లియోనార్డ్ డికాప్రియో: కామెరూన్ అడవిలో చెట్టుకు హాలీవుడ్ హీరో పేరు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హెలెన్ బ్రిగ్స్
- హోదా, బీబీసీ సైన్స్
కామెరూన్ అడవిలో మాత్రమే పెరిగే ఒక చెట్టుకు క్యూ గార్డెన్స్‌లోని రాయల్ బొటానిక్ గార్డెన్స్ శాస్త్రవేత్తలు ‘ఉవారియోప్సిస్ డికాప్రియో’ అనే పేరును పెట్టారు. ఈ వర్షాధార అడవి నాశనం కాకుండా ఉండేందుకు లియోనార్డో డికాప్రియో చేసిన సహాయానికి గౌరవ సూచికగా ఈ పేరును పెట్టినట్లు తెలిపారు.
"చెట్లను కొట్టేయడం వల్ల ఎబో అడవి వినాశనం కాకుండా ఆయన కీలక పాత్ర పోషించారు" అని క్యూకు చెందిన డాక్టర్ మార్టిన్ చీక్ చెప్పారు.
ఈ అడవిలోని చెట్లను నరికివేసేందుకు అనుమతులు ఇస్తున్నట్లు విన్న వెంటనే శాస్త్రవేత్తలు, వనసంరక్షకులు ఆందోళన చెందారు.

ఫొటో సోర్స్, LornaMacKinnon
ఇది మధ్య ఆఫ్రికాలోని వర్షాధార అడవి. ఈ అడవి బానెన్ జాతికి చెందిన ప్రజలతో పాటు ఎన్నో వృక్షజాతులు, జంతుజాలానికి ఆవాసం. అంతరించిపోయే ముప్పు ఉన్న గొరిల్లాలు, చింపాంజీలు, అడవి ఏనుగులకూ ఇది ఆవాసం.
ఇక్కడి జీవ జాతులు అంతరించిపోయే ముప్పు ఉందంటూ అంతర్జాతీయ నిపుణులు ప్రభుత్వానికి లేఖను రాశారు. ఈ అంశాన్ని డికాప్రియో కూడా లేవనెత్తారు. ఆయన రాసిన సోషల్ మీడియా పోస్టులకు కొన్ని లక్షల మంది ఫాలోవర్లు కూడా జత కావడంతో ఈ ఉద్యమం మరింత ముందుకువెళ్లింది.
దాంతో, ఈ అడవిలో చెట్లు నరికేందుకు ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయితే, ఈ అడవిని ఇంకా అధికారికంగా జాతీయ పార్కుగా ప్రకటించలేదు.
"ప్రస్తుతానికి ఈ నిర్ణయం చెట్లను కొట్టే పనిని ఆపేందుకు ఇచ్చిన స్టే అనిపిస్తోంది" అని డాక్టర్ చీక్ అన్నారు.
2022లో క్యూ శాస్త్రవేత్తలు అధికారికంగా డికాప్రియో పేరు పెట్టిన చెట్టుకు ఇంతకుముందు వేరే పేరేమీ లేదు. దీని గురించి సైంటిఫిక్ జర్నల్ ‘పీర్ జే’లో ప్రచురించారు.
ఉష్ణప్రాంతాల్లో అన్ని కాలాల్లోనూ కాసే ఈ చిన్న చెట్టుకు బెరడు నుంచి కూడా మెరిసే పసుపు పూలు పూస్తాయి. ఇది లాంగ్ లాంగ్ కుటుంబానికి చెందిన చెట్టు. ఈ రకం చెట్లు ఇక్కడి అడవిలో కొంత ప్రాంతంలో మాత్రమే ఉంటాయి. అంతరించిపోయే ముప్పు తీవ్రంగా ఉన్న చెట్ల జాబితాలో ఇది ఉంది.

ఫొటో సోర్స్, JohanHermans
ప్రపంచంలో 200కు పైగా మొక్కలు, ఫంగీకి అధికారికంగా క్యూ శాస్త్రవేత్తలు, వారి సమన్వయకర్తలు కలిసి గత ఏడాది పేర్లు పెట్టారు. ఇదే అడవిలో ఉండే గులాబీ లిల్లీకి, ఆస్ట్రేలియాలో పురుగులను ఆకర్షించే అడవి పొగాకు మొక్కకు, మడగాస్కర్‌లో చీకట్లో పెరిగే నక్షత్రాలను పోలిన పువ్వులకు కూడా పేర్లు పెట్టారు.
వీటిలో చాలా వరకు అంతరించిపోయాయి. కొన్ని జీవరాశులు అడవులు అంతరించడం, భూవినాశనం, కరువులు, వరదలు, వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే మంటల కారణంగా అంతరించిపోయే ముప్పు కలిగి ఉన్నాయి.
జీవావరణం కోల్పోవడంతో మడగాస్కర్ లో దొరికిన 16 కొత్త ఆర్చిడ్ జాతుల్లో మూడు జాతులు ఇప్పటికే అంతరించిపోయాయని భావిస్తున్నారు. జెరేనియం తైలం తయారు చేసేందుకు మొక్కలు పెంచేందుకు అడవులను నరికివేయడంతో ఒక రకం ఆర్చిడ్స్ అంతరించిపోయాయి. జెరేనియం మొక్కల పూలతో అరోమా థెరపీ తైలాలు తయారు చేస్తారు.
కాంగోలోని కటంగాలో పండే కేప్ ప్రిమ్‌రోజ్ కూడా రాగి గనుల తవ్వకం వల్ల ముప్పు ఎదుర్కొంటోంది.

ఫొటో సోర్స్, MaartenChristenhusz
ఏదైనా జీవరాశికి శాస్త్రీయ నామం ఇస్తేనే కానీ, అంతరించిపోయే ముప్పును అంచనా వేయడం, ముప్పు నుంచి రక్షించడం సాధ్యం కాదు.
"ఇప్పటివరకు తెలియని జీవరాశులను కనిపెట్టేందుకు, పేర్లు పెట్టేందుకు, సంరక్షించేందుకు ఇదే ఆఖరు అవకాశమని 2021లో కనిపెట్టిన కొత్త రకమైన జీవరాశులు గుర్తు చేస్తున్నాయి" అని డాక్టర్ మార్టిన్ చీక్ అంటారు.
"ఈ అడవుల్లో మనకి తెలియని కొన్ని వేల, లక్షల జీవరాశులు, ఫంగల్ జీవులు ఉండి ఉంటాయి. అవి పెరుగుతున్న అడవులు, వాటి సహజ జీవావరణాల్లో ఏమున్నాయో తెలుసుకోకుండా మనుషులు వేగంగా వాటిని వినాశనానికి గురి చేస్తున్నారు" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఇద్దరు గిరిజన బాలికలపై నకిలీ పోలీసు అఘాయిత్యం.. అత్యాచారం కేసు నమోదు
- బంగారు నగలకు హాల్‌మార్క్ తప్పనిసరి చేసిన కేంద్రం.. అసలు ఈ మార్క్ ఎందుకు వేస్తారు
- RRR విడుదల వాయిదా: కోవిడ్‌తో దెబ్బతిన్న సినిమా థియేటర్ల భవిష్యత్తు ఏంటి... ఓటీటీల ప్రభావం ఎంత?
- కొత్త ఏడాదిలో కాస్త హేతుబద్ధంగా ఉందామా... ఇవిగో మూడు మార్గాలు
- హైదరాబాద్‌లో పెరిగిన పెళ్లిళ్లు.. అమ్మాయిల వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచే బిల్లు గురించి తల్లిదండ్రులు ఎందుకు భయపడుతున్నారు?
- మరోసారి రష్యా నమ్మకం గెలుచుకున్న భారత్... అమెరికాను దూరం పెడుతోందా?
- కోవిడ్ దెబ్బకు తాకట్టు పెట్టిన బంగారాన్ని వదిలేసుకుంటున్నారు...
- దళిత యువకుడు గెడ్డం శ్రీనుది హత్యా, ఆత్మహత్యా... మూడునెలలుగా ఎందుకు తేలడం లేదు?
- అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టిన చైనా, తీవ్రంగా స్పందించిన భారత్
- చరిత్రలో మొట్టమొదటి రివెంజ్ పోర్న్ కేసు.. భార్య నగ్న చిత్రాలు బయటపెట్టిన భర్త.. ఏం జరిగింది?
- హైడ్రోజన్ ఇంధనంతో వాహనాలన్నీ దూసుకుపోయే రోజు ఎప్పటికైనా వస్తుందా?
- పండ్లు, కూరగాయల ప్లాస్టిక్ ప్యాకింగ్‌పై నిషేధం.. అమల్లోకి తెచ్చిన ఫ్రాన్స్
- చైనా అరుణాచల్ ప్రదేశ్‌ను 'దక్షిణ టిబెట్' అని ఎందుకు అంటోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








