ఆంధ్రప్రదేశ్: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజలు తమ అభ్యంతరాలను ఎవరికి చెప్పాలి? ఎలా చెప్పాలి

జిల్లాల విభజనపై విజయనగరం జిల్లాలో విజయోత్సవాలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, జిల్లాల విభజనపై విజయనగరం జిల్లాలో విజయోత్సవాలు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలు, 62 రెవెన్యూ డివిజన్లుగా విభజిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జనవరి 26, 2022న విడుదలైంది.

53 పేజీల ఈ రాజపత్రంలో కొత్తగా ఏర్పడుతున్న జిల్లాల్లో ఏఏ మండలాలు ఉంటాయి, అవి ఏ రెవెన్యూ పరిధిలోకి వస్తాయి, కొత్త జిల్లాల పేర్లు కూడా పేర్కొన్నారు.

జిల్లాల విభజనకు సంబంధించిన ప్రభుత్వం పేర్కొన్న ఏ అంశంపైనైనా ప్రజలకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా వాటిని నోటిఫికేషన్ విడుదలైన 30 రోజుల్లోపు అంటే ఫిబ్రవరి 26, 2022 నాటికి తెలియజేయాలని రాజపత్రంలోనే పేర్కొంది.

ఇది ఏపీ గవర్నమెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ పేరుతో విడుదలైంది.

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపాదిత జిల్లాలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపాదిత జిల్లాలు

అభ్యంతరాలు, ఆందోళనలు

రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక ప్రజలు ఇలా అన్నీ వర్గాల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి.

తమ ఊరు లేదా గ్రామం ఫలానా మండలంలోనో, జిల్లాలోనే ఉండాలని, తమ నియోజకవర్గం ఫలానా నియోజకవర్గంలోనే ఉండాలని, ప్రభుత్వం సూచిస్తున్న కొత్త పేరు కాకుండా, పాత పేరు ఉండాలని కొన్నిచోట్లా, లేదా గతం నుంచి స్థానికులు కోరుతున్న పేరు పెట్టాలనే డిమాండ్లు మొదలైయ్యాయి.

వీటికి సెంటిమెంట్, గత చరిత్ర, మనోభావాలు ఇలా అనేక కారణాలను చెప్తున్నారు.

ఇక ఉద్యోగుల్లో తాము ఏ జిల్లాలోకి వెళ్తామోనని, అలాగే స్థానికత, జోనల్ పోస్టుల్లో ఇప్పుడు మారుతున్న సరిహద్దుల వంటివి తమ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని భావిస్తున్నారు.

ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్లు, సూచనలు, ఆకాంక్షలను ప్రభుత్వం పట్టించుకోలేదంటూ చాలా ప్రాంతాల నుంచి అక్కడి స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆదివాసీ ప్రాంతాల విభజనలో లోపాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఆదివాసీ ప్రాంతాల విభజనలో లోపాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి

అభ్యంతరాలు ఎలా తెలపాలి?

ఉగాది నాటికి ఈ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకు తగ్గట్టుగానే కొత్త జిల్లాలపై విడుదల చేసిన నోటిఫికేషన్‌పై సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే నెలరోజుల్లోపు తెలియజేయాలని ప్రభుత్వం అందులో కోరింది.

ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ లో అభ్యంతరాలు, సూచనలు, సలహాలను 30 రోజుల్లో అయా జిల్లా కలెక్టర్లకు రాత పూర్వకంగా తెలియజేయాలని ఉంది.

ఇవి తెలుగు లేదా ఇంగ్లిషు భాషలలో ఉండాలని పేర్కొంది.

వీడియో క్యాప్షన్, బొబ్బిలి యుద్ధం ఎలా జరిగింది? తాండ్ర పాపారాయుడి వీరత్వం ఏమిటి?

అభ్యంతరాలను ప్రజలు ఏ విధంగా తెలపాలన్న విషయాన్ని కనుక్కునేందుకు విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారితో బీబీసీ మాట్లాడింది.

"ప్రజల నుంచి వచ్చే ప్రతి సూచన, సలహా, అభ్యంతరం, అసంతృప్తి...ఇలా ఏదైనా దాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. కొత్త జిల్లాల విషయంలో తమ అభిప్రాయాన్ని ప్రజలు తెలియ చేయడం ద్వారా ప్రభుత్వానికి, భవిష్యత్తులో పరిపాలనకు సహాయపడిన వారవుతారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో తాము చెప్పదల్చుకున్నదానిని ఒక కాగితంపై రాసి లేదా టైపు చేసి...దానిని ఆయా జిల్లా కలెక్టరు కార్యాలయంలో అందజేయాలి'' అని సూర్య కుమారి వెల్లడించారు. .

ఈ సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఇవ్వడానికి ప్రత్యేకమైన బాక్సులు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. అలాగే చీఫ్ కమిషనర్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్ మెంట్‌కు కూడా నేరుగా తెలియపర్చవచ్చని సూర్యకుమారి అన్నారు.

"రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ తో పాటు అన్నీ జిల్లాల కలెక్టర్లు కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏ ప్రాంతాలు, ఏ పరిధిలోకి, ఏ జిల్లాలోకి వస్తాయి? ఎన్ని మండలాలు ఉంటాయనే సమగ్రమైన సమచారాన్ని ఇందులో ఉంచాం. ఇందులో కూడా ప్రజలకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో తెలపాలని కోరాం" అని ఆమె బీబీసీతో అన్నారు.

జిల్లాల విభజనపై అభ్యంతరాలు, సూచనలు కోరుతూ విడుదలైన రాజపత్రం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, జిల్లాల విభజనపై అభ్యంతరాలు, సూచనలు కోరుతూ విడుదలైన రాజపత్రం

'చాటింపు వేయిస్తాం, నోటీసులు అతికిస్తాం'

" కొత్త జిల్లాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడం కూడా ముఖ్యమే. అందుకే గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో చాటింపు కూడా వేయిస్తాం. తహసిల్దార్ కార్యలయాలు, సచివాలయాల్లో సైతం నోటీసులు అతికిస్తాం. ఎవరైనా తమ అభిప్రాయాన్ని తెలియపరిస్తే అక్కడే తీసుకునే విధంగా ఆధికారులకు ఆదేశించాం. ఇవాళ్టి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్, వాట్సప్ ద్వారా కూడా సూచించవచ్చు. అయితే, దీనిపై రెండు, మూడు రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుంది" అని సూర్య కుమారి తెలిపారు.

రాజమండ్రి జిల్లా స్వరూపం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, రాజమండ్రి జిల్లా స్వరూపం

'ఇది ప్రైమరీ నోటిఫికేషన్'

ప్రభుత్వం నుంచి వచ్చిన గెజిట్ నోటిఫికేషన్, జిల్లాల వారిగా కలెక్టర్లు ఇస్తున్న నోటిఫికేషన్లు ఇవి ప్రైమరీ నోటిఫికేషన్ గా పరిగణిస్తారని పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ బీబీసీతో చెప్పారు. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు యూనిట్ల వారిగా అక్కడున్న అధికారికి అందచేయవచ్చునని చెప్పారు.

"ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పడుతున్న అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా విషయంలో ఇక్కడ స్థానికులకు ఏమైనా అభ్యంతరాలుంటే వాటిని ఐటీడీఏ పీవోగా ఉన్న నాకు తెలియ పర్చవచ్చు. అలాగే ఎమ్మార్వోలకు అందచేయవచ్చు. ఇలా స్థానికంగా ఉన్న పరిపాలన యూనిట్లలోని అధికార్లకు అందిస్తే...అవి అన్నీ కూడా ఫైనల్ గా కలెక్టరు కార్యాలయానికి చేరుతాయి. అభ్యంతరాలు వస్తే...వాటిని క్రోడికరించి ఫైనల్ గా మరో గెజిట్ వస్తుంది. అదే ఫైనల్ నోటిఫికేషన్ గా పరిగణలోకి తీసుకుంటారు" అని గోపాలకృష్ణ వివరించారు.

విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి

'ప్రజాభిప్రాయ సేకరణకు కమిటీ ఏర్పాటు'

పాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాల ఏర్పాటు బీజేపీ జాతీయ విధానమేని, ఏపిలో కూడా 25 జిల్లాలు చేస్తామని 2014 మేనిఫెస్టోలోనే ప్రకటించామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

"పార్టీపరంగా పార్లమెంటు నియోజకవర్గాలనే...జిల్లాలుగా పరిగణిస్తూ పార్టీ కార్యకలాపాలు చేస్తున్నాం. జగన్ సర్కారు తీసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నాం, అయితే ఈ విషయంలో ప్రజాభిప్రాయం కూడా అవసరం. కొత్త జిల్లాల్లో ఏ ప్రాంతాలు కలవాలి? ఏది ముఖ్యపట్టణంగా ఉండాలి? ఎవరి పేరు పెట్టాలి? అనే విషయాలను తేల్చడానికి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి" అని సోమువీర్రాజు అన్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటులో అభ్యంతరాలను ప్రజలు ప్రభుత్వానికి చెప్పవచ్చు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కొత్త జిల్లాల ఏర్పాటులో అభ్యంతరాలను ప్రజలు ప్రభుత్వానికి చెప్పవచ్చు

'మాకొక జిల్లా కావాలి, అందులో మా మండలం ఉండాలి'

నూతన జిల్లాల గెజిట్ నోటిఫికేషన్ తో కొత్త, పాత జిల్లాలుగా విడిపోతున్న ప్రాంతాల్లో అభ్యంతరాలు, వినతులు అప్పుడే మొదలైయ్యాయి. తమ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా చేయాలని కొన్నిచోట్లా, తమ నియోజకవర్గాన్ని మరో జిల్లాలో కలపాలని ఒకచోట, కలపొద్దొని మరోచోట, జిల్లాల పేర్లు మార్చాలని కొన్నిచోట్ల, మార్చొద్దని ఇంకొన్ని ప్రాంతాల్లో అభ్యంతరాలు వస్తున్నాయి. అలాంటి వాటిలో కొన్ని....

"శ్రీకాకుళం, పాలకొండ, పలాస కేంద్రాలుగా మూడు జిల్లాలు ఏర్పాటు చేయడం, అరకు లోక్‌సభ స్థానం చాలా పెద్దదిగా ఉండడం వల్ల దాన్ని రెండు కాకుండా మూడు జిల్లాలు చేయాలనే వాదన ఉంది. రాజంపేటను జిల్లా కేంద్రం చేయకపోవడం, ప్రకాశం జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజన్‌ని రద్దు చేయడం, కందుకూరు అసెంబ్లీ స్థానాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చడం, విజయవాడకు దగ్గరలో ఉన్న పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్ని మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో చేర్చడంలాంటివి వినిపిస్తున్నాయి. విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్‌ జిల్లాగా పేరు పెట్టారు. ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరు పామర్రు నియోజకవర్గంలో ఉంది. ఇలా చాలా విషయాలపై భిన్న వాదనలు, అభ్యంరాలు వ్యక్తమవుతున్నాయి" అని ఏయూ జర్నలిజం విభాగాధిపతి ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి అన్నారు.

"విశాఖలోని ఏజెన్సీ ప్రాంతాలన్నింటినీ కలిపి ఒక జిల్లాగా ఏర్పాటుచేసి, దానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలనే డిమాండ్‌ చేశాం. కానీ ప్రభుత్వం ఇప్పుడు అరకు పార్లమెంటు నియోజకవర్గంలోని పాడేరు, అరకు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరాన్ని కలిపి పాడేరు కేంద్రంగా కొత్త జిల్లా ప్రకటించి దానికి అల్లూరి పేరు పెట్టింది. దీని వలన రంచోడవరం డివిజన్ వాసులు 250 కిలోమీటర్లకుపైగా దూరం ఉన్న పాడేరు వెళ్లడం చాలా కష్టం. విలీన మండలాల్ని కలిపి, తూర్పుగోదావరి ఏజెన్సీని రంపచోడవరం జిల్లాగా, విశాఖ ఏజెన్సీని పాడేరు జిల్లాగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్ని కలిపి మరో జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం" అని ఏపీ ఆదివాసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ విశాఖ జిల్లా కన్వీనర్‌ రామారావు దొర చెప్పారు.

జిల్లాల స్వరూపం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, జిల్లాల స్వరూపం

'డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే…కోర్టుకు వెళ్తాం'

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పీఆర్సీ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించడం వంటి డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే ఈ కొత్త జిల్లాల నోటిఫికేషన్ అని టీడీపీ ఆరోపించింది.

"జీవీఎంసీ పరిధిలో ఉండి విశ్వవిద్యాలయాలు, పవర్ స్టేషన్లు, ఫార్మాసిటీ ఉన్న పెందుర్తిని...కొత్త జిల్లాగా ఏర్పడుతున్న అనకాపల్లిలో విలీనం అనేది అవగాహన లేని చర్య. పెందుర్తిని విశాఖ జిల్లాలోనే ఉంచాలి, దీనిపై కోర్టును కూడా ఆశ్రయిస్తాం. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని అంటున్నారు. అసలు విభజనకు ముందు ఏ ప్రజల అభిప్రాయం తీసుకున్నారు?" అని టీడీపీ నేత బండారు సత్యనారాయణ బీబీసీతో అన్నారు.

శ్రీకాకుళం జిల్లా స్వరూపం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, శ్రీకాకుళం జిల్లా స్వరూపం

'ఒక శాసనసభ స్థానం పూర్తిగా ఒకే జిల్లాలో'

కొత్త జిల్లాల ఏర్పాటు అనేక ప్రాంతాల ప్రజల చిరకాల ఆకాంక్ష అని, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కొత్తజిల్లాలను ప్రకటించిందని ఏపీ డిప్యూటీ సీఎం పుష్ఫశ్రీవాణి అన్నారు.

"ఒక శాసనసభ నియోజకవర్గం ఒక జిల్లా పరిధిలోకి కాకుండా రెండు జిల్లాల పరిధిలోకి రావడం వలన కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకే కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసే క్రమంలో ఒక శాసనసభ స్థానం పూర్తిగా ఒకే జిల్లా పరిధిలోకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు" అని పుష్పశ్రీవాణి అన్నారు.

గిరిజనులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, గిరిజనులు

ఇలా మొదలైంది...అలా ముగుస్తుంది

జిల్లాల పునర్విభజనకు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 2020 ఆగస్టు 7న కమిటీ ఏర్పాటు చేశారు. పార్లమెంట్ స్థానం ఒక్కొ జిల్లాగా చేయాలని అనుకున్నా...రాష్ట్రంలో 25 పార్లమెంట్ స్ధానాలుండగా ...పాడేరు ఏజెన్సీ ప్రాంతం పెద్దదిగా ఉండటంతో రెండు జిల్లాలుగా విభజించారు. దీంతో మొత్తం 26 జిల్లాలయ్యాయి.

"కొత్త జిల్లాల ఏర్పాటులో భౌగోళిక విస్తీర్ణం, జనాభా తదితర పరిస్ధితులని పరిగణనలోకి తీసుకున్నాం. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లా కేంద్రం దగ్గరగా ఉండటం, పరిపాలనా సౌలభ్యం, ఆర్ధిక వసతులు, పరిస్ధితులు, వనరులు ఇలా అన్నింటిని పరిగణనలోకి తీసుకున్నాం. ప్రతీ జిల్లాలో రెండు లేదా మూడు రెవెన్యూ డివిజన్ లో ఉండేలా చూశాం. అసెంబ్లీ నియోజకవర్గాన్ని విభజించకుండా ఆ జిల్లాలలోనే పూర్తిగా ఉండేలా చేశాం" అని ప్రణాళిక విభాగం సెక్రటరీ విజయకుమార్ తెలిపారు.

"కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఉద్యోగుల విభజన, కొత్తగా ఉద్యోగాల‌ కల్పనపై సబ్ కమిటీ పరిశీలిస్తుంది. ప్రతీ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్, జిల్లా కోర్టులు ఉంటాయి. కొత్త జిల్లాల విషయంలో ప్రజల అభ్యంతరాలు, వినతులు పరిగణనలోకి తీసుకుంటాం. ఉగాదికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఆలోచన" అని విజయకుమార్ పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, ఒకప్పుడు రైతు కూలీ, సెక్యూరిటీ గార్డ్... ఇప్పుడు ప్రపంచ దేశాలు చుట్టేస్తున్నాడు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)