అమెరికా-కెనడా సరిహద్దులో మైనస్ 35 డిగ్రీల చలిలో 11 గంటలు నడిచి.. గడ్డకట్టుకుపోయి, ప్రాణాలు కోల్పోయిన కుటుంబం

సరిహద్దు దాటేందుకు పటేల్ కుటుంబం 11 గంటల పాటు గడ్డకట్టే చలిలో నడక సాగించిందని కొంతమంది చెబుతున్నారు

ఫొటో సోర్స్, BBC GUJARATI

ఫొటో క్యాప్షన్, సరిహద్దు దాటేందుకు పటేల్ కుటుంబం 11 గంటల పాటు గడ్డకట్టే చలిలో నడక సాగించిందని కొంతమంది చెబుతున్నారు
    • రచయిత, హోలీ హాండ్‌రిచ్
    • హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్

భారతీయ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తుల మరణం, మానవ అక్రమ రవాణా ముఠాలతో ముడిపడి ఉన్నట్లు కెనడా అధికారులు భావిస్తున్నారు. అమెరికా-కెనడా సరిహద్దుకు కొన్ని అడుగుల దూరంలో వీరి మృతదేహాలను అధికారులు కనుగొన్నారు.

కెనడాలోని మానిటోబా సమీపంలో విపరీతమైన మంచు కారణంగా చలికి గడ్డకట్టుకొని ఈ నలుగురు మరణించారు. వీరిని జగదీశ్ పటేల్ (39), వైశాలిబెన్ పటేల్ (37), వీరి పిల్లలు విహాంగి (11), ధార్మిక్ (3)లుగా గుర్తించారు.

పటేల్ కుటుంబం కాలినడకన అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్ 35 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి.

జనవరి 19న, సరిహద్దుకు ఉత్తరాన కొన్ని అడుగుల దూరాన ఉన్న పొలంలో ఈ కుటుంబాన్ని కనుగొన్నారు.

కెనడాలోని భారత హైకమిషన్‌తో పాటు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు (ఆర్‌సీఎంపీ) వీరి మృతిని ధ్రువీకరించారు.

పటేల్ కుటుంబం టొరెంటో వెళ్లే విమానంలో జనవరి 12న కెనడాకు వచ్చారని ఆర్‌సీఎంపీ సూపరింటెండెంట్ రాబ్ హిల్ గురువారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. అక్కడి నుంచి మానిటోబాకు, ఆ తర్వాత జనవరి 18న సరిహద్దు పట్టణమైన ఎమర్సెన్‌ను చేరుకున్నట్లు ఆయన తెలిపారు. జనవరి 19వ తేదీ రాత్రి వారి మృతదేహాలను కనుగొన్నారు.

కెనడా-యూఎస్ సరిహద్దు వద్ద ఎలాంటి వాహనం కనిపించలేదు. అంటే దీనర్థం పటేల్ కుటుంబాన్ని ఎవరో వాహనంలో ఇక్కడ వదిలి వెళ్లి ఉంటారు. ఆ తర్వాత వారు అమెరికా సరిహద్దు దాటడానికి నడవడం ప్రారంభించారు.

మంచు

ఫొటో సోర్స్, RCMP MANITOBA

''కెనడా గురించి తెలియని ఒక కుటుంబం దేశవ్యాప్తంగా పర్యటించడానికి చాలా సమయం కేటాయించింది. ఈ కుటుంబం ప్రయాణించడానికి ఎవరో సహాయపడి ఉంటారు'' అని హిల్ భావిస్తున్నారు.

జనవరి 19వ తేదీ సాయంత్రం, మరో ఏడుగురు భారతీయుల బృందం కూడా సరిహద్దు ఏజెంట్ల చేతికి చిక్కింది. ఈ బృందంతో పటేల్ కుటుంబానికి సంబంధం ఉందా అనే ప్రశ్నకు ఆర్‌సీఎంపీ స్పందించలేదు.

పటేల్ కుటుంబాన్ని గుర్తించిన తర్వాత, అదే రోజు రాత్రి సరిహద్దుల్లో 15 మందితో కూడిన వ్యాన్‌ను నడిపిస్తోన్న స్టీవ్ శాండ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్లోరిడాకు చెందిన 47 ఏళ్ల స్టీవ్ శాండ్‌పై మానవ అక్రమ రవాణా కేసును నమోదు చేశారు.

స్టీవ్ శాండ్ వాహనంలో ప్రయాణిస్తోన్న ఇద్దరు భారతీయులను కనుగొన్నారు. వాహనంలో పెద్ద ఎత్తున ఆహారపదార్థాలు, నీరు లభ్యమైంది.

మానిటోబాలోని భారత సమాజాన్ని పటేల్ కుటుంబం మృతి వార్త కలిచివేసింది.

''అక్కడ ఏదో తప్పు జరిగినట్లుగా అపరాధభావం తొలిచివేస్తుంది'' అని మానిటోబా భారత సంఘం అధ్యక్షుడు రమణ్‌దీప్ గ్రేవల్, బీబీసీతో చెప్పారు.

కెనడాలోని తీవ్రమైన శీతాకాల వాతావరణంలో రాత్రివేళలో పటేల్ కుటుంబం కాలినడకన ఎందుకు బయల్దేరాల్సి వచ్చిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

పటేల్ కుటుంబం 11 గంటల పాటు నడిచిందనే ఊహాగానాలు విన్నట్లు గ్రేవల్ చెప్పారు. ''ఆ స్థాయి చలిని కొన్ని నిమిషాల పాటు కూడా తట్టుకోలేం. అలాంటిది గంటలపాటు అంటే నమ్మశక్యంగా లేదు'' అని ఆయన అన్నారు.

విన్నిపెగ్‌లో నివసించే భారతీయ సమాజాన్ని పటేల్ కుటుంబ మరణవార్త బాధించిందని ప్రవాస భారతీయుడు హేమంత్ షా అన్నారు. పటేల్ కుటుంబం కోసం ఆయన వర్చువల్ ప్రార్థన సమావేశాన్ని నిర్వహించారు.

''ఇక్కడ చాలా పటేల్ కుటుంబాలు ఉన్నాయి. ఇండో-కెనడియన్లు కూడా ఉన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ సంఘటన గురించే తమకు తోచిన విధంగా మాట్లాడుకుంటున్నారు'' అని హేమంత్ షా వివరించారు.

వీడియో క్యాప్షన్, సహారా: ఎడారిలో హిమపాతం

''కెనడాలో ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు చూడలేదు. వినలేదు'' అని షా చెప్పారు.

పటేల్ కుటుంబం కెనడాకు ఎలా చేరుకుంది? అమెరికా, ఇండియాలో ఎలా సమన్వయం చేసుకుందో తెలుసుకోవడానికి ఆర్‌సీఎంపీ ముమ్మర దర్యాప్తును ప్రారంభించింది. పటేల్ కుటుంబానికి అమెరికాలో లేదా కెనడాలో కుటుంబ సభ్యులు ఉన్నారా అనే విషయంపై కూడా ఇంకా స్పష్టత లేదు.

ఈ కేసు దర్యాప్తులో కెనడా అధికారులకు సహాయపడేందుకు భారత అధికారి నేతృత్వంలోని ఒక బృందాన్ని మానిటోబాకు పంపించారు. టొరెంటోలోని భారత కాన్సులేట్ జనరల్, పటేల్ బంధువులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

''పటేల్ కుటుంబం కేసు దర్యాప్తుతో పాటు మానవ అక్రమ రవాణాకు సంబంధించిన కేసును కూడా దర్యాప్తు చేస్తున్నట్లు'' గత వారం యూఎస్ హోంల్యాండ్ భద్రతా అధికారి చెప్పారు. మానవ అక్రమ రవాణాలో స్టీవ్ శాండ్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

శాండ్‌ను అదుపులోకి తీసుకున్న ప్రదేశంలోనే డిసెంబర్, జనవరి నెలల్లో మూడు మానవ అక్రమ రవాణా కేసులు నమోదైనట్లు కోర్టు పత్రాల ద్వారా తెలుస్తోంది.

పటేల్ కుటుంబం తరహాలో సరిహద్దు దాటాలనే ఆలోచనల్లో ఉన్న ఇతర కుటుంబాలు ఇలాంటి ఆలోచనలను మానుకోవాలని భారత సంఘం అధ్యక్షుడు గ్రేవల్ సూచించారు.

''ఇలాంటి ఆలోచనల్లో ఎవరైనా ఉంటే, ఈ విధంగా సరిహద్దు దాటాలని ప్రయత్నాలు చేస్తుంటే, వాటిని వదిలివేయండి. సరిహద్దు దాటడంలో మీకు సహాయపడతామని చెప్పే వారి మాటలను దయచేసి వినకండి. అలా వెళ్లకండి'' అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)