విశాఖలో తొలి సినీ స్టూడియో ‘ఆంధ్ర సినీటోన్’ రెండు చిత్రాలతోనే ఎందుకు మూతపడింది

ఒకప్పుడు ఆంధ్రా సినీటోన్ స్టూడియో ఉన్న సీతమ్మధార ప్రాంతం

ఫొటో సోర్స్, BBC/Srinivas

ఫొటో క్యాప్షన్, ఒకప్పుడు ఆంధ్రా సినీటోన్ స్టూడియో ఉన్న సీతమ్మధార ప్రాంతం
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

అందమైన విశాఖ నగరంపై సినిమా కెమెరాలు ఎప్పుడూ ఫోకస్ చేస్తూనే ఉంటాయి. ఇక్కడి ప్రకృతి అందాలను తమ కెమెరాల్లో బంధించేందుకు తెలుగుతో పాటు బెంగాలీ, ఒడిశా, కర్నాటక, హిందీ చిత్ర బృందాలు వస్తుంటాయి.

విశాఖలో పెరుగుతున్న సినిమా షూటింగులను దృష్టిలో పెట్టుకుని నిర్మాత డి.రామానాయుడు ఇక్కడ ఒక స్టూడియోను కూడా నిర్మించారు. ఇంకా చాలా మంది విశాఖలో స్టూడియోలు కట్టాలనే ఆలోచనతో ఉన్నారు.

ఇప్పుడంటే విశాఖపై అందరి దృష్టి ఉంది కానీ, అసలు తెలుగులో ఒకటి ఆరా సినిమాలు మాత్రమే నిర్మిస్తున్న 1930లలోనే విశాఖలో ఒక సినిమా స్టూడియో ఉండేది.

ఆ స్టూడియో ఇప్పుడు ఎందుకు లేదు, అందులో ఏయే సినిమాలు నిర్మించారు, ఇతర వివరాలను బీబీసీ తెలుసుకునే ప్రయత్నం చేసింది.

వీడియో క్యాప్షన్, విశాఖపట్నం: శతాబ్ధం కిందట విశాఖ ఒక చిన్న గ్రామం.. మిగతా ప్రాంతమంతా అడవే...

విశాఖకికు, సినిమాకు విడదీయరాని అనుబంధం

విశాఖలో రోజూ ఎప్పుడూ, ఎక్కడో ఒక చోట ఏదో ఒక సినిమా షూటింగ్‌ జరుగుతూనే ఉంటుంది.

రాష్ట్ర విభజన తర్వాత విశాఖకి సినిమా పరిశ్రమ తరలి వస్తుందనే చర్చలు కూడా జోరుగా సాగుతూనే ఉన్నాయి.

సముద్రం, దానికి ఆనుకుని పచ్చని కొండలు, సమీపంలోనే మన్యం, మెట్రో నగర స్థాయిలో అభివృద్ధి, అన్నింటికి మించి ఇక్కడి వాతావరణం సినిమా షూటింగులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

విశాఖ అందాలను తెరకెక్కించడానికి ప్రస్తుతం నగరంలో రోజూ ఎన్నో సినిమాల షూటింగులు జరుగుతున్నాయని వ్యాపారవేత్త, సినీ ఫైనాన్షియర్ రమణమూర్తి చెప్పారు.

"విశాఖలో 1960 నుంచి సినిమా షూటింగులు ఆడపాదడపా జరిగినా.. 1978లో విడుదలైన బాలచందర్ దర్శకత్వంలోని 'మరో చరిత్ర' చిత్రం దాదాపు విశాఖలోనే షూటింగ్ జరుపుకొంది. ఆ చిత్రంలో విశాఖ అందాలను ప్రతి ఫేమ్ లో చక్కగా ఆవిష్కరించారు. దీంతో సిని పరిశ్రమ విశాఖ వైపు చూసింది. ముందుగా తెలుగు, తర్వాత ఇతర భాషా చిత్రాల షూటింగులు కూడా మొదలయ్యాయి. ఇక్కడ తమ చిత్రంలోని ఒక్క సీనైనా షూట్ చేయాలని చాలా మంది అనుకుంటుంటారు" అన్నారాయన.

విశాఖ తీరంలో షూటింగ్

ఫొటో సోర్స్, BBC/Srinivas

ఫొటో క్యాప్షన్, విశాఖ తీరంలో షూటింగ్

మన్యం, నగరం, సాగరం...

విశాఖలో తమ సినిమా షూటింగ్ జరిగితే, అవి హిట్ అవుతాయని కొందరు హీరోలు నమ్ముతారని, నగరంలో షూటింగ్ సెంటిమెంటుగా మారిందని రమణమూర్తి వివరించారు.

"విశాఖపట్నంను సినీ పరిశ్రమ సెంటిమెంట్‌గా భావిస్తుంది. చాలా మంది హీరోలు, నిర్మాతలు కూడా విశాఖలో షూటింగ్ జరిగితే తమ సినిమాలు హిట్ అనే నమ్ముతారు. అలాగే విశాఖలో ఉన్న సింహాచలం దేవస్థానంలో సినిమా నటినటులు పూజలు చేయడం, మొక్కులు తీర్చుకోవడం కూడా తరచూ చూస్తుంటాం. బాలకృష్ణ, అల్లు అర్జున్, నాని లాంటి చాలా మంది హీరోలు తమ సినిమాల షూటింగ్ విశాఖలో జరిగేలా చూసుకుంటారు.

నగరంలో ఒకే చోట అన్ని రకాల వాతావరణం ఉండటం కూడా విశాఖలో షూటింగులకు కలిసొచ్చిందని అంటారు రమణమూర్తి.

సిటీ వాతావరణంతోపాటూ, మన్యం అడవులు, సముద్రం, ఇతర ప్రకృతి అందాలకు విశాఖ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అందుకే పక్కా కథతో విశాఖకు వెళ్తే తమ సినిమా షూటింగ్ మొత్తం దాదాపుగా పూర్తి చేసుకోవచ్చని నిర్మాతలు, హీరోలు నమ్ముతారు. అందుకే రామానాయుడు లాంటి నిర్మాతలు ఇక్కడ స్టూడియో నిర్మిస్తే, పరిశ్రమకు చెందిన హీరోలు, నిర్మాతలు కూడా కొందరు విశాఖలో స్టూడియోల కోసం స్థలాలు కొనుగోలు చేశారు" అని ఆయన వివరించారు.

విశాఖలో తొలి సినీ స్టూడియో ఆంధ్రా సినీ టోన్

ఫొటో సోర్స్, BBC/Srinivas

ఫొటో క్యాప్షన్, విశాఖలో తొలి సినీ స్టూడియో ఆంధ్రా సినీ టోన్

విశాఖలో తొలి సినీ స్టూడియో ఆంధ్రా సినీ టోన్

ఇప్పుడు ఇంత పాపులారిటీ ఉండడం కాదు, 85 ఏళ్ల క్రితమే విశాఖలో ఒక స్టూడియో నిర్మాణం జరిగింది.

మద్రాసు, బొంబాయి లాంటి నగరాలతో పాటు విశాఖలో కూడా సినిమా స్టూడియో ఉండాలని భావించిన నగరవాసి గొట్టిముక్కల జగన్నాధరాజు రాజు సీతమ్మధార ప్రాంతంలో ఒక స్టూడియో నిర్మాణం చేపట్టారు.

విశాఖకు చెందిన చరిత్రకారులు విజ్జేశ్వరం ఎడ్వర్డ్ పాల్ ఆ విషయం వివరించారు.

"అప్పట్లో విశాఖ అంటే వన్ టౌన్ ప్రాంతమే. అయితే సీతమ్మధార దానికి దూరంగా శివారు ప్రాంతంగా ఉండేది. గొట్టిముక్కల జగన్నాధరాజు అక్కడ స్టూడియోను నిర్మించారు. ఆ స్టూడియో స్థలంలోనే తర్వాత ఈనాడు కార్యాలయం నిర్మించారు. ఇప్పటి ఈనాడు కార్యాలయం ప్రాంగణంలోనే ఆంధ్రా సినీ టోన్ పేరుతో స్టూడియో ఉండేది" అని ఆయన చెప్పారు.

ఒకప్పుడు ఆంధ్రా సినీ టోన్ స్టూడియో ఉన్న ప్రాంతం

ఫొటో సోర్స్, BBC/Srinivas

ఫొటో క్యాప్షన్, ఒకప్పుడు ఆంధ్రా సినీ టోన్ స్టూడియో ఉన్న ప్రాంతం

తర్వాత కాలంలో అక్కడ వెలిసిన ఈనాడు పత్రిక కార్యాలయాన్ని కూడా, ప్రస్తుతం వేరే ప్రాంతానికి తరలించారు. ఒకప్పుడు స్టూడియో ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం అప్పుడప్పుడు ఫంక్షన్లు, పెళ్లిళ్లు లాంటివి జరుగుతున్నాయి.

నగరంలో తెలుగు, బెంగాలీ చిత్రాలు నిర్మించాలనే ఉద్దేశంతో ఇదే ప్రాంతంలో మొదట స్టూడియోను నిర్మించారని ఎడ్వర్డ్ పాల్ బీబీసీకి చెప్పారు.

"ఆంధ్రా సినీటోన్ పేరుతో 1936లో విశాఖలో నిర్మించిన ఈ స్టూడియో రాష్ట్రంలో రెండవది. అప్పటికే రాజమండ్రిలో దుర్గ సినీ టోన్ పేరుతో ఒక స్టూడియో ఉండేది. అప్పట్లో అవుట్ డోర్ షూటింగ్స్ తక్కువగా ఉండటంతో విశాఖలో సినీ స్టూడియో నిర్మించి నగరంలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని జగన్నాధరాజు భావించారు. ఆయనతో సూర్యనారాయణ రాజు అనే వ్యక్తి కూడా తోడవడంతో ఇద్దరూ కలిసి ఆంధ్రా సినీ టోన్ స్టూడియోను పూర్తి చేశారు. దీనిలో పని చేయడానికి బెంగాల్ నుంచి కొందరు సినీ కార్మికులు, టెక్నీషియన్లు కూడా వచ్చారు. ఇక్కడ తెలుగు, బెంగాలీ సినిమాలను నిర్మించాలని స్టూడియో అధినేతలు భావించారు" అని పాల్ వివరించారు.

ఆంధ్రా సినీ టోన్ స్టూడియో నిర్మించిన తొలి చిత్రం 'భక్త జయదేవ్'

ఫొటో సోర్స్, BBC/Srinivas

ఫొటో క్యాప్షన్, ఆంధ్రా సినీ టోన్ స్టూడియో నిర్మించిన తొలి చిత్రం 'భక్త జయదేవ్'

తొలి చిత్రం 'భక్త జయదేవ్'

భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు, అప్పట్లో వచ్చిన చాలా సినిమాలు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా ఉండేవి.

ఆంధ్రా సినీటోన్ స్టూడియో అధినేత జగన్నాధరాజు అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండటంతోపాటూ లాయరుగా కూడా పని చేసేవారు.

ఆ రోజుల్లో అంటరానితనం, దేవదాసి పద్ధతి నిర్మూలన... స్వాతంత్ర్యం సాధించాలనే లక్ష్యం లాంటి అంశాల చుట్టూనే సినిమా కథలు ఉండేవి.

విశాఖలో నిర్మించిన ఆంధ్రా సినీ టోన్ స్టూడియోలో రెండు సినిమాలే పూర్తి చేయగలిగారని, ఆ తర్వాత స్టూడియో మూతపడిందని పాల్ చెప్పారు.

ఆంధ్రా సినీ టోన్ స్టూడియో ఉన్న ప్రాంతం

ఫొటో సోర్స్, BBC/Srinivas

"1936లో నిర్మించిన ఆంధ్రా సినీ టోన్ స్టూడియోలో షూటింగు పూర్తి చేసుకున్న మొదటి చిత్రం భక్త జయదేవ్. ఈ చిత్రం 1939లో విడుదలైంది. ఈ చిత్రానికి గొట్టిముక్కల జగన్నాధరాజుతో పాటు సాగి సూర్యనారాయణరాజు నిర్మాతలుగా వ్యవహారించారు. దీనిని తెలుగు, బెంగాలీ భాషల్లో నిర్మించారు. ఇందులో రెంటచింతల సత్యనారాయణ, సురభి కమలాబాయి ప్రధాన పాత్రలు పోషించగా, బెంగాలీ దర్శకుడు హిరేన్ బోస్ రెండు భాషల్లో తెరకెక్కించడంతోపాటూ, సంగీత దర్శకత్వం కూడా చేశారు. విశాఖలోని ఆంధ్రా సినీ టోన్ స్టూడియోలో నిర్మించిన తొలి సినిమా అని ఆ రోజుల్లోనే పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు" అని ఆయన వివరించారు.

ఆ సినిమా తర్వాత పాశుపాతాస్త్రం అనే మరో సినిమాని నిర్మించారని, కానీ, ఆ రెండు సినిమాలతో ఆర్థికంగా చాలా నష్టపోవడంతో అక్కడ తర్వాత సినీ నిర్మాణం జరగలేదని పాల్ చెప్పారు.

విశాఖలో 1930ల్లో నిర్మించిన పూర్ణ థియేటర్

ఫొటో సోర్స్, BBC/Srinivas

ఫొటో క్యాప్షన్, విశాఖలో 1930ల్లో నిర్మించిన పూర్ణ థియేటర్

వినోదాల విడిది విశాఖ...

విశాఖపట్నం రాజులు, జమీందార్ల కాలం నుంచి వినోదాలకు విడిదిగా ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీ సమయంలో కూడా నగరం బ్రిటిష్ అధికారులకు విడిది కేంద్రంగా ఉండేది.

దాంతో, రాజులు, జమీందార్లు, అధికారులు తమ పరివారాలతో వచ్చి విశాఖలో రోజుల తరబడి బస చేసేవారు.

ముఖ్యంగా పూసపాటి, వైరిచర్ల, కురుపాం రాజులకు, జమీందార్లకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫీసర్లకు విశాఖపట్నమే విడిది కేంద్రంగా ఉండేది.

అందుకే ఇలాంటి ప్రాంతంలో సినీ స్టూడియో నిర్మించాలని అప్పట్లో ఆలోచించారని ఏయూ హిస్టరీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ బీబీసీతో చెప్పారు.

విశాఖలో 1930ల్లో నిర్మించిన పూర్ణ థియేటర్

ఫొటో సోర్స్, BBC/Srinivas

ఫొటో క్యాప్షన్, విశాఖలో 1930లో నిర్మించిన పూర్ణ థియేటర్

"విశాఖలో నిర్మించిన ఆంధ్రా సినీ టోన్ స్టూడియో రెండు చిత్రాలకే పరిమితమైనప్పటికీ, ఆ రోజుల్లో ఇది ఎంత ప్రముఖ నగరం అనేది స్టూడియో నిర్మాణమే చెప్తోంది. విడిది కేంద్రాలుగా ఉన్న ప్రాంతాల్లో వినోద సాధనాలను సమకూర్చుకోవడం అనేది చరిత్రలో చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే రాజులు, జమీందార్లకు విడిది కేంద్రమైన విశాఖలో స్టూడియో నిర్మించి, సినిమాలు తీయాలనుకున్నారు. కానీ అది పూర్తి స్థాయిలో సఫలం కాలేదు" అని ఆయన వివరించారు.

అయితే అంత మాత్రాన సినీ పరిశ్రమలో విశాఖకు ఉన్న ప్రాధాన్యం తగ్గిపోలేదని సూర్య నారాయణ చెప్పారు.

"స్టూడియో మూతపడినా, విశాఖలో సినిమా షూటింగులు జరుగుతూనే ఉండేవి. 1960ల్లోనే కులగోత్రాలు, ప్రాణమిత్రులు లాంటి సినిమాల షూటింగులు ఇక్కడ జరిగాయి. దసపల్లా హిల్స్, లైట్ హౌస్, పోర్టు ఏరియాలో అప్పట్లో ఎక్కువగా షూటింగులు జరిగేవి" అని ప్రొఫెసర్ వివరించారు.

విశాఖలో రామానాయుడు స్టూడియోస్

ఫొటో సోర్స్, BBC/Srinivas

ఫొటో క్యాప్షన్, విశాఖలో రామానాయుడు స్టూడియోస్

రామానాయుడు స్టూడియో

విశాఖ నుంచి భీమిలి వెళ్లే దారిలో తీరానికి ఆనుకుని ఉన్న తిమ్మాపురం కొండపై రామానాయుడు స్టూడియోను నిర్మించారు.

దీని నిర్మాణానికి 2008లో అప్పటి ప్రభుత్వం కొండపై దాదాపు 35 ఎకరాల స్థలం కేటాయించగా, అందులో పది ఎకరాలను చదును చేసి ఈ స్టూడియో నిర్మించారు.

ఇప్పుడు ఈ స్టూడియోలో తెలుగు, బెంగాలీ, ఒడిశా, కన్నడ సినిమాలు, ప్రధానంగా లోబడ్జెట్ సినిమాలు ఎక్కువగా షూటింగ్ జరుపుకొంటుంటాయి.

వీడియో క్యాప్షన్, విశాఖ ఎర్రమట్టి దిబ్బల అసలు రంగు ఎరుపు కాదా?

ఇక్కడ ఓటీటీ ప్లాట్ ఫాంల కోసం నిర్మించే చిన్న సినిమాలు, వెబ్ సిరిస్‌ల కోసం ఎప్పుడూ షూటింగులు కూడా జరుగుతుంటాయని విశాఖకు చెందిన సినీ షూటింగ్స్ ఆర్గనైజర్ రమేష్ చెప్పారు.

"రామానాయుడు స్టూడియోకు సమీపంలో ఉన్న భీమిలి బీచ్‌ నుంచి యారాడ బీచ్‌ వరకు, అలాగే భీమిలి నుంచి హార్బర్ వరకు నిత్యం ఎన్నో షూటింగ్‌లు జరుగుతూ ఉంటాయి. ఇందులో ఎక్కువ శాతం ఆర్‌కే బీచ్, రుషికొండ బీచ్, మంగమారిపేట, ఎర్రమట్టి దిబ్బలు, రామానాయుడు స్టూడియో, భీమిలి బీచ్‌లలో జరుగుతాయి. షార్ట్‌ ఫిల్మ్‌ల నుంచి భారీ బడ్జెట్‌ చిత్రాల వరకు ఈ స్టూడియో పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా చిత్రీకరణ జరుపుకొంటున్నాయి" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)