పాకిస్తాన్‌లో హిమపాతం: ‘కొన్ని గంటల్లోనే నాలుగైదు అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది’

మంచు తుపాను

ఉత్తర పాకిస్తాన్‌లో సంభవించిన ఘోరమైన మంచు తుపాను కారణంగా కార్లలో చిక్కుకుపోయిన వందలాది మందిని సురక్షితంగా తరలించారు. అక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారు రోడ్లను క్లియర్ చేయడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ప్రముఖ పర్యాటక ప్రాంతం, హిల్‌స్టేషన్ అయిన మర్రీలో కురుస్తోన్న అసాధారణ శీతాకాలపు మంచును చూడటానికి పర్యాటకులు పోటెత్తారు.

దీని కారణంగానే 500 కుటుంబాలకు చెందిన పర్యాటకులు మంచులో చిక్కుకుపోయారని పోలీసులు చెప్పారు.

కనీసం 22 మంది ఈ ప్రమాదంలో మరణించారని అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఉండగా, మరో కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడినట్లు వెల్లడించారు.

మంచు తుపాను

ఫొటో సోర్స్, ISPR/HANDOUT VIA REUTERS

శుక్రవారం కురిసిన మంచు తుపాను కారణంగా చెట్లు కూలిపోయాయి. మర్రీ లోపలికి, బయటకు వచ్చే రహదారులన్నీ మంచుతో కూరుకుపోయాయి.

వాహనాల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీశారు. ప్రస్తుతం వీరంతా క్షేమంగా ఉన్నారు. వీరిలో కొందరిని, రిసార్ట్ ‌టౌన్‌కు తరలించారు. ఈ ప్రాంతం సముద్రమట్టానికి 2300 మీటర్ల (7500 అడుగులు) ఎత్తులో ఉంటుంది.

మంచు తుపాను

ఈ ప్రాంతంలో గ్యాస్, నీటి సరఫరా సరిపడినంత లేదు. స్థానికులు, రెస్టారెంట్ల నిర్వాహకులు పర్యాటకులకు ఆహారం, వసతి, దుప్పట్లు అందిస్తూ సహాయం చేస్తున్నారు.

''మంచు తుపాను వల్ల కొన్ని గంటల్లోనే నాలుగు నుంచి ఐదు అడుగుల మేర మంచు మేట వేసిందని'' మర్రీ సమీప ప్రాంతమైన నతియాగలి పట్టణానికి చెందిన ఒక అధికారి తారిక్ ఉల్లా వార్తా సంస్థ ఏఎఫ్‌పీతో చెప్పారు.

ISPR/HANDOUT VIA REUTERS

ఫొటో సోర్స్, ISPR/HANDOUT VIA REUTERS

''దీన్ని మంచు అనకూడదు. భారీ మంచు అని కూడా చెప్పలేం. అంతకుమించి, అరుదైన రీతిలో మంచు కురిసింది'' అని ఆయన చెప్పారు.

''చాలా బలంగా గాలి వీచింది. చెట్లు వేళ్లతో సహా నేలకూలాయి. హిమపాతం ఘోరంగా కురిసింది. చుట్టుపక్కల ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు'' అని ఆయన వివరించారు.

మంచు తుపాను

ఫొటో సోర్స్, SANIA DAWOOD

సోషల్ మీడియాలో కనిపిస్తోన్న ఫొటోలు, వీడియోల్లో... కార్లు మొత్తం మంచులో కూరుకుపోయినట్లు, ఒక దాని వెనకే మరొకటి ఇరుక్కున్నట్లు కనిపిస్తున్నాయి.

అత్యవసర సేవల విభాగం అందించిన సమాచారం ప్రకారం మరణించిన వారిలో 10 మంది చిన్నారులు ఉన్నారు. కార్లలోనే గడ్డకట్టుకుపోయి కనీసం ఆరుగురు చనిపోయారని పోలీసులు వెల్లడించారు.

మంచు తుపాను

ఫొటో సోర్స్, PTV/REUTERS

మంచులో చిక్కుకుపోయాక, కార్లలో వెచ్చదనం కోసం ప్రయత్నిస్తూ పొగలను పీల్చడం ద్వారా ఊపిరాడకపోవడం వల్ల మరికొందరు మరణించి ఉంటారని భావిస్తున్నారు.

మంచు తుపాను

ఫొటో సోర్స్, UMAIR ABBASI

''పర్యాటకుల మరణాల పట్ల తీవ్రంగా కలత చెందానని'' శనివారం పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. హిమపాతం ఎలా ఉందో, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తనిఖీ చేయకుండా పర్యాటకులను అనుమతించడం జిల్లా యంత్రాంగం సన్నద్ధతలేమిని తెలియజేస్తుందని ఆయన అన్నారు.

''ఈ దుర్ఘటన ఎలా జరిగింది?, పర్యాటకుల రద్దీకి తగినట్లు ఏర్పాట్లు ఎందుకు చేయలేదని'' ప్రతిపక్ష నేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్ ప్రశ్నించారు.

మంచు తుపాను

ఫొటో సోర్స్, RESCUE 1122

రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని పంజాబ్ ప్రావిన్సు ప్రభుత్వం తెలిపింది.

''అత్యున్నత స్థాయి విచారణను ప్రారంభిస్తాం. ఈ ప్రమాదానికి నిర్లక్ష్యం ఒక కారణంగా ఉంటే, దానితో సంబంధం ఉన్న అందరిపై కఠిన చర్యలు తీసుకుంటాం'' అని అధికార ప్రతినిధి హసన్ ఖావర్ చెప్పారు.

మంచు తుపాను

ఫొటో సోర్స్, KAZIM ABBASI

19వ శతాబ్ధంలో బ్రిటీష్ వారు, తమ వలస దళాలకు వైద్య స్థావరంగా మర్రీని నిర్మించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)