మహిళల అక్రమ రవాణా: ‘అమ్మాయిలంటే వాళ్లకు జంతువులతో సమానం, అమ్మడం, కొనడం వాళ్లకు మామూలే’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సందీప్ సాహు
- హోదా, భువనేశ్వర్ నుంచి బీబీసీ కోసం
ఒడిశాకు చెందిన ఓ భర్త తన భార్యను రాజస్థాన్‌లో ఓ వ్యక్తికి అమ్మేశాడు. ఆ మహిళ కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో స్థానిక పోలీసులు రాజస్థాన్ వెళ్లి ఆమెను తీసుకొచ్చారు. ఆమె భర్తను అరెస్టు చేశారు.
రాజస్థాన్ నుండి తిరిగి సొంత రాష్ట్రానికి వచ్చిన ఆమె ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.
భర్త చేతిలో వంచనకు గురైన ఆ మహిళ జరిగిన సంఘటనలను బీబీసీకి ఫోన్‌లో వివరించింది.
''పెళ్లయిన 8 రోజుల తర్వాత, తాను రాజస్థాన్‌లో ఇటుక బట్టీలో పని చేస్తానని చెప్పి అక్కడికి తీసుకెళ్లాడు. 2 నెలల తర్వాత ఓ రోజు నన్ను వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడు. అతను నన్ను రూ. లక్షకు మరొక వ్యక్తికి అమ్మాడని నాకు మరుసటి రోజు తెలిసింది. నన్ను కొన్న వ్యక్తి ఇంట్లో, పొలంలో పని చేయించాడు. బలంగీర్ పోలీసులు వచ్చి నన్ను ఇంటికి తీసుకొచ్చారు'' అని ఆ యువతి చెప్పింది.
మళ్లీ పెళ్లి చేసుకుంటారా అని అడిగినప్పుడు, ''భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ప్రస్తుతానికి అమ్మా, నాన్నల దగ్గర ఉంటాను'' అని చెప్పింది.
అయితే, తనను కొన్న వ్యక్తి లైంగికంగా వేధించలేదని చెప్పింది. కానీ కేసు నమోదైన బెల్‌పారా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ బులు ముండా మాత్రం, ఆమెను కొనుగోలు చేసిన వ్యక్తి మధ్య వయస్కుడని, రాబోయే రోజుల్లో ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడనీ వెల్లడించారు.
''రాజస్థాన్‌లోని బరన్ పోలీస్ స్టేషన్ అధికారుల సాయంతో మేం ఆమెను తీసుకు వస్తుంటే, గ్రామస్తులు మమ్మల్ని అడ్డుకున్నారు. ఆ అమ్మాయిని రూ. లక్షా ఎనభై వేలకు కొనుక్కున్నామని, ఆమెను తీసుకెళ్లడానికి వీలు లేదని వారు వాదించారు'' అని బులు ముండా బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, SANDEEP SHAHU
పోలీసులు ఆ మహిళను ఎలా గుర్తించారు?
"మా బృందం, స్థానిక పోలీసుల సహాయంతో, పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మాట్లాడమని వారిని ఒప్పించారు. స్టేషన్ ఇన్‌ఛార్జి సలహా మేరకు, మా అధికారులు అమ్మాయిని దొడ్డి దారి నుండి బయటకు తీసుకెళ్లారు. అదే రోజు ఒడిశాకు బయలు దేరారు'' అని బులు ముండా వివరించారు.
"మహిళలను కొందరు గొర్రెలు, మేకల్లా చూస్తున్నారు. అమ్మాయిలతో వ్యాపారం చేయడం వారికి మామూలైంది" అని ముండా అన్నారు.
రాజస్థాన్‌లో ఆమె ఆచూకీ కనిపెట్టడం చాలా కష్టమైందని బలంగీర్ ఎస్పీ నితిన్ కుషాల్కర్ అన్నారు.
"ఆమెకు మొబైల్ ఫోన్ లేకపోవడంతో ఆమె ఎక్కడుందో తెలుసుకోవడం అంత సులభం కాలేదు. కుటుంబ సభ్యుల నుండి ఆమె ఫోటోను తీసుకున్నాం. బరన్ పోలీసుల సహాయంతో ఆమె జాడ కనుక్కున్నాం" అని ఆయన వెల్లడించారు.
అమ్మాయిల స్మగ్లర్లు చేసే అఘాయిత్యాల గురించి అక్కడి మహిళలు వివరించారని, ఈ యువతిని కొనుగోలు చేసిన వ్యక్తిపై రాజస్థాన్ పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన చెప్పారు.
ఆమె భర్త మొదట పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని బులు ముండా చెప్పారు.
తన భార్య తనను వదిలి ఎక్కడికో వెళ్లిపోయిందని అతను పోలీసులకు చెప్పారు. స్థానిక పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని పోలీసులు అడగడంతో ఆ యువకుడు భయపడిపోయారు.
"అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించినప్పుడు తన భార్యను అమ్మినట్లు ఒప్పుకున్నాడు" అని ముండా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భర్త మైనర్, భార్య మేజర్
మహిళ భర్త వయస్సు విషయంలో వివాదం తలెత్తింది. తన భర్త పెద్దవాడని, వయసు 24 ఏళ్లని ఆ మహిళ బీబీసీతో చెప్పింది. అయితే స్థానిక పోలీసులు, భర్త తరపు న్యాయవాది మాత్రం అతని వయసు 17 ఏళ్లేనని వెల్లడించారు.
"అతని స్కూల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డును పరిశీలించినప్పుడు అతని వయసు 17 సంవత్సరాలని తేలింది అతను మైనర్'' అని బెల్‌పారా పోలీసులు స్పష్టం చేశారు.
నిందితుడి తరపు న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్ కూడా దీనిని ధృవీకరించారు.
"శుక్రవారం అతడిని కోర్టులో హాజరు పరిచినప్పుడు, బలంగీర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అతని బెయిల్ దరఖాస్తును తిరస్కరించి, జువైనల్ హోమ్‌కు పంపమని ఆదేశించడానికి ఇదే కారణం" అని ఆయన చెప్పారు.
మంగళవారం బలంగీర్ జిల్లా కోర్టులో నిందితుడికి బెయిల్ కోసం దరఖాస్తు చేస్తానని ఆయన చెప్పారు.
నిందితుడు మైనర్ అయితే అతనికి శిక్ష తగ్గుతుంది. కానీ, ఇక్కడే కుటుంబ సభ్యులకు మరో సమస్య మొదలైంది. మైనర్‌కు పెళ్లి చేసినందుకు ఒడిశా పోలీసులు అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు.
అరెస్టు భయంతో నిందితుడి కుటుంబ సభ్యులు ఇంటి నుంచి పారిపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలీసులకు వారి ఆచూకీ ఇంకా దొరక లేదు.

ఫొటో సోర్స్, SANDEEP SHAHU
మహిళల అక్రమ రవాణా
మహిళలను అక్రమంగా అమ్మేయడం ఎంత సులభమో ఈ ఘటన చెప్పకనే చెబుతోంది. మానవ అక్రమ రవాణా ఒడిశాలో ఇప్పుడొక తీవ్రమైన సమస్య.
దేశవ్యాప్తంగా మహిళల అక్రమ రవాణాదారుల కళ్లు ఒడిశాపైనే ఉంటాయి. రకరకాల వాగ్దానాలతో అమ్మాయిల తల్లిదండ్రులను నమ్మించి ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి అమ్మేస్తుంటారు.
ఇలాంటి కేసులు రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడి నుంచి అమ్మాయిలను ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నారు. పోలీసు వర్గాల ప్రకారం ఈ అమ్మాయిలను ఎక్కువగా పంజాబ్ , హరియాణాలలో అమ్ముతారు.
దిల్లీ, రాజస్థాన్, యూపీలలో కూడా ఇలాంటి అమ్మకాలు తక్కువేం కాదు.

ఫొటో సోర్స్, Getty Images
ఒడిశాలోనే అక్రమ రవాణా ఎందుకు ఎక్కువ?
ప్రతి సంవత్సరం వేలమంది ఒడిశా అమ్మాయిలను ఇతర రాష్ట్రాల్లో అమ్మేస్తుంటారు. ఇక్కడి నుంచే వ్యాపారం ఎక్కువగా జరగడానికి కారణం ఏంటి?
''పేదరికం, అవగాహన లేమి అనేవి రెండు ప్రధాన కారణాలు. మంచి సంబంధం అని చెప్పి ఆడ పిల్లలను మోసం చేస్తున్నారు. పిల్లలకు పెళ్లి చేయలేని తల్లిదండ్రులే వీరికి టార్గెట్. కొందరు తల్లిదండ్రులకు చదువు సంధ్యలు పెద్దగా ఉండవు. వారికి నమ్మకం కలిగించేందుకు దొంగ పెళ్లిళ్లు చేస్తారు. తర్వాత వేరే రాష్ట్రానికి తీసుకుపోయి అమ్మేస్తారు'' అని సామాజిక కార్యకర్త అనురాధ మొహంతి అన్నారు.
''వివాహంతోపాటు మంచి ఉద్యోగం వస్తుందని ఈ మధ్యవర్తులు వారి తల్లిదండ్రులకు ఆశ చూపిస్తారు. పెళ్లి కూడా జరిపించడం వల్ల మోసగాళ్ల పని సులభమవుతుంది'' అని మొహంతి అన్నారు.
చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల చాలా సందర్భాలలో ఈ పెళ్లిళ్లు రికార్డు కావని ఆమె వెల్లడించారు.
"ఒడిశా నుండి చాలామంది అమ్మాయిలు అక్రమంగా రవాణా కావడానికి ప్రధాన కారణం ఇక్కడున్న అమ్మాయిలు అమాయకులు. మధ్యవర్తులు వీరిని సులభంగా నమ్మించగలుగుతారు'' అని సామాజిక కార్యకర్త అనురాధ దాష్ తెలిపారు.
ప్రతి సంవత్సరం ఒడిశా నుంచి వందలాది మంది మహిళల అక్రమ రవాణా జరుగుతోంది. అదృష్టం బాగుంటే ఈ యువతిలాగా వారు దీని నుంచి బయటపడతారు. లేకపోతే అంతే.
ఇవి కూడా చదవండి:
- సెక్స్ ట్రేడ్ కోసం యూరప్‌కు మహిళల అక్రమ రవాణా... తప్పించుకున్న ఓ బాధితురాలి కథ
- ‘ఎన్ని పంటలు వేసినా రాని డబ్బులు గంజాయి సాగుతో వస్తున్నాయి.. మరో దారి లేకే గంజాయి పండిస్తున్నాం..’
- 'మృతదేహాల అవశేషాలపై ఇళ్లు కట్టుకుని నివసించడం మాకు అలవాటైపోయింది'
- సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా? సెక్స్ భంగిమల కోసం బలవంతం చేయవచ్చా?
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
- నీళ్లపైనే నగరాలు.. భవిష్యత్తు ఇదేనా? యూరప్ దేశాల్లో ఈ ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయి?
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్‌లో ఆగ్రహం ఎందుకు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








