ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ పెళ్లి కొడుకు
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన వారిలో వారం రోజుల్లో పెళ్లి కావాల్సిన ఓ యువకుడున్నాడు. 10 రోజులు పని చేస్తే రూ.15,000 సంపాదించవచ్చనే ఆశతోనే గొడ్డలి పట్టి శేషాచలం అడవులకు వచ్చాడు. కానీ పోలీసులకు పట్టుబడడంతో ఇప్పుడు లబోదిబోమంటున్నాడు.
ఇలా అవుతుందని అనుకోలేదు: సౌందర రాజన్
ఆ యువకుడి పేరు సౌందర రాజన్. నివాసం తమిళనాడులోని నమ్మింబట్టు (తిరువన్నామలై జిల్లా). ఈ నెల 10న పెళ్లి. తిరుపతిలోని శేషాచలం అడవుల్లోంచి ఎర్ర చందనం దుంగలను అక్రమంగా తరలించే దాదాపు 12 మంది ముఠాతో కలిసి వచ్చాడు. జోరుగా కురుస్తున్న వానలో దుంగలను తరలించేందుకు ప్రయత్నిస్తుండగా చంద్రగిరి-చిత్తూరు రహదారి సమీపంలోని మొరవ పల్లె రైల్వే ట్రాక్ దగ్గర వీరిని పోలీసులు పట్టకున్నారు.
"ఎర్ర చందనం దుంగలు కొడితే 10 రోజుల్లో రూ.15,000 వేలు ఇస్తామన్నారు. కేజీకి రూ.500 చెల్లిస్తామన్నారు. పెళ్లి ఖర్చుల కోసం ఆశపడి వచ్చాను. చివరకు ఇలా జైలు పాలవుతానని అనుకోలేదు" అని సౌందర్ రాజన్ అధికారుల ముందు వాపోయాడు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





