ఏపీ పీఆర్సీ: ప్రభుత్వ ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన జగన్ ప్రభుత్వం

జగన్

ఫొటో సోర్స్, ugc

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నాళ్లుగా తీవ్ర చర్చకు దారి తీసిన పీఆర్సీ అంశంపై ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్‌మెంట్‌‌తోపాటు రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పేరిట ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది. అంతకుముందు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం మాట్లాడారు.

జగన్

ఫొటో సోర్స్, AP govt

ప్రకటనలో ఏముంది?

‘‘ఉద్యోగ సంఘాలతో నిన్నటి సమావేశం తర్వాత ఉద్యోగుల ప్రతినిధులుగా మీరు చెప్పిన అన్ని అంశాలపైనా నిన్ననే సుదీర్ఘంగా కూర్చొని అధికారులతో చర్చించాను. 2-3 రోజుల్లో ప్రకటిస్తానని గురువారమే చెప్పాను. కానీ నిర్ణయాన్ని వీలైనంత త్వరగా చెప్తే మంచిదని భావించి ఈ మేరకు ఉదయం కూడా సమావేశం పెట్టాను’’ అని ప్రకటనలో జగన్ తెలిపారు.

‘‘ఫిట్‌మెంట్‌ విషయానికొస్తే.. సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 14.29 శాతానికి మించి ఫిట్‌మెంట్‌ ఇవ్వలేమని, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను, సమస్యలను అన్నికోణాల్లో క్షుణ్నంగా అధ్యయనం చేసి ఒక వాస్తవికమైన ఫిగర్‌ను వారు చెప్పినప్పటికీ...., అటు ఉద్యోగుల ఆకాంక్షలను, ఇటు రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని, ఉద్యోగులకు వీలైనంత మంచి చేయాలన్న తాపత్రయంతో ఫిట్‌మెంట్‌ను 23శాతంగా నిర్ణయించాం’’ అని సీఎం తన ప్రకటనలో తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన జగన్ ప్రభుత్వం

ఈ ప్రకటన ప్రకారం పీఆర్సీ 01-07-2018 నుంచి అమలులోకి వస్తుంది. మానిటరీ బెనిఫిట్‌ అమలు 01-04-2020 నుంచి ఉంటుంది.

కొత్త జీతాలను 01-01-2022 నుంచి ప్రభుత్వం అమలు చేస్తుంది. తాజా నిర్ణయం కారణంగా ఖజానాపై సంవత్సరానికి రూ. 10,247 కోట్లు అదనపు భారం పడుతుంది.

ప్రభుత్వానికి భారమని తెలిసినా, ఉద్యోగుల ఆకాంక్షల కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తన ప్రకటనలో తెలిపారు.

చివరగా మరో ముఖ్యమైన కీలక నిర్ణయం కూడా ప్రకటిస్తున్నానంటూ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును పెంచుతున్నట్లు సీఎం తెలిపారు.

‘‘ మీరంతా సుదీర్ఘ కాలం ప్రజా సేవలో జీవితం గడిపిన వ్యక్తులు. మీ సేవలను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలన్న నిర్ణయంతో, రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతున్నాం’’ అని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని 1-1- 2022 నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు.

ఇక సీపీఎస్‌‌పై కేబినెట్‌ సబ్‌కమిటీ వేశామని, జూన్‌ 30లోగా ఒక నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

ఉద్యోగ సంఘాల నాయకులు (ఫైల్ ఫొటో)
ఫొటో క్యాప్షన్, ఉద్యోగ సంఘాల నాయకులు (ఫైల్ ఫొటో)

పీఆర్‌సీ అంటే ఏంటి?

'పే రివిజన్ కమిషన్' దీనినే క్లుప్తంగా పీఆర్‌సీ అంటారు. ఉద్యోగుల వేతనాలను అయిదేళ్లకోసారి సవరించేందుకు ఈ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. కేంద్ర ఉద్యోగులకు సంబంధించిన ఇలాంటి కమిటీని 'పే కమిషన్' అంటారు. తెలుగు రాష్ట్రాల్లో 'పే రివిజన్ కమిషన్' అని పిలుస్తారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతం ఇవ్వాలి? భత్యం ఎంత వంటివి ఈ కమిషన్ సిఫార్సు చేస్తుంది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. ఆ మేరకు ఉద్యోగుల వేతన సవరణ జరుగుతూ వస్తోంది.

కమిషన్ చెప్పిన దానికి మించి వేతనాలు పెంచడం సంప్రదాయంగా జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో వేతన సవరణ సంఘాలను ఏర్పాటు చేసే విధానం 1969లో మొదలయ్యింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)