ఆంధ్రప్రదేశ్: విశాఖలో ప్రభుత్వ భూముల తాకట్టు వివాదం... అసలేం జరుగుతోంది?

విశాఖపట్నం బీచ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శ్రీనివాస్ లక్కోజు
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 'మిషన్‌ బిల్డ్‌ ఏపీ' కింద విశాఖపట్నంలో బీచ్ రోడ్డుతోపాటు ఇతర కొన్ని విలువైన స్థలాల్ని విక్రయించడానికి నేషనల్‌ బిల్డింగ్స్‌, కన్‌స్ట్రక్షన్‌ కార్పోరేషన్‌ (ఎన్‌బీసీసీ) ద్వారా వేలం నిర్వహించేందుకు 2021 ఏఫ్రిల్‌లో ప్రకటన విడుదల చేసింది.

ఆ ప్రకటనలో పేర్కొన్న 18 స్థలాలకు రూ. 1,452 కోట్ల ఆఫ్ సెట్ ధరను నిర్ణయిస్తూ తాము ఈ-వేలం నిర్వహిస్తున్నామని ప్రభుత్వం ఎన్‌బీసీసీ వెబ్‌సైట్‌‌లో పేర్కొంది. ఈ ఆక్షన్‌పై హైకోర్డులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా, కోర్టు ఈ వేలం ప్రక్రియను నిలిపి వేస్తూ స్టే విధించింది.

తాజాగా ఇప్పుడు మళ్లీ విశాఖలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల అధీనంలో ఉన్న స్థలాలను తాకట్టు పెట్టి రూ.1,600 కోట్లు సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆయా కార్యాలయాలు, సంస్థల భూములన్నీ ఏపీఎస్డీసీ (ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్) కు బదిలీ చేయనున్నారు.

విశాఖలో మొత్తం 214 ఎకరాల భూములను ఏపీఎస్డీసీకు బదిలీ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఏపీఎస్డీసీ అధీనంలో రాగానే వాటిని తాకట్టు పెట్టేందుకు అవకాశం ఉంటుంది.

విశాఖపట్నం:

బదిలీ... తాకట్టు

సుమారు 220 ఎకరాల భూములను గుర్తించి వాటి సర్వే నెంబర్లు, విస్తీర్ణం, విలువ, స్కెచ్‌లు సహా అందుబాటులో ఉన్న ఇతర రికార్డులను సిద్ధం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి నివేదికను (చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) సీసీఎల్ఏకు పంపేందుకు జిల్లా రెవెన్యూ విభాగం పని చేస్తోంది.

ఈ నేపథ్యంలో రుణాల కోసం ప్రభుత్వ ఆస్తులను హామీగా పెట్టనున్నారన్న విషయం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వ శాఖల భూముల ద్వారా రుణం పొందాలంటే ముందుగా ఆ భూములను ఏపీఎస్డీసీకి బదలాయించాలి. వాటిని సీసీఎల్ఏ ఆమోదం చేసి మంత్రివర్గం అమోదానికి పంపుతుంది.

విశాఖలోని గవర్నమెంట్ గెస్ట్ హౌస్, జిల్లా శిక్షణ కేంద్రం, ఫారెస్ట్ గెస్ట్ హౌస్, డెయిరీ ఫారం, పాలిటెక్నిక్ కళాశాల, సీతమ్మధార, మహారాణి పేట ఎమ్మార్వో కార్యాలయాలు, బక్కనపాలెంలో వికలాంగుల శిక్షణ కేంద్రం, ఇలా 20 శాఖలకు చెందిన ప్రభుత్వ అధీనంలో ఉన్న స్థలాలను తాకట్టు పెట్టడం ద్వారా నిధుల సమీకరణ చేయవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది.

భూముల వివరాలను ప్రభుత్వానికి పంపే పనిలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఈ విషయంపై విశాఖ ఆర్డీవో పెంచల కిషోర్ ను బీబీసీ సంప్రదించింది. ఈ విషయంపై ఇప్పుడే స్పందించలేనని, అయితే ప్రభుత్వ నిర్వహణ కోసం ఆస్తులు అమ్మడం, తాకట్టు పెట్టడం అన్నది కొత్తేమి కాదని అన్నారు.

విశాఖను మొత్తం అమ్మేస్తారు

'మిషన్‌ బిల్డ్‌ ఏపీ' పేరుతో వివిధ పట్టణాలు, నగరాల్లోని ప్రభుత్వ స్థలాలను అడ్డంగా అమ్మేసి సొమ్ము చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.

విశాఖలో భూముల ధరలు అధికంగా ఉండటంతో దీనిని ఇక్కడ నుంచే ప్రారంభించారని ఆరోపిస్తోంది. పైగా పరిపాలన రాజధాని అనే బ్రాండింగ్‌తో మొత్తం విశాఖనే అమ్మేస్తారని విమర్శిస్తున్నారు.

"విశాఖ కలెక్టర్‌ కార్యాలయ అధీనంలో ఉన్నభూములతో పాటు రెండు తహసీల్దార్‌ కార్యాలయాలు, ప్రభుత్వ అతిథిగృహం, పాలిటెక్నిక్‌ కాలేజీ, ఐటీఐ తదితర ప్రభుత్వ ఆస్తులు తనఖాలోకి వెళ్లిపోతున్నాయి" అని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు.

"మొత్తం 20 ప్రభుత్వ శాఖలకు చెందిన 213.56 ఎకరాలను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రూ.1,600 కోట్లు రుణం పొందుతారు. ఏపీఏస్డీసీ ద్వారా వివిధ బ్యాంకుల నుంచి రూ.25 వేల కోట్ల రుణాలను సమీకరించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది" అని ఆయన అన్నారు.

అయితే, ఇది కొత్తగా ఏర్పాటైన సంస్థ కావడం, దీనికి మూలధనం తక్కువగా ఉండటంతో వేల కోట్లు ఋణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదు. దీంతో, మద్యంపై అదనపు పన్ను విధించి, ఆ మొత్తాన్ని ఏపీఏస్డీకి బదిలీ చేస్తున్నామని చెప్పి, ఆ ఆదాయాన్నే ష్యూరిటీగా చూపిస్తున్నారు. ఇలా ఈ సంస్థకు రూ. 2,500 కోట్లు సమకూర్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది." అని అయ్యన్న పాత్రుడు అన్నారు.

విశాఖపట్నం:

ప్రజలను కూడా తాకట్టు పెట్టేస్తారు

"వైఎస్సార్సీపీకి పాలన చేతకాకే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతుంది. తాకట్టు పేరుతో రుణాలు తెచ్చి వాటిని ఆ పార్టీ నాయకులే దోచుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. పరిపాలన రాజధాని అభివృద్ధి అంటే తాకట్టు పెట్టడమా?" అని అని మాజీ ఎమ్మేల్యే, టీడీపీ నాయకుడు పీలా గోవింద సత్యనారాయణ ప్రశ్నించారు.

"సంపద సృష్టించడం చేతకాకపోవడంతో భూములు అమ్మడంతో పాటు తాకట్టు పెడుతున్నారు. నిజానికి తాకట్టు పెట్టడం ద్వారా వైకాపా నాయకులే భూములను దోచేందుకు తెర తీశారు. వైకాపాకు అవకాశం ఇస్తే రాష్ట్రంలోని ప్రజలందరినీ తాకట్టు పెట్టేస్తారు" అని ఆయన విమర్శించారు.

ప్రభుత్వ భూముల్లోనే పాలన

విశాఖలోని భూములను తెలుగుదేశం పాలన కాలంలో ఆ పార్టీ నాయకులే దోచుకున్నారని వైసీపీ విమర్శించింది. ఆ పార్టీ నాయకులైన అయ్యన్నపాత్రుడు స్వయంగా చంద్రబాబునాయుడుకి విశాఖ భూములు కబ్జాపై ఫిర్యాదు చేశారని చెప్పారు.

విశాఖలో భూములను ఆక్రమించిన వారిని ఎవరినీ వదలమని, ఇప్పటీకే చాలా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు.

"విశాఖలో ప్రభుత్వ ఆస్తులు అమ్మకం అంటూ టీడీపీ తెగ గగ్గోలు పెడుతోంది. ప్రభుత్వ ఆస్తులు అమ్మకుండా, పన్నులు వేయకుండా రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది?" అని ఆయన ప్రశ్నించారు.

"విశాఖలో టీడీపీ నాయకులు అక్రమించిన భూములు తీసుకుంటే ప్రభుత్వానికి పెద్ద ల్యాండ్ బ్యాంక్ తయారవుతుంది. చంద్రబాబు అండతో కబ్జాకు గురైన రూ. 5 వేల కోట్ల విలువైన భూములు ఈ ఐదు నెలల్లో స్వాధీనం చేసుకున్నాం. ప్రభుత్వ భూమి అక్రమించుకుంటే ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే స్వాధీనం చేసుకోవచ్చు. విశాఖలో ఆక్రమణలపై సినిమా పూర్తి కాలేదు. ఇది తెలిసే టీడీపీ నాయకులు భూముల అమ్మకం, తాకట్టు అంటూ రాద్ధాంతం చేస్తున్నారు." అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.

"విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నాం. విశాఖలో భూములను అమ్మకం పెడితే,.పరిపాలన రాజధాని అవసరాలకు భూములు ఎక్కడ నుంచి వస్తాయని విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. పరిపాలన రాజధానికి విశాఖలో భూముల కొరత లేదు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు, భవనాలను మాత్రమే వినియోగిస్తాం. ప్రభుత్వ అవసరాల కోసం ప్రైవేట్‌ భూములు అవసరం లేదు." అని ఆయన చెప్పారు.

భూముల అమ్మకాలకు వ్యతిరేకంగా సీపీఐ నిరసన

ఫొటో సోర్స్, CPI (M)

త్వరలోనే సిట్ నివేదిక

విశాఖ భూ అక్రమాలపై మాట్లాడే హక్కు తెదేపా నాయకులకు లేదంటూ, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రస్తుతం విశాఖలో అదే జరుగుతోందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.

"విశాఖలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటాం. మాజీ ఎమ్మెల్యేలు, నేతలు విశాఖలో భూములు ఆక్రమించారు. విశాఖలో మొత్తం 430 ఎకరాలు ఆక్రమించుకున్నారు. వీటిలో రూ. 5 వేల కోట్ల విలువైన ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది".

"గతంలో బీచ్ రోడ్డులోని లులూకు గ్రూపుకు చంద్రబాబు ప్రభుత్వం అతి తక్కువ ధరకే అప్పగించిన భూములను వెనక్కు తీసుకుని మార్కెట్ రేటుకు భూములను అక్షన్ లో పెట్టాం. దానిని అడ్డుకునేందుకు టీడీపీ, దానితో కలిసి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి".

"ప్రస్తుతం 'విశాఖ తాకట్టు' అంటూ మరోసారి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, నిర్వహణకు అవసరమైన విధంగా భూములను అమ్మడం ఎక్కడైనా జరుగుతుంది. కరోనా సమయంలో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ, ప్రభుత్వ నిర్వహణ, ప్రజా సంక్షేమం ఆగకుండా ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంది" అని అమర్‌నాథ్ బీబీసీతో చెప్పారు.

విశాఖపట్నం, జీవీఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్‌,
ఫొటో క్యాప్షన్, ఆధునిక హంగులతో విశాఖ కార్పొరేషన్ వేగంగా అభివృద్ధి చెందుతోంది.

శ్వేతపత్రం విడుల చేయాలి

"విశాఖలో భూముల అమ్మకం, తాకట్టు అంటూ రోజు మీడియాలో రిపోర్టు అవుతున్న వార్తలను చూస్తున్నాను. అసలు దీనిపై ప్రభుత్వం ఏం చేయబోతుందో ప్రజలకు వివరించాలి" అని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అన్నారు.

పరిపాలనా రాజధాని విశాఖకు రాబోతుందని చెబుతున్న ప్రభుత్వం అందుకోసం నిధుల సమీకరణ, ఖర్చు వంటి అంశాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన అన్నారు.

హంగులు, ఆర్బాటాలకు పోకుండా పరిపాలన రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర అవసరాలు తక్కువ ఖర్చుతో పూర్తయ్యేలా చూసుకోవాలని సూచించారు.

విశాఖ భూములను ప్రజాప్రయోజనాలకు ఉపయోగించాలి కానీ అమ్మకం, తాకట్టు ద్వారా ప్రభుత్వ ఖజానాను నింపుకునేందుకు కాదని విశాఖ నగర సీపీఎం పార్టీ కార్యదర్శి, జీవీఎంసీ కార్పోరేటర్ బి. గంగారాం అన్నారు.

గతంలో రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను వివిధ రకాల పేర్లతో తమకు కావాల్సిన వారికి అమ్మేశారని, చివరకు వుడాను ఒక రియల్‌ ఎస్టేట్‌ సంస్థగా మార్చేశారని అంటున్న గంగారాం, "ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం కూడా అదే పని చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఉన్న భూములను, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి తమ బడ్జెట్‌ అవసరాలను తీర్చుకోవాలని ప్రయత్నించడం దుర్మార్గం. వీటిపై వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పోరాడుతాం" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)