అంటార్కిటికాలో కొత్త జాతి నాచు మొక్కలను కనుగొన్న భారత శాస్త్రవేత్తలు

2017లో అంటార్కిటికా ఖండంలో ఈ కొత్త జాతి నాచు మొక్కలను కనుగొన్నారు

ఫొటో సోర్స్, FELIX BAST

ఫొటో క్యాప్షన్, 2017లో అంటార్కిటికా ఖండంలో ఈ కొత్త జాతి నాచు మొక్కలను కనుగొన్నారు
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత శాస్త్రవేత్తలు అంటార్కిటికాలో కొత్త జాతి మొక్కలను కనుగొన్నారు.

జీవశాస్త్రవేత్తలు 2017లో ఈ మంచు ఖండంలో జరిపిన పరిశోధనల్లో నాచు జాతికి చెందిన కొత్త మొక్కలను కనుగొన్నారు.

ఇవి కొత్త జాతి మొక్కలని నిర్ధరించడానికి శాస్త్రవేత్తలకు ఐదేళ్లు పట్టింది.

ఈ పరిశోధనా ఫలితాలను 'జర్నల్ ఆఫ్ ఆసియా-పసిఫిక్ బయోడైవర్సిటీ' అనే ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురించారు.

పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఈ శాస్త్రవేత్తలు తాము కనుగొన్న కొత్త జాతి మొక్కలకు 'బ్రయం భారతీయెన్సిన్స్' అని నామకరణం చేశారు.

అంటార్కిటికాలో ఉన్న ఒక భారత పరిశోధనా కేంద్రానికి భారతి అనే పేరు ఉంది. దానిపేరు మీదుగా ఈ మొక్కలకు ఈ నామకరణం చేశారు.

ప్రొఫెసర్ ఫెలిక్స్ బాస్ట్ నేతృత్వంలో అంటార్కిటికాలో శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు

ఫొటో సోర్స్, FELIX BAST

ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ ఫెలిక్స్ బాస్ట్ నేతృత్వంలో అంటార్కిటికాలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.

అంటార్కిటికా ఖండంలో భారత శాస్త్రవేత్తలు నిర్వహించిన 36వ పరిశోధనా యాత్ర ఇది.

ఆరు నెలల పాటు కొనసాగిన ఈ పరిశోధనలో బృంద సభ్యుడైన ప్రొఫెసర్ ఫెలిక్స్ బాస్ట్, ఈ ముదురు ఆకుపచ్చ నాచు మొక్కను 2017 జనవరిలో లార్స్‌మన్ హిల్స్ వద్ద కనుగొన్నారు.

ఈ ప్రాంతం భారతి పరిశోధనా కేంద్రానికి దగ్గర్లోనే ఉంది.

మొక్కలు జీవించడానికి పొటాషియం, భాస్వరం, సూర్యరశ్మి, నీరుతో పాటు నైట్రోజన్ కూడా అవసరం. అంటార్కిటికాలో 1% మాత్రమే మంచు లేని ప్రాంతం ఉంది.

"రాయి, మంచుతో కూడిన ఇలాంటి ప్రదేశంలో నాచు ఎలా మనుగడ సాగించిందనేది మన ముందున్న అతి పెద్ద ప్రశ్న" అని ప్రొఫెసర్ బాస్ట్ అన్నారు.

ఈ నాచు ప్రధానంగా పెంగ్విన్ పక్షులు అధిక సంఖ్యలో గుడ్లు పొదిగే ప్రాంతాల్లోనే పెరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

పెంగ్విన్ మలంలో నైట్రోజన్ ఉంటుంది.

"ఈ కొత్త జాతి నాచు మొక్కలు పెంగ్విన్ మలంపై ఆధారపడి జీవించాయి. ఇక్కడి వాతావరణంలో పెంగ్విన్ ఎరువు కుళ్లిపోదు కాబట్టి, అది ఈ మొక్కలకు లాభదాయకమైంది" అని ప్రొఫెసర్ బాస్ట్ తెలిపారు.

అంటార్కిటికాలో 'భారతి' పరిశోధనా కేంద్రం

ఫొటో సోర్స్, PRADEEP TOMARఅంటార్కిటికాలో భారతి పరిశోధనా కేంద్రం

ఫొటో క్యాప్షన్, అంటార్కిటికాలో 'భారతి' పరిశోధనా కేంద్రం

మరి సూర్యరశ్మి సంగతేంటి?

ఈ విషయమే ఇంకా పూర్తి అవగాహనకు రాలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంటార్కిటికా ఖండంలో ఒక ఆరు నెలలు సూర్యుడు అస్సలు కనిపించడు. ఉష్ణోగ్రతలు మైనస్ 76 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మంచు కింద ఈ మొక్కలు ఎలా మనుగడ కొనసాగించాయన్నదే ఇంకా అంతు చిక్కని అంశం.

"ఆ సమయంలో ఈ నాచు మొక్కలు పూర్తిగా ఎండిపోయి, దాదాపు విత్తనాల్లా మారిపోయి.. సెప్టెంబర్‌లో వేసవి ప్రారంభమై, సూర్య కిరణాలు పడ్డాక మళ్లీ మొలకెత్తే అవకాశం ఉందని" శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

వేడికి మంచు కరుగుతున్నప్పుడు ఆ నీటిని పీల్చుకుని మొక్కలు చిగురిస్తూ ఉండవచ్చు.

ఈ కొత్త జాతి మొక్కల శాంపిల్స్ సేకరించిన తరువాత శాస్త్రవేత్తలు ఐదేళ్ల పాటు దీని డీఎన్ఏ క్రమాన్ని పరిశీలిస్తూ (సీక్వెన్సింగ్), ఇతర మొక్కలతో పోల్చి చూస్తూ పరిశోధనలు జరిపారు.

ఇప్పటివరకు అంటార్కిటికా ఖండంలో వందకు పైగా నాచు జాతి మొక్కలను కనుగొన్నారు.

వీడియో క్యాప్షన్, అనాథ ఉడుత వైరల్ వీడియో

వాతావరణ మార్పుల ప్రభావం

ఈ మంచుఖండంలో శాస్త్రవేత్తలు పరిశోధనా యాత్ర నిర్వహించినప్పుడు వాతావరణ మార్పుల ప్రభావాన్ని గమనించారు. అది "కొంత ఆందోళన కలిగిస్తోందని" వీరు అంటున్నారు.

కరిగిపోతున్న హిమనీనదాలు, బీటలు వారిన మంచు పలకలు, వాటిపై పేరుకుంటున్న సరస్సులు గమనించామని చెబుతున్నారు.

"అంటార్కిటికాలో పచ్చదనం విస్తరిస్తోంది. గతంలో ఈ మంచుఖండంలో మనుగడ సాగించలేకపోయిన సమశీతోష్ణ మొక్కలు ఇప్పుడు అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ ఖండం వేడెక్కుతోంది" అని ప్రొఫెసర్ బాస్ట్ అన్నారు.

వీడియో క్యాప్షన్, వేగంగా కరుగుతున్న అంటార్కిటికా హిమనీ నదాలు చూపించే ప్రభావమెంత..?

"అంటార్కిటికా పచ్చదనాన్ని సంతరించుకుంటోంది అనే వాస్తవం ఆందోళన కలిగిస్తోంది. దట్టమైన మంచు పలకల కింద ఏముందో మనకు తెలీదు. అవి కరిగిపోతే ఏం బయటపడతాయో చెప్పలేం. గ్లోబల్ వార్మింగ్ వలన మంచు కరిగిపోతే వ్యాధికారకమైన సూక్ష్మ క్రిములు అనేకం బయటపడవచ్చు" అని పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ రాఘవేంద్ర ప్రసాద్ తివారీ అన్నారు.

అంటార్కిటికా ఖండంలో పరిశోధనా కేంద్రాన్ని స్థాపించిన తరువాత, గత నాలుగు దశాబ్దాల్లో భారత శాస్త్రవేత్తలు కొత్త జాతి మొక్కలను కనుగొనడం ఇదే మొదటిసారి.

ఆ ఖండంలో తొలి భారత పరిశోధనా కేంద్రాన్ని 1984లో ప్రారంభించారు. 1990లో అది మంచులో కూరుకుపోవడంతో దాన్ని వదిలేశారు.

తరువాత, 1989లోనూ, 2012లోనూ మైత్రి, భారతి అనే కేంద్రాలను స్థాపించారు. ఈ కేంద్రాల్లో సంవత్సరం పొడవునా పరిశోధనలు జరుగుతూ ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)