పెగాసస్: ఇజ్రాయెల్‌తో రక్షణ ఒప్పందంలో భాగంగా పెగాసస్‌ను భారత్ కొనుగోలు చేసింది - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్‌తో 2017లో కుదుర్చుకున్న 2 బిలియన్ డాలర్లు (రూ.15,000 కోట్లు) విలువైన రక్షణ ఒప్పందంలో భాగంగా పెగాసస్ స్పైవేర్‌ను భారత్ కొనుగోలు చేసిందని ద న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
''భారత్‌లో ప్రముఖ పాత్రికేయులు, మానవ హక్కుల ఉద్యమకారులు, రాజకీయ నాయకులపై ఈ స్పైవేర్ సాయంతో భారత్ నిఘా పెట్టినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసింది. అయితే, గత ఏడాది దీన్ని ఉపయోగించకూడదని ఎఫ్‌బీఐ నిర్ణయించింది.
మెక్సికో కూడా ఈ స్పైవేర్‌తో జర్నలిస్టులపై నిఘా పెట్టినట్లు వార్తలు వచ్చాయి. సౌదీ అరేబియా కూడా మహిళా హక్కుల ఉద్యమకారులపై దీనితో నిఘా పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
2017లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఆ సమయంలో ఓ క్షిపణి వ్యవస్థతోపాటు పెగాసస్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది''అని ఆ కథనంలో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పెగాసస్ మళ్లీ చర్చలోకి వచ్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీ దీనికి సంబంధించిన వార్తాకథనాన్ని పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు.
‘‘ప్రజాస్వామ్యంలోని సంస్థలు, నాయకులు, ప్రజలపై నిఘా పెట్టడానికి మోదీ ప్రభుత్వం పెగాసస్‌ని కొనుగోలు చేసింది. ఫోన్ ట్యాపింగ్‌తో పాలక పక్షం, ప్రతిపక్షం, సైన్యం, న్యాయవ్యవస్థ ఇలా అందరినీ టార్గెట్ చేశారు. ఇది దేశద్రోహం. మోదీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడింది’’ అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

పద్మశ్రీ గ్రహీత మొగిలయ్యకు కేసీఆర్ రూ. కోటి నజరానా
తెలంగాణకు చెందిన ‘కిన్నెర’ కళాకారుడు దర్శనం మొగిలయ్యకు తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించారని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.
‘‘హైదరాబాద్‌లో నివాసయోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయలను కేసీఆర్ ప్రకటించారు.
దర్శనం మొగిలయ్య తాజాగా ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా మొగిలయ్యను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడన్నారు.
మొగిలయ్యకు పద్మశ్రీ పురస్కారం లభించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. పద్మశ్రీ మొగిలియ్యకు నివాసయోగ్యమైన ఇంటిస్థలంతో పాటు నిర్మాణానికి అయ్యే ఖర్చు కోటి రూపాయలను నీఎం కేసీఆర్ ఈసందర్భంగా ప్రకటించారు.
ఇందుకు సంబంధించి మొగిలయ్యతో సమన్వయం చేసుకోవాలని, కావాల్సిన ఏర్పాట్లను చూసుకోవాలని, ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సీఎం ఆదేశించారు.
ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని గౌరవ వేతనాన్ని కూడా అందిస్తున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి పునరుద్దాటించారు’’అని కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ బయోటెక్ కోవిడ్-19 చుక్కల వ్యాక్సీన్ మూడో దశ పరీక్షలకు అనుమతి
కోవిడ్-19 వ్యాధికి దేశీయ జౌషధ దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'బీబీవీ 154" అనే చుక్కల మందు టీకా (నాసల్ వ్యాక్సిన్) మూడో దశ క్లినికల్ పరీక్షలు నిర్వహించడానికి భారత జౌషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి ఇచ్చిందని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.
‘‘ప్రాథమికంగా ఇచ్చే రెండు డోసులతో పాటు, బూస్టర్‌కు అనువుగా క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తారు.
టీకా ఇవ్వటం, నిల్వ, పంపిణీలో ఉన్న సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుంటే చుక్కల మందు టీకా ఎంతో మేలైనది అవుతుందని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల గతంలో పేర్కొన్నారు.
దీనికి సిరంజి, సూదుల అవసరం ఉండదు. త్వర త్వరగా టీకాలు ఇవ్వొచ్చు. మూడో దశ క్లినికల్ పరీక్షలు మూడు నెలల్లో పూర్తవుతాయని తెలుస్తోంది.
ఆ తర్వాత దీన్ని వినియోగించడానికి అనుమతి లభిస్తే, కరోనా వ్యాధికి అందుబాటులోకి వచ్చిన చుక్కల మందు టీకా ఇదే అవుతుంది’’అని కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Facebook/Sudhakar
సాహితీవేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మృతి
‘నిరుపేద, మధ్యతరగతి నుంచి వచ్చిన అజ్ఞానిని నేను.. కవిని కాదు’అంటూనే ఎన్నో రచనలు చేసిన ప్రముఖ కవి, సాహితీవేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్ (63) హఠాన్మరణం చెందారని సాక్షి ఓ కథనం ప్రచురించింది.
‘‘హైదరాబాద్ గోపన్‌పల్లిలోని స్వగృహంలో నివసిస్తున్న ఆయనకు గురువారం అర్ధరాత్రి దాటాక గుండెపోటు రావ డంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
సుధాకర్‌కు ఇద్దరు కూతుళ్లు మానస, మనోజ్ఞ. ఆయన భార్య డాక్టర్ పుట్ల హేమలత రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర మనోవేదనతోనే ఉన్నారు. కరోనా వచ్చి తాను కూడా తన హేమ వద్దకు వెళ్లిపోతే బాగుండునని సన్నిహితుల వద్ద తరచూ ఆవేదన వ్యక్తం చేసేవారు.
నారాయణగూడలోని సిమెట్రీలో శుక్రవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరిగాయి.
ఎండ్లూరి సుధాకర్ 1959 జనవరి 21న నిజామాబాద్‌లోని పాముల బస్తీలో ఉన్న అమ్మమ్మ ఇంట్లో జన్మించారు. తల్లిదండ్రులు ఎండ్లూరి దేవయ్య, శాంతాబాయిలకు సుధాకర్ ప్రథమ సంతానం. ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు.
నిజామాబాద్‌లో తన 12వ ఏట వరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన సుధాకర్... ఆ తర్వాత హైదరాబాద్ నల్లకుంట ప్రాచ్య కళాశాలలో ఒరియంటల్ విద్య, ఓయూలో ఎంఏ, ఎంఫిల్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలంలో పీహెచ్‌డీ చేశారు. ’’అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Facebook/G D Jagadish
మాజీ సీఎం యడియూరప్ప మనవరాలు ఆత్మహత్య
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మనవరాలు సౌందర్య ఆత్మహత్య చేసుకున్నారని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
‘‘బెంగళూరు వసంత్ నగర్‌లోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆమె ప్రాణాలు తీసుకున్నారు. యడ్యూరప్ప పెద్ద కూతురు పద్మ కుమార్తె అయిన సౌందర్య ఎంఎస్ రామయ్య హాస్పటల్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు.
రెండేళ్ల క్రితం డాక్టర్ నీరజ్‌తో ఆమెకు వివాహం కాగా ఆరు నెలల క్రితం బిడ్డకు జన్మనిచ్చారు.
ఉదయం 10 గంటల సమయంలో పనిమనిషి కాలింగ్ బెల్ కొట్టినా తలుపులు తెరవకపోవడంతో డాక్టర్ నీరజ్‌కు ఫోన్ చేశారు.
హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన ఆయన తలుపులు తెరిచి చూడగా బెడ్ రూంలో సౌందర్య ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు.
సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ హాస్పిటల్‌కు తరలించారు. సౌందర్య పోస్ట్ డెలివరీ డిప్రెషన్ తో బాధపడేవారు.’’అని ఆ కథనంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- RRB: ఇరుకు గదులు.. ఖాళీ జేబులు.. కళ్లల్లో కొలువుల కలలు
- జయప్రకాశ్ నారాయణ్ భార్య బ్రహ్మచర్యం ఎందుకు స్వీకరించారు? జేపీని ప్రేమించిన యువతికి కరెంట్ షాకులు ఎందుకు ఇచ్చారు?
- తెలంగాణలో భూముల ధరలు పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు
- కిమ్ జోంగ్ ఉన్ భయపడుతున్నారా? పెడుతున్నారా? ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు ఎందుకు?
- 'దేవుడు నా బ్రా కొలతలు తీస్తున్నాడు' అంటూ శ్వేత తివారి వివాదాస్పద వ్యాఖ్యలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










