గూగుల్‌లో అనుకున్న వాటిని సులభంగా ఎలా వెతికి పట్టేయాలో మీకు తెలుసా?

గూగుల్ సెర్చ్

ఫొటో సోర్స్, Getty Images

ఒకప్పుడు 'ఒక ప్రాంతానికి ఏ దారిలో వెళ్ళాలి?', 'ఎక్కడ ఏ షాపులు బాగుంటాయి' అనే రోజూవారీ ప్రశ్నలకు చుట్టుపక్కల ఉన్న మనుషులనే అడిగి సమాధానం తెలుసుకునేవాళ్లం.

'ఐన్‍స్టీన్ కనిపెట్టిన థియరీ ఆఫ్ రిలేటివిటి ఏంటి?, షేక్స్‌పియర్ రాసిన కామెడీ నాటకాల పేర్లేంటి? లాంటి ప్రశ్నలకి నిపుణులని అడిగి తెలుసుకునేవాళ్ళం.

ఆ రోజులు గతంగా మారాయి. ఇప్పుడు వేరే వాళ్లను ఏదైనా అడుగుతున్నా, 'గూగుల్ చేసి చూడకపోయావా?, ఏం, గూగుల్ లో కనిపించలేదా?' అని వాళ్ల నుంచి ఎదురు ప్రశ్నలు వస్తున్నాయి.

ఇంటర్నెట్‍ని సెర్చ్ చేయడం అనేది ఒక సౌలభ్యం నుంచి అవసరంగా మారిపోయి చాన్నాళ్లైంది.

సాధారణంగా చిరపరిచితమైన గూగుల్ సెర్చ్ బార్‍లో ఆ క్షణాన మనకు అవసరం అయ్యింది ఏదో కొన్ని పదాల్లో కొట్టేస్తాం. వాటి ఆధారంగా, దానికి అర్థమైనంతవరకూ, దాని దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి మనకు ఫలితాలను చూపిస్తుంది.

ఒకటా రెండా, అది వాటిని కుప్పలు తెప్పలుగా తెచ్చి మన ముందు పోస్తుంది. ఒక్కోసారి వాటిలో వెదుక్కోవడం కూడా మనకు చాలా కష్టం అయిపోతుంది.

మనం ఒకటి అడగాలనుకుంటే, అది ఇంకొకటి ఏదో చూపిస్తుంది. అలాంటి గందరగోళం అవసరం లేకుండా చాలా సరళమైన టెక్నిక్స్‌తో మనం గూగుల్ సర్చ్ చేస్తే, అవసరమైన సమాచారం త్వరగా పొందచ్చు.

మనం అడిగే తీరు మార్చుకుంటే అది చూపించే విధానం కూడా మార్చుకుంటుంది. అందుకే, సెర్చ్‌లో మనం ఎలా అడగాలో, ఆ టెక్నిక్స్ కొన్ని తెలుసుకుందాం.

గూగుల్ సెర్చ్

ఫొటో సోర్స్, Getty Images

అంతర్జాలాన్ని జల్లెడ పట్టాలంటే...

1. ఒకే వెబ్‍సైట్‍లో వెతుకు

మీకు కావాల్సిన సమాచారాన్ని ఒకే వెబ్‍సైట్‍లో వెతికి పెట్టమని చెప్పడానికి ఆ సైట్ URLను సెర్చ్ బార్‍లో [keywords] site:<url> ఇచ్చినట్లు టైప్ లేదా పేస్ట్ చేస్తే.. ఆ సైటులో మాత్రమే వెతికి మీకు ఆ సమాచారాన్ని అందిస్తుంది.

మనకి కావాల్సిన సమాచారం కచ్చితంగా ఒక వెబ్‌సైట్‌లో ఉంటుంది అని తెలిసినప్పుడు ఇలాంటి సెర్చ్ ఉపయోగించవచ్చు.

ఉదాహరణకు టెక్నాలజీ site:bbc.com/telugu అని టైప్ చేసి సెర్చ్ చేస్తే బీబీసీ తెలుగులో టెక్నాలజీ గురించి వచ్చిన ఆర్టికల్స్ అన్నీ కనిపిస్తాయి.

2. ఒకటే సోర్స్ నుంచి వార్తలు వెతుకు

ఈ మధ్య రకరకాల వెబ్ న్యూస్ ఛానెళ్ళు, న్యూస్ వెబ్‍సైట్లు విపరీతంగా పెరగడంతో ఏ వార్తలు నమ్మాలో, ఏది ఫేక్ న్యూసో తెలీకుండా అయిపోయింది.

ఇలాంటి సమయాల్లో మనకి నమ్మకంగా అనిపించే సోర్స్ నుంచి వార్తలని చూపించమని గూగుల్‍కు ప్రత్యేకించి చెప్పచ్చు,

దానికి మనం [keywords] source:[మీకు నమ్మకం ఉన్న సోర్స్] టైప్ చేసి సెర్చ్ చేయాలి.

ఉదాహరణకు కరోనా వార్తలు తెలుసుకోవాలంటే 'కరోనా source:bbc telugu టైప్ చేసి సెర్చ్ చేస్తే బీబీసీ తెలుగులో ఉన్న కరోనా వార్తలన్నీ చూపిస్తుంది.

గూగుల్ సెర్చ్

ఫొటో సోర్స్, Getty Images

3.టైటిల్స్‌లో మాత్రమే వెతుకు

ఒక్కోసారి మనకి ఎక్కడో ఏదో హెడ్‍లైన్ చూసినట్లు గుర్తుంటుంది, కానీ మనకు దానిలో ఒక పదం మాత్రమే గుర్తొస్తుంటుంది. దాన్ని ఎక్కడ చదివామో గుర్తుకు రాదు. లేదంటే మనం ఒక టాపిక్ గురించి వచ్చే వార్తలని జల్లెడ పట్టాల్సిన అవసరం పడచ్చు.

అలాంటప్పుడు intitle: అనేది వాడి సెర్చ్ చేయవచ్చు. గూగుల్ సెర్చ్ బార్‌లో [ప్రధానాంశం] intitle:[పదం] టైప్ చేసి సెర్చ్ కొట్టాలి.

ఉదాహరణకు కరోనా intitle:ఫేక్ న్యూస్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే కరోనా ఫేక్ న్యూస్ మీద వచ్చిన ఆర్టికల్స్ అన్నీ కనిపిస్తాయి. అ

4.టెక్స్ట్‌లో మాత్రమే వెతుకు:

పైన చెప్పినట్టు సెర్చ్ చేస్తే కేవలం టైటిల్‍లో మాత్రమే వెతుకుతుంది. అలా కాకుండా, మనకి ఆర్టికల్స్‌లో కూడా ఆ పదం కనిపించాలంటే, అప్పుడు intext: అనేది వాడుకోవచ్చు.

[ప్రధానాంశం] intext:[పదం] అని టైప్ చేసి సెర్చ్ చేస్తే, వెబ్‍పేజీల్లో ఆ పదం ఎక్కడున్నా, అది మనకి సెర్చ్‌లో కనిపిస్తుంది.

ఉదాహరణకు కరోనా intext:ఫేక్ న్యూస్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే టైటిల్స్ కాకుండా వెబ్‍ పేజీలో ఎక్కడ ఆ పదమున్నా వెతికి పట్టుకొస్తుంది.

5.ఫలానా ఫైల్ టైప్‍లోనే వెతుకు

ఇది విద్యార్థులకి బాగా పనికొచ్చే శోధన. మనం చదవాలనుకునే అంశం గురించి బోలెడు సమాచారం ఇంటర్నెట్‌లో ఉన్నప్పటికీ, అకడమిక్ పేపర్లు, పవర్‍పాయింట్ ప్రజెంటేషన్లు కావాల్సి వచ్చినప్పుడు, లేదా ప్రభుత్వ సైట్లల్లో అప్‍లోడ్ చేసే ఫైల్స్ వెతకాల్సి వచ్చినప్పుడు, కేవలం ఆ రకం ఫైళ్లనే జల్లెడ పట్టడానికి, filetype: అనే పదం వాడితే సరిపోతుంది.

మనం గూగుల్ సెర్చ్ బార్‌వో [keywords] filetype:<ఫైల్ టైప్> టైప్ చేసి సెర్చ్ చేస్తే ఆ పదంతో ఉన్న ఆ ఫైళ్లు మాత్రమే కనిపిస్తాయి.

సెర్చ్ చేసే ఫైల్ రకాలలో మనం pdf/doc/ppt/txt/xls లాంటివి ఇవ్వచ్చు.

ఉదాహరణకు కరోనా filetype:pdf అని సెర్చ్ చేస్తే అది కరోనాకు సమాచారం ఉన్న pdf ఫైళ్ళను మాత్రమే వెతికి పెడుతుంది.

మనకి కావాల్సిన సమాచారానికి దగ్గరగా వెళ్ళేందుకు కూడా కొన్ని సెర్చ్ పద్ధతులు ఉపయోగించవచ్చు.

గూగుల్ సెర్చ్

ఫొటో సోర్స్, Getty Images

6.ఏదైనా పదానికి అర్థం/నిర్వచనం కావాలంటే

మనం ఏదైనా పదానికి, పదబంధానికి అర్థం లేదా నిర్వచనం తెలుసుకోవాలని అనుకున్నప్పుడు గూగుల్‍ని అడిగితే అది చెబుతుంది.

అది తెలుసుకోడానికి మనం define:[keyword] టైప్ చేసి సెర్చ్ కొట్టాలి.

ఉదాహరణకు define:marketing అని సెర్చ్ చేస్తే మార్కెటింగ్ అనే పదానికి అర్థం చూపెడుతుంది.

ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇంగ్లిష్ పదం వెతకగానే గూగుల్ ఇన్-బిల్ట్ డిక్షనరీ నుంచి సమాధానం వస్తుంది. అక్కడే మరిన్ని పదాలకి అర్థం అడగడానికి సర్చ్ బార్ కనిపిస్తుంది.

కింద - వెబ్ బ్రౌజర్లో ఓపెన్ చేస్తే మనం అడిగిన పదాలని బట్టి ఒక క్విజ్ లాంటి ఆట కూడా కనిపిస్తుంది.

అయితే తెలుగు పదాలని సెర్చ్ చేసినప్పుడు మాత్రం ఇవ్వన్నీ కనిపించకపోవచ్చు. ఆ పదానికి ఏదైనా సైటులో అర్థం/నిర్వచనం కనిపిస్తే వాటినే చూపిస్తుంది. తెలుగు గూగుల్ డిక్షనరీ ఫీచర్ ఇంకా రాలేదు.

వీడియో క్యాప్షన్, నొప్పిని నంబర్లలో చూపించే టెక్నాలజీ.. ఇదెలా పనిచేస్తుందంటే..

7.మనం ఏదైనా ఒక వస్తువు ధర తెలుసుకోవాలంటే

మనం ఏదైనా కొనాలని అనుకుంటే, గూగుల్ ద్వారా మన బడ్జెట్‍కి తగిన ధరలు ఎక్కడున్నాయో తెలుసుకోవడం కూడా సాధ్యమే. దానికి మనం సెర్చ్ బార్‌లో ₹ సింబల్ టైప్ చేస్తే చాలు.

మనం కొనాలనుకునే ఒక మొబైల్ మోడల్ ధర ₹20 వేలు అయినప్పుడు, అంతకంటే తక్కువ ధరకు ఎక్కడైనా విక్రయిస్తున్నారా అని తెలుసుకోవాలని అనుకుంటే [keywords] ₹[number] టైప్ చేసిసెర్చ్ చేయచ్చు.

ఉదాహరణకు Samsung A50 ₹15000 అని సెర్చ్ చేయాలి.

8.వాతావరణం గురించి తెలుసుకోవాలంటే

మనం మామూలుగా గూకుల్లో "weather in Hyderabad", "temparature in Vizag" అని సెర్చ్ చేస్తుంటాం. అలా కాకుండా, నేరుగా weather: ఆ ప్రాంతం పేరు టైప్ చేస్తే సరిపోతుంది.

ఉదాహరణకు weather: Hyderabad టైప్ చేస్తే హైదరాబాద్ వాతావరణం తెలుస్తుంది.

ఇలాగే map: చార్మినార్ అని ఏదైనా ఒక ప్రాంతం మ్యాప్ సెర్చ్ చేయచ్చు.

ఆ ప్రాంతంలో రెస్టారెంట్లు మాత్రమే సెర్చ్ చేయాలంటే loc:"charminar" restaurants అని వెతకచ్చు. కంపెనీ స్టాక్స్ చూడ్డానికి stocks:apple అని సెర్చ్ చేసి చూడచ్చు.

ఒక సినిమాకు సంబంధించిన అన్ని వివరాల కోసం Movie: pushpa అని టైప్ చేసి సెర్చ్ చేయచ్చు..

గూగుల్ సెర్చ్

ఫొటో సోర్స్, Reuters

సమయం ప్రకారం సెర్చ్ రిజల్ట్స్

9.ఇటీవల సమాచారం మాత్రమే కావాలంటే

మనం ఏదైనా సెర్చ్ చేస్తున్నపుడు గూగుల్ అప్పటి వరకూ ఆ పేజీలకున్న రాకింగ్‍ని బట్టి వాటిలో మొదటిది చూపిస్తుంది. కానీ, ఒక్కోసారి మనక్కావాల్సిన తాజా సమాచారం వేరే పేజీల్లో ఉండచ్చు. అలాంటప్పుడు గూగుల్ హోమ్ పేజ్‍లో కనిపించే "Tools" మీద క్లిక్ చేసి, ఎన్ని గంటలు, రోజుల క్రితం అప్‍డేట్ అయిన సమాచారం కావాలో దానిని వెతకమని మనం గూగుల్‌కు చెప్పచ్చు. పైన ఫొటోలో ఇచ్చినట్లు..

10.గత సమాచారం వెతకాలంటే

గతంలో ఒక సమయంలో జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోలు, సమాచారం వెతుక్కోవాలంటే [keywords] [from_year]..[to_year] టైప్ చేసి పొందవచ్చు.

ఉదాహరణకు cricket world cup video 1995..2010 అని టైప్ చేస్తే అన్ని క్రికెట్ వరల్డ్ కప్ వీడియోలు చూపించకుండా, 1995 నుంచి 2010 వరకూ జరిగిన ప్రపంచ కప్ మ్యాచుల వీడియోలనే చూపిస్తుంది.

గూగుల్ సెర్చ్

ఫొటో సోర్స్, Getty Images/BBC

గూగుల్లో ఇమేజ్ సర్చ్

11.టూల్స్ ద్వారా ఇమేజ్ సర్చ్ చేయడం

ఇమేజ్‍ల సెర్చ్ విషయానికి వస్తే కొన్ని ఎక్కువ అంశాలని పరిగణలోకి తీసుకోవాల్సుంటుంది.

మనం ఫొటోల రంగు, సైజు, ఆర్ట్ టైప్ బట్టి వాటిని ఫిల్టర్ చేయవచ్చు. పైన ఇమేజ్‌లో చూపించినట్టు, "Tools" మీద క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి.

అలానే, ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఇటీవలి కాలంలోని ఇమేజెస్ మాత్రమే మనకు కావాలనుకుంటే "Time" మీద క్లిక్ చేసి మనకు అవసరమైన గడువు ఇవ్వచ్చు.

ఇమేజెస్ విషయంలో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం "Usage Rights", అంటే ఇమేజెస్ వాడుకునే హక్కు మనకు ఉందా, లేదా అని తెలుసుకోవడం.

ఇమేజ్‍లు చాలా వరకూ కాపీరైట్స్ కిందే ఉంటాయి. మనం ఇంకెక్కడన్నా ఈ ఇమేజ్‍లని వాడాలనుకుంటే వాటి లైసెన్స్ ఎలా ఉందో చూసుకుని దానికి తగ్గట్టు క్రెడిట్స్ ఇవ్వడమో, లేక డబ్బు పెట్టి కొనుక్కోవడమో చేయాలి.

లేదంటే, కాపీరైట్ ఉల్లంఘన కింద మనం రూపొందించిన కంటెంట్‍ని తీసేసే ప్రమాదం ఉంది. అందుకే, యూట్యూబ్ వీడియోల్లో, ఇతర అంశాల్లో ఇమేజెస్ వాడదల్చుకుంటే మొదట వాటి లైసెన్స్ చూసుకోవాలి.

మనకు ఈ గొడవంతా వద్దు అనుకుంటే 'క్రియేటివ్ కామన్స్ లైసెన్స్' సెలెక్ట్ చేసుకుని ఆ ఇమేజెస్ వాడుకుంటూ క్రెడిట్ ఇవ్వడం మంచి పద్ధతి.

వీడియో క్యాప్షన్, గూగుల్‌ డుప్లెక్స్: అచ్చం మనిషిలాగే మాట్లాడుతుంది!

12.అడ్వాన్స్ ఇమేజ్ సర్చ్

గూగుల్ అడ్వాన్స్ ఇమేజ్ సెర్చ్ లింక్‍లోకి వెళ్తే (లింక్ ఇక్కడ) ఇందులో, పైన చెప్పిన సింపుల్ ఫిల్టరింగ్ కంటే ఎక్కువ కచ్చితత్వంతో సెర్చ్ చేసుకోవచ్చు. ఒక ప్రాంతం నుంచి పబ్లిష్ అయిన ఇమేజ్‍లే వచ్చేంత లోతుగా వెతికిపట్టవచ్చు.

గుర్తుంచుకోవాల్సిన కొన్ని సంగతులు…

పైన మనం చెప్పుకున్నవన్నీ బాగా తెలిసిన, గూగుల్ వెబ్‍సైట్‍లో కనిపించే విషయాలే అయినా, మనం కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం.

1.పైన ఇచ్చిన సెర్చ్ పద్ధతుల్లో ఎక్కడ ':' టైప్ చేసినా దాని తర్వాత స్పేస్ ఇవ్వకూడదు. ఇస్తే సెర్చ్ మనం కోరుకున్నట్లు ఉండదు.

2.అన్ని సార్లు, అన్ని సెర్చ్ టర్మ్స్ ఫలితం మనం కోరుకున్నట్లు ఉండకపోవచ్చు. మనం అడిగే సమాచారం గూగుల్ దగ్గర ఎంత ఉంది, అది ఏ రాంకింగ్‍లో ఉంది అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది.

3.పై కారణాల వల్ల తెలుగులో ఇవన్నీ అన్ని సెర్చ్ కీవర్డ్స్ మీదా పనిజేయకపోవచ్చు. తెలుగు కంటెంట్‍ని గూగుల్ ఎంత సమర్థవంతంగా క్రాల్ చేసి, రాంకింగ్ చేస్తే, ఇవి అంత సమర్థవంతంగా పనిజేస్తాయి.

4.గూగుల్ వాడే అత్యధిక శాతం మంది ఈ టెక్నిక్స్ ఉపయోగించరు. ఇంటర్నెట్‌ను బాగా జల్లెడ పట్టాలి అనుకునేవాళ్ళు, ఇలాంటి టూల్స్ ఎక్కువగా వాడతారు. అందుకే ఇలాంటివి కొన్ని ప్రయత్నించినప్పుడు గూగుల్‍కి మీపై అనుమానం వచ్చి, మనల్ని రోబోగా భావించి, మనిషేనని నిరూపించమని అడగవచ్చు. అలాంటప్పుడు అది ఇచ్చే చిన్న చిన్న పరీక్షల్లో పాస్ అయితే సరిపోతుంది. మన సెర్చ్ చేసే విధానం దానికి అలవాటు పడితే, తర్వాత అదే సర్దుకుంటుంది.

కాస్త మెలకువతో ఈ చిన్న చిన్న టెక్నిక్కులు పాటిస్తే అంతటి గూగుల్ కూడా మీరు చెప్పినట్టే వింటుంది. మీక్కావాల్సిందే చేసి పెడుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)