కోవిడ్: పిల్లలకు ఇచ్చే వ్యాక్సీన్ పెద్దల టీకాకు భిన్నంగా ఉంటుందా.. ఇంతకీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది

కోవిడ్ టెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అనంత్ ప్రకాశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో పిల్లల కరోనా వైరస్ వ్యాక్సిన్ 'కోవాక్సిన్' క్లినికల్ ట్రయల్ స్క్రీనింగ్ దశ సోమవారం ప్రారంభమైంది.

దీనిలో భాగంగా 12 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లల్లో కొంతమందికి ఆరోగ్య పరీక్షలు జరిపారు.

పట్నాలోని ఎయిమ్స్‌లోనూ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఇందులోభాగంగా తమ ఆస్పత్రిలో ముగ్గురు పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఎయిమ్స్ (పట్నా) మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సీఎం సింగ్ తెలిపారు.

దీంతో, ఇప్పటివరకు భారతదేశంలో మొత్తం 25 మంది పిల్లలకు కోవిడ్ వ్యాక్సీన్ వేశారు. వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

మరో పక్క అమెరికా, కెనడా, బ్రిటన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో పిల్లలకు వేసే కరోనా వ్యాక్సిన్‌కు ఇప్పటికే ఆమోదం లభించింది.

చైనాలో మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు పిల్లలకు ఇచ్చేందుకు 'కరోనావాక్' టీకా ఆమోదం పొందింది.

ఫైజర్, మోడెర్నా లాంటి పలు కంపెనీలు పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తి చేశాయి. ఫైజర్ వ్యాక్సిన్‌కు బ్రిటన్‌లో ఆమోదం లభించింది కూడా.

అయితే, ఫైజర్ పిల్లల వ్యాక్సిన్‌ను భారతదేశానికి తెప్పించే అవకాశాలు ఉన్నాయా? ఆ దిశలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందా?

VACCINATION

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంలో పిల్లలకు టీకాలు వేయడానికి సుమారు 25-26 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరమని నీతి ఆయోగ్ సభ్యులు వీకే పాల్ తెలిపారు.

అయితే, దేశంలోని పిల్లలందరికీ టీకాలు అందించగలగాలి. కొందరు వ్యాక్సీన్ వేయించుకోగలిగి, కొందరు వేయించుకోలేని స్థితిలో ఉండకూడదని ఆయన అన్నారు.

కోవాక్సిన్‌తో పాటూ జైడస్ వ్యాక్సిన్ కూడా పిల్లలపై పరీక్షించనున్నారని వీకే పాల్ జూన్ 4న చెప్పారు.

ఈ రెండూ స్వదేశీ టీకాలే.

థర్డ్ వేవ్‌లో కరోనా ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందనే వార్తలు వస్తుండడంతో తల్లిదండ్రుల మనసుల్లో రకరకాల భయాలు పట్టుకున్నాయి.

పిల్లల వ్యాక్సిన్ ఎంత సురక్షితం? ఎంత ప్రభావంతంగా ఉంటుంది? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ట్రయల్స్ ఎంతకాలం కొనసాగుతాయి?.. ఇలాంటి సందేహాలు ఎన్నో.

ఈ అంశాలపై ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ ఎన్‌కే గంగూలీతో బీబీసీ సంభాషించింది.

VACCINE

ఫొటో సోర్స్, Getty Images

పిల్లలకు ఇచ్చే వ్యాక్సీన్, పెద్దల వ్యాక్సీన్ కన్నా భిన్నంగా ఉంటుందా?

కోవిషీల్డ్, కోవాగ్జిన్ రెండూ కరోనాపై బాగా పని చేస్తున్నాయని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

అయితే, ట్రయల్స్‌లో పిల్లలకు ఇస్తున్న టీకా ఇదేనా, లేక భిన్నమైనదా అనేది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న సందేహం.

పెద్దలకు ఇచ్చిన వ్యాక్సిన్‌తోనే పిల్లలపై ట్రయల్స్ నిర్వహిస్తున్నారని డాక్టర్ గంగూలీ అభిప్రాయపడుతున్నారు.

"ఇది వేరే వ్యాక్సిన్ కాదు. వ్యాక్సీన్ మొదట 18 ఏళ్లు పైబడినవారికి ఇస్తారు. అందులో కూడా వర్గాలుగా విభజించి మొదట వృద్ధులకు అందిస్తారు. ఎందుకంటే వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి. ఈ ప్రక్రియ తరువాత వ్యాక్సిన్ ప్రభావం, భద్రతపై తగినంత డాటా లభించాక అదే వ్యాక్సిన్‌ను గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు ఇస్తారు. పిల్లల్లో కూడా ముందు కౌమార దశలో ఉన్నవారికి టీకా వేస్తారు. ఆ తరువాత చిన్నపిల్లలకు ఇస్తారు. రెండేళ్ల కన్నా చిన్న పిల్లలకు తల్లి పాల ద్వారా వ్యాక్సీన్ ప్రభావం చేరుతుంది కాబట్టి వారికి ఇవ్వరు. కానీ, వ్యాక్సీన్ అదే ఉంటుంది. పెద్దలకు ఇచ్చిందే పిల్లలకూ ఇస్తారు" అని ఆయన వివరించారు.

పలు దేశాల్లో ఇప్పటికే పిల్లల వ్యాక్సిన్‌కు ఆమోద ముద్ర లభించింది

ఫొటో సోర్స్, JEFF KOWALSKY/GETTYIMAGES

ఫొటో క్యాప్షన్, పలు దేశాల్లో ఇప్పటికే పిల్లల వ్యాక్సిన్‌కు ఆమోద ముద్ర లభించింది

క్లినికల్ ట్రయల్స్‌కు పిల్లలను ఎలా ఎంపిక చేస్తారు?

ఎయిమ్స్‌లో పని చేస్తున్న డాక్టర్ సంజయ్ కుమార్ రాయ్ ఒక ప్రైవేటు టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ పిల్లల వ్యాక్సిన్ క్లినికల్ టయల్స్ ఎలా జరుగుతాయో వివరించారు.

"ఆరోగ్యంగా ఉన్న పిల్లల్నే వలంటీర్లుగా తీసుకుంటాం. ముందు వారికి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేస్తాం. వైటల్స్ అన్నీ బావున్నాయి అనుకున్నప్పుడే వారికి టీకా వేస్తాం. ఇప్పుడు ఈ ప్రక్రియ స్క్రీనింగ్ దశ ప్రాంభమైంది. వీరిలో పూర్తి ఆరోగ్యంతో ఉన్న పిల్లలను ఎంపిక చేసి టీకాలు వేస్తాం. పెద్దల వ్యాక్సిన్ ట్రయల్స్‌లో కూడా ఇదే ప్రక్రియను అనుసరిస్తాం. అయితే, సమ్మతి, ప్రాసెసింగ్‌లో తేడా ఉంటుంది" అని డాక్టర్ సంజయ్ తెలిపారు.

పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ తీవ్రత గురించి మాట్లాడుతూ డాక్టర్ గంగూలీ, ఈ అధ్యయనం నిర్దేశించిన నిబంధనల ఆధారంగానే జరగాలని స్పష్టం చేశారు.

"చైనాలో 2 నుంచి 15 ఏళ్లు గల పిల్లలు ఓ 300-400 మందితో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేశారు. ట్రయల్స్‌లో పిల్లలను రెండు సమూహాలుగా విడగొట్టి అధ్యయనం చేయాలి. అదీ చేయలేదు. ఇంత తొందరపాటు చర్య తగదు. అధ్యయనం ఇలా జరగకూడదు" అని ఆయన అన్నారు.

VACCINE

ఫొటో సోర్స్, Getty Images

పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ ఎప్పటికి పూర్తవుతాయి?

గత ఏడాది, భారతదేశంలో పెద్దలపై చేసిన క్లినికల్ ట్రయల్స్ కోసం కొన్ని నిబంధనలను మార్చారు. తరువాత, ప్రభుత్వం పలు వివాదాలను ఎదుర్కోవలసి వచ్చింది.

అయితే, ఇప్పుడు పిల్లల విషయంలో అలా మార్చకుండా నిర్దేశించిన నిబంధనల ప్రకారమే ట్రయల్స్ జరగాలంటే, ఇవి ఎప్పటికి పూర్తవుతాయి?

వీటి ఫలితాలు రావడానికి కొన్ని నెలలు పట్టొచ్చని డాక్టర్ సంజయ్ రాయ్ అన్నారు.

"టీకా వేసిన తరువాత పిల్లలను ఆరు నుంచి తొమ్మిది నెలల వరకూ పరిశీలిస్తారు. ఈ వ్యాక్సీన్ ప్రభావశీలిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది సురక్షితం కావొచ్చు, కాకపోవచ్చు. పిల్లల భద్రత విషయంలో ఎలాంటి ఆందోళనా కనిపించట్లేదు. కానీ తగినంత డాటా లభించేంతవరకూ ఇది సురక్షితం అని చెప్పలేం. అప్పుడే ఈ వ్యాక్సిన్లకు ఆమోద ముద్ర లభిస్తుంది" అని ఆయన వివరించారు.

ఇంతకూ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?

ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ విరివిగా లభించట్లేదు. ఇదొక పెద్ద సమస్యగా మారింది. ఈ విషయమై కేంద్ర, రాష్ట్రాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

తగినన్ని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు ఎదుర్కుంటోంది.

ఇలాంటి పరిస్థితుల్లో, పిల్లల వ్యాక్సిన్ ట్రయల్స్ ఫలితాలు రావడానికే కొన్ని నెలలు పట్టొచ్చు అంటున్నారు. ఇదంతా జరిగి పిల్లలకు టీకా అందుబాటులోకి రావడానికి ఎక్కువ సమయమే పట్టేలా ఉంది.

అయితే, పిల్లల వ్యాక్సిన్ త్వరగానే అందుబాటులోకి వస్తుందని వీకే పాల్ అంటున్నారు.

కానీ, పిల్లల విషయంలో తొందరపడకూడదని డాక్టర్ గంగూలీ హెచ్చరిస్తున్నారు.

"పిల్లల విషయంలో తొందరలో ఏదో ఒకటి చేసేయకూడదు. దేశంలో అధిక శాతం పిల్లలకు అవసరమైనన్ని వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వచ్చేవరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించకుండా ఉండడమే మంచిది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)