ఎర్ర చందనం చెట్లు శేషాచలం అడవుల్లోనే ఎందుకు ఎక్కువగా ఉంటాయి, చిత్తూరు చందనానికి విదేశాల్లో ఎందుకంత గిరాకీ?

- రచయిత, తులసీప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో ఉన్న కొండల్లో మాత్రమే దొరుకుతుంది. ఈ కొండలు దాదాపు 5.5 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి.
ఈ ఎర్రచందనం చెట్లు ప్రపంచంలోనే చాలా అరుదైన జాతికి చెందినవని, వీటికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని అధికారులు, నిపుణులు చెబుతున్నారు.
చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలో విస్తరించిన శేషాచలం, వెలుగొండ, పాలకొండ, లక్కమల, నల్లమల అడవులు తూర్పు కనుమల్లో ఉన్నాయి. వీటిలో ఎక్కువగా శేషాచలం, వెలుగొండల్లో మాత్రమే ఎర్రచందనం అధికంగా పెరుగుతుంది.
ప్రధానంగా, శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనంలో ఎక్కువ చేవ ఉండడంతో దానికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.
చైనా, జపాన్, రష్యాలలో ఎర్ర చందననాన్ని వివిధ రూపాల్లో వినియోగిస్తుంటారు. విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి స్మగ్లర్లు అనేక మార్గాల్లో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారు.
ఎర్రచందనం అనే పేరు ఎలా వచ్చింది?
ఎర్రచందనాన్ని అనేక పేర్లతో పిలుస్తారు. 'టెరో కార్పస్ సాంటలైనస్' అన్నది దీని శాస్త్రీయ నామం.
టెరో అనే గ్రీకు మాటకు ఉడ్ (కర్ర) అని అర్ధం. కార్పస్ అంటే పండు. దాని కాయ చాలా గట్టిగా ఉంటుంది. సాధారణంగా అది మొలకెత్తదు. అది మొక్క రావాలంటే సంవత్సరం పడుతుంది.
దీన్ని ఎర్రచందనం, రక్త చందనం, శాంటాలం, ఎర్ర బంగారం అని కూడా అంటారు. ఇది ఫ్యాబేసి వర్గానికి చెందిన మొక్క. దీని దుంగ ఎర్రగా ఉండడం వల్ల ఎర్ర చందనం అంటారు.
"బంగారం అంటేనే విలువైనది. అయితే, ఇది దానికన్నా విలువైనది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో నల్లమల అడవులు, శేషాచలం కొండల్లో మాత్రమే ఎక్కువగా ఈ రకం చందనం దొరుకుతుంది'' అని ఎస్వీ యూనివర్సిటీ, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ ఎన్.సావిత్రమ్మ బీబీసీతో చెప్పారు.

శేషాచలం కొండల్లోని భూమిలో ఏముంది?
ఎర్రచందనం చెట్లను ఇతర ప్రాంతాల్లో చాలామంది పెంచుతున్నారు. శేషాచలం కొండలు చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలలో ఉంటాయి. ఈ నేల స్వభావం వల్ల దీనికి వచ్చే నాణ్యత ఇతర ప్రాంతాల చెట్లకు రావడం లేదు.
''చిత్తూరు జిల్లాలో మంచి క్వాలిటీ ఉడ్ వస్తుంది. ఇక్కడున్న మట్టి ఈ చెట్ల పెరుగుదలకు చాలా అనువుగా ఉంటుంది. శేషాచలం కొండల్లో యురేనియం, ఐరన్, గ్రాఫైట్, కాల్షియం లాంటివి వివిధ నిష్పత్తుల్లో వున్నాయి. ఈ మొక్కకి ఈ కాంబినేషన్ అనుకూలమైంది. అందుకే శేషాచలం కొండల్లో ఈ చెట్లు బాగా పెరుగుతున్నాయి. ఏ మొక్కలోనూ లేనటువంటి ప్రత్యేకమైన లక్షణాలు ఇందులో ఉంటాయి'' అని ప్రొఫెసర్ సావిత్రమ్మ చెప్పారు.
రైతులు పెంచొచ్చా?
''రైతులు కూడా పెంచుతున్నారు. కానీ వాళ్ల పంటలకు ఇంత క్వాలిటీ రావడం లేదు. పెంచాలన్నా ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ల నుంచి పర్మిషన్ తీసుకోవాలి. చిత్తూరు జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ సాధారణంగానే పెరుగుతుంది. దీన్ని పెంచుకోవడానికి విరివిగా ప్రభుత్వం అనుమతిస్తే రైతులకు మంచి ఆదాయం వస్తుంది. ఎగుమతులు చేసుకోవచ్చు. శేషాచలం కొండల్లో పెరిగే మొక్కల్లో 20 సంవత్సరాల్లోనే చేవ వస్తుంది. రైతులు పెంచితే 30 నుంచి 40 సంవత్సరాలు వరకు పడుతుంది'' అని ప్రొఫెసర్ సావిత్రమ్మ వివరించారు.
చైనా, జపాన్ వాళ్లు ఇక్కడి మొక్కలను తీసుకెళ్లి పెంచడానికి ప్రయత్నాలు చేశారని అయినా అక్కడ పెరగలేదని ప్రొఫెసర్ సావిత్రమ్మ వెల్లడించారు.
''డైరెక్టుగా మొక్క రావడం లేదు కాబట్టి, ఇతర దేశాల వాళ్లు టిష్యూ కల్చర్ ద్వారా వీటిని పెంచడానికి ప్రయత్నించారు. అదీ కుదరలేదు. పైగా ఇలా పెంచిన మొక్కల్లో ఔషధ గుణాలు తక్కువగా ఉంటాయి'' అన్నారామె.

దీనికి ఎందుకు అంత డిమాండ్?
చైనా, జపాన్‌లలో వంటింట్లో వాడే పాత్రలు, గిన్నెలు కూడా ఎర్రచందనం తో చేసినవి వాడుతుంటారు. సంగీత వాయిద్యాలు తయారు చేసి పెళ్లిళ్ల లో బహుమతిగా ఇస్తుంటారు.
''చైనా, జపాన్ తో పాటు రష్యా వాళ్లు కూడా ఎర్రచందనాన్ని కొంటున్నారు. అందులో ఔషధ గుణాలు ఉన్నాయి. వయాగ్రా, కాస్మెటిక్స్, ఫేస్ క్రీమ్స్ లాంటి వాటిలో వీటిని వాడుతారు. అల్సర్ ను తగ్గించే గుణం, కిడ్నీ సమస్యలు, రక్తాన్నిశుద్ధి చేయడం వంటి లక్షణాలు ఎర్ర చందనంలో ఉంటాయి'' అని ప్రొఫెసర్ సావిత్రమ్మ వెల్లడించారు.
విదేశాలకు అక్రమంగా ఎలా తరలిస్తున్నారు?
''శేషాచలం అటవీ ప్రాంతం నుంచి ఏడు దశల్లో ఈ అక్రమ రవాణా జరుగుతుంది. ఉడ్ కట్టర్, మేస్త్రీ, పైలట్, ట్రాన్స్‌పోర్టర్, గోడౌన్ కీపర్, ఎక్స్ పోర్టర్, ఇంటర్నేషనల్ స్మగ్లర్స్... ఇలా దశల వారీగా జరుగుతుంది. వాళ్లు చాలా గోప్యత పాటిస్తారు. ఎవరికీ ఎవరితోనూ సంబంధాలు ఉండవు'' అని డిప్యూటి కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అశోక్ కుమార్ బీబీసీతో చెప్పారు.
అడవి అనేది తెరిచిన ఖజానా అని, ఏ ద్వారం నుంచి ఎవరైనా వచ్చేందుకు వీలు ఉంటుందని అశోక్ కుమార్ అన్నారు. వీరప్పన్ చనిపోయిన తర్వాత వేలూరు, కాట్పాడి, జవాదిమలై కొండల్లో ఉన్న స్మగ్లర్లంతా శేషాచలం కొండల్లోకి వచ్చి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారని ఆయన వెల్లడించారు.
''వారు దేనికీ భయపడరు. పగలు, రాత్రి తేడా లేకుండా దుంగలను తరలిస్తుంటారు. ఎన్ని రకాలుగా మార్చాలని చూసిన వాళ్లు మారరు. షార్ప్ వెపన్స్ వాడుతుంటారు. ఎంత దూరమైనా దుంగలను మోసుకొని వెళ్లగలరు. కొండలు కోనల్లో నడవడానికి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్లను పట్టుకోవడం ఫారెస్ట్ అధికారులకు కూడా కష్టమే. అధికారులపైనే దాడులు చేసిన చరిత్ర వారికి ఉంది'' అని అశోక్ కుమార్ విరించారు.

కూలీలే సమిధలు...
ఎర్రచందనం స్మగ్లర్లు కొందరు కీలకైన వ్యక్తుల డైరెక్షన్స్‌లో నడుస్తారు. మొత్తం ఏడు దశల్లో ఈ అక్రమ రవాణా జరుగుతుంది. అటవీ ప్రాంతంలో ఉన్న చెక్ పోస్టులు దాటించి ఎగుమతులు చేస్తుంటారు. ఈ మొత్తం వ్యవహారంలో అసలు వారు బాగానే ఉన్నా, కింది స్థాయి కూలీలే నలిగి పోతుంటారని గతంలో స్మగ్లింగ్ కార్యకలాపాల్లో పాల్గొన్న ఓ వ్యక్తి బీబీసీతో చెప్పారు.
''వాటిని ఎక్కడికి తీసుకెళ్తారో నాకు తెలియదు. వేరే వాళ్ల మాటలు విని తెలియకుండా ఆ పనికి వెళ్ళాను. చెట్లు వేరే వాళ్ళు నరుకుతారు. నా పని వాటిని మోయడం. భుజాలు బాగా నొప్పులు పుట్టేవి. ఇంత చేసినా కూలీ ఐదారొందల కన్నా ఎక్కువ ఉండదు. ఇందులోకి రావడం వల్ల కేసుల్లో ఇరుక్కున్నాను. మా ఊర్లో పరువు పోయింది. మా అమ్మానాన్నలు అప్పులు చేసి ఎన్నో కష్టాలు పడి నన్ను బెయిల్ మీద బైటికి తెచ్చారు. నా భార్య బిడ్డలు కూడా నావల్ల ఊళ్లో తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. నన్ను ఈ పనికి తీసుకెళ్ళిన వాళ్లు ఎవరూ నాకు సహాయం చేయలేదు. ఇలాంటి పనులు చేసేవాళ్లకు నాలాగా బాధలు తప్పవని చెప్పగలను'' అని ఆ వ్యక్తి వివరించారు. ఆయన తన పేరు బైటపెట్టడానికి ఇష్టపడ లేదు.
స్మగ్లింగ్ ఆపడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది?
విదేశాలకు తరలిపోకుండా ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాంటీ స్మగ్లర్స్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. శేషాచలం అడవుల్లో నిత్యం కూంబింగ్ చేస్తూ ఎర్రచందనం కూలీలు చెట్లు నరకుండా ఇది అడ్డుకుంటుంది.
2015లో ఏర్పాటైన ఈ టాస్క్‌ఫోర్స్‌లో పోలీసు, ఫారెస్ట్, ఏపీఎస్‌పీ, ఏఆర్ ఫోర్స్, సివిల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ల సిబ్బంది ఉంటారు. తిరుపతి హెడ్‌క్వార్టర్ గా ఇది పని చేస్తోంది.
''స్మగ్లర్లు ఫారెస్ట్‌లోకి వెళ్లే పాయింట్లు, దుంగలను తీసుకెళ్లే పాయింట్ల దగ్గర గట్టి బందోబస్తు పెట్టాం. టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని టీమ్‌లుగా ఏర్పాటు చేసి అడవిలోకి పంపుతాం. ఈ క్రమంలో స్మగ్లర్లు దొరికితే వాళ్లను కస్టడీలోకి తీసుకుంటాం. కొన్నిసార్లు మమ్మల్ని గమనించి దుంగల్ని వదిలిపెట్టి స్మగ్లర్లు పారిపోతున్నారు. అయినా వాళ్లను పట్టుకొని కేసులు నమోదు చేసి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కి అప్పగిస్తాం. వీరిలో ఎక్కువమంది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కూలీలుంటారు'' అని యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ ఎస్పీ సుందర్‌రావు బీబీసీతో చెప్పారు.
2021 సంవత్సరంలో 104 కేసుల్లో, 434 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసామని, దాదాపు 3 వేల కేజీల బరువైన దుంగలు, 282 వాహనాల సీజ్ చేశామని సుందర్ రావు చెప్పారు. వీటి విలువ రూ.50 కోట్లు ఉంటుందని ఆయన వెల్లడించారు.

ఫోన్ సిగ్నల్ కూడా ఉండని చోట...
టాస్క్‌ఫోర్స్ సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. కానీ, అడవుల్లో సెల్ సిగ్నల్స్ ఉండవు. దీంతో శాటిలైట్ ఫోన్ల కోసం అధికారులు ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. కమ్యూనికేషన్ పెరగడం వల్ల స్మగ్లర్లను పట్టుకోవడం సులభమవుతుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు.
''ఎక్కువ మంది స్మగ్లర్లు ఉండి, సిబ్బంది తక్కువగా ఉన్నారని తెలిసినప్పుడు మాకు సమాచారం ఇస్తే అదనపు ఫోర్స్‌ను అక్కడికి పంపడానికి వీలవుతుంది. అప్పుడు స్మగ్లర్లను అరెస్ట్ చేయడానికి అవకాశాలు పెరుగుతాయి'' అని సుందర్ రావు వివరించారు.
పట్టుకున్న దుంగలను ఏం చేస్తారు?
''తిరుపతిలో ఎనిమిది గోడౌన్లున్నాయి. ఇప్పటి వరకు 5,500 టన్నుల కర్ర నిల్వ ఉంచాము. 2018 నుంచి ఐదు విడతల్లో గ్లోబల్ టెండరింగ్ ఈ-ఆక్షన్ ద్వారా 1462 టన్నుల ఎర్రచందనాన్ని అమ్మాం. గవర్నమెంట్‌కు రూ.664 కోట్ల రెవెన్యూ వచ్చింది. అటవీశాఖ చరిత్రలోనే ఇదొక రికార్డు'' అని అశోక్ కుమార్ వెల్లడించారు.
ఇంటర్నేషనల్ మార్కెట్‌లో డిమాండ్ కు అనుగుణంగా ప్రతి సంవత్సరం ధర మారుతూ ఉంటుందని, ప్రస్తుతం ఏ వన్ గ్రేడ్ ఎర్రచందనం కర్ర టన్ను రూ.50 లక్షల వరకు ఉందని ఆయన వెల్లడించారు.

క్వాలిటీ తగ్గుతుందా?
''గోడౌన్‌లో ఎక్కువ రోజులు ఉంచితే దీని క్వాలిటీ తగ్గిపోతుంది. దీనివల్లా ప్రభుత్వానికే నష్టం. తొందరగా వీటిని వేలం వేస్తే క్వాలిటీ తగ్గకుండా ఉంటుంది. దానివల్లా కొన్నవారికి ఉపయోగం కలుగుతుంది'' అని ప్రొఫెసర్ సావిత్రమ్మ చెప్పారు.
గత మూడు దశాబ్దాలుగా స్మగ్లింగ్ జరుగుతోంది. గత 15 సంవత్సరాల్లో 15 లక్షల టన్నుల ఎర్రచందనం విదేశాలకు తరలిపోయింది.
''చైనా, జపాన్ దేశాలు దీని ప్రాధాన్యతను ఎప్పుడైతే గుర్తించాయో అప్పటి నుంచి ఇండియా నుంచి దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. అప్పుడు ప్రభుత్వం మేలుకొని ఆంక్షలు విధించింది. కానీ, అప్పటికే స్మగ్లింగ్ పెరిగింది. చెట్ల సంఖ్య తగ్గిపోయింది'' అన్నారు సావిత్రమ్మ.
ఇవి కూడా చదవండి:
- కజకిస్తాన్ సంక్షోభం: భద్రతా బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన డజన్ల కొద్దీ నిరసనకారులు
- ప్రధాన మంత్రి భద్రత ఎలా ఉంటుంది? పంజాబ్ పర్యటనలో పొరపాటు ఎలా జరిగింది?
- హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన ఉత్తర కొరియా
- అమరావతి: క్యాపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ వ్యవహారం మళ్లీ ఎందుకు ముందుకొచ్చింది?
- కాలిఫోర్నియాలో వేర్వేరు సంవత్సరాల్లో జన్మించిన కవలలు
- సింధుతాయి సప్కాల్: అనాథల అమ్మ ఇక లేరు... చేతిని ముంగిస కొరికేస్తున్నా ఆమె ఓ కాగితం కోసం ఎందుకంత పోరాటం చేశారు?
- మనిషి, మొసళ్ల మధ్య మనుగడ పోరాటం
- కొంపముంచిన అలెక్సా, పదేళ్ల చిన్నారికి ప్రమాదకరమైన చాలెంజ్
- గోవాలో క్రిస్టియానో రొనాల్డో విగ్రహ ఏర్పాటుపై వివాదం
- అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామిని భూమిపైకి తెచ్చేందుకు డబ్బుల్లేక ప్రభుత్వం అక్కడే ఉంచేసింది
- WAN-IFRA ‘సౌత్ ఏసియా డిజిటల్ మీడియా అవార్డ్స్’లో బీబీసీకి 4 పురస్కారాలు
- స్పైడర్ మ్యాన్ జోరుకు అల్లు అర్జున్ పుష్ప, రణ్వీర్ సింగ్ 83 తగ్గక తప్పలేదా? బాక్సాఫీస్ వద్ద మార్వెల్ సినిమా కలెక్షన్ల జోరుకు కారణాలేంటి?
- మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?.. ‘24 గంటల్లో డబ్బు రెట్టింపు.. 50 వేలు పెట్టుబడి పెడితే ఆరు లక్షలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














