రష్యా విమాన ప్రమాదం: కొనసాగుతున్న సహాయచర్యలు

రష్యాలో 71 మందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడం వెనక కారణాలను తెలుసుకోవడానికి సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. రాత్రంతా మంచులో సైతం వారు తమ ఆపరేషన్‌ను కొనసాగించారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మానవ తప్పిదం, సాంకేతిక సమస్యలు.. వీటిలో ఏదో ఒకటి ప్రమాదానికి కారణమై ఉండవచ్చని, తీవ్రవాద చర్యకు అవకాశం ఉంటుందనుకోవడం లేదని అధికారులు భావిస్తున్నారు.
ప్రమాదం జరిగిన ప్రాంతం అర్గునోవో మాస్కోకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విమానం కూలిన తర్వాత ఆ ప్రాంతంలో ప్రయాణికుల శరీర భాగాలు, విమాన శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
మంచు తీవ్రంగా ఉండటంతో సహాయక బృందాలు తమ వాహనాలను ప్రమాద స్థలానికి దూరంగా నిలిపి చాలా దూరం నడిచి అక్కడకు చేరుకోగలిగారు.
"మా ఆపరేషన్ పూర్తి కావడానికి, ప్రాథమికంగా ఓ అంచనాకు రావడానికి కనీసం ఓ రోజు పడుతుంది" అని సహాయక చర్యలకు నేతృత్వం వహిస్తున్న విచారణ బృందం ప్రతినిధి స్వెత్లానా పెట్రెంకో తెలిపారు.
ప్రమాదానికి ముందు ఏఎన్-148 విమానం నుంచి ఎలాంటి అత్యవసర సంకేతాలు అందలేదని, ఫ్లైట్ రికార్డర్‌ను స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు.

ఫొటో సోర్స్, Flighradar24
విమానం కూలిపోతున్న సమయంలో మండిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతి చెందినవారిలో ఓ చిన్నారితోపాటు ఇద్దరు బాలురు కూడా ఉన్నారు.
ఆర్స్క్ విమానాశ్రయం మృతుల బంధువుల రోదనలతో నిండిపోయింది.
ప్రమాదానికి గురైన విమానాన్ని చాలా అనుభవజ్ఞుడైన పైలట్ నడిపారని ఎయిర్ లైన్స్ సంస్థ తెలిపింది.
ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణకు అధికారులు ఆదేశించారు. మృతి చెందినవారి కుటుంబాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తన సంతాపాన్ని ప్రకటించారు.
ప్రమాదాలు కొత్త కాదు
ఇటీవలి కాలంలో రష్యన్ ఎయిర్‌లైన్స్‌లో రెండు భారీ ప్రమాదాలు సంభవించాయి.
- 2016 డిసెంబర్ 25న ‘టీయూ-154 మిలిటరీ ఎయిర్‌లైనర్’ నల్ల సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 92మంది చనిపోయారు.
- 2015 అక్టోబర్ 31న ‘రష్యన్ ఎయిర్‌బస్ ఏ321’ విమానం ఈజిప్ట్‌లో కూలిపోయింది. ఈ ఘటనలో 224మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి కారణం తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Air Team Images
నిషేధానికి గురైన ఎయిర్‌లైన్స్
ఆదివారంనాడు కూలిన విమానం సారటోవ్ సంస్థకు చెందింది.
2015లో ఈ విమానయాన సంస్థ అంతర్జాతీయ సర్వీసులు నిర్వహించకుండా నిషేధానికి గురైంది. కాక్‌పిట్‌లో విమాన సిబ్బంది కాకుండా బయటి వ్యక్తులు ఉన్నట్లు తనిఖీ సిబ్బంది గుర్తించడమే దీనికి కారణం.
2016లో సారటోవ్ ఎయిర్‌లైన్స్ తమ పాలసీని మార్చుకొని ప్రభుత్వ అనుమతితో అంతర్జాతీయ సర్వీసులను తిరిగి ప్రారంభించింది.
ఈ సంస్థ విమానాలు ప్రధానంగా రష్యన్ నగరాల్లోనే ప్రయాణిస్తాయి. అర్మేనియా, జార్జియా లాంటి దేశాలకూ సేవలందిస్తాయి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








