకులు ఈశ్వరరావు అన్నారు. "కొత్త పీఆర్సీలోకి నేను వచ్చేందుకు అంగీకరిస్తున్నాను. నాకు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వండంటూ ఉద్యోగి ఆర్థికశాఖకు లేఖ ఇవ్వాలి. దీనిని ఎంప్లాయ్ విల్లింగ్ అని అంటారు. దీని కోసం అప్షన్ ఫాం అని ఒకటుంటుంది. దానిని పూర్తి చేసి ప్రతి ఉద్యోగి ఇవ్వాలి. అంటే ఉద్యోగి అనుమతి ఇచ్చినట్లు...అలా ఉద్యోగి వ్యక్తిగత అనుమతి లేకుండా జీతం వేయరాదు. ఇది ప్రభుత్వం గుర్తించాలి" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)